బ్లాక్ మార్కెట్ వ్యాపారులకు మోదీ సర్కార్ సహకారం: కాంగ్రెస్
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ పాలనలో రూ.36,000 కోట్ల చక్కెర కుంభకోణం జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జేవాలా గురువారం ఆరోపించారు. పండుగ సీజన్‌లో చక్కెర ధరలు పెరగడం వల్ల అక్రమ నిల్వదారులు, బ్లాక్ మార్కెట్ వ్యాపారులు లాభపడేలా మోదీ సర్కార్ సహరిస్తోందని విమర్శించారు. దేశంలో చక్కెర కొరత గురించి ఏప్రిల్ నెలలోనే ప్రభుత్వానికి తెలిసినప్పటికీ ఎలాంటి చర్యలూ తీసుకోకుండా మౌనంగా ఉండిపోయిందని ఆక్షేపించారు.
దీనివల్ల చక్కెర ధర కిలోకు రూ.40 నుంచి రూ.75కు పెరిగిందని పేర్కొన్నారు. ఆగస్టు, నవంబర్ మధ్య సుమారు 12 మిలియన్ టన్నుల చక్కెర వినియోగం జరుగుతుందని, ప్రజలు కిలోకు అదనంగా రూ.30 చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. దసరా, దీపావళి పండుగల సమయంలో ప్రజలు చక్కెర ధరల పెరుగుదల భారాన్ని మోయాల్సి ఉంటుందన్నారు.
ఈ సొమ్మంతా అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తుందన్నారు. బ్లాక్ మార్కెట్ వ్యాపారుల ద్వారా ప్రజలను బహిరంగంగా దోచుకోవడానికి ఇది మోదీ ప్రభుత్వం వేసిన కొత్త ఎత్తుగడ అని ధ్వజమెత్తారు. మధుమేహాన్ని(డయాబెటిస్) తరిమికొట్టేందుకే ప్రధాని మోదీ చక్కెర ధరను పెంచి, దానిని పెట్రోల్‌లో కలిపారంటూ బీజేపీ నాయకులు ప్రజలకు జ్ఞానోదయం కలిగిస్తున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.


