న్యూఢిల్లీ: పాకిస్థాన్ గూఢచార సంస్థ (ఐఎస్ఐ)తో సంబంధాలు కొనసాగిస్తూ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో ఢిల్లీకి చెందిన యువ దంపతులను పోలీసుల ప్రత్యేక విభాగం (స్పెషల్ సెల్) అరెస్టు చేసింది. నిందితులను సరాయ్ కాలే ఖాన్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ సాహిల్, అతని భార్య సమీరాగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ దంపతులు 2024 నుంచి సోషల్ మీడియా ద్వారా పాకిస్థాన్‌కు చెందిన హ్యాండ్లర్లతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు.
వీరు భారత సిమ్ కార్డులను సేకరించి, దుబాయ్ మీదుగా పాకిస్థాన్‌కు చేరవేసే లాజిస్టికల్ మద్దతును అందించారు. 2024–2025 మధ్య కాలంలో 8 భారతీయ సిమ్ కార్డులను పాకిస్థాన్‌కు పంపినందుకు గాను వీరు సుమారు రూ.30,000 నగదును పారితోషికంగా అందుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సిమ్ కార్డులతో పాక్ ఏజెంట్లు భారత్‌లోని వాట్సాప్ గ్రూపుల్లో చేరి, రక్షణ రంగానికి సంబంధించిన కీలక, సున్నితమైన సమాచారాన్ని సేకరించడానికి వినియోగించినట్లు దర్యాప్తులో తేలింది.
The Northern Range of the Delhi Police Special Cell busts an alleged ISI-backed, Pakistan-based espionage network and arrests a Delhi-based couple accused of working for Pakistani Intelligence Operatives (PIOs) through social media since 2024.
According to Delhi police, the… pic.twitter.com/6qFbGdQ9j8— All India Radio News (@airnewsalerts) August 28, 2026
సాహిల్‌ను అదుపులోకి తీసుకుని మొబైల్ ఫోన్‌ను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపగా పాక్ ఏజెంట్లతో జరిపిన సంభాషణలు వెలుగుచూశాయి. 2024లో సమీరా ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో పాక్ ఏజెంట్‌తో పరిచయం ఏర్పడిందని, అనంతరం మరింత మంది ఏజెంట్లతో సంబంధాలు కుదిర్చి ఆర్థిక ఎర చూపినట్లు సాహిల్ విచారణలో అంగీకరించాడు. దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ఆర్మీ కంటోన్మెంట్ల వద్ద రెక్కీ నిర్వహించే వారిని వెతకడం, సైనిక న్యాయస్థానాల్లో కోర్టు మార్షల్ విచారణలు ఎదుర్కొంటున్న ఆర్మీ సిబ్బంది వివరాలను సేకరించడం వంటి బాధ్యతలను కూడా సాహిల్‌కు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం సమీరాను కూడా అరెస్టు చేసి, వీరి వద్ద నుంచి కుట్రకు ఉపయోగించిన రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. భారత్‌లోని స్థానిక ఏజెంట్లు, ఓవర్‌గ్రౌండ్ వర్కర్లు, స్లీపర్ సెల్స్‌తో ఈ నెట్‌వర్క్‌కు ఉన్న సంబంధాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: ఈ సీజన్‌లో తొలి స్వైన్ ఫ్లూ మృతి నమోదు


