న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న పాముకాటు ఘటనల్లో భారత్ మొదటి స్థానంలో ఉందని అంతర్జాతీయ పరిశోధకుల తాజా అధ్యయనం వెల్లడించింది. ‘లివర్‌పూల్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్’ శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం ప్రపంచంలో ఏటా సుమారు 21 లక్షల నుంచి 70 లక్షల మంది పాముకాటుకు గురవుతుండగా, ఒక్క భారతదేశంలోనే ఏటా 4.09 లక్షల నుంచి 13 లక్షల వరకు కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రపంచంలోనే అత్యధిక పాముకాటు బాధితులు ఉన్న దేశంగా భారత్ నిలిచింది.
ఈ జాబితాలో 6.66 లక్షల కేసులతో నైజీరియా రెండో స్థానంలో ఉండగా, ఇండోనేషియా (4.90 లక్షలు), డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (4.67 లక్షలు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న మొత్తం కేసుల్లో 75 శాతం కేవలం 20 దేశాలకే పరిమితమైనట్లు పరిశోధకులు గుర్తించారు. బ్రెజిల్ (48,000–162,000), వియత్నాం (33,500–113,000), చైనా (28,900–97,400) కూడా టాప్-20 దేశాల జాబితాలో ఉన్నాయి.
'పీఎల్‌ఓఎస్ మెడిసిన్' (PLOS Medicine) జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనంలో.. జనవరి 2007 నుంచి మార్చి 2025 వరకు 79 దేశాల సమాచారాన్ని పరిశీలించారు. పాముకాటు మరణాల విషయానికి వస్తే, అల్పాదాయ దేశాల్లో తీవ్రత అధికంగా ఉంది. ముఖ్యంగా సబ్-సహారా ఆఫ్రికా ప్రాంతంలో ప్రపంచవ్యాప్త పాముకాట్లు, మరణాలలో 45 శాతం నమోదవుతున్నాయని, ఇది దక్షిణాసియా కంటే దాదాపు మూడు రెట్లు అధికమని పరిశోధకులు తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా పాముకాట్ల కారణంగా ఏటా 2.74 లక్షల నుంచి 5.13 లక్షల మరణాలు సంభవిస్తున్నట్లు అంచనా వేశారు. అయితే గతంలో వేసిన అంచనాల కంటే వాస్తవ పరిస్థితులు మరింత తీవ్రంగా ఉన్నాయని, వాస్తవంగా పాముకాటు విషప్రభావం మూడు రెట్లు, మరణాల సంఖ్య రెండు రెట్లు అధికంగా ఉండే అవకాశం ఉందని ప్రధాన పరిశోధకుడు దిలీప ఎదిరివీర పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: ‘జెజు’లో సీరియల్ కిల్లర్?.. 3 రోజుల్లో 4 మృతదేహాలు లభ్యం!


