కెనడాతో ట్రంప్‌ ట్రేడ్‌ వార్‌లో మరో సంచలనం | Trump Warns Bombardier: Build in the US or Lose Access to American Market | Sakshi
Sakshi News home page

కెనడాతో ట్రంప్‌ ట్రేడ్‌ వార్‌లో మరో సంచలనం

Sep 8 2026 6:52 AM | Updated on Sep 8 2026 8:16 AM

Trump Warns Bombardier: Build in the US or Lose Access to American Market

అమెరికా–కెనడా మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదురుతోంది. కెనడాకు చెందిన ప్రముఖ ప్రైవేట్‌ జెట్‌ తయారీ సంస్థ బాంబార్డియర్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర హెచ్చరికలు చేశారు. అమెరికా మార్కెట్‌లో విమానాలు విక్రయించాలంటే వాటిని అమెరికాలోనే తయారు చేయాలని.. లేదంటే అమెరికాలో ఆ సంస్థ జెట్ల అమ్మకాలను అనుమతించబోమని స్పష్టం చేశారు.

తాజాగా ‘ట్రూత్‌ సోషల్‌’లో డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన పోస్ట్‌ సారాంశం.. “అమెరికాలో ఇక బాంబార్డియర్‌ విక్రయాలు ఉండవు. అమెరికా మార్కెట్‌లో కొనసాగాలంటే ‘ఇక్కడే తయారు చేయాలి’ అని అన్నారు. అమెరికాను ‘పిగ్గీ బ్యాంక్‌’గా ఉపయోగించుకోవద్దంటూ బాంబార్డియర్‌పై విమర్శలు చేశారు. సంస్థ ఉత్పత్తుల నాణ్యతపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు.

కెనడా ప్రతీకార సుంకాలు
అమెరికా విధిస్తున్న సుంకాలకు ప్రతీకారంగా కెనడా మంగళవారం(నేటి) నుంచి కొత్త టారిఫ్‌లను అమలు చేయనుంది. అమెరికా నుంచి దిగుమతయ్యే వందలాది ఉత్పత్తులపై 50 శాతం వరకు సుంకాలు విధించనుంది. అల్యూమినియం ఫాయిల్‌, రెయిన్‌కోట్లు, చీజ్‌ తదితర ఉత్పత్తులు వీటి పరిధిలోకి రానున్నాయి.

మొత్తం సుమారు 20 బిలియన్‌ డాలర్ల విలువైన అమెరికా ఉత్పత్తులపై ఈ సుంకాలు పడనున్నాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి అవి అమల్లోకి రానున్నాయి. తాజా చర్యతో ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న ఇరుదేశాల వాణిజ్య సంబంధాలు మరింత దెబ్బతినే అవకాశం ఉంది.

అయితే.. కెనడా ప్రతీకార సుంకాలపై ట్రంప్‌ తీవ్రంగా స్పందిస్తూ.. అమెరికా కూడా మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కెనడాలో తయారయ్యే కార్లు, ఆటో విడిభాగాలపై ప్రస్తుతం ఉన్న 25 శాతం సుంకాన్ని 50 శాతానికి పెంచుతామని గత నెలలోనే ప్రకటించారు. ఇది జనవరి నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు.

“మనకు కెనడా అవసరం లేదు.. వారికి మనమే అవసరం” అంటూ ట్రంప్‌ గతంలో చేసిన వ్యాఖ్యలు ఇరుదేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతకు అద్దం పడుతున్నాయి.

అమెరికాలో బాంబార్డియర్‌కు భారీ వ్యాపారం
ట్రంప్‌ తాజా హెచ్చరిక బాంబార్డియర్‌కు కీలక పరిణామమే అయినా.. ఆ సంస్థకు అమెరికాతో బలమైన వ్యాపార సంబంధాలు ఉన్నాయి. మాంట్రియల్‌ కేంద్రంగా పనిచేసే బాంబార్డియర్‌కు అమెరికాలో సుమారు 3,500 మంది ఉద్యోగులు, దాదాపు 2,800 మంది అమెరికా సరఫరాదారులు ఉన్నారు. అమెరికాలోనే పలు ఫ్యాక్టరీలు, సర్వీస్‌ సెంటర్లను నిర్వహిస్తున్న ఈ సంస్థ.. మరో సర్వీస్‌ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తోంది. కంపెనీ తయారు చేసే ఫ్లాగ్‌షిప్‌ గ్లోబల్‌ 8000 బిజినెస్‌ జెట్‌ రెక్కలను టెక్సాస్‌లో తయారు చేస్తోంది. రక్షణ విభాగానికి చెందిన కార్యకలాపాల కోసం కాన్సాస్‌లో ప్రత్యేక కేంద్రం కూడా ఉంది.

బాంబార్డియర్‌ కస్టమర్లు నిర్వహిస్తున్న సుమారు 5,100 విమానాల్లో దాదాపు సగం అమెరికాలోనే ఉన్నాయి. దీంతో అమెరికా మార్కెట్‌ ఆ సంస్థకు అత్యంత కీలకమైనది.

అమెరికా కంపెనీలపైనే ఆధారం
అమెరికా–కెనడా విమానయాన పరిశ్రమలు పరస్పరం ఎంతగా అనుసంధానమై ఉన్నాయో బాంబార్డియర్‌ ఉదంతం స్పష్టం చేస్తోంది. బాంబార్డియర్‌ బిజినెస్‌ జెట్లలో ఉపయోగించే చాలా ఇంజిన్లను అమెరికాకు చెందిన హనీవెల్‌ ఏరోస్పేస్‌, జీఈ ఏరోస్పేస్‌ సంస్థలు తయారు చేస్తున్నాయి. విమానాలు, విడిభాగాల రాకపోకల విషయంలోనూ ఇరుదేశాల పరిశ్రమలు పరస్పరం ఆధారపడుతున్నాయి. ఇప్పటివరకు ఏరోస్పేస్‌ రంగంపై టారిఫ్‌ల ప్రభావం పెద్దగా కనిపించలేదు.

అమెరికా ఏరోస్పేస్‌ ఇండస్ట్రీస్‌ అసోసియేషన్‌ ప్రకారం.. 2025లో అమెరికా ఏరోస్పేస్‌, రక్షణ రంగం 109.2 బిలియన్‌ డాలర్ల వాణిజ్య మిగులు (Trade Surplus.. అంటే ఒక దేశం దిగుమతులు చేసుకున్న దానికంటే ఎగుమతుల ద్వారా ఎక్కువ విలువ సంపాదించడం) నమోదు చేసింది. అదే సమయంలో ఎగుమతులు అంతకుముందు ఏడాదితో పోలిస్తే 25 శాతం పెరిగాయి.

గతంలోనూ బాంబార్డియర్‌పై ట్రంప్‌ గురి
బాంబార్డియర్‌ను ట్రంప్‌ గతంలోనూ లక్ష్యంగా చేసుకున్నారు. ఈ ఏడాది జనవరిలో బాంబార్డియర్‌ గ్లోబల్‌ ఎక్స్‌ప్రెస్‌ బిజినెస్‌ జెట్లకు అమెరికా ధ్రువీకరణ రద్దు చేస్తామని హెచ్చరించారు. కెనడాలో తయారయ్యే విమానాలపై 50 శాతం సుంకాలు విధిస్తామని కూడా ప్రకటించారు.

తాజా హెచ్చరికను అమెరికా ప్రభుత్వం ఎలా అమలు చేస్తుందన్నదానిపై మాత్రం స్పష్టత లేదు. ఇప్పటికే అమెరికా ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌ఏఏ) అనుమతులు పొందిన బాంబార్డియర్‌ విమానాల డెలివరీలను కూడా అడ్డుకుంటారా? అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ట్రంప్‌ వ్యాఖ్యలపై బాంబార్డియర్‌ నుంచి వెంటనే స్పందన రాలేదు.

ఇరుదేశాలకూ తప్పని నష్టం?
అమెరికా–కెనడా మధ్య వాణిజ్య సంబంధాలు అత్యంత కీలకమైనవి. 2026 తొలి ఆరు నెలల్లో అమెరికా కెనడాకు 175.8 బిలియన్‌ డాలర్ల విలువైన వస్తువులను ఎగుమతి చేసింది. అమెరికా మొత్తం ఎగుమతుల్లో కెనడా వాటా 14 శాతంగా ఉంది. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య రాకపోకలు సాగించే వస్తువుల్లో కొద్దిపాటి వాటిపైనే టారిఫ్‌లు అమల్లో ఉన్నప్పటికీ.. వివాదం మరింత విస్తరిస్తే రెండు దేశాల వ్యాపారాలు, వినియోగదారులపై భారం పెరగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇదీ చదవండి: మహిళ చేతికి పనామా కెనాల్‌.. ఎవరంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement