ప్రపంచంలోనే అత్యధిక వేతనం అందుకుంటున్న ప్రభుత్వాధినేత ఎవరో తెలుసా?. చాలా దేశాలు అధికారికంగా ఆ విషయం బయటకు చెబుతున్నా.. కొన్ని దేశాల్లో మాత్రం అలవెన్స్, ఎగస్ట్రాల రూపంలో అడ్డగోలుగా అందుకుంటున్నారు. ఇక చైనా, ఉత్తర కొరియా, రష్యా లాంటి కొన్ని దేశాధినేతల జీతాలపై క్లారిటీ అంటూ లేకుండా పోయింది. అయితే ఈ విషయంలో ఇప్పుడు సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ సంచలనం సృష్టించారు. ప్రపంచంలోనే అత్యధిక జీతం అందుకుంటున్న ప్రధానిగా ఆయన రికార్డు నెలకొల్పారు.
తాజాగా.. సింగపూర్ పార్లమెంట్‌లో చట్ట సభ్యుల జీతాల సవరణ జరిగింది. అందులో ప్రధాని లారెన్స్ వాంగ్(Lawrence Wong) వార్షిక వేతన ప్యాకేజీని ఏకంగా 64 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయన జీతం 3.6 మిలియన్ డాలర్లకు చేరనుంది. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.25 కోట్లకు పైగా. ఈ కొత్త వేతన విధానం అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానుంది.
ఒకేసారి అంతా..!!
లారెన్స్ వాంగ్ ప్రస్తుత వార్షిక వేతన ప్యాకేజీ 2.2 మిలియన్ సింగపూర్ డాలర్లు కాగా.. కొత్త విధానంతో అది 3.6 మిలియన్ డాలర్లకు పెరగబోతోంది. అంటే.. అదనంగా 1.4 మిలియన్ సింగపూర్ డాలర్ల అదనపు ఆదాయం. సింగపూర్ రాజకీయ నాయకులకు ఇప్పటికే ప్రపంచంలోనే అత్యధిక వేతనాలు ఉన్నాయి. అధిక జీతాల వల్ల ప్రైవేట్ రంగంలోని ప్రతిభావంతులను రాజకీయాల్లోకి ఆకర్షించడంతోపాటు అవినీతికి దూరంగా పాలన సాగించేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది.
మరోవైపు సాధారణ పౌరుల ఆదాయంతో పోలిస్తే రాజకీయ నాయకుల వేతనాలు భారీగా ఉండటంపై దేశంలో విమర్శలు కూడా ఉన్నాయి. అయితే ఈ పెంపు మొత్తాన్ని తన పదవీకాలంలో వచ్చే ఐదేళ్ల పాటు మంచి కార్యక్రమాలకు విరాళంగా ఇస్తానని వాంగ్ ప్రకటించారు.

మంత్రుల జీతాలూ పెంపు
దాదాపు 15 ఏళ్ల తర్వాత సింగపూర్ రాజకీయ వేతనాల వ్యవస్థలో ఈ మార్పులు చేస్తున్నారు. పార్లమెంట్ సభ్యుల నెలవారీ అలవెన్స్‌ను కూడా 13,750 సింగపూర్ డాలర్ల నుంచి 18,500 డాలర్లకు పెంచనున్నారు. ప్రధాని మాత్రమే కాకుండా ఇతర రాజకీయ పదవుల వేతనాల్లోనూ మార్పులు చేయనున్నారు. డిప్యూటీ ప్రధాని బెంచ్‌మార్క్ వార్షిక వేతనం 1.87 మిలియన్ సింగపూర్ డాలర్ల నుంచి 3.06 మిలియన్ డాలర్లకు పెరగనుంది. మంత్రుల వేతనాలు వారి హోదా, బాధ్యతలను బట్టి 1.80 మిలియన్ నుంచి 2.88 మిలియన్ సింగపూర్ డాలర్ల వరకు ఉండేలా కొత్త బెంచ్‌మార్క్‌ను నిర్ణయించారు.
అయితే మంత్రులందరికీ వెంటనే కొత్త బెంచ్‌మార్క్ వేతనం అందదు. ప్రస్తుత పదవీదారులకు అక్టోబర్ 15 నుంచి గరిష్ఠంగా 9 శాతం వరకు ఒకేసారి పెంపు ఇవ్వనున్నారు. ఆ తర్వాత వేతన మార్పులు వ్యక్తిగత పనితీరు, బాధ్యతల ఆధారంగా ఉంటాయని ప్రభుత్వం తెలిపింది.
ప్రపంచంలో అత్యధిక వేతనాలు! వీళ్లే..
అంతర్జాతీయ రాజకీయ నేతల వేతనాలను పోల్చే (PoliticalSalaries) డేటా ప్రకారం, 2025లో టాప్-10లో ప్రధానంగా సింగపూర్, స్విట్జర్లాండ్, అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ తదితర దేశాల నేతలు ఉన్నారు. ఈ జాబితాలో సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ మొదటి స్థానంలో ఉన్నారు.
1. లారెన్స్ వాంగ్ – సింగపూర్ ప్రధాని
2. కరీన్ కెల్లర్-సట్టర్ – స్విట్జర్లాండ్ అధ్యక్షురాలు
3. డొనాల్డ్ ట్రంప్ – అమెరికా అధ్యక్షుడు
4. ఫ్రెడ్రిక్ మెర్జ్ – జర్మనీ ఛాన్సలర్
5. ఆంటోనీ అల్బనీస్ – ఆస్ట్రేలియా ప్రధాని
6. క్రిస్టియన్ స్టాకర్ – ఆస్ట్రియా ఛాన్సలర్
7. బార్ట్ డి వెవర్ – బెల్జియం ప్రధాని
8. క్రిస్టోఫర్ లక్సన్ – న్యూజిలాండ్ ప్రధాని
9. మార్క్ కార్నీ – కెనడా ప్రధాని
10. లూక్ ఫ్రైడెన్ – లక్సెంబర్గ్ ప్రధాని
మరి మోదీ స్థానం ఎంత?
ప్రధాని నరేంద్ర మోదీ టాప్-10లో లేరు. ఆయన అధికారిక వార్షిక వేతనం అంతర్జాతీయ ప్రమాణాలతో పోలిస్తే చాలా తక్కువ. సుమారు అమెరికా 30 వేల డాలర్ల పరిధిలో ఉన్నట్లు గత అంతర్జాతీయ వేతనాల డేటాలో నమోదైంది. అయితే కేంద్ర ప్రభుత్వ వివరాల ప్రకారం జీతం, నియోజకవర్గం, విధి నిర్వహణకు సంబంధించిన రోజువారీ భత్యాలను కలిపి చూస్తే మోదీ వార్షిక మొత్తం సుమారు రూ.25-26 లక్షల పరిధిలో ఉంటుంది.
ఇదీ చదవండి: సీఎం గొంతుతో మిమిక్రీ చేసి భారీ కుంభకోణం!


