రవాణా అవసరాల కోసం ఎలక్ట్రిక్ ట్రక్కులను వినియోగంలోకి తెచ్చే దిశగా ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్, టాటా మోటర్స్ చేతులు కలిపాయి. దీని ప్రకారం అమెజాన్ క్యారియర్ పార్ట్‌నర్లకు టాటా మోటర్స్ 3,000 తేలికపాటి, మీడియం–డ్యూటీ ట్రక్కులను సరఫరా చేయనుంది. వీటిని సదరు భాగస్వామ్య సంస్థలే నిర్వహిస్తాయి. ప్రాథమికంగా పండగ సీజన్ సందర్భంగా ఢిల్లీలో ఈ వాహనాల వినియోగం ప్రారంభించనున్నారు.
మూడేళ్ల వ్యవధిలో మొత్తం అన్ని ట్రక్కులను వినియోగంలోకి తేనున్నట్లు అమెజాన్ వైస్ ప్రెసిడెంట్ అభినవ్ సింగ్ తెలిపారు. తొలి విడత వాహనాలను అందించే కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఇరు సంస్థలను కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి అభినందించారు. సరకు రవాణాకు డిమాండ్ పెరిగే కొద్దీ పర్యావరణహితంగా, ఇంధనాలను ఆదా చేసే రవాణా సాధనాల వినియోగాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాలు, ద్విచక్ర వాహనాల పురోగతి ఆశావహంగా ఉండగా, వాణిజ్య వాహనాల విభాగంలో కూడా విద్యుదీకరణ పెరగడం ముఖ్యమని కుమారస్వామి చెప్పారు. దేశీయంగా ఎలక్ట్రిక్ కమర్షియల్ వాహనాల వినియోగం విస్తృతంగా పెరిగేందుకు ఈ ఒప్పందం దోహదపడగలదని టాటా మోటర్స్ వైస్ ప్రెసిడెంట్ రాజేశ్ కౌల్ తెలిపారు.


