పిల్లలు చదివే చోటనే తల్లిదండ్రులకు ఆఫీస్ స్పేస్
చిల్డ్రన్స్ స్కూల్స్‌కు కొత్త రూపు
పేరెంట్ కేఫ్–కో–వర్కింగ్ లాంజ్ ఏర్పాటు
ప్రశాంతంగా ఆఫీసు పనిచేసుకునే వాతావరణం
ఎంచక్కా తోటితల్లిదండ్రులతో మాట్లాడుకునే వీలు
సైక్లింగ్ చేసుకోవచ్చు...పుస్తకాలు తిరిగేయొచ్చు
ఎలాంటి రుసుమూ లేకుండానే వసతులు
‘ఇంటర్‌జెనరేషనల్ క్యాంపస్’గా మార్చే అవకాశం
‘ఎలా ఉన్నాడో? ఏం చేస్తున్నాడో... అల్లరి చేస్తున్నాడో.... అమ్మ కావాలంటున్నాడో....’బుడి బుడి నడకల బుడ్డోడిని తొలిసారి స్కూల్‌లో వదిలి వచ్చాక.. ఆ పెద్దోళ్ల ఆందోళన అంతా ఇంతా కాదు. ఇంటికి వచ్చినా, ఆఫీసుకు వచ్చినా మనసు మాత్రం ఆ బుడ్డోడి స్కూల్‌లోనే ఉండిపోతుంది. మరింకేం.. మనిషి కూడా మనసున్న చోటే ఉండండి అంటూ పేరెంట్స్‌ని మనసారా ఆహ్వానిస్తోంది ఓ వినూత్న కాన్సెప్ట్.
సాక్షి, హైదరాబాద్: నగరంలోని టెక్ కంపెనీలు హైబ్రిడ్ వర్క్ కల్చర్‌కు అలవాటు పడుతున్న వేళ.. ఇష్టం వచ్చిన చోట ఉంటూనే ఆఫీస్ పని చేసుకునే వెసులుబాటున్నప్పుడు...స్కూల్ నుంచి మాత్రం ఎందుకు పని చేసుకోకూడదు? ఈ ఆలోచనతో పిల్లలు స్కూల్‌లో చదువుకుంటుంటే..తల్లిదండ్రులు అదే ప్రాంగణంలో కూర్చుని తమ ఆఫీస్ పనులు చేసుకునేలా నగరానికి చెందిన ఓ ఇంటర్నేషనల్ స్కూల్ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.
ఈ స్కూల్‌లో తల్లిదండ్రుల కోసం ప్రత్యేకంగా ‘పేరెంట్ కేఫ్–కో–వర్కింగ్ లాంజ్’ఏర్పాటు చేశారు. అంటే.. పిల్లలను స్కూల్‌లో దింపేసి ఆదరాబాదరా తిరిగి ఇంటికి/ఆఫీసుకి వెళ్లాల్సిన అవసరం లేదు.పిల్లలు క్లాస్‌రూమ్‌కి వెళ్తే పేరెంట్స్ కేఫ్‌లో కూర్చుని ప్రశాంతంగా ఆఫీసు పని చేసుకోవచ్చు.. లేదా కాఫీ తాగుతూ కాస్త విశ్రాంతి తీసుకోవచ్చు. తోటి తల్లిదండ్రులతో మాట్లాడుకోవచ్చు. సుమారు 1,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ లాంజ్‌లో పని చేసుకోవడానికి ప్రత్యేక డెస్క్ లు, అందరూ కలిసి కూర్చునే టేబుళ్లు ఏర్పాటు చేశారు.
శాండ్‌విచ్‌లు, సలాడ్లు, ర్యాప్స్, బౌల్స్ వంటి తేలికపాటి ఆహారం కేఫ్‌లో లభిస్తుంది. వ్యాయామం చేయాలనుకునేవారి కోసం స్టేషనరీ సైకిల్, పిల్లల పెంపకం, చైల్డ్ డెవలప్‌మెంట్, విద్యకు సంబంధించిన పుస్తకాలతో నిండిన చిన్న లైబ్రరీ కూడా ఉంది. కేఫ్‌లో తీసుకునే ఆహారం, పానీయాలకు తప్ప కో–వర్కింగ్ లాంజ్‌ను ఉపయోగించేందుకు ఎలాంటి రుసుమూ లేకపోవడం విశేషం.
ఆందోళన తగ్గింది
మా కవల పిల్లలు చాశ్వి, చాసన్‌లను స్కూల్‌లో వదిలి వెళ్లాల్సి రావడం వల్ల కలిగే ఆందోళనను ఈ లాంజ్ కొంతవరకు తగ్గిస్తోంది. పిల్లలు బాగా చిన్నవాళ్లు కావడం వల్ల స్కూల్ కొనసాగుతున్న సమయంలోనూ అప్పుడప్పుడు వారిని చూసుకోవాల్సిన అవసరం రావచ్చు. అలాంటప్పుడు ఇంటి నుంచి మళ్లీ స్కూల్‌కు రావడం కంటే ఇక్కడే ఉండటం సౌకర్యంగా ఉంటుంది. రోజూ రెండు గంటలపాటు పుస్తకం చదవడం, ఇతర తల్లిదండ్రులతో మాట్లాడడం బాగుంది. – ప్రత్యూష దేవరపల్లి, గృహిణి, కోకాపేట
కో వర్కింగ్ స్పేస్‌ల కన్నా విశాలంగా...
సాధారణ కో–వర్కింగ్ స్పేస్‌లలో మూసివేసిన డెస్‌్కలు, క్యాబిన్లు కొంత ఇరుకుగా అనిపిస్తాయని.. ఇక్కడ మాత్రం విశాలమైన, గాలి బాగా వచ్చే వాతావరణం ఉండటంతో ప్రశాంతంగా పని చేసుకోవచ్చని ఓ స్టార్టప్ నిర్వాహకులు కార్తీక్ చెబుతున్నారు. అంతేకాదు.. పిల్లలను ఆట కోసం బయటకు తీసుకొచ్చే సమయాలు నిర్దిష్టంగా ఉండటంతో లాంజ్‌లోకి పెద్దగా శబ్దం రాకపోవడం కూడా పనిపై దృష్టి పెట్టేందుకు ఉపయోగపడుతోందని అంటున్నారు.
లండన్.. సింగపూర్ స్ఫూర్తిగా...
ఈ వినూత్న ఆలోచనకు బీజం 2022లో పడిందని ప్రీ–నర్సరీ, కిండర్‌గార్డెన్‌తో పాటు రెండో తరగతి వరకు తరగతులు నిర్వహించే నానక్‌రామ్‌గూడలోని సేజ్‌బ్రూక్ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవస్థాపకుడు ప్రవీణ్ రాజు చెబుతున్నారు. తాను లండన్‌లోని ఓ కిండర్‌గార్డెన్ సందర్శించినప్పుడు అక్కడ చిన్న చిన్న క్యూబికల్స్‌తో ఏర్పాటు చేసిన కో–వర్కింగ్ స్పేస్‌ను చూశానని, పిల్లలు స్కూల్‌లో ఉండగా తల్లిదండ్రులు ఆ సమీపంలోనే ఉంటూ పని చేసుకునే ఆ విధానం తనకు బాగా నచ్చిందని వివరించారాయన.
తర్వాత సింగపూర్‌లోని ఓ స్కూల్ కూడా ఇలాంటి సదుపాయాన్ని అందిస్తున్నట్లు తెలుసుకున్నానన్నారు. దీంతో ఈ కాన్సెప్ట్ ను హైదరాబాద్‌లో అమలు చేయాలనే ఆలోచనకు రూపమిచ్చామన్నారు. గతంతో పోలిస్తే పిల్లల విద్యలో తల్లిదండ్రుల భాగస్వామ్యం ఇప్పుడు మరింత పెరిగిందని పేర్కొన్నారు. మరోవైపు పిల్లల పెంపకంలో తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. అందుకే తల్లిదండ్రులు, పిల్లలు, తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు అంతా ఒకే ప్రాంగణంలో కలిసి ఉండేలా ‘ఇంటర్‌జెనరేషనల్ క్యాంపస్’గా తమ స్కూల్‌ని తీర్చిదిద్దాలన్నది తమ ఉద్దేశమని చెబుతున్నారు.
సెపరేషన్ యాంగ్జెటీకి సొల్యూషన్.. పిల్లలను తొలిసారి స్కూల్‌లో వదిలేటప్పుడు చాలామంది తల్లిదండ్రులు ‘సెపరేషన్‌యాంగ్జైటీ’కి గురవుతారని స్కూల్ సహ వ్యవస్థాపకురాలు ఎషితా రాజు అంటున్నారు. భవిష్యత్తులో సెపరేషన్‌యాంగ్జైటీ, చిన్నారుల సమగ్రాభివృద్ధి, వయసుకు తగ్గ అభ్యాస పద్ధతులు, పిల్లల ఎదుగుదలలో కీలకమైన మైలురాళ్లు వంటి అంశాలపై తల్లిదండ్రులకు ప్రత్యేక వర్క్‌షాప్‌లు నిర్వహించేందుకు కూడా స్కూల్ సిద్ధమవుతోందని, అందుకే ఈ లాంజ్ కేవలం పనిచేసుకునే స్థలం కాదని తల్లిదండ్రులు, పిల్లల మధ్య బంధాన్ని బలోపేతం చేసే, కొత్త విషయాలు నేర్చుకునే వేదిక అని ఎషితా అంటున్నారు. అదే సమయంలో ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు, నగర ట్రాఫిక్.. ఇవన్నీ కలిపి తల్లిదండ్రులపై ఒత్తిడిని పెంచుతున్నాయన్నారు.


