- అంగారకుడి చంద్రుడు ‘ఫోబోస్’ పైకి వ్యోమనౌక
- అక్కడి మట్టి, రాళ్ల నమూనాలు 2031లో భూమికి
- వచ్చే నెల 20న జపాన్ ‘ఎంఎంఎక్స్’ మిషన్ ప్రయోగం
మానవుడు సౌరవ్యవస్థలో అత్యధికంగా శోధించిన గ్రహం... పొరుగునున్న అంగారకుడు! ఇదే కుజ గ్రహం. ఐరన్ ఆక్సైడ్ వల్ల దీని నేల ఎర్రగా కనిపిస్తుంది కనుక అరుణగ్రహం అని కూడా అంటారు. ఈ గ్రహం దాపులకు వెళ్లిన అంతరిక్ష నౌకలు, దాని కక్ష్యలో తిరిగిన మానవ నిర్మిత ఉపగ్రహాలు (ఆర్బిటర్లు), ఉపరితలంపై దిగిన ల్యాండర్లు, రోవర్ల మిషన్లను లెక్కపెడితే.. 1964 నుంచి నేటి వరకు దాదాపు 40 సార్లు అంగారకుడిపై పరిశోధనల దండయాత్రలు చేశాం. ఆ గ్రహపు విశాల లోయలు, తుప్పుపట్టిన రంగులోని ఇసుక తిన్నెల్ని ఆర్బిటర్లు ఫొటోలు తీశాయి.
రోవర్లు అక్కడి దుమ్ము తుపాన్లను, గడ్డకట్టించే చలిని తట్టుకుంటూ, రాతిపొరల్లో రంధ్రాలు వేస్తూ పురాతన నదీ గర్భాల కింద జీవం ఆనవాళ్ల కోసం అన్వేషణ సాగించాయి. నాసా రోవర్లు ‘క్యూరియాసిటీ’, ‘పెర్సెవరెన్స్’ ప్రస్తుతం అంగారకుడి ఉపరితలంపై తిరుగాడుతూ పరిశోధిస్తున్నాయి. నాసా ఉపగ్రహాలు ‘మార్స్ ఒడిస్సీ’, ‘మార్స్ రీకానసన్స్ ఆర్బిటర్’, యూరోపియన్ అంతరిక్ష సంస్థకు చెందిన ‘మార్స్ ఎక్స్ప్రెస్’ సహా దాదాపు అరడజను ఆర్బిటర్లు ప్రస్తుతం అంగారకుడి కక్ష్యలో చక్కర్లు కొడుతూ ఆ గ్రహాన్ని జల్లెడ పడుతున్నాయి.

కానీ, అంగారకుడి జంట చంద్రుళ్లు ఫోబోస్, డీమోస్ జన్మరహస్యం మాత్రం నేటికీ ఓ మిస్టరీగానే మిగిలింది. సూర్యుడి బాహ్య గ్రహాల చంద్రుళ్లపై ఓ లుక్కేద్దాం! శని చందమామ టైటాన్... మీథేన్ సముద్రాలతో అలరారుతోంది. నిత్యం బద్దలయ్యే 400 అగ్నిపర్వతాలతో గురుడి చంద్రుడు ‘అయో’ సదా అట్టుడుకుతుంటాడు. ఇక గురుడి మరో చంద్రుడు యూరోపా, శని చంద్రుడు ఎన్సెలాడస్... మంచుతో ఘనీభవించిన తమ ఉపరితలాల కింద ద్రవరూప సముద్రాలతో శోభిల్లుతున్నాయి. అంగారకుడి జంట చంద్రుళ్లకు మాత్రం ఇంత ‘గ్లామర్’ లేదు!
ఫోబోస్, డీమోస్ వంకరటింకరగా బంగాళాదుంప ఆకారంలో ఉంటాయి. గ్రహాల సహజ చంద్రుళ్లకు సంబంధించిన ఈ సకార, వికార ఆకృతుల ముచ్చట పక్కనపెడితే... రెండు రాతి ముక్కలు ఫోబోస్, డీమోస్ మనకు చెప్పాల్సిన సంగతులు బోలెడు! వీటి గుట్టు విప్పడానికి జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ (జాక్సా) వచ్చే నెల 20న తనేగాషిమా అంతరిక్ష కేంద్రం నుంచి హెచ్3 రాకెట్ సాయంతో ‘మార్షియన్ మూన్స్ ఎక్స్ప్లోరేషన్’ (ఎంఎంఎక్స్) వ్యోమనౌకను ప్రయోగించబోతోంది. అది ఫోబోస్ మీద దిగి పది గ్రాముల దాకా మట్టి, సూక్ష్మ శిలలు, ధూళి నమూనాలు సేకరించి భూమికి పట్టుకొస్తుంది.

భయం పుట్టిస్తాడు ఫోబోస్!
అంగారకుడు రోమన్ల యుద్ధ దేవుడు. పురాణాల ప్రకారం గ్రీకుల యుద్ధ దేవుడు ‘ఏరిస్’. ఇతడి కుమారులే ఫోబోస్, డీమోస్. వీరిద్దరు తండ్రికి రథసారథులై యుద్ధంలో అతడికి సహకరిస్తారు. రణరంగంలో అకస్మాత్తుగా భయోత్పాతం సృష్టించి శత్రు సైనికుల పలాయనానికి కారణమవుతాడు ఫోబోస్. ఇక డీమోస్- యుద్ధభూమిలో బీభత్సానికి ప్రతీక. నేడు వాడుకలో ఉన్న ప్రాచీన గ్రీకు పదం ‘ఫోబియా’ (భయం)కు మూలం ఫోబోస్!
అంగారకుడి జంట చంద్రుళ్లను అమెరికన్ ఖగోళవేత్త అసాఫ్ హాల్ 1877లో కనుగొన్నాడు. పరిమాణంలో డీమోస్ కంటే పెద్దదైన ఫోబోస్ అంగారకుడికి బాగా దగ్గరగా ఉంటుంది. అంగారకుడికి ఫోబోస్ కేవలం 6 వేల కిలోమీటర్ల దూరంలో, డీమోస్ 23 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. 22 కిలోమీటర్ల వ్యాసం గల ఫోబోస్ ఏడున్నర గంటల్లోనే అంగారకుడి చుట్టూ పరిభ్రమిస్తుంది. 12 కిలోమీటర్ల వ్యాసం గల డీమోస్ అంగారకుడి చుట్టూ తిరగడానికి 30 గంటలు పడుతుంది.

గ్రహశకలాలా? అంగారకుడి శిథిలాలతో పుట్టాయా?
అంగారకుడు-గురుడు గ్రహాల మధ్య గల ఆస్టరాయిడ్ బెల్టులో లక్షలాది గ్రహశకలాలున్నాయి. ఫోబోస్, డీమోస్ కూడా గ్రహశకలాలని, సౌరవ్యవస్థ ఆవిర్భావ దశలో అంగారకుడు గురుత్వశక్తితో వాటిని బంధించి చంద్రుళ్లుగా మార్చుకున్నాడనేది 40 ఏళ్లుగా బహుళ జనాదరణ పొందిన సిద్ధాంతం. ఎందుకంటే అంగారకుడికి తన జంట చంద్రుళ్లతో ఏమాత్రం సంబంధం ఉన్నట్టు అనిపించదు. మంచు, సేంద్రియ పదార్థాలతోపాటు అత్యధిక కార్బన్ గల ‘కార్బొనేషియస్ కాండ్రైట్స్’ తరగతికి చెందిన ఉల్కలతో ఈ రెండు చంద్రుళ్లకు పోలికలున్నాయి. తక్కువ సాంద్రత గల ఫోబోస్, డీమోస్ సూర్యకాంతిని అత్యల్పంగా ప్రతిఫలిస్తూ నల్లటి ఉపరితలాలతో దర్శనమిస్తాయి. బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు సౌరకుటుంబంలో లోపలివైపుండే శిలామయ గ్రహాలు.
గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ సౌరవ్యవస్థలో బయటివైపుండే వాయు గ్రహాలు. జీవావిర్భావానికి కావాల్సిన మంచు, సేంద్రియ పదార్థాలు తొలుత సౌరకుటుంబ బాహ్య ప్రాంతాల్లో ఏర్పడి అనంతరం అంతర-శిలామయ గ్రహాల వైపు విస్తరించాయా? ఈ ప్రశ్న ఎప్పటినుంచో శాస్త్రవేత్తల మదిని తొలుస్తోంది. అటు అంతర గ్రహాలు, ఇటు బాహ్య గ్రహాల ప్రాంతాలకు మధ్యలో ఓ ‘గేట్ వే’లా ఉన్న ఫోబోస్, డీమోస్... జీవం ఆవిర్భవించిన తొలినాటి పరిస్థితులపై మనం అవగాహన పెంచుకోవడానికి దోహదపడతాయని భావిస్తున్నారు.
సౌరవ్యవస్థలోని బాహ్య గ్రహాలు బంధించిన గ్రహశకలాలు సాధారణంగా పొడవైన, వంపుతో కూడిన కక్ష్యల్లో తిరుగుతున్నాయి. కానీ ఫోబోస్, డీమోస్ మాత్రం అంగారకుడి చుట్టూ దాదాపు వృత్తాకార కక్ష్యల్లో తిరుగుతున్నాయి. మరోవైపు- భూమి నుంచి మన చంద్రుడు ఏర్పడినట్టే... ఓ భారీ ఖగోళ వస్తువు ఢీకొట్టినప్పుడు అంగారకుడి నుంచి ఉత్పన్నమైన శిథిలాలతో ఫోబోస్, డీమోస్ ఆవిర్భవించాయని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి. అవి రెండూ ఓ భారీ ఖగోళ వస్తువు నుంచి విడివడిన రెండు అవశేషాలు అయివుండొచ్చని మరో నమ్మిక. జాక్సా ‘ఎంఎంఎక్స్’ మిషన్ ఈ వాదనలన్నిటికీ చెక్ పెట్టి ఓ స్పష్టత తీసుకురానుంది.

అంగారకుడి చంద్రుడు ఫోబోస్ ఉపరితలంపై సంచరించనున్న 'ఐడెఫిక్స్' రోవర్
‘ఫోబోస్’పై తిరుగాడనున్న ‘ఐడెఫిక్స్’ రోవర్!
ఫ్రెంచ్ స్పేస్ ఏజెన్సీ, జర్మన్ ఏరో స్పేస్ సెంటర్ ఉమ్మడిగా రూపొందించిన 23 కిలోల బుల్లి రోవర్ ‘ఐడెఫిక్స్’ను మోసుకెళుతున్న ‘ఎంఎంఎక్స్’ వ్యోమనౌక వచ్చే ఏడాది అంగారకుడి కక్ష్యలో ప్రవేశిస్తుంది. వ్యోమనౌక అంగారకుడి రెండు చంద్రుళ్లకు బాగా దగ్గరికెళ్లి ఏడాది పైగా పరిశోధిస్తుంది. 2028 లేదా 2029లో మిషన్ చివరి అంకం మొదలవుతుంది. ఫోబోస్ గురుత్వశక్తి అత్యల్పం. అది మన భూమి గురుత్వశక్తిలో వెయ్యో వంతు కంటే తక్కువ. 23 కిలోల రోవర్ సైతం ఫోబోస్ ఉపరితలంపై కేవలం 15 గ్రాములే తూగుతుంది! అందుకే ‘ఐడెఫిక్స్’ ల్యాండింగులో భారీ థ్రస్టర్లు, పారాచూట్ల అవసరం ఉండదు.
రోవర్ సాఫీగా దిగుతుందా లేదా అని శాస్త్రవేత్తలు టెన్షన్ పడాల్సిన పనీ లేదు. రోవరును ప్రధాన నౌక అయిన ‘ఎంఎంఎక్స్’… ఫోబోస్ ఉపరితలానికి 40 మీటర్ల ఎత్తు నుంచి మృదువుగా కిందికి జారవిడుస్తుంది. రోవర్ వంద రోజులపాటు ఫోబోస్ ఉపరితలంపై సంచరిస్తుంది. అక్కడి రాళ్లను విశ్లేషిస్తూ ఫొటోలు తీస్తుంది. నేల స్వభావం, భౌతిక పరిస్థితులను అధ్యయనం చేస్తుంది.ఈ పని పూర్తవగానే ‘ఎంఎంఎక్స్’ వ్యోమనౌక ఫోబోస్ మీద దిగి మట్టి, రాళ్ల నమూనాలు సేకరిస్తుంది. అనంతరం డీమోస్ కు వంద కిలోమీటర్ల దూరంలోకి వెళుతుంది. దాని నిర్మాణం కూడా ఫోబోస్ లాగే ఉందో, లేదో పరిశీలిస్తుంది. 2030లో భూమికి తిరుగు పయనమవుతుంది. ఫోబోస్ నమూనాల కేప్సూల్ 2031లో పారాచూట్ల సాయంతో ఆస్ట్రేలియాలో ల్యాండవుతుంది.
- జమ్ముల శ్రీకాంత్
(Courtesy: JAXA, Smithsonian Magazine)


