వాషింగ్టన్: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. అమెరికా నౌకాదళానికి చెందిన యుద్ధనౌకపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ (IRGC) వరుసగా రెండుసార్లు బాలిస్టిక్ క్షిపణులతో దాడికి ప్రయత్నించడంతో.. అమెరికా తీవ్రంగా స్పందించి ప్రతి దాడి చేసింది. ఇరాన్‌కు చెందిన ఐదు ముడి చమురు రవాణా నౌకలను అమెరికా బలగాలు తాజాగా ధ్వంసం చేశాయని యూఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) వెల్లడించింది.
గత రెండు రోజుల్లో అమెరికా నేవీ యుద్ధనౌకపై ఇరాన్ రెండుసార్లు క్షిపణి దాడికి ప్రయత్నించిందని CENTCOM తెలిపింది. అయితే రెండు దాడులను అమెరికా యుద్ధనౌక విజయవంతంగా తప్పించుకుని, ప్రాంతీయ జలాల్లో తన కార్యకలాపాలను కొనసాగించిందని పేర్కొంది. ఈ ఘటనల్లో అమెరికా సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని స్పష్టం చేసింది. కాగా, ఇరాన్ తాజా దాడి ప్రయత్నాలకు ప్రతిస్పందనగా ఐదు చమురు నౌకలపై దాడులు చేసినట్లు అమెరికా తెలిపింది.
ఐఆర్‌జీసికి చెందిన చెందిన చమురు అక్రమ రవాణా నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్నట్లు ఆరోపించిన M/T Kaviz, M/T Charminar, M/T Horizon 1, M/T Riesco నౌకలను గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో, M/T Derya నౌకను ఇరాన్‌లోని ఖార్గ్ ఐలాండ్ సమీపంలో లక్ష్యంగా చేసుకున్నట్లు CENTCOM వెల్లడించింది. అయితే, దాడులకు ముందు నౌకల్లోని సిబ్బందిని ఖాళీ చేయాలని అమెరికా బలగాలు ఆదేశించాయని, ఆ తర్వాత నౌకలను పనికిరాకుండా చేశాయని పేర్కొంది. ఈ నౌకలు ఇరాన్ నుంచి భారీ స్థాయిలో చమురు అక్రమ రవాణా చేస్తూ, ఐఆర్‌జీసీతో పాటు దాని ప్రాంతీయ మద్దతుదారులకు నిధులు సమకూర్చే బహుళ బిలియన్ డాలర్ల ‘షాడో ఫ్లీట్’లో భాగమని అమెరికా ఆరోపించింది.
CENTCOM forces destroyed five Iranian crude oil carriers, Sept. 8, after the Islamic Revolutionary Guard Corps (IRGC) targeted a U.S. Navy warship with ballistic missiles twice over the past two days. The U.S. warship successfully evaded the attempted Iranian attacks and… pic.twitter.com/Gi8a2tloN1
— U.S. Central Command (@CENTCOM) September 8, 2026
ఇదే తరహాలో సెప్టెంబర్ 5న కూడా మూడు ఇరాన్ చమురు నౌకలను అమెరికా ధ్వంసం చేసింది. అప్పట్లో అమెరికా విమాన వాహక నౌక, గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్‌పై ఐఆర్‌జీసీ దాడికి ప్రయత్నించిందని CENTCOM పేర్కొంది. ఇప్పటివరకు అమెరికా నేవీ నౌకలపై ఇరాన్ చేసిన అన్ని దాడి ప్రయత్నాలు విఫలమయ్యాయని తెలిపింది. అయితే ఇరాన్ ప్రభుత్వ మీడియా మాత్రం తాజా అమెరికా దాడుల్లో రెండు చమురు ట్యాంకర్లు దెబ్బతిన్నాయని తెలిపింది. ఒకటి జాస్క్ సమీపంలో, మరొకటి ఖార్గ్ ఐలాండ్ సమీపంలో దాడికి గురయ్యాయని పేర్కొంది. నౌకల్లోని సిబ్బందిని సురక్షితంగా తరలించామని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపింది.
తాజా పరిణామాలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా చర్యలకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించినట్లు సమాచారం. కువైట్, బహ్రెయిన్ నౌకాశ్రయాల సమీపంలో ప్రయాణించే చమురు నౌకలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా.. అమెరికా నేవీ నౌకలపై ఇరాన్ దాడికి ప్రయత్నిస్తే.. ప్రతిసారీ మరిన్ని చమురు ట్యాంకర్లను ఇరాన్ కోల్పోవాల్సి వస్తుందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో హెచ్చరించారు.
ఇదీ చదవండి: ఈనెల 11న మోదీ, పుతిన్ భేటీ..


