అంతర్జాతీయ ప్రీమియం ఎగుమతి మార్కెట్లలో మన మామిడికి తిరస్కరణ..
పైకి నిగనిగ.. లోపల పురుగులు.. రసాయనాల వాడకంతో తగ్గుతున్న నాణ్యత.. సాగు పద్ధతి మార్చాలంటున్న నిపుణులు
(సాక్షి, స్పెషల్ డెస్క్) : అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉందన్న చందంగా ఉంది మన మామిడి సంగతి. ప్రపంచంలోనే రుచికరమైన మామిడి పండ్లను భారత్ ఉత్పత్తి చేస్తోంది. అయినప్పటికీ, అంతర్జాతీయ ప్రీమియం ఎగుమతి మార్కెట్లలో మన మామిడి తీవ్ర ఆంక్షలు, తిరస్కరణలను ఎదుర్కొంటోంది. విదేశీ వినియోగదారులు మంచి ధర చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా, నాణ్యత లోపాల వల్ల భారతీయ రైతులు, ఎగుమతిదారులు ఏటా తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. ఈ సంక్షోభానికి బహుళ కారణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
కాంట్రాక్టు సాగుతో కష్టాలు
దేశంలో సుమారు వెయ్యి మామిడి రకాలున్నప్పటికీ, మార్కెట్లో గిరాకీ కలిగినవి 24 ప్రధాన రకాలు మాత్రమే. వీటిల్లో మన తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా సాగయ్యే బంగినపల్లి, చిన్నరసం, పెద్దరసం అగ్రస్థానంలో నిలిచాయి. మామిడి తోటల యజమానుల్లో అత్యధికులు నగరాల్లో నివసిస్తూ తోటలను కాలానికి కాంట్రాక్టర్లకు లీజుకిస్తున్నారు. కేవలం మూడు నెలల సీజన్ లో వచ్చే తాత్కాలిక లాభాలపై తప్ప, తోట దీర్ఘకాలిక ఆరోగ్యంపై కాంట్రాక్టర్లకు శ్రద్ధ ఉండదు.
తక్కువ సమయంలో పంటను కాపాడుకోవటానికి విచక్షణారహితంగా సింథటిక్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్లు వాడుతున్నారు. నాసిరకం పురుగు మందులను అవసరానికి మించి పిచికారీ చేస్తున్నారు. ఫలితంగా పురుగు మందులను తట్టుకునే శక్తిని చెట్లు పెంచుకుంటున్నాయి. వీటివల్ల కాయ పైకి నిగనిగలాడేలా కనిపించినా, నాణ్యత ఉండటం లేదు. కాయల్లో పండు ఈగ వంటి పురుగులతో పాటు ప్రమాదకర రసాయనాల అవశేషాలు నిండిపోతున్నాయి.

ఆంక్షలు.. తిరస్కరణలు
పండ్లలో పురుగుల బెడద, అధిక రసాయన అవశేషాల కారణంగా విదేశీ తనిఖీ సంస్థలు భారతీయ మామిడి కన్‌సైన్‌మెంట్లను వెనక్కి పంపుతున్నాయి. వేపర్ హీట్ ట్రీట్‌మెంట్ కేంద్రాల్లో పరిశుభ్రతా ప్రమాణాలు లోపించటంతో జపాన్ దిగుమతులను నిలిపివేయగా, అధిక పురుగుమందుల అవశేషాలున్నాయనే ఆరోపణలతో నేపాల్ ఇటీవల సరిహద్దుల్లో కఠిన నిబంధనలు తెచ్చింది. గతంలో యూరోపియన్ యూనియన్ కూడా భారతీయ మామిడిపై నిషేధం విధించింది. అమెరికాకు ఎగుమతి చేయడానికి నిర్దేశించిన నాన్–టారిఫ్ ఆంక్షలు దాటటం సాధారణ రైతులు, ఎగుమతిదారులకు పెనుభారంగా మారింది. ప్రస్తుతం మన ఎగుమతుల్లో మూడోవంతు కేవలం గల్ఫ్ దేశాలకే పరిమితమవుతోంది.
సాగు పద్ధతి మార్చాలి..
మామిడి రైతులు రసాయన రహిత ఆధునిక సాగు పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలి. నిరంతర వ్యక్తిగత పర్యవేక్షణ అత్యవసరం. బాధ్యతారహితంగా తోటలను నిర్వహించే కాంట్రాక్టర్ల చేతులకు తోటలను వదిలేయకుండా శాస్త్రీయ పద్ధతుల్లో క్రిమిసంహారకాల వాడకం తగ్గించి, ఫైటోశానిటరీ ప్రమాణాలు పాటిస్తేనే ప్రపంచ మార్కెట్లో భారతీయ మామిడికి అసలైన గిట్టుబాటు ధర లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
మౌలిక సదుపాయాలపై దృష్టి కేంద్రీకరించాలి
భూయజమానుల నిర్లక్ష్యం, నాణ్యత లేని రసాయన వ్యవసాయం మన మామిడి ఎగుమతులను దెబ్బ తీస్తున్నాయి. బంగినపల్లికి మంచి నిల్వ సామర్థ్యం ఉన్నా ఏపీ, తెలంగాణల్లో ఇర్రేడియేషన్, ప్యాక్‌హౌస్ వసతులు లేవు. సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో పదేళ్లకు పైగా మామిడి సాగు చేస్తూ, విదేశాలకు ఎగుమతి చేస్తున్నాను. అమెరికాలో, గల్ఫ్ దేశాల్లో డోర్ డెలివరీ చేస్తున్నాం. ఈ ఏడాది యూరప్‌కూ విస్తరిస్తున్నాం. మామిడి ఎగుమతి సీజన్ కేవలం 45–60 రోజులే. పేపర్‌వర్క్, ఎయిర్ ఫ్లైట్‌పై జీఎస్టీ పెనుభారంగా మారాయి. ప్రభు త్వం రసాయనాలకు సబ్సిడీలు ఆపి, సహజ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి. ఎగుమతులు పెంచేందుకు తగిన మౌలిక సదుపాయాలు కల్పించటంపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలి. – గుమ్మడపురం రఫీ, మేనేజింగ్ డైరెక్టర్, ఏఆర్4 ఫ్రెష్ ఇంటర్నేషనల్


