వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తున్న బాటింగ్‌ను టీడీపీ తట్టుకోలేకపోతోందన్న దిగులు ఎల్లో మీడియాకు బాగానే పట్టుకున్నట్లు ఉంది. అందుకే జగన్ మీడియా సమావేశంపై నేరుగా దాడి చేయడానికి ఈ తెలుగుదేశం మీడియా పడరాని అగచాట్లు పడుతోంది.
జగన్ బుధవారం నాడు కరువు సమస్య, బీసీల రిజర్వేషన్‌లపై ప్రభుత్వ డ్రామా, గంజాయి ప్రదేశ్‌గా మారిన ఏపీ, వెలిగొండ క్రెడిట్ చోరీ మొదలైన అంశాలపై డిటైల్డ్‌గా తన మీడియా సమావేశంలో మాట్లాడారు. వీటన్నిటికి ఆయన ఆధారాలు, సాక్ష్యాలు చూపుతూ తన వాదన వినిపించారు. వాటికి నేరుగా సమాధానం ఇవ్వలేక, టీడీపీ నేతలు, మంత్రులు కప్పదాటు వైఖరి ప్రదర్శించారు. కాని ఎల్లో మీడియా ఆంధ్రజ్యోతి మాత్రం రాజును మించిన రాజభక్తితో, టీడీపీని కాపు కాసే బాధ్యత తమదే అన్నట్లుగా జగన్‌పై నేరుగా దాడి చేసింది. జగన్ చెప్పినవి అబద్దాలని రాసేసుకుంది. ఆ రకంగా జగన్‌పై బురద వేసి ఆ మీడియా సంతృప్తి చెందింది.
జగన్ చెప్పిన విషయాలను పరిశీలిద్దాం.. ముందుగా కరువు ప్రస్తావనను జగన్ చేశారు. రాష్ట్రంలో కరువు ఉందన్నది వాస్తవమే కదా!స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే ఆ విషయాన్ని చెబుతున్నారు కదా! అయినా పట్టిసీమ నుంచి నీరు వచ్చేసిందని చెప్పి ప్రకాశం బారేజీ వద్ద పూజలు చేసి నీళ్లు వదలి కృష్ణా డెల్టా కింద మంత్రులు నీరు ఇస్తున్నట్లు చెప్పింది అవాస్తవమా? ఆ సందర్భంలో వీరంతా ఏ రకంగా గప్పాలు పోయారో తెలియదా! ఆ విషయాలనే కదా జగన్ గుర్తు చేసింది.
వాటికి ఆధారంగా ఎల్లో మీడియాలో వచ్చిన వార్తల క్లిప్పింగ్‌లను కూడా చూపించారు కదా! కాకపోతే ఎల్లో మీడియా, టీడీపీ నేతలు కరువు అన్న పదాన్ని వాడకుండా ఎల్‌నినో అని చెప్పుకుని జనాన్ని మభ్య పెట్టాలని చూస్తున్నారు. మంత్రుల మాటలు నమ్మి పంటలు వేసుకున్న రైతులు నష్టపోతున్నారని జగన్ తెలిపారు. ఇందులో తప్పేముంది? అబద్దం ఏమి ఉంది. కృష్ణా జిల్లాలో అవనిగడ్డ మొదలైన ప్రాంతాలలో నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్న వార్తలు ఎల్లో మీడియాలో కూడా వచ్చాయి కదా!రైతులను, కరువు బారిన ప్రజలను ప్రభుత్వం ఆదుకోవడం లేదని జగన్ విమర్శించారు. ప్రభుత్వం ఇంతవరకు కరువును ఎదుర్కోవడానికి తీసుకుంటున్న నిర్దిష్ట చర్యలేమిటి? ఇంకా ప్లానింగ్‌లోనే ఉన్నామని కదా ప్రభుత్వ పెద్దలు చెబుతున్నది. పలు చోట్ల ముఖ్యంగా రాయలసీమ నుంచి వలసలు ఎలా సాగుతున్నాయో పత్రికలలో వార్తలు వచ్చాయి కదా!
ఆగస్టు 11నాటికి శైశైలంలో 879 అడుగుల నీటి మట్టం వచ్చినా పోతిరెడ్డిపాడు నుంచి నీరు ఎందుకు ఇవ్వలేదన్నది జగన్ ప్రశ్న. రైతులకు ఇవ్వకుండా విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వాడేస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు వంటి పాలకులు ఉంటారనే, తాము రాయలసీమ లిఫ్ట్ఇరిగేషన్ స్కీమ్‌ను ఆరంభించామని జగన్ తెలిపారు. ఇది వాస్తవమే కదా! ఈ స్కీమ్‌ను జగన్ వేగంగా ముందుకు తీసుకువెళుతున్న సమయంలో ప్రభుత్వం మారడం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారని చంద్రబాబు ఈ స్కీమ్‌ను నిలిపివేయడం కరెక్టే కదా! రేవంత్ ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పినా చంద్రబాబు ఖండించలేకపోయారే. మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడులు జగన్ చేసిన విమర్శలకు జవాబు ఇస్తూ ప్రతి విమర్శలు చేశారే కాని, ప్రభుత్వం ఇంతవరకు ఏ చర్యలు తీసుకున్నది వివరించినట్లు కనిపించలేదు.
జగన్ టైమ్‌లో రైతులకు ఉచిత భీమా అమలు చేస్తే ఈ ప్రభుత్వం దానిని ఎందుకు కొనసాగించలేకపోయింది? రామానాయుడు మాత్రం కరువు నేపథ్యంలో తాగునీటికే ప్రాధాన్యం ఇస్తున్నామని, ఆ తర్వాత ఆరుతడి పంటలకు నీరు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చామని అన్నారు. కరువు సమస్య కారణంగా గ్రామీణ ప్రాంతాలలో ఆర్థిక పరిస్థితులు గడ్డుగా మారాయి. వాటిని ఎలా నివారిస్తారన్న జగన్ ప్రశ్నకు బదులు ఇచ్చినట్లు లేదు.
జగన్ టైమ్‌లో వివిధ స్కీమ్‌ల ద్వారా గ్రామీణ ప్రాంతాలవారికి ఆర్థిక సాయం అందించడంతో చేతిలో డబ్బులు ఆడాయి. వ్యాపారాలు కూడా సాగాయని ఆర్థిక నిపుణులు కూడా అంగీకరించారు. జగన్ టైమ్‌లో రెండేళ్లపాటు కరోనా సంక్షోభం వస్తే ఈ ఎల్లో మీడియా ఎంత నీచమైన రాతలు రాసిందో మర్చిపోయి ఉండవచ్చు. ప్రపంచం అంతటా ఏర్పడినట్లే ఏపీలో కూడా అప్పట్లో ఆదాయం పూర్తిగా పడిపోయింది. కేంద్రం సూచనల ప్రకారం రుణం తీసుకోవలసి వచ్చింది. మిగిలిన రాష్ట్రాలకన్నా మెరుగ్గా కరోనాను జగన్ ప్రభుత్వం ఎదుర్కుంది. అయినా జగన్ ఏపీని శ్రీలంక చేసేస్తున్నారని ఎల్లో మీడియా తప్పుడు వార్తలు రాసిందా? లేదా? ఉద్యోగులకు జీతాలు ఆలస్యం అయితే కోర్టులలో కేసులు వేయించి వడ్డీతో సహా జీతాలు చెల్లించాలని ఆదేశాలు తెచ్చింది ఎవరో తెలియదా!
తాను అధికారంలో ఉంటే కరోనా వచ్చేదా తమ్ముళ్లు అని చంద్రబాబు అంటే అదేమిటని ప్రశ్నించకపోగా, ఎల్లో మీడియా ఔను, ఔను అని భజంత్రి వాయించాయే. ఇప్పుడు కరువు సమస్య వల్ల ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడుతుంటే వారిని మభ్య పెట్టడానికి ఎల్లో మీడియా ఎల్‌నినో, యుద్దం అంటూ సాకులు ప్రచారం చేస్తోంది. వెలిగొండ ప్రాజెక్టు క్రెడిట్ గురించి కూడా ఎల్లో మీడియా తనదైన శైలిలో టీడీపీ ఖాతాలో వేయడానికి తహతహలాడుతోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవ లేకపోతే ఈనాటికి కూడా ఈ ప్రాజెక్టు వాస్తవరూపం దాల్చేది కాదన్నది పచ్చి నిజం.
జగన్ రెండేళ్ల క్రితం సొరంగాలకు ప్రారంభోత్సవం చేసిన సందర్భంగా చేసిన ప్రసంగంలో ,నిర్వాసితులకు పరిహారం చెల్లించి రిజర్వాయిర్‌లోకి నీరు తరలిస్తామని ప్రకటించారు. ఈలోగా ప్రభుత్వం మారింది. రెండేళ్ల క్రితం ఈ పని పూర్తి చేయకుండా ఆలస్యం చేసింది కూటమి ప్రభుత్వం కాదా! వైఎస్సార్‌సీపీ, జగన్ కలిసి సుమారు 31 కిలోమీటర్ల మేర సొరంగాలు తవ్విస్తే, చంద్రబాబు హయాంలో 6.68 కిలోమీటర్ల మేర మాత్రమే పూర్తి చేశారన్నది నిజమా? కాదా? ఈ క్రెడిట్‌లో ఎవరి వాటా ఎంతో చెబితే తప్పుకాదు. మొత్తం క్రెడిట్‌ను చోరీ చేయాలని చూస్తేనే ఇబ్బంది. ఇక ఏపీ గంజాయి ప్రదేశ్‌గా మారిందని జగన్ ఆరోపణ.
ఈ మధ్యనే ఏకంగా పోలీసుల వాహనంలోనే గంజాయి తరలించిన వార్తను ఎల్లో మీడియా మర్చిపోయిందా? నిత్యం ఎక్కడో చోట గంజాయి పట్టుబడుతూనే ఉంది. వంద రోజుల్లో గంజాయి నిరోదించి చూపుతామని చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లు ఎన్నికల ముందు చేసిన ప్రగల్బాలను జగన్ ప్రస్తావించారు. ఆ ప్రకారం వారు చేయలేకపోయిన విషయాన్ని జగన్ ఎండగట్టారు. ఇక బీసీల రిజర్వేషన్‌ల అంశాన్ని కూడా ఎల్లో మీడియా నిస్సిగ్గుగా భుజాన వేసుకుని అసత్యాలు ప్రచారం చేస్తోంది.
గతంలో జగన్ బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌లపై జీఓ ఇస్తే తప్పుపట్టారా?లేదా?దానిపై టీడీపీ నేతే కోర్టుకు వెళ్లారా?లేదా?ఆ తర్వాత అది ఆగిపోతే జగన్ పార్టీపరంగా ఆయా పదవులను ఏభై శాతం పైగా బీసీలకు ఇచ్చారే! ఆ విషయాన్ని ఆయన లెక్కలతో సహా చూపించారు. మరి చంద్రబాబు మళ్లీ ఇప్పుడు జీఓ ఇచ్చి రిజర్వేషన్లు కల్పిస్తామని చెబితే దానికి కోర్టు ఆమోదం తెలుపుతుందా?పార్లమెంటులో సంబంధిత చట్ట సవరణ చేయిస్తామని ఎందుకు టీడీపీ ప్రకటించలేదు?
ఇక వైఎస్సార్‌సీపీ బీసీ నేతలపై కేసులు అక్రమమా? కాదా? అన్నది అందరికి తెలిసిందే. చంద్రబాబు నాయుడుతో సహా పలువురు టీడీపీ నేతలపై అప్పట్లో అవినీతి కేసులు వస్తే ఇదే ఎల్లో మీడియా గుండెలు బాదుకుని గోల, గోల చేసిందే. టీడీపీ ముఖ్యనేత పీఏ ఇంటిపై ఆదాయపన్ను శాఖ దాడి చేసి రెండువేల కోట్ల అక్రమాలను కనుగొన్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం బహిరంగ రహస్యమే కదా! ఆ కేసు ఏమైందో చెప్పి, ఆ తర్వాత వైఎస్సార్‌సీపీపై ఎన్ని ఆరోపణలు చేసినా ఆలోచించవచ్చు. ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు అన్నట్లు టీడీపీతో పాటు ఎల్లో మీడియా ప్రవర్తిస్తున్న విషయాన్ని జనం గమనించరా!
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత
ఇవి కూడా చదవండి: బాబూ.. అమరావతి కథనం వెనుక అసలు కథేంటి?


