దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ హవా నిజంగా తగ్గిందా?.. ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి పరిస్థితి ఏంటి?.. జెన్‌జీ ఎఫెక్ట్‌ను తట్టుకుని మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోగలుగుతుందా?. అయితే ఆ అవకాశాలు ఎలా ఉన్నాయో ఇండియా టుడే–సీ ఓటర్ ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ (MOTN) సర్వే వెల్లడించింది.
మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో కాస్త సర్‌ప్రైజింగ్ విషయాలే కనిపించాయి. ఇప్పటికిప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగితే.. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి ఏకంగా 326 సీట్లు వస్తాయని తెలిపింది. పార్టీల వారీగా చూస్తే బీజేపీకి 261 సీట్లు వస్తాయని, కాంగ్రెస్ పార్టీ కాస్త పుంజుకుని 106 సీట్లకు పరిమితం కావొచ్చని అంచనా వేసింది. అయితే ఇదే పోల్ ఏజెన్సీ ఈ ఏడాది జనవరిలో జరిపిన సర్వే కంటే ఎన్డీయేకు ఇప్పుడు కాస్త ప్రతికూలతే కనిపిస్తోంది.
జనవరి సర్వేతో పోలిస్తే ఎన్డీయే కూటమి బలం 26 సీట్లు తగ్గడం గమనార్హం. ఆ టైంలో ఎన్డీయేకు 352 సీట్లు వస్తాయని ఇదే సర్వే అంచనా వేసింది. ఇందులో బీజేపీకి పార్టీకి 287 సీట్లు వస్తాయని అంచనా వేయగా.. ఆ సంఖ్య ఇప్పుడు 26 సీట్లు తగ్గినట్లైంది. అయినప్పటికీ.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఒరిజినల్‌గా బీజేపీ సాధించిన 240 సీట్ల కంటే తాజా అంచనా కూడా ఎక్కువగా ఉండటం విశేషం.
మరోవైపు కాంగ్రెస్ బలం గణనీయంగా పెరిగే అవకాశముందని సర్వే తెలిపింది. కాంగ్రెస్‌కు 106 సీట్లు వస్తాయని అంచనా వేసింది. జనవరి సర్వేతో పోలిస్తే ఇది 26 సీట్ల పెరుగుదల. అప్పట్లో కాంగ్రెస్‌కు 80 సీట్లు వస్తాయని అంచనా వేశారు.
ఇండియా కూటమికి 185
మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో.. ఎన్డీయే కూటమికి 326 సీట్లు వస్తాయని చెప్పగా.. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి 185 సీట్లు వస్తాయని తాజా ఎంవోటీఎన్ సర్వే అంచనా వేసింది. జనవరి సర్వేతో పోలిస్తే ఇది స్వల్పంగా మాత్రమే పెరిగింది. అప్పట్లో ఇండియా కూటమికి 182 సీట్లు వస్తాయని అంచనా వేశారు. అయితే 2024 ఎన్నికల్లో ఈ కూటమి వాస్తవంగా.. 234 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే.
ఎన్డీయే ఓటు షేర్ 45.1 శాతం
ఓటు శాతం పరంగానూ ఎన్డీయే ముందంజలోనే ఉంది. తాజా సర్వే ప్రకారం ఎన్డీయేకు 45.1 శాతం ఓట్లు లభించే అవకాశం ఉంది. జనవరి సర్వేలో ఇది 47 శాతంగా ఉంది. మరోవైపు ఇండియా కూటమి ఓటు షేర్ స్వల్పంగా పెరిగి 39.1 శాతానికి చేరుతుందని అంచనా. జనవరిలో ఇది 39 శాతంగా ఉంది.
400 పార్‌కు దూరమే..!
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయేకు ఇప్పటికీ ఓటర్లలో గట్టి మద్దతు ఉందని సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి. అయితే 2024 ఎన్నికల సమయంలో బీజేపీ ఇచ్చిన ‘400 పార్’ నినాదానికి ఈ అంచనా చాలా దూరంలో ఉంది. ముఖ్యంగా యువత, విద్యార్థులకు సంబంధించిన అంశాలు బీజేపీకి సవాలుగా మారుతున్నాయని సర్వే విశ్లేషణ పేర్కొంది.
పరీక్ష పేపర్ లీకులు, విద్యా వ్యవస్థలో అవకతవకలు వంటి అంశాలపై యువతలో అసంతృప్తి వ్యక్తమవుతోందని తెలిపింది. అదే సమయంలో రాహుల్‌గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పలు కీలక అంశాలపై బీజేపీని లక్ష్యంగా చేసుకోవడం ఆ పార్టీకి కొంత మేర రాజకీయంగా కలిసొస్తున్నట్లు సర్వే గణాంకాలు చెబుతున్నాయి.
ఇండియా టుడే గ్రూప్ దాదాపు రెండు దశాబ్దాలుగా నిర్వహిస్తున్న ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో భాగంగా ఈ తాజా అంచనాలను రూపొందించారు. సీ ఓటర్ నిర్వహించిన ఈ సర్వేలో జూలై 1 నుంచి ఆగస్టు 25 వరకు 25,184 మందిని నేరుగా ప్రశ్నించారు. దీనికి అదనంగా గత ఆరు నెలల్లో సీ ఓటర్ నిర్వహించిన రెగ్యులర్ ట్రాకింగ్‌లో భాగంగా సేకరించిన 91,795 ఇంటర్వ్యూలను కూడా విశ్లేషణలో పరిగణనలోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి: విదేశీ పర్యటనకు మోదీ.. పుతిన్ భేటీకి ఛాన్స్?


