టూర్లు.. పెళ్లిళ్లు.. బంగారం: మోదీ కీలక పిలుపు | Vocal For Local Push, PM Modi Links 7.8% GDP Growth To Swadeshi And Takes Dig At Rahul Gandhi, More Details Inside | Sakshi
Sakshi News home page

టూర్లు.. పెళ్లిళ్లు.. బంగారం: మోదీ కీలక పిలుపు

Sep 1 2026 10:46 AM | Updated on Sep 1 2026 11:44 AM

PM Modis Gold Foriegn Trips Comments Reacts On GDP Jibe at Rahul Gandhi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాలను మించి వృద్ధి రేటు నమోదు చేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, సంక్షోభాలు, సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు కొనసాగుతున్నప్పటికీ భారత్‌ శర వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు ‘స్వదేశీ.. వోకల్‌ ఫర్‌ లోకల్‌’ మంత్రాన్ని పాటించాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీకి పరోక్షంగా చురకలంటించారు.

కిర్గిజిస్థాన్‌లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సుకు హాజరైన మోదీ.. మంగళవారం ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ‘‘7.8 శాతం వృద్ధి దేశ ప్రజల్లో ఆనందాన్ని నింపింది. ఇది ప్రజల సంకల్ప బలం, కష్టపడి పనిచేసే తత్వానికి ప్రతిబింబం’’ అని అన్నారు.

‘ప్రపంచం యుద్ధంలో ఉంది’
ప్రస్తుతం ప్రపంచం యుద్ధాలు, సంక్షోభాలతో సతమతమవుతోందని మోదీ పేర్కొన్నారు. కొవిడ్‌ కాలం 2020 నుంచి ఇప్పటివరకు ఎక్కడా పూర్తి స్థాయిలో స్థిరత్వం కనిపించలేదని, సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నాయని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ భారత్‌ వేగంగా ముందుకు సాగుతోందని అన్నారు.

విదేశీ టూర్లు వద్దు.. ‘వెడ్‌ ఇన్‌ ఇండియా’
ఈ నేపథ్యంలో ప్రజలు దేశీయ ఉత్పత్తులు, సేవలకు ప్రాధాన్యమివ్వాలని ప్రధాని కోరారు. అవసరం లేని విదేశీ ప్రయాణాలకు దూరంగా ఉండాలని, విదేశాల్లో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌లు అసలే నిర్వహించవద్దని సూచించారు. పెళ్లిళ్లను దేశంలోనే నిర్వహిస్తూ ‘వెడ్‌ ఇన్‌ ఇండియా’ నినాదాన్ని పాటించాలని అన్నారు. అలాగే అవసరం లేకపోతే బంగారం కొనుగోలు చేయవద్దని పిలుపునిచ్చారు. స్వదేశీ ఉత్పత్తులు, సేవలను ఎంత ఎక్కువగా ప్రోత్సహిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ అంతగా బలోపేతమవుతుందని చెప్పారు.

‘అబద్ధాల ప్రతిధ్వని’పై వ్యాఖ్యలు
ఇదే సమయంలో దేశంలో కొందరు నిరాశావాదంతో ‘జూట్‌ కీ గూంజ్‌’ (అబద్ధాల ప్రతిధ్వని) వ్యాప్తి చేస్తున్నారని మోదీ వ్యాఖ్యానించారు. అయితే ఇలాంటి విమర్శలు, నిరాశావాద ప్రచారాలను అధిగమిస్తూ భారత ఆర్థిక వ్యవస్థ 7.8 శాతం వృద్ధిని నమోదు చేసిందని అన్నారు. ‘‘దేశంలోనే కొందరు తీవ్ర నిరాశలో మునిగిపోయి అబద్ధాల ప్రతిధ్వనిని వ్యాప్తి చేస్తున్నారు. వాటన్నింటినీ అధిగమించి దేశం 7.8 శాతం వృద్ధిని సాధించింది. ఈ వేగాన్ని కొనసాగించాలి’’ అని మోదీ పేర్కొన్నారు.

మోదీ చెప్పిన ‘జూట్‌ కీ గూంజ్‌’ పదప్రయోగం ఇటీవల కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన ‘ఛాత్రోం కీ గూంజ్‌’ ప్రచారంపై కొనసాగుతున్న రాజకీయ విమర్శలకు సంబంధించి చేసిన వ్యాఖ్యగా భావిస్తున్నారు. రాహుల్‌గాంధీ వివిధ కార్యక్రమాల్లో చేసిన వ్యాఖ్యలను లక్ష్యంగా చేసుకుని బీజేపీ ఇప్పటికే తీవ్ర విమర్శలు చేసింది. ఆయన నాలుగు కార్యక్రమాల్లో చేసిన 40 ప్రకటనల్లో 29 అవాస్తవమైనవని, మరో 11 తప్పుదారి పట్టించేలా ఉన్నాయని బీజేపీ ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే మోదీ ‘అబద్ధాల ప్రతిధ్వని’ అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

7.8 శాతం వృద్ధి
సోమవారం విడుదలైన గణాంకాల ప్రకారం.. 2026–27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్‌–జూన్‌)లో భారత జీడీపీ 7.8 శాతం వృద్ధి చెందింది. అంతకుముందు త్రైమాసికంలోని 8.6 శాతంతో పోలిస్తే వృద్ధి కొంత తగ్గినప్పటికీ.. అంచనాలను మాత్రం అధిగమించింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఇంధన మార్కెట్లలో అనిశ్చితి వంటి సవాళ్ల మధ్య ఈ వృద్ధి నమోదైంది.

భారత్‌ స్వాతంత్ర్యం సాధించి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు కృషి చేయాలని మోదీ పిలుపునిచ్చారు. ‘‘విధానం సరైనది.. సంకల్పం స్పష్టంగా ఉంది.. 140 కోట్ల మంది భారతీయుల ఐక్య శక్తితో దేశాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తాం’’ అని తాజా వీడియో సందేశంలో ఉద్ఘాటించారు.

ఇదీ చదవండి: రాహుల్‌ గాంధీ? విజయ్‌?? పీఎం అభ్యర్థి ఎవరసలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement