నేపాల్‌లో సంభవించిన జలప్రళయం వేలాది కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చింది. అందులో గల్లంతైన వారి ఆచూకి కోసం కొండంత ఆశతో చూస్తూన్న ఘోష మాటలకందనిది. ఈ నేపథ్యంలో ఓ కంటెంట్ క్రియేటర్ నీట్ పీజీ వైద్య విద్యార్థి తన్వి షేర్ సోషల్ మీడియా వేదకగా షేర్ చేసిన వీడియో కన్నీళ్లు పెట్టిస్తోంది. ఆమె పేరెంట్స్ కూడా నేపాల్ వరదల్లో గల్లంతయ్యారు. ఇంతవరకు వారి ఆచూకీ కానరాలేదు. అయినా సరే తన అమ్మనాన్న ఎక్కడోఒక చోట క్షేమంగా ఉంటారని కొండంత ఆశతో చూస్తున్నా అటూ కన్నీటి పర్యంతమైందామె వీడియోలో.
తన్వి తల్లిదండ్రలు 67 మంది సభ్యుల బృందంతో కలిసి కైలాస యాత్రకు వెళ్లినట్లు పేర్కొంది. ఆ బృందం చివగా ఇమ్మిగ్రేషన్ సెంటర్ ఫ్రెండ్‌షిప్‌బ్రిడ్జ్ వద్ద ఉన్నట్లు గుర్తించారు. అయితే ఆ రెండు ప్రదేశాలు ఇప్పడు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయినప్పటికీ తన తల్లిదండ్రులు అక్కడున్న ఏదో ఒక పునరాసవ కేంద్రానికి చేరుకుని సురక్షితంగా ఉంటారేమోనని ఆశిస్తోందామె. ఆ బృందంలోని ఎవ్వర్నీ సంప్రదించలేకపోవడంతో ఆమె తల్లిదండ్రలు ఆచూకీ మరింత క్లిష్టంగా మారింది.
ఆ విషయాన్నే ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వీడియోలో వివరిస్తూ..కన్నీళ్లు పెట్టుకుంది. తాను భారత రాయబార కార్యాలయం, విదేశీ వ్యవహారాల శాక, నేపాల్, చైనా అధికారులను సైతం సంప్రదించామని, అయినా ఎలాంటి ప్రయోజనం లేదని పేర్కొంది. తాను నీట్ పీజీ పరీక్ష రాస్తున్నంత సేపు ఏడుస్తూనే ఉన్నానని, కన్నీళ్లు వచ్చేయడంతో కొన్ని ప్రశ్నలు చదవలేకపోయానని భావోద్వేగంగా చెప్పుకొచ్చింది.
తన తండ్రి ఈ పరీక్ష రాయాలని కోరుకున్నారు, అందువల్ల కచ్చితంగా ఈ పరీక్ష రాసి తీరాల్సి వచ్చింది. అంతకంటే బాధకరం ఏంటంటే..పరీక్షకు వెళ్లేమందు అమ్మ పెరుగు చక్కెర కలిపి తినిపించి ఆల్‌ది బెస్ట్ చెప్పి దీవించేవారు. అది మరింత గుర్తు వచ్చి కన్నీళ్లు ఆగలేదు అంటూ ఆవేదనగా చెప్పింది. ఎలాగైన వాళ్లు తిరిగి రావాలి, కచ్చితంగా తిరిగి రావాలంటే ఉబికివస్తున్న కన్నీళ్లతో చెబుతూ తన సంభాషణను ముగించింది.
కాగా, నేపాల్ విపత్తులో మరణించిన వారి సంఖ్య సోమవారం నాటికి 939కి చేరగా, గల్లంతైన వారి సంఖ్య నాలుగువేలకు చేరుకుందని అధికారులు తెలిపారు. సుమారు 158 మంది భారతీయులను రక్షించినట్లు విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది.
(చదవండి: విపత్తు మిగిల్చిన విషాదం..! తల్లిదండ్రుల ఆచూకీ కోసం..ఆ పసివాడు..)


