ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఉపగ్రహాల్లో ఒకటైన నాసా–ఇస్రో సంయుక్త నిసార్ ఇప్పుడు ఏం చేస్తోంది?. నేపాల్ విపత్తు విషయంలో అది ఏదైనా సమాచారం సేకరించిందా? లేదంటే నిద్ర పోతోందా?. ఆకస్మిక వరదలు, మంచు, నీరు, రాళ్లు, బురద కదలికలతో తీవ్ర విధ్వంసం చోటుచేసుకున్న నేపథ్యంలో.. ఈ విపత్తుకు సంబంధించి నిసార్ ఏం గుర్తించింది? దాని డేటా ఏం చెబుతోంది? అనే ప్రశ్నలు ఆసక్తిని రేపుతున్నాయి.
సుమారు 1.3 బిలియన్ డాలర్ల వ్యయంతో రూపొందించిన నిసార్(NISAR)ను భూమిపై జరిగే మార్పులను మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వంతో గుర్తించేలా ఇస్రో-నాసాలు దీనిని అభివృద్ధి చేశాయి. హిమనదులను(గ్లేసియర్ల) పర్యవేక్షించడం, భూభాగ కదలికలను గుర్తించడం, కొండచరియలను అధ్యయనం చేయడం, భూకంపాలను పరిశీలించడం, విపత్తుల నిర్వహణకు కీలక సమాచారం అందించడం దీని లక్ష్యాలు. ముఖ్యంగా హిమనదులు, క్రియాశీల టెక్టానిక్ ప్రాంతాలు, వాతావరణ మార్పుల ప్రభావాలతో ప్రమాదకరంగా మారుతున్న హిమాలయాలు.. నిసార్ పరిశీలనకు కీలక ప్రాంతాల్లో ఒకటి.
మరి నిసార్ ఎక్కడ?
నేపాల్ రసువా జిల్లాలో గ్లేసియర్ కూలిపోవడం, మంచు, నీరు, రాళ్లు, బురద భారీగా పొటెత్తడంతో విపత్తు తలెత్తింది. నిసార్ రూపొందించిన ప్రధాన లక్ష్యాల్లోనే ఇలాంటి హిమనదులు, కొండచరియలు, భూభాగ మార్పులను పరిశీలించడం ఉంది. అయితే ఇప్పటివరకు ఈ విపత్తుకు సంబంధించి నిసార్ కనీస అంచనా, హెచ్చరిక సమాచారం లేదంటే కీలక శాస్త్రీయ విశ్లేషణ అనేవి ఏవీ కూడా పబ్లిక్ డొమైన్‌లో కనిపించకపోవడం చర్చకు దారితీసింది. నిసార్ ప్రస్తుతం కక్ష్యలో ఉండి క్రమం తప్పకుండా డేటా సేకరిస్తుంటే.. నేపాల్ విపత్తుకు సంబంధించి అదసలు ఏం గుర్తించిందన్నది ఆసక్తికరంగా మారింది.

నాసా-ఇస్రో చెప్పేది ఇదే..
నాసా ప్రకారం.. నిసార్ విపత్తులను ట్రాక్ చేయడం, పర్యావరణ వ్యవస్థలను పర్యవేక్షించడం, హిమనదులు, మంచు ప్రాంతాలను అధ్యయనం చేయడం, భూమి ఉపరితలం ఎలా మారుతోందో తెలుసుకోవడంలో సహాయపడుతుంది. దీని ద్వారా ప్రాణాలను రక్షించేందుకు, ప్రకృతి వనరుల నిర్వహణకు అవసరమైన సమాచారం అందుతుందని నాసా పేర్కొంది. ఇస్రో కూడా నిసార్ ప్రతి 12 రోజులకు ప్రపంచంలోని భూభాగం, మంచుతో కప్పబడిన ప్రాంతాలను చిత్రీకరిస్తుందని తెలిపింది.
‘కదలికలు గుర్తించగలం’
నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీకి చెందిన నిసార్ ప్రాజెక్ట్ శాస్త్రవేత్త పాల్ రోజెన్ ఇంతకు ముందు నిసార్ సామర్థ్యాలను వివరించారు. భూమి, మంచు కదలికలను త్రీడీ రూపంలో అధ్యయనం చేయగలమని, భూకంపాలకు ముందు.. భూకంపాల సమయంలో.. ఆ తర్వాత భూమి కదలికలను మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వంతో కొలవచ్చని తెలిపారు. అంతేకాదు.. కొండచరియలు విరిగిపడటానికి ముందు చోటుచేసుకునే కదలికలను గుర్తించగలమని, హిమనదుల కదలికలను పర్యవేక్షించడం ద్వారా గ్లేషియల్ లేక్ ఔట్‌బర్స్ట్ ఫ్లడ్ (GLOF) ముప్పులను అంచనా వేయడంలో సహాయపడుతుందని వివరించారు.

ఏడాది క్రితమే ఆపరేషన్స్ ప్రారంభం
నిసార్ కక్ష్యలోకి ప్రవేశించి ఏడాది పూర్తైంది. ఈ సందర్భంగా ఆగస్టు 4న బెంగళూరులో నాసా, ఇస్రో సంయుక్తంగా కార్యక్రమం నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో ఉపగ్రహం సాధించిన పురోగతి, శాస్త్రీయ ఫలితాలు, డేటా పంపిణీ తదితర అంశాలను ప్రస్తావించారు. నాసా ఎర్త్ సైన్స్ డివిజన్ డైరెక్టర్ కరెన్ ఎం. సెయింట్ జర్మెయిన్.. భూమి వ్యవస్థలను అర్థం చేసుకోవడానికి నిసార్ అందిస్తున్న భారీ స్థాయి డేటా ప్రాధాన్యాన్ని వివరించారు. ఇస్రో శాస్త్రవేత్తలు అటవీ బయోమాస్, నేల తేమ, పంటలు, సముద్ర ఉపరితల గాలులు, మడ అడవులు, అటవీ మార్పులు, భూభాగ మార్పులు వంటి అంశాల్లో నిసార్ అప్లికేషన్లను వివరించారు.
వెనెజువెలా భూకంప టైంలో..
నిసార్ ఇప్పటికే విపత్తుల విశ్లేషణలో ఉపయోగపడిందనడానికి ఉదాహరణగా నిలిచాయి. జూన్ 24న వెనెజువెలాలో 7.2 తీవ్రతతో భూకంపం సంభవించిన కొన్ని రోజులకే నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ నిసార్ డేటాతో రూపొందించిన మ్యాప్‌ను విడుదల చేసింది. భూకంపాల కారణంగా భూభాగం ఎంత మేరకు కదిలిందో ఆ మ్యాప్ చూపించింది. అత్యవసర నిర్వహణ అధికారులు, శాస్త్రవేత్తలకు ఇది ఉపయోగకరమైన సమాచారాన్ని అందించిందని నాసా తెలిపింది.
అయితే నేపాల్ విషయంలో ఎందుకు?
నేపాల్ విపత్తుపై మాత్రం నిసార్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి పబ్లిక్ విశ్లేషణ వెలువడలేదు. దీంతో కొన్ని కీలక ప్రశ్నలు ముందుకొస్తున్నాయి. విపత్తుకు ముందు ప్రాంతంలో భూభాగ కదలికలను నిసార్ గుర్తించిందా? గ్లేసియర్‌లలో ఏవైనా అసాధారణ మార్పులను నమోదు చేసిందా? విపత్తుకు దారితీసిన ప్రక్రియలకు సంబంధించి నిసార్ డేటాలో ఏమైనా సంకేతాలు ఉన్నాయా? ఇప్పటికే ప్రాథమిక విశ్లేషణ జరిగిందా? జరిగితే ఆ వివరాలను ఎందుకు బయటపెట్టలేదు? అనేదే ఆ ప్రశ్నలు. అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయాలి. నిసార్ ప్రతి వరద, కొండచరియలు, హిమనదులు కుప్పకూలిపోవడం, భూకంపాన్ని ముందుగానే హెచ్చరించే పూర్తిస్థాయి ఆపరేషనల్ వార్నింగ్ ఉపగ్రహం కాదు. దీని ప్రధాన లక్ష్యం భూమి, మంచు ప్రాంతాల్లో జరిగే మార్పులను అత్యంత ఖచ్చితత్వంతో పరిశీలించడం, ఆ డేటాను శాస్త్రీయ విశ్లేషణకు అందించడం. అలాగే నిసార్‌లో సాంకేతిక వైఫల్యం జరిగిందన్న ఆధారాలు కూడా ఇప్పటివరకు లేవు.
‘డేటా తీస్తుంది.. విశ్లేషించేది మనుషులే’
అయితే నేపాల్ విపత్తు తర్వాత ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్ రోజెన్ కీలక విషయాన్ని వెల్లడించారు. నిసార్ డేటాను సేకరిస్తుంది కానీ దాన్ని విశ్లేషించేది శాస్త్రవేత్తలేనని చెప్పారు. ఇలాంటి ముందస్తు సంకేతాలను గుర్తించేందుకు అవసరమైన దీర్ఘకాలిక డేటా సిరీస్‌ను నిసార్ ఇప్పుడిప్పుడే సేకరిస్తోందన్నారు. అలాగే హిమాలయ ప్రాంతమంతటా సాధారణ, అసాధారణ కదలికలను గుర్తించేందుకు ఆటోమేటెడ్ టూల్స్‌ను అభివృద్ధి చేయాల్సి ఉందని.. అలాంటి వ్యవస్థలు సిద్ధమైన తర్వాతే ప్రమాదాలను అంచనా వేసే అవకాశాలు మెరుగవుతాయని వివరించారు. నిసార్ ఈ తరహాలో పనిచేసే తొలి ఉపగ్రహం కావడంతో దాని డేటా, సామర్థ్యాలను పూర్తిగా అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుందని తెలిపారు.

డేటా మాత్రం అందుబాటులోకి రావాల్సిందే
నిసార్ నుంచి సేకరించే డేటాను ప్రాసెస్ చేసిన తర్వాత పబ్లిక్ ఆర్కైవ్‌లో అందుబాటులో ఉంచేందుకు నాసా, ఇస్రో అంగీకరించాయి. అందువల్ల నేపాల్ విషాదం నేపథ్యంలో నిసార్ డేటాపై మరింత ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం నిసార్ కక్ష్యలో ఉంది.. డేటాను సేకరిస్తోంది. అయితే ఈ ఉపగ్రహం నేపాల్ విపత్తు విషయంలో ఏం చూసింది? ఏం గుర్తించింది? అన్నది మాత్రం ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.
బహుశా శాస్త్రీయ విశ్లేషణలు జరుగుతుండొచ్చు.. డేటాను ధ్రువీకరించేందుకు సమయం పడుతుండొచ్చు. అలాగే హిమాలయాల్లోనే ఇంతటి విపత్తు చోటుచేసుకున్న నేపథ్యంలో.. నిసార్ సేకరించిన డేటా ఇప్పుడు అత్యంత కీలకంగా మారే అవకాశం లేకపోలేదు. విపత్తుకు ముందు అక్కడ ఏం జరిగింది? హిమనదులు, భూభాగ కదలికల్లో ఏవైనా అసాధారణ మార్పులు నమోదయ్యాయా?.. నిసార్ డేటా సమాధానం చెబుతుందా అన్నదే ఆసక్తికరంగా మారింది.
ఇదీ చదవండి: కార్లు మాట్లాడుకుంటే.. యాక్సిడెంట్లే జరగవట!


