13 నుంచి అఫ్గానిస్తాన్‌తో టి20 సిరీస్
బుమ్రా, సుందర్, నితీశ్ ఫిట్
న్యూఢిల్లీ: సొంతగడ్డపై టి20 సిరీస్‌కు భారత్ సన్నద్ధమైంది. ఆదివారం నుంచి జరిగే 3 మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో అఫ్గానిస్తాన్‌తో భారత్ తలపడుతుంది. జింబాబ్వేపై 3–0తో సిరీస్ గెలిచిన తర్వాత టీమిండియా బరిలోకి దిగుతున్న టి20 సిరీస్ ఇదే. ఈ సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో ముగ్గురు ఆటగాళ్లు జస్‌ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి తమ ఫిట్‌నెస్‌ను నిరూపించుకున్నారు. ఈ ముగ్గురు మ్యాచ్ ఫిట్‌గా ఉన్నారని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) నిర్ధారించింది.
భారత జట్టులోని 10 మంది సభ్యులు గురువారం సుదీర్ఘ సమయం పాటు సాధనలో పాల్గొన్నారు. హెడ్ కోచ్ గంభీర్, స్పిన్ బౌలింగ్ కోచ్ బహుతులే పర్యవేక్షణలో స్పిన్నర్లు సుందర్, వరుణ్ చక్రవర్తి బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు. ఆ తర్వాత నెట్ బౌలర్ల సహాయంతో సుందర్ బ్యాటింగ్ కూడా చేశాడు. ఇతర నెట్స్‌లో అక్షర్, బిష్ణోయ్‌ల బౌలింగ్‌లో సంజు సామ్సన్, అభిషేక్ శర్మ దూకుడైన షాట్లు ఆడుతూ తమ ప్రాక్టీస్‌ను కొనసాగించారు.
బుమ్రా, నితీశ్ శుక్రవారం జట్టుతో చేరతారు. పేస్ బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ ఈ సెషన్‌కు గైర్హాజరయ్యాడు. భారత్‌లో అతని వర్కింగ్ వీసా గడువు ముగిసిందని, దక్షిణాఫ్రికాకు వెళ్లి రెన్యువల్ చేయించుకున్న తర్వాత తిరిగి వస్తాడని బోర్డు వర్గాలు వెల్లడించాయి. మరో వైపు టీమిండియా ఫిజియో కమలేశ్ జైన్‌పై బీసీసీఐ వేటు వేసింది. గత కొన్ని నెలలుగా భారత క్రికెటర్లంతా తరచుగా గాయాలబారిన పడుతుండటంతో కమలేశ్ వైఫల్యాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటూ బోర్డు అతడినితప్పించింది.
హర్షిత్ స్థానంలో యశ్ ఠాకూర్...
కండరాల గాయంతో భారత జట్టుకు దూరమైన పేసర్ హర్షిత్ రాణా కోలుకోలేదు. సీఓఈలో రీహాబిలిటేషన్‌లో ఉన్న అతనికి ఇప్పుడు కొత్తగా మరో గాయమైంది. దాంతో అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌తో పాటు ఆసియా క్రీడలకు కూడా హర్షిత్ దూరమయ్యాడు. అతని స్థానంలో యశ్ ఠాకూర్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇటీవల జింబాబ్వేతో సిరీస్‌లో అరంగేట్రం చేసిన ఠాకూర్ 2 టి20లు ఆడి 4 వికెట్లు పడగొట్టాడు.
మరోవైపు ఆదివారం ఢిల్లీలో తొలి టి20 మ్యాచ్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని బీసీసీఐ స్పష్టం చేసింది. దేశ రాజధానిలో ‘బ్రిక్స్’ సమావేశం కారణంగా స్థానిక పోలీసులు భద్రత కలిగించడం కష్టమవుతుంది కాబట్టి మ్యాచ్‌ను వాయిదా వేయాలనే చర్చ జరిగినా... పోలీసులతో ఢిల్లీ క్రికెట్ సంఘం చర్చల అనంతరం మ్యాచ్ యధావిధిగా కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.


