హార్మూజ్‌ హీట్‌.. ఎగుమతులకు షాక్‌ | Energy prices surge as war rattles supply | Sakshi
Sakshi News home page

హార్మూజ్‌ హీట్‌.. ఎగుమతులకు షాక్‌

Mar 4 2026 5:15 AM | Updated on Mar 4 2026 5:17 AM

Energy prices surge as war rattles supply

పన్ను రీయింబర్స్‌మెంట్‌ రేట్లు తగ్గించొద్దు 

నిలిచిపోయిన సరుకుపై అదనపు చార్జీలు వద్దు 

కస్టమ్స్‌ అనుమతులను వేగవంతం చేయాలి 

ఎగుమతిదారుల డిమాండ్‌ 

అండగా ఉంటామన్న కేంద్రం 

ఎగమతిదారులు, లాజిస్టిక్స్‌ సంస్థలతో చర్చలు

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఇరాన్‌–ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధ పరిస్థితులతో భారత వాణిజ్యంపై అనిశ్చితులు నెలకొన్నాయి. దేశ వాణిజ్యం (ఎగుమతులు–దిగుమతులు)పై ఏ మేర కు ప్రభావం పడుతుందో తెలుసుకునేందుకు ఎగుమతిదారులు, లాజిస్టిక్స్‌ భాగస్వాములతో కేంద్ర వాణిజ్య శాఖ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఎగుమతిదారులు ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు పెట్టారు. రెమిషన్‌ ఆఫ్‌ డ్యూటీస్‌ అండ్‌ ట్యాక్సెస్‌ (రాడ్‌టెప్‌) పథకం కింద.. ఎగుమతిదారుల రవాణా వ్యయాలపై ఇప్పటి వరకు అధిక శాతం రీయింబర్స్‌మెంట్‌ సదుపాయం ఉండేది.

దీన్ని ఇటీవలే సగానికి తగ్గించడం గమనార్హం. అలా చేయకుండా ఇంతకుముందు మాదిరే అధిక రేట్లను అమలు చేయాలని ఎగుమతిదారులు డిమాండ్‌ చేశారు. యుద్ధం పేరుతో సరుకు రవాణాపై ఇన్సూరెన్స్‌ ప్రీమియంలు పెంచకుండా ఎక్స్‌పోర్ట్‌ క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాను (ఈసీజీసీ)ను ఆదేశించాలని, మరిన్ని ఉత్పత్తులను బీమా కవరేజీలో చేర్చాలని కోరారు. ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈలపై ప్రభావం తగ్గించే చర్యలు అవసరమని సూచించారు.

సరుకు రవాణాపై స్పష్టత ఉండాలని, అనవసర జాప్యాన్ని నివారించాలని, డాక్యుమెంటేషన్‌ ప్రక్రియ సాఫీగా, సజావుగా ఉండాలని ఎగుమతిదారులు కోరారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌–అమెరికా సంయుక్త సైనిక చర్యలు చేపట్టడం, ప్రతిగా ఇరాన్‌ పశ్చిమాసియా వ్యాప్తంగా ఉన్న అమెరికా ఎయిర్‌బేస్‌లపై దాడులు చేస్తుండడం తెలిసిందే. అంతేకాదు హార్మూజ్‌ జలసంధిని ఇరాన్‌ మూసివేసింది. ప్రపంచ చమురు రవాణాలో 15 శాతం, గ్యాస్‌ సరఫరాలో 20 శాతం రవాణాకు ఈ మార్గమే ఆధారం. ముడి చమురు ఇప్పటికే బ్యారెల్‌ 85 డాలర్లకు పెరిగిపోవడం గమనార్హం.  

పోటీతత్వానికి గండి 
హార్మూజ్‌ జలసంధిని మూసివేయడం వల్ల చమురు వాణిజ్యంపై ప్రభావం పడి ధరల పెరుగుదలకు దారితీస్తుందని ఎగుమతిదారు లు ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల తమకు వ్యయాలు పెరిగిపోతాయని.. దీంతో భారత వస్తువుల పోటీతత్వం తగ్గిపోతుందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. విమాన రాకపోకల అంతరాయం వల్ల ఎయిర్‌పోర్టుల్లో నిలిచిపోయిన సరుకుపై అదనపు చార్జీలు రద్దు చేయాలని అప్పారెల్‌ ఎక్స్‌పోర్టర్స్‌ కౌన్సిల్‌ ఏఈపీసీ కోరింది.

