సినిమా చూసి ఇంటికెళ్తుండగా ఘోరం.. బైక్‌ను ఈడ్చుకెళ్లిన లారీ | kakinada man died In road incident | Sakshi
Sakshi News home page

సినిమా చూసి ఇంటికెళ్తుండగా ఘోరం.. బైక్‌ను ఈడ్చుకెళ్లిన లారీ

Aug 28 2026 11:10 AM | Updated on Aug 28 2026 11:11 AM

kakinada man died In road incident

కాకినాడ: ఆ కుటుంబ సభ్యులు అప్పటి వరకూ సినిమా చూసి, ఆనందంగా గడిపారు. అతడు భార్యాపిల్లలను ఇంటి దగ్గర దింపి, పలావ్‌ కొనుక్కుని వచ్చేందుకు బయల్దేరాడు. తిరిగి వెళ్తూండగా మృత్యుశకటంలా దూసుకొచ్చిన లారీ.. అతడి ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ ఘోర సంఘటన జగ్గంపేటలోని గోకవరం రోడ్డులో చోటు చేసుకుంది. ఎస్సై రఘునాథరావు కథనం ప్రకారం.. విశాఖపట్నానికి చెందిన నీలాపు సంతోష్‌ కుమార్‌ రెడ్డి (34) ప్రతిపాడులోని సీఎఫ్‌సీ కంపెనీలో ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌గా పని చేస్తూ, 11 సంవత్సరాలుగా జగ్గంపేట బాలాజీ నగర్‌లో నివాసముంటున్నాడు. బుధవారం రాత్రి భార్య శ్రీలిఖిత, కుమార్తెలు శాన్వి, లాస్య(చిన్న పిల్లలు)తో కలసి సినిమాకు వెళ్లారు. 

అనంతరం, భార్యాపిల్లలను సంతోష్‌ కుమార్‌ రెడ్డి ఇంటి వద్ద దించి, పలావు కోసం గోకవరం రోడ్డులోని బిర్యానీ సెంటర్‌కు మోటార్‌ సైకిల్‌పై వచ్చాడు. తిరిగి ఇంటికి వెళ్తూండగా ఎదురుగా వేగంగా వచ్చిన లారీ అతడిని ఢీకొంది. దీంతో, సంతోష్‌ కుమార్‌ రెడ్డి బైక్‌ అదుపు తప్పి, ఎదురుగా వస్తున్న మరో మోటార్‌ సైకిల్‌ను ఢీకొంది. అందరూ కింద పడిపోగా ఆ లారీ సంతోష్‌ కుమార్‌ రెడ్డి బైక్‌ను కొంత దూరం ఈడ్చుకుపోయింది. ఈ ఘోర ప్రమాదంలో అతడి చెయ్యి నుజ్జునుజ్జయి ఊడిపోయింది. తీవ్ర గాయంతో రక్తస్రావం అవుతూండగానే సంతోష్‌ కుమార్‌ రెడ్డి మరో చేత్తో కుటుంబ సభ్యులకు ప్రమాదం గురించి మొబైల్‌ ఫోన్‌లో సమాచారం అందించడం స్థానికులను కలచివేసింది. 

అతడిని స్థానికులు, పోలీసులు, బంధువులు తొలుత స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం తరలిస్తూండగా మార్గం మధ్యలో అతడు మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో మోటార్‌ సైకిల్‌పై వెళ్తున్న వారు కూడా గాయపడ్డారు. సంతోష్‌ కుమార్‌ రెడ్డి భార్య శ్రీలిఖిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం అతడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

చదవండి: ఫ్రెండ్ ప్రాణం తీసిన అక్రమ సంబంధం?


  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement