ట్రంప్‌ సర్కార్‌ కొత్త ప్లాన్‌.. భారతీయులకు భారీ షాక్‌? | US Plans Massive Hike In H 1B Visa Fee Indians Brace For Big Impact | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ సర్కార్‌ కొత్త ప్లాన్‌.. భారతీయులకు భారీ షాక్‌?

Aug 25 2026 2:09 AM | Updated on Aug 25 2026 2:11 AM

US Plans Massive Hike In H 1B Visa Fee Indians Brace For Big Impact

అమెరికాలో ఉద్యోగాలు, చదువుల కోసం వెళ్లే భారతీయులకు ట్రంప్‌ ప్రభుత్వం తీసుకురాబోతున్న కొత్త నిబంధనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా H-1B వీసా, F-1 ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) ప్రోగ్రామ్‌లపై భారీ ఫీజులు విధించే ప్రతిపాదనలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ నిబంధన ప్రకారం.. H-1B వీసా ఫీజు ఏకంగా 1,03,265 డాలర్లకు (దాదాపు రూ.98.91 లక్షలు) పెరిగే అవకాశం ఉంది. గతంలో 1 లక్ష డాలర్ల ఫీజును ప్రతిపాదించినప్పటికీ, ఆ నిర్ణయంపై కోర్టులో వివాదం కొనసాగుతోంది.

భారతీయులపై ప్రభావం
ఈ ప్రతిపాదనలు భారతీయులకు చాలా కీలకం. ఎందుకంటే.. అమెరికా H-1B వీసా లబ్ధిదారుల్లో 70 శాతానికి పైగా భారతీయులే ఉన్నారు. 2024లో అమెరికా USCIS సుమారు 3,99,402 H-1B పిటిషన్లను ఆమోదించగా, అందులో ఇండియాలో జన్మించిన వారికి సంబంధించిన లబ్ధిదారుల వాటా దాదాపు 71 శాతంగా ఉంది. అందువల్ల H-1B ఫీజు భారీగా పెరిగితే అమెరికాలో ఉద్యోగాలు చేయాలనుకునే భారతీయ నిపుణులు, వారిని స్పాన్సర్‌ చేసే కంపెనీలపై ఆర్థిక భారం గణనీయంగా పెరగవచ్చు.

OPTపై కూడా భారీ ఫీజు?
H-1Bతో పాటు F-1 విద్యార్థులు చదువు పూర్తయిన తర్వాత అమెరికాలో ఉద్యోగ అనుభవం పొందేందుకు ఉపయోగించే ఓపీటీ కార్యక్రమంపైనా కొత్త ఫీజు విధించే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. ఈ ఫీజు సుమారు 1 లక్ష డాలర్ల వరకు ఉండవచ్చనే అంచనాలు ఉన్నాయి. అయితే అసలు ఫీజు ఎంత, ఎవరికి వర్తిస్తుంది వంటి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఈ ప్రతిపాదన ప్రస్తుతం వైట్‌హౌస్‌ ఆఫీస్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ బడ్జెట్‌ పరిశీలన దశలో ఉన్నట్లు ఇమ్మిగ్రేషన్‌ సంస్థలు చెబుతున్నాయి.

H-1B ఉద్యోగులకు కొత్త రూల్
కొత్త ఫీజులతో పాటు H-1B ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న 60 రోజుల గ్రేస్‌ పీరియడ్‌ను తొలగించే ప్రతిపాదనను కూడా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ తీసుకొచ్చింది. ప్రస్తుతం H-1B ఉద్యోగం కోల్పోయినవారు కొన్ని పరిస్థితుల్లో 60 రోజుల వరకు కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నిబంధన తొలగిస్తే.. ఉద్యోగం ముగిసిన వెంటనే కొత్త మార్గం చూసుకోవాల్సి రావచ్చు. లేదంటే అమెరికాలో ఇమ్మిగ్రేషన్‌ స్టేటస్‌ ఉల్లంఘనకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. ఉద్యోగులపై మాత్రమే కాకుండా వారి డిపెండెంట్లపైనా దీని ప్రభావం పడే అవకాశం ఉంది.

అయితే..ఈ నిబంధనలన్నీ ఇప్పటికీ ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి. తుది నిర్ణయం తీసుకుని అధికారికంగా అమలు చేసే వరకు ఫీజులు లేదా నిబంధనలు ఖరారైనట్లుగా చెప్పలేం. అయినప్పటికీ H-1Bపై ఆధారపడుతున్న భారతీయ టెక్‌ నిపుణులు, అమెరికాలో చదువుతున్న విద్యార్థులు, వారిని నియమించుకునే కంపెనీల్లో ఈ ప్రతిపాదనలు తీవ్ర చర్చకు దారితీశాయి. అమెరికాలో భారతీయ మూలాలున్న వారి సంఖ్య 52 లక్షలకు పైగా ఉండటంతో, ఇమ్మిగ్రేషన్‌ విధానాల్లో వచ్చే మార్పులు భారతీయులపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: దూసుకెళ్తున్న బిట్‌కాయిన్‌.. కారణాలివే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement