మాస్కో: రష్యాలోని తూర్పు ప్రాంతమైన అమూర్‌లోని ఒక గ్యాస్ కెమికల్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు చైనా పౌరులతో సహా మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, మరో తొమ్మిది మంది ఆచూకీ గల్లంతైంది. మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చినట్లు ప్లాంట్ యాజమాన్యం బుధవారం టెలిగ్రామ్ వేదికగా వెల్లడించింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించగా, 152 మంది గాయపడ్డారు. వీరిలో పరిస్థితి విషమంగా ఉన్న 36 మందిని మెరుగైన చికిత్స అందిస్తున్నారు.
పరిశ్రమల భద్రతా నిబంధనల ఉల్లంఘన కోణంలో రష్యా దర్యాప్తు కమిటీ ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఈ గ్యాస్ ప్లాంట్ నిర్మాణ పనుల్లో పలువురు విదేశీ కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో అధిక శాతం చైనా పౌరులు ఉన్నారు. రష్యా సాధారణంగా భారీ పారిశ్రామిక, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం విదేశీ శ్రామికులపై ఆధారపడుతుంటుంది. ఈ అమూర్ గ్యాస్ కెమికల్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్‌ను రష్యాకు చెందిన ‘సిబూర్’, చైనాకు చెందిన ‘సినోపెక్’ సంస్థల భాగస్వామ్యంతో నిర్మిస్తున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పాలిథిలిన్, పాలిప్రొపైలిన్ ఉత్పత్తి కేంద్రాలలో ఒకటిగా నిలవనుంది. ఈ ప్లాంట్ ద్వారా ఏటా సుమారు 23 లక్షల మెట్రిక్ టన్నుల పాలిథిలిన్, 4 లక్షల టన్నుల పాలిప్రొపైలిన్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇది కూడా చదవండి: నేపాల్‌లో వరద బీభత్సం: 28 మంది పోలీసులు గల్లంతు!


