చమురు సమస్యకు చాన్స్‌ లేదు | India has 25 days of crude oil in reserve and 25 days of petrol | Sakshi
Sakshi News home page

చమురు సమస్యకు చాన్స్‌ లేదు

Mar 4 2026 5:27 AM | Updated on Mar 4 2026 1:03 PM

India has 25 days of crude oil in reserve and 25 days of petrol

భారత్‌ వద్ద తగినన్ని నిల్వలు

6–8 వారాలకు సరిపడేంతగా ఉన్నాయి

ఇరాన్‌ పరిణామాలపై కేంద్రం వివరణ

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో స్వల్పకాలికంగా ఇంధనాల సరఫరాలో ఆటంకాలేర్పడినా భారత్‌కి ఇబ్బందేమీ ఉండదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మన దగ్గర 6–8 వారాల డిమాండ్‌కి సరిపడేంతగా పెట్రోల్, డీజిల్, ఇతర ఇంధనాల నిల్వలు ఉన్నాయని వివరించాయి. ప్రభుత్వం రోజువారీగా, ప్రతి గంటకు పరిస్థితిని సమీక్షిస్తోందని చమురు శాఖ అధికారి ఒకరు తెలిపారు. వారం పది రోజుల్లో ఈ సంక్షోభం ముగిసిపోయే అవకాశం ఉందనే అంచనాలు నెలకొన్నట్లు వివరించారు. దేశీయంగా 25 రోజులకు సరిపడే స్థాయిలో క్రూడాయిల్, ఇంధనాల నిల్వలు ఉన్నాయని, ఒకవేళ సంక్షోభం మరింత కాలం కొనసాగినా దాదాపు అంతే కాలానికి సరిపడేంతగా ఆయిల్‌ సరఫరా అమెరికా, రష్యా మొదలైన దేశాల నుంచి వస్తోందని పేర్కొన్నారు. దేశీయంగా వైజాగ్, మంగళూరు, పాదూర్‌ నిల్వ కేంద్రాల్లో 100 మిలియన్‌ బ్యారెళ్ల పెట్రోలియం రిజర్వ్‌లు ఉన్నాయి. 

ధరలు పెరిగితే దిగుమతుల బిల్లులు భారం .. 
తక్షణమైతే ఇంధనాలకు కొరత ఏర్పడకపోవచ్చు కానీ క్రూడాయిల్‌ ధరలు, రవాణా.. బీమా వ్యయాలు పెరగడమనేది భారత దిగుమతుల బిల్లు, ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారి చెప్పారు. అంతర్జాతీయంగా ప్రామాణికమైన బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర ఇరాన్‌ సంక్షోభం మొదలైనప్పటి నుంచి సుమారు 10 శాతం పెరిగి బ్యారెల్‌కి 80 డాలర్ల స్థాయిని దాటింది. 2025 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత్‌ క్రూడాయిల్‌ దిగుమతుల కోసం 137 బిలియన్‌ డాలర్లు వెచ్చించింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల్లో 206.3 మిలియన్‌ టన్నుల క్రూడాయిల్‌ దిగుమతుల కోసం 100.4 బిలియన్‌ డాలర్లు వెచ్చించింది.  

మరోవైపు, పశ్చిమాసియాలో అనిశ్చితుల వల్ల స్వల్పకాలికంగా తలెత్తే సవాళ్లను పరిష్కరించుకునేలా దేశీయంగా పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం (ఏటీఎఫ్‌) సహా కీలక పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు పుష్కలంగా ఉన్నట్లు కేంద్ర చమురు శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి చెప్పారు. దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా, నిల్వలను నిరంతరం సమీక్షించేందుకు ఆయిల్‌ శాఖ  ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇది వారంలో ఏడు రోజులూ, ఇరవై నాలుగు గంటలు పని చేస్తుందని చెప్పారు. అత్యధికంగా చమురును దిగుమతి చేసుకునే దేశాల జాబితాలో భారత్‌ మూడో స్థానంలో, రిఫైనింగ్‌లో నాలుగో స్థానంలో, పెట్రోలియం ప్రొడక్టుల ఎగుమతుల్లో అయిదో స్థానంలో ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement