జడ్చర్ల: మహిళలంటే తనకు చాలా గౌరవం, వారిపై తాను ప్రెస్ మీట్లు పెట్టనని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై స్పందిస్తూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'ఇంట్లో మా అమ్మ తిట్టినా తల వంచుకుంటానే తప్ప ఎదురు మాట్లాడను. మహిళల ఒక్క చుక్క కంటనీరు నేలపై పడ్డా అది సునామీ అయిపోయి మనం అందులో కొట్టుకుపోతామ'ని వ్యాఖ్యానించారు.
కొండా సురేఖ వ్యవహారాన్ని క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తోందని అనిరుధ్ రెడ్డి (Janampalli Anirudh Reddy) చెప్పారు. ఈ వ్యవహారంపై ఎవరూ మాట్లాడొద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కొండా సురేఖ అంశంలో ఎమ్మెల్యేలు నిర్వహించిన ప్రెస్‌మీట్‌కు తనను ఎవరూ ఆహ్వానించలేదని వెల్లడించారు. చిన్నారెడ్డి చాలా సీనియర్ నాయకుడని, ఆయన విషయంలో తానేమి మాట్లాడబోనని అన్నారు.
ప్రశ్నిస్తూనే ఉంటా
తన నియోజకవర్గ సమస్యల పరిష్కారం అయ్యేంతవరకు నిరంతరం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటానని చెప్పారు. పెండింగ్ బిల్లుల కోసం అవసరమైతే భట్టి విక్రమార్కతో కొట్లాడుతానని, ఈయకపోతే దీక్షకు దిగుతానని వ్యాఖ్యానించారు. కాగా, కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
ఇదీ చదవండి: ఇంకా బెంగళూరులోనే భట్టి.. కొండా ఫ్యామిలీ ఎపిసోడ్‌పై సస్పెన్స్!