ఎగుమతులపై ప్రభావం.. 
దేశ ఎగుమతుల్లో సుమారు 15 శాతం విమానాల ద్వారానే జరుగుతుంటాయి. పశ్చిమాసియా వ్యాప్తంగా పలు దేశాలు గగనతలాలను మూసివేయడం వల్ల పండ్లు, కూరగాయలు, ఆభరణాల రవాణా భారంగా మారనుంది.

ఎంఎస్‌ఎంఈలకు భరోసా..
పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని వాణిజ్య శాఖ పేర్కొంది. భారత ఎగుమతులు, దిగుమతులు స్థిరంగా కొనసాగించేందుకు (సరఫరా వ్యవస్థ).. ఎగమతిదారులు, ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని ప్రభుత్వం హామీ ఇచి్చంది. కస్టమ్స్‌ అనుమతులు, చెల్లింపులను వేగవంతం చేసేందుకు ప్రత్యేక సమన్వయ యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. దేశ ఉత్పత్తికి అవసరమైన కీలక దిగుమతులపై ఎలాంటి తీవ్ర ప్రభావం లేదని స్పష్టం చేసింది. త్వరగా పాడయ్యే వస్తువులు, ఫార్మాస్యూటికల్స్, అధిక విలువ కలిగిన తయారీ ఉత్పత్తుల ఎగుమతులు సాఫీగా సాగేందుకు ఉన్న మార్గాలపైనా చర్చించినట్టు తెలిపింది. 

క్రూడ్‌ కల్లోలం.. గ్లోబల్‌ మార్కెట్లు కుదేల్‌

డోజోన్స్‌ 1,200 పాయింట్లు డౌన్‌
చమురు ధరలు భగభగ
అమెరికా, ఇజ్రాయెల్‌–ఇరాన్‌ మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతుండటం అంతర్జాతీయ మార్కెట్లను కుదిపేస్తోంది. ప్రధానంగా చమురు, సహజ వాయువు, పెట్రోలియం ఆధారిత ఇంధనాలను గణనీయంగా ఉపయోగించే దేశాల స్టాక్‌ మార్కెట్లు, కంపెనీలను కుదేలు చేస్తోంది. ఒక దశలో అమెరికాలో కీలకమైన సూచీలైన డోజోన్స్‌ 2.5 శాతం (1,232 పాయింట్లు), నాస్‌డాక్‌ 2.7 శాతం మేర క్షీణించాయి. ఎస్‌అండ్‌పీ 500లోని 95 శాతం స్టాక్స్‌ నష్టపోవడం గమనార్హం. పెరిగే ఇంధన భారం, ఫ్లయిట్ల రద్దుపరమైన సవాళ్లతో అమెరికాలో యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ షేరు 5.4 శాతం, అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ 5.8 శాతం పతనమయ్యాయి.

అటు ఆసియా, యూరప్‌ సూచీలు కూడా తగ్గాయి. దక్షిణ కొరియా కోస్పి స్టాక్‌ ఇండెక్స్‌ ఏకంగా 7.2 శాతం పతనమైంది. ఆరు నెలలకు పైగా సరిపడే ఆయిల్‌ నిల్వలున్నప్పటికీ జపాన్‌ నికాయ్‌ 225 సుమారు 3 శాతం క్షీణించగా, జర్మనీకి చెందిన డాక్స్‌ సూచీ 3.9 శాతం పతనమైంది.  మంగళవారం హోలీ సందర్భంగా సెలవు కావడంతో దేశీ మార్కెట్లు పనిచేయలేదు. గ్లోబల్‌ మార్కెట్ల ప్రభావంతో బుధవారం (నేడు) గ్యాప్‌ డౌన్‌తో ప్రారంభం కావొచ్చనే అంచనాలు నెలకొన్నాయి.  

ఆయిల్‌ అప్‌.. గోల్డ్‌ డౌన్‌..: అంతర్జాతీయంగా ప్రామాణికమైన బ్రెంట్‌ క్రూడాయిల్‌ రేటు బ్యారెల్‌కి 7% పైగా పెరిగి 83.33 డాలర్ల వద్ద, నైమెక్స్‌ 7.5 శాతం పెరిగి 76.60 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. మరోవైపు, ఔన్సు (31.1 గ్రాముల) పసిడి 3 శాతం పైగా నష్టపోయి 5,133 డాలర్ల వద్ద, సిల్వర్‌ 6 శాతం పైగా క్షీణించి 83.42 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement