మా వాళ్లు ఎలా ఉన్నారో? | Nepal Devasting Floods Washes Away Villages | Sakshi
Sakshi News home page

మా వాళ్లు ఎలా ఉన్నారో?

Aug 27 2026 12:28 PM | Updated on Aug 27 2026 12:33 PM

Nepal Devasting Floods Washes Away Villages

సాక్షి, హైదరాబాద్‌: నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరద నగరవాసులకు ఆందోళన కలిగిస్తోంది. వృత్తి, వ్యాపార, పర్యాటక, ఆధ్యాత్మిక యాత్ర కోసం వెళ్లిన తమవాళ్లకు సంబంధించిన సమాచారం కోసం వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఆర్తిగా ఎదురుచూస్తున్నారు. వీరికి ఏ హానీ కలగకుండా తిరిగి రావాలంటూ మొక్కుకుంటున్నారు. నగరం నుంచి నేపాల్‌ వెళ్లినవారు 150 మందిపైనే ఉంటారని తెలుస్తోంది. నేపాల్‌కు వీసా లేకుండా అధికారిక గుర్తింపు కార్డులు చూపించి వెళ్లే అవకాశం ఉంది. దీంతో భారతీయులు పర్యాటకంతో పాటు వృత్తి, వ్యాపార, ఆధ్యాత్మిక యాత్రలకు వెళుతున్నారు.

అనేక కారణాల వల్ల నగరం నుంచి నేపాల్‌ ఉత్తర ప్రాంతానికి వెళ్లేవారి సంఖ్య నిత్యం ఎక్కువగా ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే వారిలో అత్యధికులు హైదరాబాద్‌ నుంచే ఉంటారు. వీరిలో కొందరు ట్రావెల్‌ ఏజెన్సీల ద్వారా వెళ్తుండగా మరికొందరు కుటుంబ సభ్యులతో కలిసి సొంతంగా వెళ్తుంటారు. ఇలాంటివారితో పాటు సఫారీలు, ట్రెక్కింగ్స్‌ కోసం వెళ్లే వారి సంఖ్య గణనీయమే. వర్షాకాలం నేపథ్యంలో ట్రెక్కింగ్‌కు వెళ్లేవారి సంఖ్య తగ్గినా, మిగిలిన పనులపై వెళ్లేవారు పదులు, వందల్లోనే ఉంటారు.

ఆకస్మిక వరదల వార్త దావానలంలా వ్యాపించడంతో వీరందరి కుటుంబాల్లో ఉత్కంఠ, ఆత్రుత నెలకొంది.  నేపాల్‌ యాత్రకు వెళ్లినవారిని సంప్రదించడానికి ప్రయత్నించగా అనేకమంది ఫోన్లు బుధవారం అర్ధరాత్రి వరకు పని చేయలేదు. కొందరి ఫోన్లు రింగ్‌ అవుతున్నా సమాధానం ఉండట్లేదు. ఈ పరిణామాలు నగరంలోని వారి కుటుంబీకుల్లో ఆందోళన మరింత పెంచుతోంది. చాలామంది తమవారిని తీసుకెళ్లిన, పంపిన ట్రావెల్‌ ఏజెన్సీలు, వ్యక్తుల వద్దకు పరుగులు పెట్టారు.  
31 మంది క్షేమం 
చిక్కడపల్లి: నగరం నుంచి కైలాస మానస సరోవర్‌ యాత్రకు వెళ్లిన 31 మంది క్షేమంగా ఉన్నారు. ఈ నెల 18న వీరి యాత్ర ప్రారంభమైంది. ప్రస్తుతం టిబెట్‌ వైపు ఉన్నారు. అయితే, వీరు ప్రయాణించి వచ్చిన ప్రాంతం వరదల్లో కొట్టుకుపోయింది. చైనా అనుమతిస్తే 29వ తేదీన కొడారి మార్గం నుంచి ఖాట్మాండుకు చేరుకుని, అక్కడినుంచి భారత్‌లోకి రానున్నారు. ఈ విషయాన్ని యాత్రకు వెళ్లిన ఎమ్మెస్‌ రామారావు ట్రస్టు చైర్మన్‌ పోలాప్రగడ శ్రీనివాస్‌ స్వామి ఫోన్‌ ద్వారా వెల్లడించారు.  


2013లో ఉత్తరాఖండ్‌లో వచ్చిన ఆకస్మిక వరదలు నగరం నుంచి చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లినవారిపై తీవ్ర ప్రభావం చూపాయి. పదుల సంఖ్యలో నగరవాసులు చనిపోగా, ఇంకొందరు గల్లంతయ్యారు.  

2014లో హిమాచల్‌ప్రదేశ్‌ మండి జిల్లాలోని బియాస్‌ నది వద్ద జలవిద్యుత్‌ ప్రాజెక్టు అధికారులు ముందస్తు హెచ్చరికలు లేకుండా రిజర్వాయర్‌ గేట్లను తెరవడంతో నగరం నుంచి విహార యాత్రకు వెళ్లిన ఇంజనీరింగ్‌ విద్యార్థులు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. 

 

తాజాగా నేపాల్‌ ఆకస్మిక వరదల వార్త విన్న నగరవాసులు పై రెండు ఉదంతాలను గుర్తు చేసుకుంటున్నారు. నాటి బీభత్సాన్ని తలచుకుని ఆందోళన చెందుతున్నారు. ఈ మూడు దుర్ఘటనలూ హిల్‌ స్టేషన్‌లలో జరిగినవే కావడంతో మరింత కంగారు పడుతున్నారు.  

 

చదవండి: నేపాల్‌ భీకర వరదలు.. ఏరియల్‌ వ్యూలో..
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement