మా తప్పేంటి?.. భారత్‌, చైనా, అమెరికా పరిహారం చెల్లించాల్సిందే! | Nepal Big Demand: Compensation from India China US for This | Sakshi
Sakshi News home page

మా తప్పేంటి?.. భారత్‌, చైనా, అమెరికా పరిహారం చెల్లించాల్సిందే!

Sep 2 2026 9:04 AM | Updated on Sep 2 2026 9:06 AM

Nepal Big Demand: Compensation from India China US for This

ఆకస్మిక వరదలతో అతలాకుతలం అయిన నేపాల్‌ సరికొత్త డిమాండ్‌ను తెర మీదకు తెచ్చింది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతుండగా.. భారత్‌ సహా పలు దేశాలు పాలు పంచుకుంటున్నాయి. అయితే తమకు సాయంతో పాటు న్యాయం కూడా జరగాలని నేపాల్‌ వాదిస్తోంది. చేయని తప్పులకు శిక్ష తామెందుకు అనుభవించాలని.. భారత్‌, చైనా, అమెరికాలు తమకు పరిహారం చెల్లించాల్సిందేనంటూ చెబుతోంది.

హిమాలయ దేశం నేపాల్‌.. ఇప్పుడు క్లైమేట్‌ జస్టిస్‌ పేరిట ప్రపంచం ముందు ఓ ప్రశ్న ఉంచింది. వాతావరణ మార్పుల ప్రభావంతోనే తాము భారీ విపత్తులను ఎదుర్కోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో ప్రపంచంలో అత్యధిక కార్బన్‌ డయాక్సైడ్‌ (CO₂) ఉద్గారాలు చేస్తున్న దేశాల్లో ముందున్న చైనా, అమెరికా, భారత్‌ తమకు వాతావరణ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తోంది. ఈ మూడు దేశాలు చారిత్రక బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని నేపాల్‌ విదేశాంగ మంత్రి శిశిర్‌ ఖనాల్‌  చెబుతున్నారు. 

తాము తక్కువ స్థాయిలోనే కార్బన్‌ ఉద్గారాలు చేస్తున్నా.. వాతావరణ మార్పుల ప్రభావంతో భారీ విపత్తులను ఎదుర్కొంటున్నామని శిశిర్‌ అంటున్నారు. తమ దేశం సృష్టించని సంక్షోభానికి తామే మూల్యం చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారాయన. 

‘ఇది పర్వత సునామీ’
చైనా సరిహద్దులోని రసువా జిల్లాలో ఆగస్టు 26న సంభవించిన ఆకస్మిక వరదలు నేపాల్‌ను అతలాకుతలం చేశాయి. హిమనదీ ప్రాంతంలో మంచు, శిలలు కూలిపోవడంతో భారీగా నీరు, బురద, రాళ్లు దిగువ ప్రాంతాలకు దూసుకొచ్చాయి. ఈ ఘటనలో వెయ్యి మందికి పైనే ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది గల్లంతయ్యారు. వాళ్ల ఆచూకీ కోసం ఇంకా అన్వేషణ కొనసాగుతూనే ఉంది. 

సాధారణ వర్షపాతం లేకుండానే ఒక్కసారిగా వరద ముంచెత్తడంతో బాధిత ప్రాంతాల ప్రజలకు తగినంత ముందస్తు హెచ్చరిక అందలేదు. దీంతో ఈ విపత్తును నేపాల్‌ విదేశాంగ మంత్రి ‘క్యాటస్ట్రాఫిక్‌ మౌంటెన్‌ సునామీ’గా అభివర్ణించారు. వాతావరణ మార్పుల కారణంగా హిమాలయాల్లో మంచు కరుగుదల వేగవంతమవుతోందని.. దాని ప్రభావంతో హిమనదులు, పర్వత వాలులు ఆందోళనకరంగా మారుతున్నాయన్న నిపుణుల హెచ్చరికలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. 

మా తప్పు లేకుండా మూల్యం చెల్లిస్తున్నాం’
వాతావరణంలోకి నేపాల్‌ గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాలు వాస్తవంగా చాలా తక్కువ. అయినప్పటికీ మేం సృష్టించని ప్రపంచ సంక్షోభానికి అంతిమ మూల్యం చెల్లిస్తున్నాం’’ మంత్రి ఖనాల్‌ అంటున్నారు. వాతావరణ మార్పుల వల్ల హిమాలయాల్లో మంచు కరుగుదల, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇటీవలి వరదలతో నేపాల్‌లో కీలక మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయని, విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యంలో కూడా గణనీయమైన భాగం దెబ్బతిందని, దేశ ఆర్థిక వ్యవస్థపైనా ఈ విపత్తు తీవ్ర ప్రభావం చూపుతోందని అన్నారాయన.

‘సాయం కాదు.. న్యాయం’
ఇది నాగరికత మనుగడకు సంబంధించిన విషయం. ఇకపై వాతావరణ విపత్తుల విషయంలో మా దౌత్య విధానాన్ని ‘సాయం’గా కాకుండా.. ‘న్యాయం, పరిహారం’ వైపు మళ్లిస్తాం. ఇది దాతృత్వం కాదు.. చట్టపరమైన, నైతిక బాధ్యత అని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే వాతావరణ నష్టపరిహారానికి సంబంధించి అంతర్జాతీయ భాగస్వాములకు నేపాల్‌ క్లెయిమ్‌ పంపిందని మంత్రి వెల్లడించారు. రాబోయే అంతర్జాతీయ వేదికలన్నింటిపైనా ఈ అంశాన్ని గట్టిగా ప్రస్తావిస్తామని చెప్పారు.

కాలుష్యంలో ఎవరి వాటా ఎంత?
వాతావరణ మార్పులపై నేపాల్‌ చేస్తున్న వాదనలో ప్రధానంగా కార్బన్‌ ఉద్గారాల అసమానతను ప్రస్తావిస్తోంది. గ్లోబల్‌ కార్బన్‌ బడ్జెట్‌ (Global Carbon Budget 2025) గణాంకాల ప్రకారం.. కార్బన్‌డయాక్సైడ్‌ ఉద్గారాల్లో చైనా వాటా సుమారు 32 శాతం. అమెరికా వాటా 13 శాతం, భారత్‌ వాటా 8 శాతం. అంటే ఈ మూడు దేశాలే కలిపి ప్రపంచ ఫాసిల్‌ కార్బన్‌ ఉద్గారాల్లో దాదాపు 53 శాతం రిలీజ్‌ చేశాయన్నమాట. అయితే.. 

అయితే నేపాల్‌ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. 2024 గణాంకాల ప్రకారం ఆ దేశం నుంచి రిలీజ్‌ అయిన కర్బన ఉద్గారాలు సుమారు 1.59 కోట్ల టన్నులు మాత్రమే. అంటే ప్రపంచ దేశాల్లో ఆ వాటా 0.04 శాతం మాత్రమే. అలాగే యావరేజ్‌గా ఒక దేశం 0.5 టన్నులు రిలీజ్‌ చేస్తుంటే.. నేపాల్‌ అంతకంటే తక్కువగా ఉందన్నమాట. అలాగని..

చైనా, అమెరికా, భారత్‌ వంటి దేశాలు నేపాల్‌కు తప్పనిసరిగా పరిహారం చెల్లించాలనే రూల్‌గానీ, చట్టంగానీ లేదు. ఇది కేవలం నేపాల్‌ తెర మీదకు తెచ్చిన ‘క్లైమేట్‌ జస్టిస్‌–లాస్‌ అండ్‌ డ్యామేజ్‌’ వాదన మాత్రమే. అయితే తక్కువ ఉద్గారాలు చేసే దేశాలే వాతావరణ విపత్తులతో ఎక్కువగా నష్టపోతున్న నేపథ్యంలో.. ఎక్కువ కార్బన్‌ను రిలీజ్‌ చేస్తున్న చేసిన దేశాలు ఆర్థిక బాధ్యత తీసుకోవాలన్న డిమాండ్‌ మాత్రం చర్చనీయాంశంగా మారే అవకాశం లేకపోలేదు.

ఇదీ చదవండి: కాల్చరు.. పూడుస్తారు! ఎందుకో తెలుసా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement