మేం సిద్ధం.. మా దాడి మొదలవుతుంది: ఇరాన్‌ | Iran Hits Back at Trumps Economic War Says We Are Fully Prepared | Sakshi
Sakshi News home page

మేం సిద్ధం.. మా దాడి మొదలవుతుంది: ఇరాన్‌

Aug 25 2026 8:43 AM | Updated on Aug 25 2026 8:46 AM

Iran Hits Back at Trumps Economic War Says We Are Fully Prepared

ఇరాన్‌పై అమెరికా ఆంక్షలను మరింత విస్తరించడంతో మరోసారి ఉద్రిక్తతలు రాజుకుంటున్నాయి. ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఆదాయ మార్గాలను దెబ్బతీయడమే లక్ష్యంగా అమెరికా కొత్త ఆంక్షలను ప్రకటించింది. అయితే ఈ చర్యలకు తాము భయపడబోమని ఇరాన్‌ తేల్చిచెప్పింది. ఆంక్షలను ఎదుర్కొనేందుకు ‘పూర్తిగా సిద్ధంగా ఉన్నామని’ ప్రకటించడంతోపాటు.. అవసరమైతే అమెరికా ప్రయోజనాలు, కీలక ఇంధన మార్గాలపై ఎదురుదాడికి దిగుతామని హెచ్చరించింది.

అమెరికా కొత్త ఆంక్షలపై ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ మహ్మద్‌ బాఘర్‌ ఘలీబాఫ్‌ తీవ్రంగా స్పందించారు. అమెరికా చేస్తున్న ఆంక్షల బెదిరింపులనుOperation Economic Outcast ఎవరూ పట్టించుకోవడం లేదని అన్నారు. ఇరాన్‌ ప్రధాన వాణిజ్య భాగస్వాములు కూడా అమెరికా ఒత్తిడికి తలొగ్గబోరని ధీమా వ్యక్తం చేశారు. అలాగే.. అమెరికా మరిన్ని దేశాలతో ఆర్థిక సంబంధాలను తెంచుకునే స్థితిలో లేదని ఘలీబాఫ్‌ వ్యాఖ్యానించారు. ఇరాన్‌తో వాణిజ్యం చేస్తున్న దేశాలు అమెరికా హెచ్చరికలను పెద్దగా పరిగణనలోకి తీసుకోవడం లేదని తమకు సమాచారం అందుతోందన్నారు. దీంతో ఆంక్షల విషయంలో అమెరికా ఒత్తిడికి దీటుగా దౌత్య, ఆర్థిక మార్గాల్లో ప్రతిఘటనకు ఇరాన్‌ సిద్ధమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

‘పూర్తిగా సిద్ధంగా ఉన్నాం’
ఇరాన్‌ ఆర్థిక మంత్రి అలీ మదానిజాదే అమెరికాకు మరింత ఘాటైన హెచ్చరిక జారీ చేశారు. కొత్త ఆంక్షలను ఎదుర్కొనేందుకు ఇరాన్‌ ‘పూర్తిగా సిద్ధంగా ఉంది’ అని ప్రకటించారు. అమెరికా తమపై ఆర్థిక దాడికి దిగితే.. తమ వద్ద కూడా ప్రతిస్పందించేందుకు అవసరమైన సాధనాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ‘‘ఇక మేం కేవలం రక్షణాత్మక చర్యల కోసమే పరిమితం కాబోం. శత్రువులు మా నుంచి దాడిని ఎదురుచూడాల్సి ఉంటుంది’’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. చైనా, రష్యాలు అమెరికా తాజా చర్యలను అంగీకరించలేదని, ఇతర దేశాలు కూడా వాషింగ్టన్‌ ఒత్తిడికి తలొగ్గకపోవచ్చని మదానిజాదే పేర్కొన్నారు.

అమెరికా ప్రయోజనాలే టార్గెట్‌?
ఆర్థిక ఆంక్షల విషయంలో ఇరాన్‌ ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ ప్రతినిధి బ్రిగేడియర్‌ జనరల్‌ హొస్సేన్‌ మొహెబ్బీ కూడా అమెరికాను హెచ్చరించారు. ఇరాన్‌ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటే.. అమెరికా కీలక ప్రయోజనాలు, ఇంధన రవాణా మార్గాలపై భారీ దెబ్బలు తప్పవని హెచ్చరించినట్లు ఇరాన్‌ మీడియా పేర్కొంది. అంతేకాదు.. గల్ఫ్‌ ప్రాంతం నుంచి చమురు ఎగుమతులను మరింత తగ్గించే అవకాశం ఉందని కూడా ఇరాన్‌ సంకేతాలు ఇచ్చింది. అదే జరిగితే ప్రపంచ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పటికే ఉద్రిక్తతలకు కేంద్రంగా మారిన హర్ముజ్‌ జలసంధిలో పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారే ప్రమాదం ఉంది.

60 మందిపై అమెరికా ఆంక్షలు
ఇరాన్‌కు వచ్చే ప్రతి కీలక ఆదాయ మార్గాన్ని అడ్డుకునే లక్ష్యంతో అమెరికా తాజా చర్యలకు దిగింది. అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్‌ బెసెంట్‌ 60 మంది వ్యక్తులు, సంస్థలు, నౌకలపై కొత్త ఆంక్షలు విధించినట్లు ప్రకటించారు. ఇరాన్‌తో వ్యాపార సంబంధాలు కొనసాగించే దేశాలు, సంస్థలపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందని బెసెంట్‌ హెచ్చరించారు. ముఖ్యంగా ఇరాన్‌ చమురు ఆదాయాన్ని నగదుగా మార్చేందుకు సహకరించే సంస్థలు అమెరికా ఆంక్షల పరిధిలోకి వస్తాయని స్పష్టం చేశారు.

అయితే ఇరాన్‌ చమురు వ్యాపారంలో కీలక పాత్ర పోషిస్తున్న చైనా ఆర్థిక సంస్థలను తాజా ఆంక్షల జాబితాలో చేర్చకపోవడం గమనార్హం. ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలను కొనసాగించే దేశాలు అమెరికా డాలర్‌ ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి వెలేస్తామని బెసెంట్‌ ఇప్పటికే హెచ్చరించారు.

ఆరు నెలలుగా యుద్ధం.. తగ్గని వేడి
అమెరికా, ఇజ్రాయెల్‌ ఇరాన్‌పై దాడులు ప్రారంభించి దాదాపు ఆరు నెలలు గడుస్తున్నా.. సంక్షోభానికి శాశ్వత పరిష్కారం కనిపించడం లేదు. ఇటీవలి వారాల్లో పెద్దస్థాయి దాడులు కొంత తగ్గినా.. ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన పరిష్కారం మాత్రం ఇంకా దూరంగానే ఉంది. అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులతో ఇరాన్‌ సాంప్రదాయిక సైనిక సామర్థ్యం దెబ్బతిన్నప్పటికీ.. క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసే సామర్థ్యం మాత్రం ఆ దేశానికి మిగిలి ఉందని విశ్లేషణలు చెబుతున్నాయి. ముఖ్యంగా గల్ఫ్‌ దేశాలు, చమురు నౌకలు, కీలక ఇంధన మార్గాలపై ముప్పు కొనసాగుతోంది.

ఆర్థిక దెబ్బకు.. సైనిక కౌంటర్‌?
ఇరాన్‌ను ఆర్థికంగా ఒంటరి చేసేందుకు అమెరికా ఆంక్షలను మరింత కఠినతరం చేస్తుండగా.. వాటికి తలొగ్గకుండా ఎదురుదాడికి సిద్ధమని ఇరాన్‌ స్పష్టం చేయడం ఇప్పుడు కీలక పరిణామంగా మారింది. ఒకవైపు **చమురు, డాలర్‌ లావాదేవీలు, నౌకాయానంపై అమెరికా ఒత్తిడి పెంచుతుండగా.. మరోవైపు హర్ముజ్‌ జలసంధి, ఇంధన సరఫరా మార్గాలను ఇరాన్‌ ప్రతీకార చర్యలకు ఉపయోగించే అవకాశం ఆందోళన కలిగిస్తోంది.

డొనాల్డ్‌ ట్రంప్‌ గనుక ఆర్థిక యుద్ధాన్ని మరింత తీవ్రం చేస్తే.. ఇరాన్‌ ఎలాంటి కౌంటర్‌ ఇస్తుందన్నదే ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఆర్థిక ఆంక్షలతో ఇరాన్‌ను లొంగదీసుకోవాలని అమెరికా చూస్తుంటే.. ‘‘ఆంక్షలు మమ్మల్ని ఆపలేవు.. అవసరమైతే ఎదురుదాడికి దిగుతాం’’ అనే సంకేతాలను టెహ్రాన్‌ స్పష్టంగా ఇస్తోంది. దీంతో ఇరాన్‌-అమెరికా ఘర్షణ మరోసారి ఆర్థిక రంగం నుంచి సైనిక చర్యల దిశగా మళ్లుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

ఇదీ చదవండి: డొనాల్డ్‌ ట్రంప్‌కు భారీ ఊరట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement