కాన్‌బెర్రా: ఆస్ట్రేలియాలోని గ్రేట్ బారియర్ రీఫ్ సముద్ర గర్భంలో దాగి ఉన్న 65,000 ఏళ్ల నాటి ప్రాచీన భూభాగాన్ని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. నదులు, సరస్సులు, బీచ్‌లతో కూడిన ఈ సమగ్ర భౌగోళిక ప్రాంతం నీటి అడుగున చెక్కుచెదరకుండా నిక్షిప్తమై ఉండటం విశేషం. క్వీన్స్‌లాండ్ తీరంలో పరిశోధనా నౌక ‘ఇన్వెస్టిగేటర్’ ద్వారా చేపట్టిన 24 రోజుల అన్వేషణలో దీనిని కనుగొన్నారు.
స్థానిక దారుంబల్, వొప్పాబుర్రా తెగల సాంప్రదాయ జ్ఞానంతో పాటు నౌకలోని అధునాతన సోనార్ వ్యవస్థను ఉపయోగించి ఈ ప్రాంతాన్ని మ్యాపింగ్ చేశారు. ఈ యాత్ర ప్రధాన శాస్త్రవేత్త హెలెన్ బోస్టాక్ తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 65,000 సంవత్సరాల క్రితం ప్రస్తుత సముద్ర మట్టం కంటే నీటి మట్టం 80 మీటర్ల దిగువన ఉన్న సమయంలో ఆస్ట్రేలియాకు చేరుకున్న మొదటి తరం స్థానిక తెగలు (ఫస్ట్ నేషన్స్) ఈ మైదాన ప్రాంతాల్లో జీవించారు. 7,000 సంవత్సరాల క్రితం సముద్ర మట్టాలు పెరగడంతో ఈ నేల క్రమంగా మునిగిపోయింది. సముద్ర గర్భం నుంచి సేకరించిన 20కి పైగా అవక్షేపాల (సెడిమెంట్ కోర్స్) ఆధారంగా అప్పటి శీతోష్ణస్థితి, వృక్షసంపద, శిలాజాలను విశ్లేషించి చరిత్రను పునర్నిర్మించే పనిలో పరిశోధకులు ఉన్నారు. ఈ ప్రాచీన సమాచారం ద్వారా భవిష్యత్తులో సముద్ర మార్పులు, రీఫ్ పరిణామాలను అంచనా వేయడానికి వీలవుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: అదుపుతప్పిన ‘ఏఐ’.. దాడికి దిగిన 688 ఓపెన్ఏఐ ఏజెంట్లు


