చిక్కుల్లో చమురు జీవనాడి  | Satellite images reveal massive tanker jam in Strait of Hormuz | Sakshi
Sakshi News home page

చిక్కుల్లో చమురు జీవనాడి 

Mar 3 2026 5:00 AM | Updated on Mar 3 2026 5:00 AM

Satellite images reveal massive tanker jam in Strait of Hormuz

హార్మూజ్‌ వద్ద ‘సిగ్నల్స్‌ జామ్‌’ 

‘దిక్కు’తోచని చమురు నౌకలు 

గందరగోళంలో 1,100 ట్యాంకర్లు! 

పూర్తిగా నెమ్మదించిపోయిన రవాణా 

అంతర్జాతీయ చమురు సరఫరాల్లో 20 శాతం ఇక్కడినుంచే 

భారత్‌ సహా పలు దేశాలపై తీవ్ర ప్రభావం

ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం అంతర్జాతీయంగా చమురు సరఫరాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇరాన్, ఒమన్‌ మధ్య ఉండే హార్మూజ్‌ జలసంధి ప్రపంచంలోనే అత్యంత బిజీ చమురు మార్గం. అంతర్జాతీయ చమురు సరఫరాలకు ఇది అత్యంత కీలకం. మొత్తం రోజువారీ చమురు, సహజవాయు సరఫరాల్లో 20 శాతం దీనిగుండానే జరుగుతూ ఉంటుంది. యుద్ధం దెబ్బకు ఇప్పుడక్కడ చమురు నౌకల రాకపోకలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి.

 ముఖ్యంగా సిగ్నల్స్‌ జామ్‌ అవుతుండటంతో మూడు రోజులుగా నౌకలు దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. దాంతో భారత్‌తో పాటు పలు దేశాలకు చమురు ఇక్కట్లు తలెత్తుతున్న పరిస్థితి! దీనికి తోడు ఇరాన్‌ దాడుల కారణంగా సౌదీ అరేబియా కూడా తాజాగా చమురు ఉత్పత్తిని భారీగా తగ్గించడం మూలిగే నక్కపై తాటిపండు చందంగా మారింది. ఈ పరిణామాలతో చమురు ధరలకు కూడా రెక్కలొస్తున్నాయి. 

ఇరుకైన మార్గం 
హార్మూజ్‌ జలసంధి పర్షియన్‌ గల్ఫ్‌ను అరేబియా సముద్రంతో అనుసంధానిస్తుంది. సౌదీ అరేబియాతో పాటు పశి్చమాసియాలోని ఇరాన్, ఇరాక్‌ తదితర దేశాల చమురు, ఖతర్, యూఏఈ ఉత్పత్తి చేసే సహజ వాయువు రవాణాకు హార్మూజ్‌ ఏకైక మార్గం. దీనిగుండా ఒక్కో నౌక వెళ్లడానికి అత్యంత ఇరుకైన మార్గాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. దాంతో జలసంధిని దాటేదాకా అవి అత్యంత జాగరూకంగా ఉండాల్సిందే. 

ఇజ్రాయెల్‌–అమెరికా, ఇరాన్‌ దాడులను కాచుకునే క్రమంలో పరస్పరం జీపీఎస్‌ జామింగ్, సిగ్నల్‌ స్పూఫింగ్‌కు దిగుతున్నాయి. దాంతో ఈ ప్రాంతమంతా ఎల్రక్టానిక్‌ యుద్దక్షేత్రంగా మారిపోయింది. ఇది నౌకల సిగ్నలింగ్‌ వ్యవస్థలనూ ప్రభావితం చేస్తోంది. దాంతో అవి తీవ్ర గందరగోళానికి గురవుతున్నాయి. తమ నావిగేషన్‌ వ్యవస్థలు తప్పుడు పొజిషన్లను చూపుతున్నట్టు నౌకల కెపె్టన్లు వాపోతున్నారు. ఈ డిజిటల్‌ బ్లాకౌట్‌ దెబ్బకు హార్మూజ్‌ వద్ద ఏకంగా 1,100కు పైగా చమురు నౌకలు ఇరుక్కుపోయినట్టు ఉపగ్రహ చిత్రాలను బట్టి వెల్లడవుతోంది.   

ఎలక్ట్రానిక్‌ బ్లాకౌట్‌ 
నౌకలు తమ ప్రయా ణానికి ప్రధానంగా గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టం (జీపీఎస్‌), ఆటోమేటిక్‌ ఐడెంటిఫికేషన్‌ సిస్టం (ఏఐఎస్‌)లపై ఆధారపడతాయి. ఇతర నౌకల పొజిషన్‌ను కూడా ఆ వ్యవస్థల ద్వారానే తెలుసుకుంటాయి. హార్మూజ్, పరిసర ప్రాంతాల్లో ఈ సిగ్నళ్లు రెండువైపులా దాడికి లోనవుతున్నాయి. మొదటిది జామింగ్‌. దీనివల్ల ఉపగ్రహాల సిగ్నళ్లు బలహీనమో, నిర్వీర్యమో అయిపోతున్నాయి. 

రెండోది స్పూఫింగ్‌. దీనిద్వారా నౌకల నావిగేషన్‌ కంప్యూటర్లు తప్పుడు కో ఆర్డినేట్స్‌ చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్‌ సైన్యం వాడుతున్న దేశీయ కోబ్రా వీ8, సయ్యద్‌–4 ఎల్రక్టానిక్‌ యుద్ధ వ్యవస్థలు 250 కి.మీ. పరిధిలోని ఉపగ్రహ సిగ్నల్స్‌ను పూర్తిగా గందరగోళపరుస్తున్నాయి. తద్వారా తమ యుద్ధనౌకలను అమెరికా, ఇరాన్‌ బారినుంచి కాపాడుకోవడం ఇరాన్‌ లక్ష్యం. అయితే ఎల్రక్టానిక్‌ బ్లాకౌట్‌ ప్రభావం చమురు నౌకలపైనా తీవ్రంగా పడుతోంది.

 బ్లాకౌట్‌ను అధిగమించి హార్మూజ్‌ జలసంధిని సురక్షితంగా దాటడం వాటికి దాదాపుగా అసాధ్యంగా మారుతోంది. గుడ్డిగా ముందుకెళ్తే నౌకలు పరస్పరం ఢీకొనే ప్రమాదం పొంచి ఉండటంతో ఆపరేటర్లు రిస్కు తీసుకోవడం లేదు. దాంతో జపాన్, దక్షిణ కొరియా, భారత్, చైనా వెళ్లాల్సిన చమురు నౌకలు పదుల సంఖ్యలో లంగరు వేసి నిలిచిపోయాయి. ప్రత్యామ్నాయ మార్గాలున్నా రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతాయి. పైగా ఆ మార్గాలను ఎంచుకునేందుకు నౌకా సంస్థలు కూడా సిద్ధంగా లేవు. దీనికి తోడు బీమా కంపెనీలు కూడా ఈ మార్గం గుండా సాగే నౌకల బీమా ప్రీమియాన్ని సగటున 50 శాతం దాకా పెంచేస్తున్నాయి! అంతేగాక యుద్ధం తాలూకు రిసు్కకు కవరేజీని నిరాకరిస్తున్నాయి. 
     
– ­సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement