భారత కంపెనీలకు షాకిచ్చిన ట్రంప్‌.. | Trump sanctions 4 India-based companies over Iran oil trade | Sakshi
Sakshi News home page

భారత కంపెనీలకు షాకిచ్చిన ట్రంప్‌..

Aug 26 2026 7:22 AM | Updated on Aug 26 2026 7:35 AM

Trump sanctions 4 India-based companies over Iran oil trade

ఇరాన్‌పై అమెరికా ఆర్థిక ఒత్తిడి రోజురోజుకు పెరుగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. ఇరాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ట్రంప్‌ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్‌ నుంచి పెట్రోలియం, పెట్రోకెమికల్‌ ఉత్పత్తుల దిగుమతుల్లో భాగస్వామ్యం ఉన్నాయన్న ఆరోపణలతో భారత్‌కు చెందిన నాలుగు కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది. మొత్తం సుమారు 119 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.10 వేల కోట్లకు పైగా) విలువైన ఇరాన్‌ చమురు వ్యాపారానికి సంబంధించి ఈ చర్యలు తీసుకున్నట్లు అమెరికా పేర్కొంది. ‘ఆపరేషన్‌ ఎకనామిక్‌ అవుట్‌కాస్ట్‌’లో భాగంగా ఈ ఆంక్షలు అమెరికా ప్రకటించింది.

ఆంక్షలు విధించిన కంపెనీలు ఇవే.. 

  • PP Softtech Private Limited, 

  • Sadashiva Overseas Limited, 

  • Prakrutees Infra Impex India Private Limited, 

  • Portease Partners LLP కంపెనీలపై చర్యలు తీసుకున్నారు.

ఇక, వీటిలో మొదటి మూడు సంస్థలు ఇరాన్‌ మూలం కలిగిన పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నాయని అమెరికా ఆరోపించింది. నాలుగో సంస్థ అయిన Portease Partners ఇరాన్‌ పెట్రోకెమికల్‌ ఉత్పత్తుల పలు షిప్‌మెంట్లను భారత్‌కు తీసుకురావడంలో కస్టమ్స్‌ బ్రోకర్‌గా సహకరించిందని పేర్కొంది. 2023 మే నుంచి 2026 ఫిబ్రవరి మధ్య ఈ లావాదేవీలు జరిగినట్లు పేర్కొంది. ఈ మూడు సంస్థలకు సంబంధించి అమెరికా పేర్కొన్న దిగుమతుల విలువే దాదాపు 119 మిలియన్‌ డాలర్లు. Portease Partners ద్వారా నిర్వహించబడిన షిప్‌మెంట్ల విలువను ఇందులో చేర్చలేదు.

ముగ్గురు భారతీయులపైనా ఆంక్షలు
ఇదిలా ఉండగా.. కంపెనీలతో పాటు ముగ్గురు భారతీయులపై కూడా అమెరికా చర్యలు తీసుకుంది. PP Softtech డైరెక్టర్‌ ప్రశాంత్‌ గార్గ్‌తో పాటు Portease Partners భాగస్వాములు ఇంద్రిస్మియా అషరఫ్మియా షేఖ్‌, హరీశ్‌ రామచంద్ర రంగిలను కూడా ఆంక్షల జాబితాలో చేర్చింది. అయితే, అమెరికా ఆంక్షలు కేవలం నాలుగు భారత కంపెనీలకు మాత్రమే పరిమితం కాలేదు. ఇరాన్‌ ఆదాయ మార్గాలను ప్రపంచవ్యాప్తంగా దెబ్బతీయడమే లక్ష్యంగా ‘ఆపరేషన్‌ ఎకనామిక్‌ అవుట్‌కాస్ట్‌’ పేరుతో విస్తృత ఆంక్షల కార్యక్రమాన్ని వాషింగ్టన్‌ ప్రారంభించింది. దాదాపు 60 మంది వ్యక్తులు, సంస్థలు, నౌకలపై తాజాగా చర్యలు తీసుకున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. చైనా, హాంకాంగ్‌కు చెందిన పలు సంస్థలు, వ్యక్తులు కూడా ఈ జాబితాలో ఉన్నారు.

ఇది కూడా చదవండి: అమెరికాకు కెనడా స్ట్రాంగ్‌ కౌంటర్‌

ఈ నేపథ్యంలో ఆంక్షల విధింపుపై అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్‌ బెసెంట్‌ మాట్లాడుతూ.. ఇరాన్‌ ప్రభుత్వ ఆర్థిక సంబంధాలపై ఒత్తిడిని మరింత పెంచుతామని స్పష్టం చేశారు. ఇరాన్‌తో ఆర్థిక సంబంధాలు కొనసాగించే సంస్థలు కూడా భవిష్యత్తులో అమెరికా ఆంక్షల ముప్పును ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు.. అమెరికా ఆంక్షలను ఇరాన్‌ తీవ్రంగా ఖండించింది. తాజా చర్యలు అంతర్జాతీయ చట్టాలను, ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను ఉల్లంఘించే ప్రయత్నమని ఇరాన్‌ విదేశాంగ శాఖ ఆరోపించింది. ఇరాన్‌ ఆర్థిక మంత్రి అలీ మదనిజాదెహ్‌ స్పందిస్తూ.. తమ దేశం ఈ ఆంక్షలను ఎదుర్కొనేందుకు పూర్తిగా సిద్ధంగా ఉందని చెప్పారు. ఇందుకోసం రెండేళ్ల ప్రణాళికను రూపొందించినట్లు వెల్లడించారు.

భారత్‌పై ప్రభావం?
ఇరాన్‌ చమురు వ్యాపారానికి సంబంధించి భారత కంపెనీలపై అమెరికా వరుసగా చర్యలు తీసుకోవడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలోనూ ఇరాన్‌తో చమురు సంబంధాల ఆరోపణలపై భారత సంస్థలు, వ్యక్తులను అమెరికా ఆంక్షల పరిధిలోకి తీసుకొచ్చింది. తాజా చర్యలతో ఇరాన్‌తో వాణిజ్యం చేసే భారతీయ సంస్థలపై అమెరికా నిఘా మరింత కఠినమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement