బుధుడి చెంతకు ‘బెపి కొలంబో’! | Spacecraft BepiColombo Nears Mercury | Sakshi
Sakshi News home page

బుధుడి చెంతకు ‘బెపి కొలంబో’!

Sep 4 2026 7:16 PM | Updated on Sep 4 2026 7:54 PM

Spacecraft BepiColombo Nears Mercury
  • ఈఎస్ఏ, జాక్సా సంయుక్త మిషన్
  • నవంబరు 21న బుధ కక్ష్యలోకి ‘జంట వ్యోమనౌకలు’
  • డిసెంబరు 9న విడిపోనున్న ఆర్బిటర్స్
  • వీడనున్న మెర్క్యురీ మిస్టరీ!

బుధుడు... పరిమాణంలో మన చందమామ కంటే కొంచెం పెద్ద... సౌరవ్యవస్థలో అతి చిన్న గ్రహం... సూర్యుడికి అతి దగ్గరగా ఉండే గ్రహం కూడా... దీనికి సహజ చంద్రుళ్లు లేవు. బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు... ఇవి సౌరకుటుంబంలో శిలామయ అంతర గ్రహాలు. సౌరవ్యవస్థలోని ‘పాత నవగ్రహాల’ మాటకొస్తే… ప్లూటో గతంలో గ్రహం హోదా కోల్పోవడంతో అధికారికంగా అష్టగ్రహాలే మిగిలాయి. వీటిలో భూమిని తప్పిస్తే  మిగతా ఏడు గ్రహాల్లో శాస్త్రవేత్తలు ఇప్పటివరకు అతి తక్కువగా అధ్యయనం చేసింది బుధుడి గురించే! అలాంటి బుధుడి సంగతేంతో తేల్చడానికి, ఆ గ్రహాన్ని జల్లెడపట్టి లోతుగా అధ్యయనం చేయడానికి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ), జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ (జాక్సా) సంయుక్తంగా 2018లో ‘బెపి కొలంబో’ అంతరిక్ష మిషన్ ప్రయోగించాయి. 

ఇందులో భాగంగా జంట వ్యోమనౌకలు (ఉపగ్రహాలు) ఈ ఏడాది నవంబరులో బుధుడి కక్ష్యలో ప్రవేశించనున్నాయి. 1920-1984 మధ్యకాలంలో జీవించిన జూసెప్పీ బెపి కొలంబో ఇటలీకి చెందిన ఓ గణిత శాస్త్రజ్ఞుడు. బుధ, శుక్ర గ్రహాల వద్దకు తొలిసారిగా 1970వ దశకంలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ ప్రయోగించిన ‘మెరైనర్-10’ మిషన్లో ఆయన పాలుపంచుకున్నారు. బెపి కొలంబో సేవలను స్మరిస్తూ తాజా ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టారు. అప్పట్లో బుధ, శుక్ర గ్రహాలకు సమీపంగా వెళ్లిన ‘మెరైనర్-10’ అంతరిక్ష నౌక వాటి ఫొటోలు తీసి భూమికి పంపింది. ఆ తర్వాత 2004లో నాసా ప్రయోగించిన ‘మెసెంజర్’ వ్యోమనౌక (ఆర్బిటర్) తొలిసారిగా 2011లో బుధుడి కక్ష్యలో ప్రవేశించి 2015 వరకు ఆ గ్రహాన్ని మరింత అన్వేషించింది.

                                                                   జూసెప్పీ బెపి కొలంబో

ఇవీ బుధుడి విశేషాలు...
బుధ గ్రహం సూర్యుడి నుంచి సగటున 5.8 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బుధుడిపై ఒకరోజు భూమిపై 58 రోజులతో సమానం. అక్షంపై తన చుట్టూ తాను తిరగడానికి బుధుడు అంత సమయం తీసుకుంటాడు. అలాగే 88 రోజులకోసారి సూర్యుడి చుట్టూ పరిభ్రమణం పూర్తిచేస్తాడు. అంటే భూమిపై 88 రోజులు గడిస్తే బుధుడిపై ఏడాది పూర్తవుతుంది. బుధుడి ఉపరితల ఉష్ణోగ్రత పగటి వేళల్లో 430 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు, రాత్రి సమయాల్లో మైనస్ 180 డిగ్రీల సెంటీగ్రేడ్ దాకా ఉంటాయి. ఈ గ్రహం వ్యాసం కేవలం 4,880 కిలోమీటర్లు. వాయువులతో కూడిన అతి పలుచని పొరతో అక్కడి వాతావరణం నిర్మితమైంది. బుధుడిని ‘విస్మరించిన లేదా నిర్లక్ష్యానికి గురైన’ గ్రహంగా పిలుస్తారు. 

కారణం- మన పొరుగు గ్రహాలైన శుక్రుడు, అంగారకుడితో పోలిస్తే బుధుడిని చేరుకోవడం, భూమి నుంచి దాన్ని అధ్యయనం చేయడం బహు కష్టం. సౌరవ్యవస్థలో సూర్యుడికి బుధుడు బాగా దగ్గరగా ఉంటాడు. సూర్యుడిది అఖండ గురుత్వ శక్తి. తన సమీపంలోని ఖగోళ వస్తువులను భానుడు అమిత వేగంతో ఆకర్షిస్తూ తనలోకి లాగేసుకుంటాడు. ఆ సౌర గురుత్వాకర్షణను దీటుగా ఎదుర్కొంటూ... దానికి వ్యతిరేకంగా తన వేగాన్ని బాగా తగ్గించుకుంటూ బుధుడిని చేరడానికి వ్యోమనౌక బోలెడు ఇంధనాన్ని మండించాలి! అందుకే ఈ ప్రయాణం సంక్లిష్టం, వ్యయభరితం. సూర్యుడి వేడికి వ్యోమనౌకలోని సైంటిఫిక్ పరికరాలు, ఎలక్ట్రానిక్ భాగాలు కాలిపోతాయి. 

వ్యోమనౌక భానుడికి అతి చేరువగా ఉంటుంది కనుక పగటి వేళ భూమ్మీది టెలిస్కోపులు సూర్యకాంతి ధగధగల్లో దాన్ని చూడలేవు. ఇన్ని పరిమితులున్నందునే కేవలం రెండు మిషన్లే (మెరైనర్-10, మెసెంజర్) బుధుడిని సందర్శించాయి. బుధుడి ఆవిర్భావం, తదనంతర పరిణామాలు, ఉపరితల స్వరూపం, అంతర్గత నిర్మాణం, రసాయన కూర్పు, వాతావరణం, గతిశీల-బలహీన అయస్కాంత క్షేత్రాన్ని అధ్యయనం చేయడం ‘బెపి కొలంబో’ మిషన్ లక్ష్యం. 2018 అక్టోబరు 20న ఫ్రెంచ్ గయానాలోని కౌరూ స్పేస్ పోర్టు నుంచి ఏరియన్-5 రాకెట్ ప్రయోగించి ఇందుకు శ్రీకారం చుట్టారు. చుట్టూ తిరిగి వెళ్లే మార్గంలో భాగంగా ఈ మిషన్ ఇప్పటివరకు వెయ్యి కోట్ల కిలోమీటర్ల దూరం పైగా ప్రయాణించింది.

‘మెర్కురీ హాలోస్’పై డేగ కన్ను!
చివరిసారిగా 2025 జనవరి 8న బుధుడి సమీపానికి వెళ్లినప్పుడు... ఆ గ్రహంపై అగ్నిపర్వత మైదానాలు, ఉల్కలు/గ్రహశకలాలు వంటి ఖగోళ వస్తువులు ఢీకొని ఉపరితలంపై ఏర్పడిన బిలాల తాలూకు అచ్చెరువొందించే ఫొటోలు తీసింది ‘బెపి కొలంబో’ మిషన్. బుధుడి ఉపరితల శిలల్లో ముఖ్యంగా గంధకం వంటి అస్థిర ఖనిజాలు సూర్యుడి వేడికి ఉత్పతనం చెందుతున్నట్టు 1974లో ‘మెరైనర్-10’ అంతరిక్ష నౌక గమనించింది. అక్కడి సల్ఫర్ వంటి అస్థిర మూలకాలు ద్రవస్థితిలోకి మారకుండానే ఘనస్థితి నుంచి నేరుగా వాయురూపంలో ఆవిరైపోవడంతో ఆ ప్రాంతాల్లో తక్కువ లోతుతో ప్రకాశవంతమైన విలక్షణ గుంతలు ఏర్పడ్డాయి. ‘మెర్క్యురి హాలోస్’గా పిలిచే వీటిపైనా ‘బెపి కొలంబో’ ఓ కన్నేస్తుంది. సూర్యుడికి అతి సమీపంగా ఉన్న గ్రహం కనుక విపరీత వేడిమిని తట్టుకునేలా జంట వ్యోమనౌకలను రూపొందించారు. ‘బెపి కొలంబో’ మిషన్ వ్యయం 1.65 బిలియన్ యూరోలు. మన కరెన్సీలో ఇది సుమారు రూ.18,100 కోట్లు. రాకెట్ ప్రయోగ వ్యయం, ఎంపీవో, ఎంటీవోల రూపకల్పన, ఇతర నిర్వహణ ఖర్చులు కలిపి రూ.14,275 కోట్ల మేర సింహభాగాన్ని ఈఎస్ఏ భరించింది. ఎంఎంవో తయారీ సహా మిగతా ఖర్చును ‘జాక్సా’ పెట్టుకుంది.

- జమ్ముల శ్రీకాంత్ 
(Courtesy: European Space Agency, JAXA, Forbes, The Manila Times, ‘nature’ magazine).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement