అమెరికాకు కెనడా స్ట్రాంగ్ కౌంటర్! | Canada To Impose Up To 50 Percent Tariffs On 700 US Goods In Trade War Escalates | Sakshi
Sakshi News home page

అమెరికాకు కెనడా స్ట్రాంగ్ కౌంటర్!

Aug 25 2026 11:53 PM | Updated on Aug 25 2026 11:58 PM

Canada To Impose Up To 50 Percent Tariffs On 700 US Goods In Trade War Escalates

అమెరికా, కెనడా మధ్య వాణిజ్య వివాదం రోజురోజుకూ ముదురుతోంది. అమెరికా విధించిన భారీ టారిఫ్‌లకు కెనడా కూడా గట్టిగా స్పందించింది. సుమారు 20 బిలియన్ డాలర్ల విలువైన 700 అమెరికా వస్తువులపై 15 నుంచి 50 శాతం వరకు ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు కెనడా ప్రకటించింది. ఈ టారిఫ్‌లు సెప్టెంబర్ 8 నుంచి అమల్లోకి రానున్నాయి.

స్టీల్ నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు..
కెనడా విధించే కొత్త సుంకాల ప్రభావం అమెరికాకు చెందిన పలు కీలక రంగాలపై పడనుంది. ముఖ్యంగా స్టీల్, డెయిరీ, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు ఈ టారిఫ్‌ల పరిధిలోకి రానున్నాయి. అమెరికా ఏ స్థాయిలో సుంకాలు విధించిందో, దానికి అనుగుణంగానే తమ టారిఫ్‌లు ఉంటాయని కెనడా అధికారులు స్పష్టం చేశారు.

కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్ షాంపేన్ మాట్లాడుతూ.. తమ దేశానికి ఇది ఎన్నడూ ఎదురుకాని సవాలని, అయితే ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు కెనడా సిద్ధంగా ఉందని చెప్పారు. అమెరికా చర్యకు ప్రతిస్పందించే విషయంలో దేశ ప్రజలంతా ఐక్యంగా ఉన్నారని తెలిపారు.

చర్చల నుంచి కెనడా వైదొలగింపు
అమెరికా, కెనడా మధ్య టారిఫ్‌లపై జరిగిన చర్చలు సఫలం కాలేదు. అమెరికా ప్రతిపాదించిన కొత్త వాణిజ్య నిబంధనలు కెనడాకు అనుకూలంగా లేవని ప్రధాని మార్క్ కార్నీ అభిప్రాయపడ్డారు.

ఆ ప్రతిపాదనలు ఆర్థికంగా అన్యాయంగా ఉండటంతో పాటు కెనడాకు దక్కాల్సిన ప్రయోజనాలను తగ్గించేలా ఉన్నాయని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా ఆటోమొబైల్, స్టీల్, అల్యూమినియం వంటి తమ ప్రధాన పరిశ్రమలను దెబ్బతీసే విధంగా అమెరికా ప్రతిపాదనలు ఉన్నాయని కార్నీ అన్నారు. అందుకే అమెరికా ఇచ్చిన ఒప్పందాన్ని అంగీకరించకుండా చర్చల నుంచి బయటకు వచ్చామని స్పష్టం చేశారు.

ట్రంప్ హెచ్చరిక
మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా కెనడాపై తన వైఖరిని మరింత కఠినతరం చేశారు. కెనడా అమెరికా నిర్ణయాలకు అనుగుణంగా వ్యవహరించాలని, లేకపోతే ఇప్పటికే విధించిన టారిఫ్‌ల కంటే మరింత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అంతేకాకుండా.. కెనడా ఆటోమొబైల్ పరిశ్రమపై వచ్చే ఏడాది నుంచి మరిన్ని టారిఫ్‌లు విధించే అవకాశం ఉందని ట్రంప్ ప్రకటించారు.

కెనడా ఎన్నో సంవత్సరాలుగా అమెరికాను వాణిజ్యపరంగా నష్టపరుస్తోందని ట్రంప్ ఆరోపించారు. ముఖ్యంగా అమెరికా రైతుల ఉత్పత్తులపై కెనడా విధిస్తున్న అధిక సుంకాలను ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో రెండు దేశాలు ఒకదానిపై మరొకటి టారిఫ్‌లు విధించుకుంటుండటంతో స్టీల్, ఆటోమొబైల్, వ్యవసాయం, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలపై ప్రభావం పడే అవకాశం ఉంది.

ప్రస్తుతం అమెరికా-కెనడా మధ్య టారిఫ్‌ల పోరు మరింత తీవ్రంగా మారింది. అమెరికా విధించిన సుంకాలకు కెనడా ప్రతీకార చర్యలు తీసుకోవడం, మరోవైపు ట్రంప్ మరిన్ని టారిఫ్‌ల హెచ్చరికలు చేయడంతో పరిస్థితి సంక్లిష్టంగా మారింది. ఇరు దేశాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుంటాయా?, లేక టారిఫ్‌ల పోరు మరింత పెరుగుతుందా?, అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వాణిజ్య యుద్ధం కొనసాగితే చివరికి దాని ప్రభావం రెండు దేశాల పరిశ్రమలతో పాటు వినియోగదారులపైనా పడే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement