కార్ల మధ్య రహస్య సంభాషణతో రోడ్డు ప్రమాదాలకు చెక్ | Talking Cars in India Govt Unveils Mandatory V2V Safety Rules | Sakshi
Sakshi News home page

కార్ల మధ్య రహస్య సంభాషణతో రోడ్డు ప్రమాదాలకు చెక్

Sep 1 2026 7:34 AM | Updated on Sep 1 2026 7:34 AM

Talking Cars in India Govt Unveils Mandatory V2V Safety Rules

దేశంలోని రోడ్లపై ప్రయాణం ఇకపై పూర్తిగా మారిపోనుంది. ఎదురుగా వచ్చే ప్రమాదాలను ముందే పసిగట్టి, ఒకదానితో ఒకటి మాట్లాడుకునే సరికొత్త కార్లు త్వరలోనే మన ముందుకు రాబోతున్నాయి. దేశంలో ఏటా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ‘వెహికల్-టు-వెహికల్’ (వీ టు వీ) కమ్యూనికేషన్ వ్యవస్థను తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు.. కేంద్రం సంచలన నిర్ణయం
2025లో దేశవ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఏకంగా 1.83 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య సుమారు 6,000 పెరగడం ప్రభుత్వాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఈ ప్రమాదాల తీవ్రతను తగ్గించేందుకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వినూత్న పరిష్కారంతో ముందుకొచ్చింది. ఇందులో భాగంగా ‘కేంద్ర మోటార్ వాహనాల (సవరణ) నిబంధనలు, 2026’ ముసాయిదాను జూలై 22న విడుదల చేసి, ప్రజల నుంచి సలహాలు, అభ్యంతరాలను స్వీకరించింది.

అసలు ఏమిటీ ‘వీ టు వీ’టెక్నాలజీ?
వీ టు వీ అంటే ‘వెహికల్-టు-వెహికల్’ వైర్‌లెస్ కమ్యూనికేషన్ సిస్టమ్. ఈ సాంకేతికత ద్వారా రోడ్డుపై వెళ్లే వాహనాలు పరస్పరం సమాచారాన్ని మార్పిడి చేసుకుంటాయి. ప్రస్తుతం కార్లలో వస్తున్న ఏడీఏఎస్ భద్రతా ఫీచర్ల కంటే ఇది ఎంతో ముందంజలో ఉంటుంది. ఈ వ్యవస్థ సాయంతో ప్రయాణంలో ఎదురయ్యే ముప్పును డ్రైవర్ కంటే ముందే వాహనం గుర్తించి హెచ్చరిస్తుంది.

అమలు గడువులు.. పాటించాల్సిన ప్రమాణాలు
కొత్త నిబంధనల ప్రకారం, 2027 అక్టోబర్ 1 నుంచి తయారయ్యే ఎల్‌ (ద్విచక్ర, త్రిచక్ర), ఎం (కార్లు, బస్సులు), ఎన్‌ (సరుకు రవాణా వాహనాలు) కేటగిరీ వాహనాల్లో వీ టు వీ సిస్టమ్ అమర్చితే అవి కచ్చితంగా ‘ఏఐఎస్‌-230’ ప్రమాణాలకు లోబడి ఉండాలి. అలాగే 2028 అక్టోబర్ 1 తర్వాత దేశంలో తయారయ్యే ఈ కేటగిరీల అన్ని వాహనాల్లోనూ ‘వీ టు వీ’ సిస్టమ్ ఏర్పాటును ప్రభుత్వం తప్పనిసరి చేసింది. సిగ్నల్స్ బదిలీ, రేడియో ఫ్రీక్వెన్సీ, జీపీఎస్ అనుసంధానం, సైబర్ భద్రత నియమాలను ఈ ఏఐఎస్‌-230 ప్రమాణాలు నిర్దేశిస్తాయి.

సాంకేతికత ఎలా పనిచేస్తుంది?
వాహనంలో అమర్చే చిన్న ‘ఆన్-బోర్డ్ యూనిట్’ (ఓబీయూ)ద్వారా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. ఇది 5.875 GHz నుండి 5.925 GHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌పై సెల్యులార్ వెహికల్-టు-ఎవ్రీథింగ్ (C-V2X) సాంకేతికతను వాడుకుంటుంది. టెలికాం శాఖ (DoT) ఇప్పటికే ఈ స్పెక్ట్రమ్‌ను లైసెన్స్ రహితంగా ప్రకటించింది. ఈ ఓబీయూ పరికరం దాదాపు 300 మీటర్ల పరిధిలోని వాహనాలను సులువుగా పసిగడుతుంది. కొత్త కార్లలో అమర్చే ఈ పరికరం ఖరీదు సుమారు రూ.5,000 నుంచి రూ.7,000 వరకు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

సాధారణ సెన్సార్లకు ‘వీ టూ వీ’కి తేడా ఏమిటి?
ప్రస్తుతం కార్లలో ఉండే కెమెరా లేదా రాడార్ ఆధారిత ఏడీఏఎస్‌ వ్యవస్థలు కేవలం డ్రైవర్ లేదా కెమెరా చూడగలిగే పరిధిని మాత్రమే గుర్తిస్తాయి. కానీ ‘వీ టూ వీ’ వ్యవస్థ దృష్టికి ఆవల ఉన్న ప్రమాదాలను కూడా పసిగడుతుంది. ప్రమాదకరమైన మలుపులు (బ్లైండ్ కార్నర్స్), భారీ ట్రక్కుల వెనుక ఉన్న కార్లు, దట్టమైన పొగమంచులో దాగి ఉన్న వాహనాల వివరాలను వేగం, దిశ, బ్రేకింగ్ డేటా ద్వారా పరస్పరం పంచుకుంటుంది. విమానాలు తమ ఎత్తు, వేగాన్ని రేడియో సిగ్నల్స్ ద్వారా పంచుకునే విధానాన్ని పోలి ఉండే ఈ వ్యవస్థతో ఎదురెదురు ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయి.

డేటా భద్రత.. ఎదురవుతున్న సవాళ్లు
‘వీ టు వీ’ ఎంతో ఉపయోగకరమైనప్పటికీ, ప్రయాణ డేటా, వాహనం లొకేషన్, రూట్ సమాచారం నిరంతరం సేకరించడం వల్ల సైబర్ దాడులు, గోప్యతా సమస్యలు తలెత్తే ముప్పు ఉంది. లక్షలాది వాహనాలు ఒకేసారి రోడ్లపైకి వచ్చినప్పుడు ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌పై ట్రాఫిక్ లోడ్ పెరగడం, సిగ్నల్ లోపాలు రాకుండా చూసుకోవడం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారనుంది. ఈ భద్రతా లోపాలను అధిగమించేందుకు పటిష్టమైన సైబర్ చట్టాలు, రక్షణ చర్యలు అవసరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: నేపాల్: శవాల గుర్తింపు ఎలా? కుటుంబ సభ్యులకు చూపిస్తారిలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement