పెంపు బాటలో టాటా మోటార్స్, హ్యుందాయ్, ఆడి
ముడిసరుకు రేట్ల పెరుగుదల ఎఫెక్ట్
డిసెంబర్ 1 నుంచి అమల్లోకి...
న్యూఢిల్లీ: పెరిగిపోతున్న ముడిసరుకుల భారం నుంచి మార్జిన్లను కాపాడుకునేందుకు దేశీ దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు మరోసారి రేట్ల పెంపు బాట పట్టాయి. మారుతీ సుజుకీ ఇండియా ఇప్పటికే ధరలను పెంచగా, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (టీఎంపీవీ), హ్యుందాయ్, ఆడి ఇండియా మొదలైనవి కూడా రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించాయి.
మారుతీ సుజుకీ కొన్ని మోడల్స్‌పై నవంబర్ 22 నుంచే నిర్దిష్ట ఫార్ములా ప్రాతిపదికన 0.31 శాతం మేర ధరలను పెంచింది. టాటా మోటార్స్, హ్యుందాయ్ డిసెంబర్ 1 నుంచి ధరల పెంపును అమలు చేయనుండగా, ఆడి కొత్త ధరలు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. తాజాగా పండుగ సీజన్ ముగియగానే కార్ల కంపెనీలు రేట్ల పెంపును ప్రకటించడం గమనార్హం.
మార్జిన్లపై ఒత్తిడి..
కార్ల అమ్మకాలు గణనీయంగా వృద్ధి చెందుతున్నప్పటికీ.. పెరుగుతున్న కమోడిటీలు, ఇతరత్రా ముడిసరుకుల ధరల వల్ల కంపెనీల నిర్వహణ మార్జిన్లు, లాభదాయకతపై ప్రతికూల ప్రభావం పడుతోంది. దీనితో అవి అదనపు భారాన్ని కొద్ది కొద్దిగా కస్టమర్లకు బదలాయిస్తున్నాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మారుతీ సుజుకీ రికార్డు స్థాయిలో విక్రయాలు సాధించినప్పటికీ కన్సాలిడేటెడ్ నికర లాభం 26 శాతం క్షీణించింది. పశి్చమాసియాలో ఉద్రిక్తతల వల్ల ముడిసరుకుల వ్యయాలు పెరగడం ఇందుకు కారణమని సంస్థ తెలిపింది. మారుతీ సుజుకీ ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో మూడు విడతలు రేట్లు పెంచగా, తాజాది అదనం. దీనితో మొత్తం మీద 1 శాతం పైగా ధరలను పెంచినట్లయింది.
టాటా మోటార్స్
టీఎంపీవీ తమ కార్లు, ఎస్‌యూవీల పోర్ట్‌ఫోలియోవ్యాప్తంగా (ఈవీలు సహా) అన్నింటి రేట్లను డిసెంబర్ 1 నుంచి సగటున 0.5 % మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. అధిక స్థాయి ముడిసరుకుల వ్యయాల భారాన్ని పాక్షికంగా తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీనితో ఈ ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 4 సార్లు ధరలు పెంచినట్లవుతుంది. పెట్రోల్, డీజిల్ కార్ల (ఐసీఈ) ధరలను ఏప్రిల్ 1న 0.5% పెంచింది. ఆ తర్వాత ఐసీఈ..ఈవీల రేట్లను జూలై 1న 1.5% వరకు పెంచింది. సెపె్టంబర్ 1న పోర్ట్‌ఫోలియోవ్యాప్తంగా రూ. 25,000 మేర పెంపును చేపట్టింది.
హ్యుందాయ్
ముడి సరుకుల వ్యయాల పెరుగుదల కారణంగా ఎంపిక చేసిన కొన్ని వాహనాల మోడల్స్, వేరియంట్స్‌పై రూ. 8,000 వరకు ధరలను పెంచుతున్నట్లు తెలిపింది. ఇవి డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. తాజా పెంపు కాకుండా, హ్యుందాయ్ ఈ ఏడాది ఇప్పటివరకు 1.4% ధరలను పెంచింది. కమోడిటీల ధరలు పెరగడం కంపెనీ లాభదాయకతపై తీవ్ర ప్రతి కూల ప్రభావం చూపుతోంది.
ఆడి ఇండియా
వివిధ మోడల్స్ ధరలను వచ్చే ఏడాది జనవరి 1 నుంచి రెండు శాతం వరకు పెంచనున్నట్లు ప్రకటించింది. కంపెనీ ఈ ఏడాది ఏప్రిల్ 1నే వివిధ మోడల్స్ ధరలను 2 శాతం వరకు పెంచింది. ప్రస్తుతం ఆడి ఇండియా పోర్ట్‌ఫోలియోలో ఏ4, ఏ6 సెడాన్‌లు, క్యూ3, క్యూ5 తదితర ఎస్‌యూవీ మోడల్స్ ఉన్నాయి.


