చివరి నిమిషంలో ట్విస్ట్‌ ఉంటుందా? | Congress party High Tension on Konda Surekha | Sakshi
Sakshi News home page

చివరి నిమిషంలో ట్విస్ట్‌ ఉంటుందా?

Aug 28 2026 3:34 AM | Updated on Aug 28 2026 3:34 AM

Congress party High Tension on Konda Surekha

కొండా సురేఖ ఎపిసోడ్‌లో హైటెన్షన్‌

ఖర్గేతో భట్టి భేటీ.. ఎమ్మెల్యేలు, మంత్రుల అభిప్రాయాలపై ఆరా

ఢిల్లీకి త్వరలో సీఎం, పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం?

హీటెక్కిస్తున్న కాంగ్రెస్‌ రాజకీయం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్‌ రోజుకో మలుపు తిరుగుతోంది. క్రమశిక్షణ కమిటీ నివేదికతో వేటుకు రంగం సిద్ధమైందన్న ప్రచారం ఊపందుకున్న వేళ.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే భేటీ రాజకీయ ఉత్కంఠను మరింత పెంచింది. సురేఖపై చర్య ఖరారైందా? లేక అధిష్టానం చివరి నిమిషంలో మరో మార్గాన్ని ఎంచుకుంటుందా? అన్నదే ఇప్పుడు కాంగ్రెస్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే సురేఖపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేయడం తెలిసిందే.

ఈ నివేదిక ఏఐసీసీకి చేరడంతో బంతి పూర్తిగా అధిష్టానం కోర్టులోకి వెళ్లింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ గౌడ్‌ కూడా ఈ వ్యవహారం ఏఐసీసీ పరిధిలో ఉందని, ఎలాంటి నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తామని తాజాగా ప్రకటించారు. ఇదే సమయంలో ఖర్గేతో భట్టి బెంగళూరులో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. సురేఖ వ్యవహారంపై ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల అభిప్రాయాలను కూడా భట్టి ఖర్గేకు వివరించినట్లు కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

అలాగే చిన్నారెడ్డి వ్యవహారంపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. క్రమశిక్షణ కమిటీ సిఫారసు బయటకు వచ్చిన తర్వాత సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించడం దాదాపు ఖాయమన్న వాదన బలపడింది. కేబినెట్‌ నుంచి తక్షణమే తొలగించాలా? లేక మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వరకు ఆగాలా? అన్న అంశంపై అధిష్టానం ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 

ఢిల్లీకి ముగ్గురు కీలక నేతలు
మంత్రి కొండా సురేఖతోపాటు చిన్నారెడ్డి తదితర నేతలకు సంబంధించి క్రమశిక్షణ సంఘం ఇచ్చిన నివేదికను ఏఐసీసీకి పంపిన నేపథ్యంలో ఇప్పుడు అందరి చూపు ఢిల్లీ వైపే ఉంది. అదే సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి త్వరలో ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి కేసీ వేణుగోపాల్‌ ఈనెల 31న ఢిల్లీకి వచ్చిన తరువాతే ఈ అంశంపై స్పష్టత వస్తుందన్న వాదన కూడా వినిపిస్తోంది.

ఈ ముగ్గురు అధిష్టానంతో భేటీ అయితే సురేఖపై చర్యతోపాటు తెలంగాణ కాంగ్రెస్‌లో ఇటీవలి కాలంలో పెరిగిన అంతర్గత విభేదాలు, నేతల మధ్య సమన్వయం వంటి అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. సురేఖ, చిన్నారెడ్డితోపాటు ఎమ్మెల్యేలు రాజగోపాల్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి తదితర ఎమ్మెల్యేల వ్యాఖ్యలను కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

మురళీ భేటీలో ఏం జరిగింది?
కొండా మురళీ డిప్యూటీ సీఎం భట్టిని కలిసి తన కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యల నేపథ్యం గురించి వివరించినట్లు చెబుతున్నారు. సురేఖ కుటుంబం తరఫున వివరణ ఇవ్వడంతోపాటు రాజకీయంగా పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయా? అన్న చర్చకు ఈ భేటీ కారణమైంది. అదే సమయంలో సురేఖ మంత్రి హోదాలో తనదైన శైలిలో వరంగల్‌ జిల్లాలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటుండడం, వివాదాస్పద వ్యాఖ్యల జోలికి వెళ్లకపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement