మృతదేహానికి రాఖీ కట్టి సోదరి కన్నీరుమున్నీరు
హైదరాబాద్: విద్యుదాఘాతంతో చనిపోయిన అన్న మృతదేహానికి చెల్లి రాఖీ కట్టి కన్నీరుమున్నీరైంది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని నెహ్రూనగర్ కాలనీకి చెందిన నర్సింలు, రాణిబాయ్ దంపతుల కుమారుడు జమాల్పూర్ నవీన్ (24) చటాన్‌పల్లి రైల్వేగేట్ సమీపంలో మటన్ షాపు నిర్వహిస్తున్నాడు.
బుధవారం షాపులోకి విద్యుత్ సరఫరా కాకపోవడాన్ని గమనించి, సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై కిందపడిపోయాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే నవీన్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అంత్యక్రియలకు తీసుకెళ్తున్న క్రమంలో.. సోదరి పూజిత అన్నకు చివరి రాఖీ కట్టి గుండెలవిసేలా రోదించింది.


