ట్రంప్‌ ఉక్కుపాదం.. ఇరాన్‌పై ‘ఎకనామిక్‌ డీ-డే’! | Trumps Economic D Day Warn World : Iran Faces Unprecedented Pressure | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ ఉక్కుపాదం.. ఇరాన్‌పై ‘ఎకనామిక్‌ డీ-డే’!

Aug 25 2026 6:50 AM | Updated on Aug 25 2026 6:52 AM

Trumps Economic D Day Warn World : Iran Faces Unprecedented Pressure

వాషింగ్టన్‌: ఆంక్షలు, సైనిక చర్యలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థపై మరో పిడుగు పడింది. మరిన్ని ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఆ దేశానికి వచ్చే ప్రతి ఆదాయ మార్గాన్ని దెబ్బతీయడమే లక్ష్యమని ప్రకటించింది. అంతేకాదు ఆ దేశంతో ఆర్థిక లావాదేవీలు కొనసాగించే ఇతర దేశాలు, సంస్థలకూ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తద్వారా ఆ దేశాన్ని ఒంటరిని చేయాలనే ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది.

ఇరాన్‌కు ఆర్థికంగా సహకరిస్తే అమెరికా ఆంక్షల పరిధిలోకి వస్తారని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్‌ బెసెంట్‌ స్పష్టం చేశారు. సంస్థలు, దేశాలపై ఇక ఉపేక్ష ఉండదని బెసెంట్‌ తేల్చిచెప్పారు. ఇరాన్‌ తరఫున మనీలాండరింగ్‌కు పాల్పడే ఏ సంస్థ అయినా అమెరికా డాలర్‌ వ్యవస్థ నుంచి తొలగించబడుతుందని హెచ్చరించారు. ‘‘గడియారం తిరగడం ఇప్పుడే మొదలైంది’’ అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇరాన్‌ పాలక వ్యవస్థకు ఆర్థికంగా అండగా నిలిచే వారెవరైనా అమెరికా శక్తిని పరీక్షించేందుకు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు అమెరికా-ఇరాన్‌లలో ఎవరితో సంబంధాలు కొనసాగించాలనే విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు.

‘గ్రే ఏరియాల్లో’ ఇక వ్యాపారాలు కుదరవు
ఇరాన్‌తో ఆర్థిక సంబంధాలను కొనసాగిస్తూ అమెరికా ఆంక్షలను తప్పించుకునే ప్రయత్నాలను ఇక సహించబోమని బెసెంట్‌ స్పష్టం చేశారు. ఇరాన్‌ చమురు విక్రయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని నగదుగా మార్చేందుకు సహకరించే సంస్థలు, లావాదేవీలకు మధ్యవర్తిత్వం వహించే సంస్థలపై కూడా చర్యలు తప్పవన్నారు. ‘‘ఇరాన్‌తో ఎలాంటి ఆర్థిక సంబంధమైనా కొనసాగించడం.. బాధ్యత వహించే వారిని అమెరికా ఆంక్షల పరిధిలోకి తీసుకువస్తుంది’’ అని హెచ్చరించారు.

ఐదు కీలక రంగాలే లక్ష్యం
ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారాలుగా ఉన్న ఐదు కీలక రంగాలపై అమెరికా ప్రత్యేకంగా దృష్టి సారించింది. డిజిటల్‌ ఆస్తులు, సాంకేతికత, బంగారం, విమానయానం, నౌకాయానం రంగాలను లక్ష్యంగా చేసుకుని ఆంక్షలు విధించనున్నట్లు అమెరికా ప్రకటించింది. వీటితోపాటు ఇరాన్‌ చమురు ఆదాయాన్ని అడ్డుకోవడం, ఆ దేశానికి సహకరిస్తున్న సంస్థలు, నౌకలు, వ్యక్తులపై చర్యలు తీసుకోవడం ద్వారా ఆర్థిక మూలాలను తెంచే ప్రయత్నం చేస్తోంది.

తాజా చర్యల్లో ప్రపంచంలోని పలు ప్రాంతాలకు చెందిన సుమారు 60 సంస్థలు, నౌకలు, వ్యక్తులను లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా వెల్లడించింది. ఇరాన్‌కు కీలక వాణిజ్య భాగస్వాములుగా ఉన్న చైనా, టర్కీ, యూఏఈ వంటి దేశాలపై కూడా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.

దేశాధినేతలకు ట్రంప్‌ ఫోన్‌లు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్వయంగా ప్రపంచ దేశాల అధినేతలకు ఫోన్‌ చేసి ఇరాన్‌తో ఆర్థిక సంబంధాలను తెంచుకోవాలని కోరుతున్నారని బెసెంట్‌ తెలిపారు. అమెరికాకు మద్దతు ఇచ్చే దేశాలు భాగస్వామ్య ప్రయోజనాలను పొందుతాయని, ఇరాన్‌తో సంబంధాలు కొనసాగించే దేశాలు ఒంటరితనాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

అయితే ఈ చర్యల వెనుక ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే ప్రమాదం కూడా ఉందని అమెరికా వర్గాలు అంగీకరిస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదని, తప్పిదాలను సరిదిద్దుకునేందుకు దేశాలకు అవకాశం ఇస్తున్నామని బెసెంట్‌ పేర్కొన్నారు.

‘ఆపరేషన్‌ ఎకనామిక్‌ ఔట్‌కాస్ట్‌’
ఇరాన్‌పై చేపట్టిన తాజా ఆర్థిక ఒత్తిడి కార్యక్రమాన్ని అమెరికా ‘‘ఆపరేషన్‌ ఎకనామిక్‌ ఔట్‌కాస్ట్‌’’Operation Economic Outcastగా పేర్కొంది. దీనిని బెసెంట్‌ ‘‘ఎకనామిక్‌ డీ-డే’’గా అభివర్ణించారు. ఇరాన్‌కు వచ్చే అన్ని ఆర్థిక మార్గాలను ఒక్కొక్కటిగా మూసివేసి ఆ దేశాన్ని అంతర్జాతీయంగా ఒంటరిగా చేయడమే లక్ష్యంగా అమెరికా ముందుకు సాగుతున్నట్లు ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.

వెనక్కి తగ్గేదేలే
అమెరికా కొత్త ఆంక్షలపై ఇరాన్‌ తీవ్రంగా స్పందించింది. అమెరికా వద్ద ఇరాన్‌ను ఎదుర్కొనేందుకు కొత్త మార్గాలు లేకపోవడంతోనే పాత ఆంక్షలను పదేపదే అమలు చేస్తోందని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీ విమర్శించారు. అమెరికా ఒత్తిడికి తాము తలొగ్గబోమని స్పష్టం చేశారు.

ఇరాన్‌ ఆర్థిక మంత్రి అలీ మదానీ-జాదే కూడా అమెరికా ప్రకటించిన కొత్త ఆర్థిక ఒత్తిడి కార్యక్రమంపై స్పందించారు. ఆంక్షలు, ఆర్థిక ఒత్తిళ్లు ఇరాన్‌కు కొత్తేమీ కాదని, వాటిని ఎదుర్కొనే సామర్థ్యం తమకు ఉందనే సంకేతాలు ఇచ్చారు.

రియాల్‌ పతనం.. రికార్డు కనిష్ఠానికి
మరోవైపు అమెరికా ఆంక్షలతోపాటు యుద్ధ ప్రభావం ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడుతోంది. ఇరాన్‌ కరెన్సీ రియాల్‌ డాలర్‌తో పోలిస్తే రికార్డు స్థాయిలో పతనమైంది. ఒక డాలర్‌కు సుమారు 20.2 లక్షల రియాల్స్‌ వరకు పడిపోయింది.

యుద్ధానికి ముందే అధిక ద్రవ్యోల్బణం, ప్రతికూల వృద్ధితో ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థ సతమతమవుతోంది. యుద్ధం ప్రారంభమైన తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయి. బియ్యం ధరలు దాదాపు 60 శాతం పెరగగా.. గొడ్డు మాంసం ధరలు 150 శాతానికి పైగా పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి కూడా ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థలో 5 శాతానికి పైగా సంకోచం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.

‘ఇరాన్‌ పూర్తిగా కుప్పకూలుతోంది’
ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇరాన్‌ ఆర్థిక, సైనిక పరిస్థితిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌ ‘‘పూర్తిగా కుప్పకూలుతోంది’’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఆ దేశం ఆర్థిక, సైనిక పరంగా ‘డెత్‌ స్పైరల్‌’లోకి వెళ్తోందని వ్యాఖ్యానించారు.

చమురు.. హర్ముజ్‌పైనే అసలు పోరు
ఇరాన్‌పై అమెరికా ఆర్థిక ఒత్తిడి వెనుక ప్రధాన లక్ష్యం చమురు ఆదాయాన్ని అడ్డుకోవడమే. ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన హర్ముజ్‌ జలసంధిలో పరిస్థితులు ఇప్పటికే తీవ్రంగా దెబ్బతిన్నాయి. అక్కడ నౌకాయానం అంతరాయానికి గురికావడంతో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు, గ్యాస్‌ ధరలపై ఒత్తిడి పెరిగింది.

ఇరాన్‌ చమురు ఎగుమతులను అడ్డుకోవడం ద్వారా ఆ దేశానికి వచ్చే విదేశీ మారకద్రవ్యాన్ని నిలిపివేయాలని అమెరికా భావిస్తోంది. అయితే ఇప్పటివరకు విధించిన ఆంక్షలు, సముద్ర దిగ్బంధనం ఇరాన్‌పై ఒత్తిడి పెంచినా.. రాజకీయంగా ఆశించిన ఫలితాన్ని పూర్తిగా సాధించలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

చర్చల టేబుల్‌పైకి రావాల్సిందే: హెగ్‌సెత్‌
అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్‌సెత్‌ కూడా ఇరాన్‌ ఆర్థిక ఒత్తిడిని ఎక్కువ కాలం తట్టుకోలేదని వ్యాఖ్యానించారు. చివరకు అణు కార్యక్రమంపై చర్చలకు తిరిగి రావడం తప్ప ఇరాన్‌కు మరో మార్గం ఉండదని అన్నారు. అవసరమైతే అమెరికా సైనిక చర్యలకు కూడా వెనుకాడబోదని హెచ్చరించారు.

దీంతో ఇరాన్‌పై అమెరికా వ్యూహం సైనిక చర్యల నుంచి ఆర్థిక యుద్ధం వైపు మరింతగా మళ్లుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. చమురు, డాలర్‌ లావాదేవీలు, నౌకాయానం, బంగారం, సాంకేతిక రంగాలను లక్ష్యంగా చేసుకున్న తాజా ఆంక్షలు ఎంతవరకు ప్రభావం చూపుతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలు కొనసాగించే దేశాలు అమెరికా ఒత్తిడికి ఎలా స్పందిస్తాయన్నదే తదుపరి కీలక పరిణామంగా మారనుంది.

ఇదీ చదవండి: మేం రెడీ.. రెండేళ్లకు సరిపడా!: ఇరాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement