ఎటు చూసినా ఎడారి.. మండే ఎండలు.. ఏడాదికి 100 మిల్లీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం.. శాశ్వత నదులు కూడా లేవు. అయినా సౌదీ అరేబియాలో 3.7 కోట్లకుపైగా జనాభా రోజువారీ అవసరాలకు నీటిని పొందుతోంది. మరి చుక్క నీటి కోసం కూడా ప్రకృతిపై ఆధారపడలేని ఈ దేశం.. కోట్లాది మందికి నీటిని ఎలా అందిస్తోంది? ఎడారి మధ్యలో ఇంత భారీ జలవ్యవస్థను ఎలా నిర్మించింది?
సౌదీ అరేబియాలోని తీర ప్రాంతాల్లో భారీ డీశాలినేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. సముద్రం నుంచి నీటిని తీసుకొచ్చి, అందులోని ఉప్పు, మలినాలను తొలగించి మంచినీటిగా మారుస్తారు. అనంతరం ఈ నీటిని భారీ పైప్‌లైన్ల ద్వారా వందల కిలోమీటర్ల దూరంలోని నగరాలు, జనావాసాలకు తరలిస్తారు. అంటే.. సహజంగా ప్రవహించే నదులు లేకపోయినా, విస్తారమైన ప్రాంతాలకు నీటిని చేరవేసే ఓ ‘కృత్రిమ నదీ వ్యవస్థ’ను నిర్మించుకున్నట్టే. మరి సముద్రపు ఉప్పునీరు అసలు తాగునీటిగా ఎలా మారుతుంది? ఎడారి, కొండలు, రాళ్లను దాటుకుంటూ ఈ నీరు వందల కిలోమీటర్లు ఎలా ప్రయాణిస్తుంది? ఇందుకోసం సౌదీ నిర్మించిన భారీ పైప్‌లైన్లు, అత్యాధునిక శుద్ధి వ్యవస్థ ఎలా పనిచేస్తాయన్నది ఆసక్తికరం.
భారీ పైప్‌లైన్ల నిర్మాణం
ఈ నీటి రవాణాకు ఉపయోగించే పైప్‌లైన్లు సాధారణమైనవి కావు. ఎడారి వేడి, ఇసుక తుపాన్లు, నేలలోని ఒత్తిడిని తట్టుకునేలా హై-స్ట్రెంగ్త్ కార్బన్ స్టీల్‌తో వీటిని తయారు చేస్తారు. దాదాపు 1.8 మీటర్ల వ్యాసంతో ఉండే భారీ పైపులను 12 నుంచి 18 మీటర్ల పొడవైన సెక్షన్లుగా తయారు చేసి, ప్రత్యేక ట్రక్కుల్లో ఎడారి ప్రాంతాలకు తరలిస్తారు. పైపులకు తుప్పు పట్టకుండా ప్రత్యేక కోటింగ్ వేసి, అల్ట్రాసోనిక్ పరీక్షలు నిర్వహించిన తర్వాతే వినియోగిస్తారు.

ఇసుక.. రాళ్లు.. కొండలు దాటుతూ
తీర ప్రాంతం నుంచి అంతర్భాగాలకు పైప్‌లైన్ వేయడం మరో భారీ సవాలు. ముందుగా GPS, ఆధునిక సర్వే పరికరాలతో మార్గాన్ని నిర్ణయిస్తారు. కదిలే ఇసుక దిబ్బలు, అస్థిరమైన భూభాగాలను వీలైనంత వరకు తప్పించుకుంటారు. రాళ్లు, కొండలు ఎదురైతే నియంత్రిత పేలుళ్లతో వాటిని తొలగించి లోతైన కాలువలు తవ్వుతారు. అందులో పైపులను అమర్చి.. ఒక్కో సెక్షన్‌ను మరొకదానితో అనుసంధానిస్తూ వేల కిలోమీటర్ల నెట్‌వర్క్‌ను నిర్మించారు.
అసలు నీరు ఎక్కడి నుంచి?
ఇదంతా ఒక ఎత్తయితే.. అసలు నీటి వనరు సముద్రమే. తీరానికి వందల మీటర్ల దూరంలో భారీ ఇన్‌టేక్ పైపులను ఏర్పాటు చేసి సముద్రపు నీటిని ప్లాంట్లలోకి తీసుకొస్తారు. కొన్ని పైపులు రోజుకు కోట్ల లీటర్ల నీటిని తరలించే సామర్థ్యం కలిగి ఉంటాయి. చేపలు, పీతలు, జెల్లీ ఫిష్ వంటి సముద్ర జీవులు లోపలికి రాకుండా ప్రత్యేక స్క్రీన్లను ఏర్పాటు చేస్తారు.
ఉప్పునీరు.. మంచినీరుగా ఎలా?
మొదట సముద్రపు నీటిని ఇసుక ఫిల్టర్ల ద్వారా శుద్ధి చేస్తారు. ఫెరిక్ క్లోరైడ్, సోడియం హైపోక్లోరైట్ వంటి రసాయనాలతో మలినాలను ఒకచోట చేర్చి తొలగిస్తారు. ఆ తర్వాత 1–5 మైక్రాన్ల పరిమాణంలో ఉన్న సూక్ష్మ కణాలను కూడా పట్టుకునే కార్ట్రిడ్జ్ ఫిల్టర్ల ద్వారా నీటిని పంపిస్తారు.
అసలు కీలక ప్రక్రియ రివర్స్ ఆస్మాసిస్ (RO). దాదాపు 60 బార్ ఒత్తిడితో సముద్రపు నీటిని ప్రత్యేక మెంబ్రేన్‌ల గుండా పంపుతారు. నీటి అణువులు మాత్రమే మెంబ్రేన్‌ను దాటుతుండగా.. ఉప్పు, ఇతర మలినాలు వెనుకే మిగిలిపోతాయి. అవసరమైతే మరోసారి RO ప్రక్రియ నిర్వహించి మరింత శుద్ధి చేస్తారు.
శుద్ధి చేశాక మళ్లీ ఖనిజాలే!
అయితే పూర్తిగా శుద్ధి చేసిన నీటిలో సహజంగా ఉండే కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు చాలా తక్కువగా ఉంటాయి. దీంతో నీటికి అవసరమైన ఖనిజాలను మళ్లీ కలుపుతారు. పీహెచ్ స్థాయిని కూడా సరిచేసి.. తాగేందుకు అనువుగా మారుస్తారు.
ఖర్చు భారీ.. అవసరం తప్పనిసరి
ఇంత భారీ నీటి వ్యవస్థను నిర్మించడం అంత చౌక కాదు. ఒక్క కిలోమీటర్ పైప్‌లైన్ నిర్మాణానికే మిలియన్ల డాలర్లు ఖర్చవుతాయి. భారీ డీశాలినేషన్ ప్లాంట్లకు వందల మిలియన్ల డాలర్ల పెట్టుబడులు అవసరం. నీటి ఉత్పత్తి ఖర్చు కూడా సాంకేతికత, విద్యుత్ ధరలు, ప్లాంట్ సామర్థ్యాన్ని బట్టి గణనీయంగా ఉంటుంది. అయినా సౌదీకి మరో మార్గం పెద్దగా లేదు. నదులు లేని దేశం.. తక్కువ వర్షపాతం.. విస్తారమైన ఎడారి. అందుకే సముద్రాన్నే నీటి వనరుగా మార్చుకుని.. వందల కిలోమీటర్ల పైప్‌లైన్లతో ఆ నీటిని ఎడారి మధ్యనున్న నగరాలకు చేరుస్తోంది. సహజంగా లేని నదులకు బదులుగా ఇంజినీరింగ్‌తో కృత్రిమ జలధారను సృష్టించుకుంది.
ఇదీ చదవండి: ఈఫిల్ టవర్ మూసివేతకు కారణం ఇదే!


