రసువా: నేపాల్‌లోని రసువా తదితర జిల్లాల్లో సంభవించిన ఆకస్మిక వరదల విధ్వంస తీవ్రతను ‘ప్లానెట్ ల్యాబ్స్’ విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాలు కళ్లకు కట్టాయి. ఆగస్టు 23, 25 నాటి సాధారణ స్థితికి, వరదల అనంతరం ఆగస్టు 26న తీసిన చిత్రాలకు మధ్య ఉన్న వ్యత్యాసం అక్కడి విపత్తు తీవ్రతను తేటతెల్లం చేస్తోంది. మనకామన, ఖడ్గ భంజ్యాంగ్ వంటి గ్రామాలు, నేపాల్-చైనా సరిహద్దు లోయలు, భోటేకోశీ నది పరివాహక ప్రాంతాల్లోని మౌలిక సదుపాయాలు, జలవిద్యుత్ కేంద్రాలు, రహదారులు వరద ప్రవాహానికి తీవ్రంగా దెబ్బతిన్న దృశ్యాలు శాటిలైట్ చిత్రాల్లో కనిపిస్తున్నాయి.
ఈ ఆకస్మిక వరదల ధాటికి ఇప్పటివరకు 98 మంది మృతి చెందగా, వందలాది మంది గల్లంతయ్యారు. గల్లంతైన సుమారు 400 మందిలో 105 మంది భారతీయులు, 37 మంది ప్రవాస భారతీయులు ఉన్నట్లు నేపాల్ టూరిజం బోర్డు వెల్లడించింది. హిమనీనదం పేలడం లేదా మంచు చరియలు విరిగిపడి నదీ ప్రవాహాన్ని అడ్డుకోవడం వల్లే ఒక్కసారిగా ఈ భారీ వరద ఉప్పొంగి ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
వరద ప్రవాహం గండక్ నది ద్వారా దిగువకు వచ్చే అవకాశం ఉండటంతో భారత్‌లోని బిహార్, ఉత్తరప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్ బలగాలను అప్రమత్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్ ప్రభుత్వానికి సంఘీభావం తెలుపుతూ అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు.
ఇది కూడా చదవండి: 1934 భూకంపం నుంచి 2026 వరదల వరకు..


