breaking news
economic sanctions
-
మేం సిద్ధం.. మా దాడి మొదలవుతుంది: ఇరాన్
ఇరాన్‌పై అమెరికా ఆంక్షలను మరింత విస్తరించడంతో మరోసారి ఉద్రిక్తతలు రాజుకుంటున్నాయి. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఆదాయ మార్గాలను దెబ్బతీయడమే లక్ష్యంగా అమెరికా కొత్త ఆంక్షలను ప్రకటించింది. అయితే ఈ చర్యలకు తాము భయపడబోమని ఇరాన్ తేల్చిచెప్పింది. ఆంక్షలను ఎదుర్కొనేందుకు ‘పూర్తిగా సిద్ధంగా ఉన్నామని’ ప్రకటించడంతోపాటు.. అవసరమైతే అమెరికా ప్రయోజనాలు, కీలక ఇంధన మార్గాలపై ఎదురుదాడికి దిగుతామని హెచ్చరించింది.అమెరికా కొత్త ఆంక్షలపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘర్ ఘలీబాఫ్ తీవ్రంగా స్పందించారు. అమెరికా చేస్తున్న ఆంక్షల బెదిరింపులనుOperation Economic Outcast ఎవరూ పట్టించుకోవడం లేదని అన్నారు. ఇరాన్ ప్రధాన వాణిజ్య భాగస్వాములు కూడా అమెరికా ఒత్తిడికి తలొగ్గబోరని ధీమా వ్యక్తం చేశారు. అలాగే.. అమెరికా మరిన్ని దేశాలతో ఆర్థిక సంబంధాలను తెంచుకునే స్థితిలో లేదని ఘలీబాఫ్ వ్యాఖ్యానించారు. ఇరాన్‌తో వాణిజ్యం చేస్తున్న దేశాలు అమెరికా హెచ్చరికలను పెద్దగా పరిగణనలోకి తీసుకోవడం లేదని తమకు సమాచారం అందుతోందన్నారు. దీంతో ఆంక్షల విషయంలో అమెరికా ఒత్తిడికి దీటుగా దౌత్య, ఆర్థిక మార్గాల్లో ప్రతిఘటనకు ఇరాన్ సిద్ధమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.‘పూర్తిగా సిద్ధంగా ఉన్నాం’ఇరాన్ ఆర్థిక మంత్రి అలీ మదానిజాదే అమెరికాకు మరింత ఘాటైన హెచ్చరిక జారీ చేశారు. కొత్త ఆంక్షలను ఎదుర్కొనేందుకు ఇరాన్ ‘పూర్తిగా సిద్ధంగా ఉంది’ అని ప్రకటించారు. అమెరికా తమపై ఆర్థిక దాడికి దిగితే.. తమ వద్ద కూడా ప్రతిస్పందించేందుకు అవసరమైన సాధనాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ‘‘ఇక మేం కేవలం రక్షణాత్మక చర్యల కోసమే పరిమితం కాబోం. శత్రువులు మా నుంచి దాడిని ఎదురుచూడాల్సి ఉంటుంది’’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. చైనా, రష్యాలు అమెరికా తాజా చర్యలను అంగీకరించలేదని, ఇతర దేశాలు కూడా వాషింగ్టన్ ఒత్తిడికి తలొగ్గకపోవచ్చని మదానిజాదే పేర్కొన్నారు.అమెరికా ప్రయోజనాలే టార్గెట్?ఆర్థిక ఆంక్షల విషయంలో ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ హొస్సేన్ మొహెబ్బీ కూడా అమెరికాను హెచ్చరించారు. ఇరాన్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటే.. అమెరికా కీలక ప్రయోజనాలు, ఇంధన రవాణా మార్గాలపై భారీ దెబ్బలు తప్పవని హెచ్చరించినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. అంతేకాదు.. గల్ఫ్ ప్రాంతం నుంచి చమురు ఎగుమతులను మరింత తగ్గించే అవకాశం ఉందని కూడా ఇరాన్ సంకేతాలు ఇచ్చింది. అదే జరిగితే ప్రపంచ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పటికే ఉద్రిక్తతలకు కేంద్రంగా మారిన హర్ముజ్ జలసంధిలో పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారే ప్రమాదం ఉంది.60 మందిపై అమెరికా ఆంక్షలుఇరాన్కు వచ్చే ప్రతి కీలక ఆదాయ మార్గాన్ని అడ్డుకునే లక్ష్యంతో అమెరికా తాజా చర్యలకు దిగింది. అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ 60 మంది వ్యక్తులు, సంస్థలు, నౌకలపై కొత్త ఆంక్షలు విధించినట్లు ప్రకటించారు. ఇరాన్‌తో వ్యాపార సంబంధాలు కొనసాగించే దేశాలు, సంస్థలపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందని బెసెంట్ హెచ్చరించారు. ముఖ్యంగా ఇరాన్ చమురు ఆదాయాన్ని నగదుగా మార్చేందుకు సహకరించే సంస్థలు అమెరికా ఆంక్షల పరిధిలోకి వస్తాయని స్పష్టం చేశారు.అయితే ఇరాన్ చమురు వ్యాపారంలో కీలక పాత్ర పోషిస్తున్న చైనా ఆర్థిక సంస్థలను తాజా ఆంక్షల జాబితాలో చేర్చకపోవడం గమనార్హం. ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలను కొనసాగించే దేశాలు అమెరికా డాలర్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి వెలేస్తామని బెసెంట్ ఇప్పటికే హెచ్చరించారు.ఆరు నెలలుగా యుద్ధం.. తగ్గని వేడిఅమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడులు ప్రారంభించి దాదాపు ఆరు నెలలు గడుస్తున్నా.. సంక్షోభానికి శాశ్వత పరిష్కారం కనిపించడం లేదు. ఇటీవలి వారాల్లో పెద్దస్థాయి దాడులు కొంత తగ్గినా.. ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన పరిష్కారం మాత్రం ఇంకా దూరంగానే ఉంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ సాంప్రదాయిక సైనిక సామర్థ్యం దెబ్బతిన్నప్పటికీ.. క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసే సామర్థ్యం మాత్రం ఆ దేశానికి మిగిలి ఉందని విశ్లేషణలు చెబుతున్నాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాలు, చమురు నౌకలు, కీలక ఇంధన మార్గాలపై ముప్పు కొనసాగుతోంది.ఆర్థిక దెబ్బకు.. సైనిక కౌంటర్?ఇరాన్‌ను ఆర్థికంగా ఒంటరి చేసేందుకు అమెరికా ఆంక్షలను మరింత కఠినతరం చేస్తుండగా.. వాటికి తలొగ్గకుండా ఎదురుదాడికి సిద్ధమని ఇరాన్ స్పష్టం చేయడం ఇప్పుడు కీలక పరిణామంగా మారింది. ఒకవైపు **చమురు, డాలర్ లావాదేవీలు, నౌకాయానంపై అమెరికా ఒత్తిడి పెంచుతుండగా.. మరోవైపు హర్ముజ్ జలసంధి, ఇంధన సరఫరా మార్గాలను ఇరాన్ ప్రతీకార చర్యలకు ఉపయోగించే అవకాశం ఆందోళన కలిగిస్తోంది.డొనాల్డ్ ట్రంప్ గనుక ఆర్థిక యుద్ధాన్ని మరింత తీవ్రం చేస్తే.. ఇరాన్ ఎలాంటి కౌంటర్ ఇస్తుందన్నదే ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఆర్థిక ఆంక్షలతో ఇరాన్‌ను లొంగదీసుకోవాలని అమెరికా చూస్తుంటే.. ‘‘ఆంక్షలు మమ్మల్ని ఆపలేవు.. అవసరమైతే ఎదురుదాడికి దిగుతాం’’ అనే సంకేతాలను టెహ్రాన్ స్పష్టంగా ఇస్తోంది. దీంతో ఇరాన్-అమెరికా ఘర్షణ మరోసారి ఆర్థిక రంగం నుంచి సైనిక చర్యల దిశగా మళ్లుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: డొనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట -
ట్రంప్ ఉక్కుపాదం.. ఇరాన్‌పై ‘ఎకనామిక్ డీ-డే’!
వాషింగ్టన్: ఆంక్షలు, సైనిక చర్యలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై మరో పిడుగు పడింది. మరిన్ని ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఆ దేశానికి వచ్చే ప్రతి ఆదాయ మార్గాన్ని దెబ్బతీయడమే లక్ష్యమని ప్రకటించింది. అంతేకాదు ఆ దేశంతో ఆర్థిక లావాదేవీలు కొనసాగించే ఇతర దేశాలు, సంస్థలకూ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తద్వారా ఆ దేశాన్ని ఒంటరిని చేయాలనే ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది.ఇరాన్‌కు ఆర్థికంగా సహకరిస్తే అమెరికా ఆంక్షల పరిధిలోకి వస్తారని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ స్పష్టం చేశారు. సంస్థలు, దేశాలపై ఇక ఉపేక్ష ఉండదని బెసెంట్ తేల్చిచెప్పారు. ఇరాన్ తరఫున మనీలాండరింగ్‌కు పాల్పడే ఏ సంస్థ అయినా అమెరికా డాలర్ వ్యవస్థ నుంచి తొలగించబడుతుందని హెచ్చరించారు. ‘‘గడియారం తిరగడం ఇప్పుడే మొదలైంది’’ అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఇరాన్ పాలక వ్యవస్థకు ఆర్థికంగా అండగా నిలిచే వారెవరైనా అమెరికా శక్తిని పరీక్షించేందుకు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు అమెరికా-ఇరాన్లలో ఎవరితో సంబంధాలు కొనసాగించాలనే విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు.‘గ్రే ఏరియాల్లో’ ఇక వ్యాపారాలు కుదరవుఇరాన్తో ఆర్థిక సంబంధాలను కొనసాగిస్తూ అమెరికా ఆంక్షలను తప్పించుకునే ప్రయత్నాలను ఇక సహించబోమని బెసెంట్ స్పష్టం చేశారు. ఇరాన్ చమురు విక్రయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని నగదుగా మార్చేందుకు సహకరించే సంస్థలు, లావాదేవీలకు మధ్యవర్తిత్వం వహించే సంస్థలపై కూడా చర్యలు తప్పవన్నారు. ‘‘ఇరాన్‌తో ఎలాంటి ఆర్థిక సంబంధమైనా కొనసాగించడం.. బాధ్యత వహించే వారిని అమెరికా ఆంక్షల పరిధిలోకి తీసుకువస్తుంది’’ అని హెచ్చరించారు.ఐదు కీలక రంగాలే లక్ష్యంఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారాలుగా ఉన్న ఐదు కీలక రంగాలపై అమెరికా ప్రత్యేకంగా దృష్టి సారించింది. డిజిటల్ ఆస్తులు, సాంకేతికత, బంగారం, విమానయానం, నౌకాయానం రంగాలను లక్ష్యంగా చేసుకుని ఆంక్షలు విధించనున్నట్లు అమెరికా ప్రకటించింది. వీటితోపాటు ఇరాన్ చమురు ఆదాయాన్ని అడ్డుకోవడం, ఆ దేశానికి సహకరిస్తున్న సంస్థలు, నౌకలు, వ్యక్తులపై చర్యలు తీసుకోవడం ద్వారా ఆర్థిక మూలాలను తెంచే ప్రయత్నం చేస్తోంది.తాజా చర్యల్లో ప్రపంచంలోని పలు ప్రాంతాలకు చెందిన సుమారు 60 సంస్థలు, నౌకలు, వ్యక్తులను లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా వెల్లడించింది. ఇరాన్‌కు కీలక వాణిజ్య భాగస్వాములుగా ఉన్న చైనా, టర్కీ, యూఏఈ వంటి దేశాలపై కూడా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.దేశాధినేతలకు ట్రంప్ ఫోన్లుఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రపంచ దేశాల అధినేతలకు ఫోన్ చేసి ఇరాన్‌తో ఆర్థిక సంబంధాలను తెంచుకోవాలని కోరుతున్నారని బెసెంట్ తెలిపారు. అమెరికాకు మద్దతు ఇచ్చే దేశాలు భాగస్వామ్య ప్రయోజనాలను పొందుతాయని, ఇరాన్‌తో సంబంధాలు కొనసాగించే దేశాలు ఒంటరితనాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.అయితే ఈ చర్యల వెనుక ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే ప్రమాదం కూడా ఉందని అమెరికా వర్గాలు అంగీకరిస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదని, తప్పిదాలను సరిదిద్దుకునేందుకు దేశాలకు అవకాశం ఇస్తున్నామని బెసెంట్ పేర్కొన్నారు.‘ఆపరేషన్ ఎకనామిక్ ఔట్‌కాస్ట్’ఇరాన్‌పై చేపట్టిన తాజా ఆర్థిక ఒత్తిడి కార్యక్రమాన్ని అమెరికా ‘‘ఆపరేషన్ ఎకనామిక్ ఔట్‌కాస్ట్’’Operation Economic Outcastగా పేర్కొంది. దీనిని బెసెంట్ ‘‘ఎకనామిక్ డీ-డే’’గా అభివర్ణించారు. ఇరాన్‌కు వచ్చే అన్ని ఆర్థిక మార్గాలను ఒక్కొక్కటిగా మూసివేసి ఆ దేశాన్ని అంతర్జాతీయంగా ఒంటరిగా చేయడమే లక్ష్యంగా అమెరికా ముందుకు సాగుతున్నట్లు ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.వెనక్కి తగ్గేదేలేఅమెరికా కొత్త ఆంక్షలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. అమెరికా వద్ద ఇరాన్‌ను ఎదుర్కొనేందుకు కొత్త మార్గాలు లేకపోవడంతోనే పాత ఆంక్షలను పదేపదే అమలు చేస్తోందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ విమర్శించారు. అమెరికా ఒత్తిడికి తాము తలొగ్గబోమని స్పష్టం చేశారు.ఇరాన్ ఆర్థిక మంత్రి అలీ మదానీ-జాదే కూడా అమెరికా ప్రకటించిన కొత్త ఆర్థిక ఒత్తిడి కార్యక్రమంపై స్పందించారు. ఆంక్షలు, ఆర్థిక ఒత్తిళ్లు ఇరాన్‌కు కొత్తేమీ కాదని, వాటిని ఎదుర్కొనే సామర్థ్యం తమకు ఉందనే సంకేతాలు ఇచ్చారు.రియాల్ పతనం.. రికార్డు కనిష్ఠానికిమరోవైపు అమెరికా ఆంక్షలతోపాటు యుద్ధ ప్రభావం ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడుతోంది. ఇరాన్ కరెన్సీ రియాల్ డాలర్‌తో పోలిస్తే రికార్డు స్థాయిలో పతనమైంది. ఒక డాలర్‌కు సుమారు 20.2 లక్షల రియాల్స్ వరకు పడిపోయింది.యుద్ధానికి ముందే అధిక ద్రవ్యోల్బణం, ప్రతికూల వృద్ధితో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ సతమతమవుతోంది. యుద్ధం ప్రారంభమైన తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయి. బియ్యం ధరలు దాదాపు 60 శాతం పెరగగా.. గొడ్డు మాంసం ధరలు 150 శాతానికి పైగా పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి కూడా ఇరాన్ ఆర్థిక వ్యవస్థలో 5 శాతానికి పైగా సంకోచం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.‘ఇరాన్ పూర్తిగా కుప్పకూలుతోంది’ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ ఆర్థిక, సైనిక పరిస్థితిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ‘‘పూర్తిగా కుప్పకూలుతోంది’’ అంటూ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఆ దేశం ఆర్థిక, సైనిక పరంగా ‘డెత్ స్పైరల్’లోకి వెళ్తోందని వ్యాఖ్యానించారు.చమురు.. హర్ముజ్‌పైనే అసలు పోరుఇరాన్పై అమెరికా ఆర్థిక ఒత్తిడి వెనుక ప్రధాన లక్ష్యం చమురు ఆదాయాన్ని అడ్డుకోవడమే. ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిలో పరిస్థితులు ఇప్పటికే తీవ్రంగా దెబ్బతిన్నాయి. అక్కడ నౌకాయానం అంతరాయానికి గురికావడంతో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు, గ్యాస్ ధరలపై ఒత్తిడి పెరిగింది.ఇరాన్ చమురు ఎగుమతులను అడ్డుకోవడం ద్వారా ఆ దేశానికి వచ్చే విదేశీ మారకద్రవ్యాన్ని నిలిపివేయాలని అమెరికా భావిస్తోంది. అయితే ఇప్పటివరకు విధించిన ఆంక్షలు, సముద్ర దిగ్బంధనం ఇరాన్‌పై ఒత్తిడి పెంచినా.. రాజకీయంగా ఆశించిన ఫలితాన్ని పూర్తిగా సాధించలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.చర్చల టేబుల్‌పైకి రావాల్సిందే: హెగ్సెత్అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కూడా ఇరాన్ ఆర్థిక ఒత్తిడిని ఎక్కువ కాలం తట్టుకోలేదని వ్యాఖ్యానించారు. చివరకు అణు కార్యక్రమంపై చర్చలకు తిరిగి రావడం తప్ప ఇరాన్‌కు మరో మార్గం ఉండదని అన్నారు. అవసరమైతే అమెరికా సైనిక చర్యలకు కూడా వెనుకాడబోదని హెచ్చరించారు.దీంతో ఇరాన్‌పై అమెరికా వ్యూహం సైనిక చర్యల నుంచి ఆర్థిక యుద్ధం వైపు మరింతగా మళ్లుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. చమురు, డాలర్ లావాదేవీలు, నౌకాయానం, బంగారం, సాంకేతిక రంగాలను లక్ష్యంగా చేసుకున్న తాజా ఆంక్షలు ఎంతవరకు ప్రభావం చూపుతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలు కొనసాగించే దేశాలు అమెరికా ఒత్తిడికి ఎలా స్పందిస్తాయన్నదే తదుపరి కీలక పరిణామంగా మారనుంది.ఇదీ చదవండి: మేం రెడీ.. రెండేళ్లకు సరిపడా!: ఇరాన్ -
ప్రపంచ ఆర్థిక స్థిరీకరణ శక్తిగా భారత్
న్యూఢిల్లీ: భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తీవ్రతరం అవుతున్నాయని, ఆర్థిక ఆంక్షలు–టారిఫ్‌లు ప్రపంచ సరఫరా వ్యవస్థలను మార్చేస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ తరుణంలోనూ భారత్ 8 శాతం వృద్ధిరేటును ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. ఢిల్లీలో ‘కౌటిల్య ఆర్థిక సమావేశం 2025’ను ప్రారంభించిన సందర్భంగా మంత్రి సీతారామన్ మాట్లాడారు. వాణిజ్యం, ఇంధన భద్రత పరంగా ప్రపంచం ఎంతో అసమతుల్యతలను చూస్తోందని, నిర్మాణాత్మక పరివర్తనం దిశగా అడుగులు వేస్తోందని చెప్పారు. ఈ తరుణంలో భారత్ స్థిరీకరణ శక్తిగా నిలుస్తున్నట్టు చెప్పారు. వెలుపలి షాక్‌లను తట్టుకోగలదన్నారు. ‘‘2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకునేందుకు 8 శాతం మేర స్థిరమైన జీడీపీ వృద్ధికి చేరుకోవడం అవసరం. మనం చూస్తున్నది తాత్కాలిక అస్థిరతలు కాదు. నిర్మాణాత్మక మార్పు. ఒకప్పుడు బలమైన కూటములు అనుకున్నవి నేడు కాల పరీక్షను ఎదుర్కొంటున్నాయి. కొత్త కూటములు అవతరిస్తున్నాయి. కనుక కేవలం ప్రపంచ అస్థిరతలను ఎదుర్కోవడమే కాదు. వాణిజ్యం, ఇంధనం, ఆర్థిక అస్థిరతలతోనూ పోరాడాల్సి రావడం మనముందున్న సవాలు’’అని అని పేర్కొన్నారు. ప్రపంచ సంస్థలు బలోపేతం కావాలి.. అంతర్జాతీయ సంస్థలు (డబ్ల్యూటీవో, ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంక్ తదితర) బలోపేతం కావాల్సిన అవసరాన్ని మంత్రి సీతారామన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. అవి నిరీ్వర్యమవుతుండడంతో ప్రపంచ విశ్వాసం సన్నగిల్లుతున్నట్టు చెప్పారు. ఇవి నేటి వాస్తవాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉందన్నారు. దేశీయంగా సంస్కరణలు అమలు చేయడం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో సమన్వయం చేసుకోవడం ద్వారా భారత్ పెరుగుతున్న సుంకాల అవరోధాలను, వాణిజ్య కూటముల్లో మార్పులను అధిగమించగలదని చెప్పారు. పెరిగిపోయిన ఉద్రిక్తతలు, అధిక సుంకాలు, విధానపరమైన తీవ్ర అనిశి్చతులతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సమస్యలను ఎదుర్కొంటున్నట్టు మంత్రి తెలిపారు. అలాగే, పెట్టుబడులు తగ్గుముఖం పట్టడం, పెరిగిపోయిన నిధుల వ్యయాలు, ఇంధన ధరల్లో అస్థిరతలు సైతం వేధిస్తున్నట్టు చెప్పారు. వీటన్నింటి మధ్య భారత్ స్థిరీకరణ శక్తిగా పనిచేస్తున్నట్టు పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంలో భారత్ ద్రవ్య స్థిరీకరణ, మూలధన వ్యయాల నాణ్యతపై దృష్టి సారించినట్టు మంత్రి సీతారామన్ చెప్పారు. ‘‘జీడీపీలో వినియోగం, పెట్టుబడుల వాటా ఈ కాలంలో స్థిరంగా కొనసాగింది. భారత్ వృద్ధి దేశీ అంశాలపై బలంగా ఆధారపడి ఉంది. ఇది వెలుపలి షాక్‌లను పరిమితం చేస్తోంది. దీంతో భారత ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధిని సాధిస్తోంది’’అని వివరించారు. -
రష్యాపై ఆంక్షలు విధిస్తే ప్రత్యామ్నాయాలు ఉన్నాయ్
న్యూఢిల్లీ: రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై అమెరికా ఆర్థిక ఆంక్షల రిస్క్ ను కేంద్రం తోసిపుచ్చింది. రష్యా దిగుమతుల విషయంలో ఏవైనా సమస్యలు ఎదురైతే, ఇతర దేశాల నుంచి ముడి చమురు సరఫరాతో అధిగమిస్తామని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. దేశ చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతుల రూపంలోనే సమకూరుతోంది. సాధారణంగా మధ్యప్రాచ్యం నుంచి భారత్‌కు ముడి చమురు సరఫరా అధికంగా అవుతుండేది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత నుంచి మారిన పరిణామాలతో గత మూడేళ్లుగా రష్యా ప్రధాన సరఫరాదారుగా మారిపోయింది. పాశ్చాత్య దేశాలు కొనుగోళ్లు తగ్గించడంతో భారత్ తదితర దేశాలకు రష్యా తక్కువ ధరకే చమురు సరఫరా చేస్తోంది. దీంతో భారత రిఫైనరీలు రష్యా ముడి చమురు దిగుమతుల వైపు మళ్లాయి. ఇప్పుడు మొత్తం దిగుమతుల్లో 40 శాతం రష్యా నుంచే ఉంటున్నాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి పురి దీనిపై మాట్లాడారు. చమురు సరఫరా మార్కెట్లోకి ఇటీవలి కాలంలో గయానా తదితర కొత్త సరఫరాదారులు ప్రవేశించగా, ఇప్పటికే ఉన్న బ్రెజిల్, కెనడాలు సరఫరాను పెంచినట్టు చెప్పారు. గతంతో పోల్చిచూస్తే భారత్ ముడి చమురు సరఫరాలు వైవిధ్యంగా మారినట్టు తెలిపారు. సాధారణంగా 27 దేశాల నుంచి చమురును కొనుగోలు చేస్తుండగా, ఇప్పుడు ఆ సంఖ్య 40కు చేరినట్టు తెలిపారు. స్థిరంగానే చమురు ధరలు ముడి చమురు ధర ప్రస్తుతం బ్యారెల్ ధర 68.5 డాలర్ల వద్ద ఉండగా.. రానున్న నెలల్లోనూ 65 డాలర్ల స్థాయిలో స్థిరంగా కొనసాగొచ్చని మంత్రి పురి అభిప్రాయపడ్డారు. పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని 20 శాతం మించి పెంచే విషయమై నీతి ఆయోగ్ అధ్వర్యంలో పరిశ్రమల ప్రతినిధులతో చర్చిస్తున్నట్టు చెప్పారు. మరోవైపు రష్యా సరఫరా నిలిచిపోతే ఉక్రెయిన్–రష్యా సంక్షోభం ముందు నాటి విధానానికి (పూర్వపు సరఫరా చైన్‌కు) మళ్లుతామని ఐవోసీ చైర్మన్ ఏఎస్ సాహ్నే ఇదే కార్యక్రమంలో భాగంగా స్పష్టం చేశారు. -
10 రోజుల్లో ‘అణు’ పరిమితిని దాటేస్తాం
టెహ్రాన్: అమెరికా ఆర్థిక ఆంక్షలు కుంగదీస్తున్న వేళ ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. అణుఒప్పందం ప్రకారం 300 కేజీలకు మించి యురేనియంను శుద్ధి చేయరాదన్న పరిమితిని ఉల్లంఘిస్తామని యూరప్ దేశాలను హెచ్చరించింది. రాబోయే 10 రోజుల్లో ఈ లక్ష్యాన్ని దాటేస్తామని ఇరాన్ అణుశక్తి సంస్థ అధికార ప్రతినిధి బెహ్రౌజ్ కమల్వాండీ తెలిపారు. యూరప్ దేశాలు మౌనం వహిస్తే, ఇదే పరిస్థితి కొనసాగితే అసలు అణు ఒప్పందం అనేదే ఉండదని తేల్చిచెప్పారు. ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించిన నేపథ్యంలో పరిష్కారం కనుగొనకుండా యూరప్ దేశాలు మౌనం వహించడంపై ఆయన అసహనం వ్యక్తంచేశారు. సాధారణంగా అణుఇంధన రియాక్టర్లలో 20 శాతం వరకూ శుద్ధిచేసిన యురేనియంను వాడతారు. 85 శాతం, అంతకంటే ఎక్కువగా శుద్ధిచేసిన యురేనియంను అణ్వాయుధాల తయారీకి వినియోగిస్తారు. 2015లో అమెరికా, రష్యా, చైనా, జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు ఇరాన్‌తో అణు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీనిప్రకారం ఇరాన్‌పై ఆంక్షలను ఎత్తివేశారు. ప్రతిగా 3.67 శాతం శుద్ధిచేసిన 300 కేజీల యురేనియంను మాత్రమే ఇరాన్ నిల్వ చేసుకోవాల్సి ఉంటుంది. -
మళ్లీ అణ్వస్త్రాల తయారీని ప్రారంభిస్తాం
సియోల్: అమెరికా, ఉత్తరకొరియాల మధ్య ప్రారంభమైన శాంతిచర్చలకు బీటలు వారుతున్నాయి. తమపై విధించిన తీవ్రమైన ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయకుంటే మళ్లీ అణ్వస్త్రాల తయారీని ప్రారంభిస్తామని ఉ.కొరియా అమెరికాను హెచ్చరించింది. ఇప్పటికైనా అమెరికా తన నిర్ణయాన్ని మార్చుకోవాలని సూచించింది. ఈ మేరకు ఉ.కొరియా విదేశాంగ శాఖ చెప్పినట్లు అధికారిక వార్తాసంస్థ కేఎన్సీఏ తెలిపింది. ఉ.కొరియాను అభివృద్ధి పథంలో నడిపేదిశగా ఆ దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ అణు, క్షిపణి పరీక్షలను 2018, ఏప్రిల్‌లో నిలిపివేశారు. ఇక సోషలిస్టు ఆర్థిక వ్యవస్థ నిర్మాణంపై దృష్టి సారిస్తామని ప్రకటించారు. అందులో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఆరు నెలల క్రితం సింగపూర్‌లోని ఓ హోటల్లో సమావేశమై కొరియా ద్వీపకల్పం లో శాంతిస్థాపనపై చర్చించారు. పరస్పరం విశ్వాసం నెలకొల్పడం భాగంగా పంగ్యే–రీ అణు పరీక్షా కేంద్రాన్ని సైతం ధ్వంసం చేశారు. అయితే పూర్తిస్థాయిలో అణ్వస్త్రాలను త్యజించేవరకూ ఆంక్షలను ఎత్తివేయబోమని అమెరికా స్పష్టం చేయడంతో కిమ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అమెరికా తీరు గ్యాంగ్‌స్టర్ తరహాలో ఉందన్నారు. తాజాగా ఆర్థిక ఆంక్షల ను ఎత్తివేయకుంటే అణు కార్యక్రమం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేశారు. -
సిరియాపై అమెరికా మరిన్ని ఆంక్షలు!
యోచిస్తున్న ట్రంప్ ప్రభుత్వం వాషింగ్టన్: సిరియాపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు అమెరికా సిద్ధమవుతున్నట్లు ఆ దేశ కీలక అధికారులు తెలిపారు. ఈ మేరకు శనివారం ఫ్లోరిడాలోని అధ్యక్షుడు ట్రంప్ గోల్ఫ్ రిసార్టులో ట్రెజరీ కార్యదర్శి స్టీవ్ ఎంనుచిన్ ఒక ప్రకటన చేశారు. ‘సిరియాలో జరుగుతున్న పరిణామాలకు మేమెంత ప్రాధాన్యమిస్తున్నామో తెలిసేలా అదనపు ఆంక్షలుంటాయి. ఇతరులు ఆ దేశంతో వ్యాపారం చేయకుండా నిరోధించేలా అవి ఉంటాయి’ అని ఆయన అన్నారు. ఆంక్షలు, ఇతర ఆర్థిక వ్యవహారాల నిఘాకు సంబంధించి ట్రెజరీ విభాగానికి కీలకాధికారాలున్నాయని వెల్లడించారు. మరోవైపు, విషదాడులకు ప్రతిగా ఆమెరికా చేపట్టిన సైనిక చర్య వల్ల సిరియాకు చెందిన సుమారు 20 శాతం వాయుసేన విమానాలు, ఇతర మౌలిక వసతులు తుడిచిపెట్టుకుపోయాయని యూఎస్ వాణిజ్య మంత్రి విల్బర్ రాస్ అన్నారు. సిరియాపై చేసిన ఆర్మీ ఆపరేషన్ విజయవంతమైందని అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్ పేర్కొన్నారు. ఈ దాడిలో సిరియా రన్‌వేలకు ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు. సిరియా ఎయిర్‌బేస్ పనిచేయకుండా చేసేందుకే దాన్ని లక్ష్యంగా ఎంచుకున్నామని, దీంతో శనివారం నుంచి అక్కడ అన్ని కార్యకలాపాలు నిలిచిపోయాయని వెల్లడించారు. -
ఉత్తర కొరియాపై అమెరికా తాజా ఆంక్షలు
వాషింగ్టన్ : ఉత్తర కొరియాపై అమెరికా తాజాగా మరిన్ని ఆర్థిక ఆంక్షలు విధించింది. సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థపై సైబర్ దాడులకు ఉత్తర కొరియా ప్రభుత్వ మద్దతు ఉందని అమెరికా తెలిపింది. ఉద్దేశపూర్వకంగా ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నందున ఉత్తర కొరియాకు చెందిన మూడు సంస్థలు, పదిమంది వ్యక్తులపై ఆంక్షలు విధిస్తున్నట్టు అమెరికా పేర్కొంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై శుక్రవారం అమెరికా అధ్యక్షుడు ఒబామా సంతకం చేశారని వైట్ హౌస్ ప్రెస్ కార్యదర్శి జోష్ ఎర్నెస్ట్ ఒక ప్రకటనలో తెలిపారు. అమెరికా కంపెనీ ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతీసేలా, కళాకారులను బెదిరించేలా ఉత్తర కొరియా చర్యలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. -
అన్నింటా ఏపీ సర్కారు ఆంక్షలు
హైదరాబాద్: సర్కారు ప్రాధాన్యత ఇస్తున్న అభివృద్ధి పథకాలకు అవసరమైన నిధుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక ఆంక్షలు విధించనుంది. పలు శాఖల్లో వివిధ రంగాల వ్యయంపై అనేకరకాల ఆంక్షలను విధిస్తూ ఆర్థిక శాఖ త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది. మంత్రులకు కూడా ఈ ఆంక్షలు వర్తించనున్నారుు. మంత్రులైనా, అధికారులైనా విమానాల్లో ఇకపై ఎకానమీ క్లాస్‌లోనే ప్రయాణించాలని ఆదేశించనున్నారు. వీలైనంత మేర ప్రణాళికేతర వ్యయాన్ని తగ్గించాల్సిందిగా ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శాఖ అధికారులను ఆదేశించారు. ప్రణాళికేతర వ్యయం తగ్గింపు, పొదుపు చర్యలపై మంత్రి మంగళవారం అధికారులతో సమీక్షించారు. పొదుపు చర్యల్లో భాగంగా తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఈ మేరకు అధికారులు చేసిన ప్రతిపాదనలకు యనమల ఆమోదం తెలిపారు. ముఖ్యమంత్రి ఆమోదం లభించగానే ఆర్థిక శాఖ ఆంక్షల ఉత్తర్వులను జారీ చేయనుంది. కొత్తగా ఔట్ సోర్సింగ్ నియామకాలు చేపట్టరాదని, వీలైతే ఉన్న ఔట్సోర్సింగ్ సిబ్బందిని కూడా తగ్గించేయాలనే నిర్ణయం తీసుకున్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ సంస్థలకు ఈ ఆంక్షలు వర్తింప చేయనున్నారు.


