
ఇతర దేశాల నుంచి చమురు సరఫరా
కేంద్ర పెట్రోలియం మంత్రి పురి
న్యూఢిల్లీ: రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై అమెరికా ఆర్థిక ఆంక్షల రిస్క్ ను కేంద్రం తోసిపుచ్చింది. రష్యా దిగుమతుల విషయంలో ఏవైనా సమస్యలు ఎదురైతే, ఇతర దేశాల నుంచి ముడి చమురు సరఫరాతో అధిగమిస్తామని పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి తెలిపారు. దేశ చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతుల రూపంలోనే సమకూరుతోంది. సాధారణంగా మధ్యప్రాచ్యం నుంచి భారత్‌కు ముడి చమురు సరఫరా అధికంగా అవుతుండేది.
ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత నుంచి మారిన పరిణామాలతో గత మూడేళ్లుగా రష్యా ప్రధాన సరఫరాదారుగా మారిపోయింది. పాశ్చాత్య దేశాలు కొనుగోళ్లు తగ్గించడంతో భారత్ తదితర దేశాలకు రష్యా తక్కువ ధరకే చమురు సరఫరా చేస్తోంది. దీంతో భారత రిఫైనరీలు రష్యా ముడి చమురు దిగుమతుల వైపు మళ్లాయి. ఇప్పుడు మొత్తం దిగుమతుల్లో 40 శాతం రష్యా నుంచే ఉంటున్నాయి.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి పురి దీనిపై మాట్లాడారు. చమురు సరఫరా మార్కెట్లోకి ఇటీవలి కాలంలో గయానా తదితర కొత్త సరఫరాదారులు ప్రవేశించగా, ఇప్పటికే ఉన్న బ్రెజిల్, కెనడాలు సరఫరాను పెంచినట్టు చెప్పారు. గతంతో పోల్చిచూస్తే భారత్ ముడి చమురు సరఫరాలు వైవిధ్యంగా మారినట్టు తెలిపారు. సాధారణంగా 27 దేశాల నుంచి చమురును కొనుగోలు చేస్తుండగా, ఇప్పుడు ఆ సంఖ్య 40కు చేరినట్టు తెలిపారు.
స్థిరంగానే చమురు ధరలు
ముడి చమురు ధర ప్రస్తుతం బ్యారెల్ ధర 68.5 డాలర్ల వద్ద ఉండగా.. రానున్న నెలల్లోనూ 65 డాలర్ల స్థాయిలో స్థిరంగా కొనసాగొచ్చని మంత్రి పురి అభిప్రాయపడ్డారు. పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని 20 శాతం మించి పెంచే విషయమై నీతి ఆయోగ్ అధ్వర్యంలో పరిశ్రమల ప్రతినిధులతో చర్చిస్తున్నట్టు చెప్పారు. మరోవైపు రష్యా సరఫరా నిలిచిపోతే ఉక్రెయిన్–రష్యా సంక్షోభం ముందు నాటి విధానానికి (పూర్వపు సరఫరా చైన్‌కు) మళ్లుతామని ఐవోసీ చైర్మన్ ఏఎస్ సాహ్నే ఇదే కార్యక్రమంలో భాగంగా స్పష్టం చేశారు.