ఓటమి అంచుల నుంచి... | Coco Gauff advances to US Open semifinals | Sakshi
Sakshi News home page

ఓటమి అంచుల నుంచి...

Sep 11 2026 1:23 AM | Updated on Sep 11 2026 1:23 AM

Coco Gauff advances to US Open semifinals

సెమీఫైనల్లోకి కోకో గాఫ్‌  

న్యూయార్క్‌: యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో అమెరికా యువ తార, 2023 చాంపియన్‌ కోకో గాఫ్‌ రెండోసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ ఏడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌ చాంపియన్, ఐదో సీడ్‌ మిరా ఆండ్రీవా (రష్యా)తో 2 గంటల 19 నిమిషాలపాటు జరిగిన మహిళల సింగిల్స్‌ చివరి క్వార్టర్‌ ఫైనల్లో నాలుగో సీడ్‌ కోకో గాఫ్‌ 2–6, 7–6 (9/7), 6–2తో గెలిచింది. 

రెండో సెట్‌ టైబ్రేక్‌లో కోకో గాఫ్‌ 5–6తో, 6–7తో ఓటమి ప్రమాదాన్ని ఎదుర్కొంది. అయితే ఈ రెండుసార్లు కోకో పాయింట్లు గెలిచి స్కోరును సమం చేసింది. ఆ తర్వాత టైబ్రేక్‌లో పైచేయి సాధించి మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్‌లో మాత్రం కోకో గాఫ్‌ పూర్తి ఆధిపత్యం చలాయించి ఆండ్రీవా ఆట కట్టించింది. నేడు జరిగే సెమీఫైనల్స్‌లో పెగూలా (అమెరికా)తో సబలెంకా (బెలారూస్‌); రిబాకినా (కజకిస్తాన్‌)తో కోకో గాఫ్‌ తలపడతారు. 

సెమీస్‌లో జ్వెరెవ్, ఖచనోవ్‌ 
పురుషుల సింగిల్స్‌లో టాప్‌ సీడ్‌ జ్వెరెవ్‌ (జర్మనీ), అన్‌సీడెడ్‌ ఖచనోవ్‌ (రష్యా) సెమీఫైనల్లోకి ప్రవేశించారు. జాండ్‌షుల్ప్‌ (నెదర్లాండ్స్‌)తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో జ్వెరెవ్‌ 6–2, 7–5, 6–1తో గెలుపొందాడు. మరో క్వార్టర్‌ ఫైనల్లో ఖచనోవ్‌ 6–2, 7–5, 3–2తో ఆధిక్యంలో ఉన్న దశలో అతని ప్రత్యర్థి అలెగ్జాండర్‌ బ్లాక్స్‌ (బెల్జియం) గాయం కారణంగా వైదొలిగాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement