బాలీవుడ్ నటుడు, దురంధర్ ఫేమ్ రణ్‌వీర్ సింగ్ తన లగ్జరీ కార్ల జాబితాలో మరో అత్యాధునిక ఎలక్ట్రిక్ సెడాన్‌ను చేర్చుకున్నారు. జర్మనీకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ బీఎండబ్ల్యూ తయారు చేసిన ఐ7 ఎలక్ట్రిక్ లగ్జరీ కారును ఆయన ఇటీవల డెలివరీ తీసుకున్నారు. ముంబైలోని షోరూమ్ నుంచి కారును తీసుకున్న అనంతరం స్వయంగా నడుపుకుంటూ వెళ్లినట్లు వార్తా కథనాల ద్వారా తెలుస్తుంది. ఈ కొనుగోలు నేపథ్యంలో బీఎండబ్ల్యూ ఐ7 ధర, సాంకేతిక సామర్థ్యాలు, భారత మార్కెట్‌లో ఈ మోడల్‌కు ఉన్న ప్రాధాన్యం చర్చనీయాంశంగా మారాయి.
728 కి.మీ. వరకు ప్రయాణ సామర్థ్యం
బీఎండబ్ల్యూ ఇండియా సెప్టెంబర్ 11, 2026న ప్రకటించిన అధికారిక ధరల ప్రకారం.. ఐ7 50 xDrive ఎం స్పోర్ట్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.1.95 కోట్లు కాగా, అధిక పనితీరు కలిగిన ఐ7 ఎం70 xDrive ధర రూ.2.65 కోట్లు. ఈ ధరలకు రోడ్డు ట్యాక్స్, బీమా, రిజిస్ట్రేషన్ వంటి అదనపు ఖర్చులు వర్తిస్తాయి. ఐ7 50 xDrive ఎం స్పోర్ట్‌లో 449 హెచ్‌పీ పవర్‌ను, 660 ఎన్ఎం టార్క్‌ను అందించే ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ ఉంది. ఇది గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 5.5 సెకన్లలో అందుకోగలదు. 112.5 కిలోవాట్ అవర్ బ్యాటరీతో డబ్ల్యూఎల్‌టీపీ ప్రమాణాల ప్రకారం ఒక్కసారి ఛార్జింగ్‌తో గరిష్ఠంగా 728 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని సంస్థ పేర్కొంది.
కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. వెనుక సీట్లలో ఎగ్జిక్యూటివ్ లాంజ్ సౌకర్యం, వినోదం కోసం పెద్ద స్క్రీన్, ప్రీమియం ఆడియో వ్యవస్థ వంటి ఫీచర్లు ఈ కారును ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. మరోవైపు, ఐ7 ఎం70 xDrive 680 హెచ్‌పీ శక్తితో 3.8 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
భారత్‌లోనే ఐ7 తయారీ
బీఎండబ్ల్యూ అధికారిక ప్రకటన ప్రకారం, ఐ7 తయారీని చెన్నై ప్లాంట్‌లో చేపడుతున్నారు. జర్మనీ వెలుపల ఈ మోడల్ స్థానికంగా తయారవుతున్న ఏకైక దేశంగా భారత్ నిలిచింది. సెప్టెంబర్‌లో కొత్త 7 సిరీస్ ఆవిష్కరణ సందర్భంగా రణ్‌వీర్ సింగ్‌ను బీఎండబ్ల్యూ ఇండియా బ్రాండ్ వాయిస్‌గా పరిచయం చేసింది. ఈ నేపథ్యంలో ఆయన ఐ7 కొనుగోలు వార్తకు మరింత ప్రాధాన్యం లభించింది.
ఇదీ చదవండి: మార్కెట్లను కుదిపేసిన అమ్మకాల ఒత్తిడి


