టూ వీలర్లు, వాణిజ్య వాహనాలకు డిమాండ్
తొలిసారిగా 5 లక్షలు దాటిన ఈవీ అమ్మకాలు
నెమ్మదించిన ప్యాసింజర్ వాహన రిటైల్ విక్రయాలు
ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య గణాంకాలు వెల్లడి
న్యూఢిల్లీ: దేశీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ‘పండుగ సీజన్’ సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ఏడాది 42 రోజుల పండుగ సీజన్‌లో మొత్తం వాహన రిటైల్ అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 2.21% వృద్ధి చెంది ఆల్‌టైమ్ రికార్డు స్థాయిలో 55,25,490 యూనిట్లకు చేరుకున్నాయి. గతేడాది ఇదే పండుగ కాలంలో నమోదైన 54,05,956 యూనిట్లతో పోలిస్తే ఇది అత్యధికం.
ద్విచక్ర వాహనాలు, వాణిజ్య వాహనాలు, విద్యుత్ వాహనాలకు (ఈవీ) బలమైన డిమాండ్ లభించడమే ఈ రికార్డు స్థాయి విక్రయాలకు దోహదపడిందని ఆటోమొబైల్ డీలర్ల సంఘాల సమాఖ్య (ఫాడా) సోమవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ప్యాసింజర్ వాహనాల విభాగం మాత్రం కొంత నెమ్మదించింది. ఈ పండుగ సీజన్‌లో ప్యాసింజర్ వాహన రిటైల్ అమ్మకాలు వార్షికంగా 7.16 శాతం క్షీణించి 7,48,616 యూనిట్లకు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే సమయంలో ఈ విభాగంలో 8,06,322 యూనిట్లు అమ్ముడయ్యాయి.
విభాగాల వారీగా...
ద్విచక్ర వాహనాల రిటైల్ అమ్మకాలు వార్షికంగా 3.67% వృద్ధితో 43,13,276 యూనిట్లకు చేరాయి. త్రిచక్ర వాహన విక్రయాలు 5.32 % పెరిగి 1,93,576 యూనిట్లుగా నమోదయ్యాయి. వాణిజ్య వాహనాల అమ్మకాలు 7.13% పుంజుకుని 1,55,761 యూనిట్లకు చేరాయి. ట్రాక్టర్ల విక్రయాలు 2.24 % వృద్ధితో 1,03,809 యూనిట్లుగా ఉండగా, కన్‌స్ట్రక్షన్ ఎక్విప్‌ట్‌మెంట్ అమ్మకాలు 26.06% ఎగబాకి 10,452 యూనిట్లకు చేరాయి.
ఈవీ అమ్మకాలు @ 5 లక్షల యూనిట్లు
ఈ పండుగ సీజన్‌లో విద్యుత్ వాహనాల (ఈవీ) విక్రయాలు గణనీయంగా పెరగడం విశేషం. ఈవీ రిటైల్ అమ్మకాలు వార్షికంగా 52.62% దూసుకెళ్లి 5,09,667 యూనిట్లకు చేరాయి. ఒకే పండుగ సీజన్‌లో ఈవీ విక్రయాలు అయిదు లక్షల మార్కును దాటడం ఇదే తొలిసారి. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు 61.10 % వృద్ధితో 3,30,846 యూనిట్లకు, ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 72.91 % పెరిగి 52,104 యూనిట్లకు చేరాయి. ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాల అమ్మకాలు 25.45 % వృద్ధితో 1,20,330 యూనిట్లుగా నమోదయ్యాయి. ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాల విక్రయాలు ఏకంగా 154.56 % పెరిగి 6,387 యూనిట్లకు చేరాయి.
రికార్డుపై రికార్డు సాధించిన సీజన్: ఫాడా
భారత ఆటోమొబైల్ రిటైల్ చరిత్రలో 2026 పండుగ సీజన్ ‘రికార్డుపై రికార్డు’ సృష్టించిన ఏడాదిగా నిలిచిపోతుందని ఫాడా అధ్యక్షుడు సాయి గిరిధర్ పేర్కొన్నారు. ‘‘జీఎస్‌టీ 2.0 ప్రభావంతో గతేడాది దసరా, దీపావళి పండుగల సమయంలో విక్రయాలు అసాధారణ స్థాయికి చేరాయి. అయినప్పటికీ, ఈ ఏడాది 42 రోజుల పండుగ సీజన్‌లో అమ్మకాలు 2.21 శాతం వృద్ధితో 55,25,490 యూనిట్లకు చేరడం చరిత్రాత్మకం’’ అన్నారు. ఒక క్యాలెండర్ ఏడాదిలో తొలిసారిగా మూడు కోట్లకు పైగా వాహనాల రిటైల్ విక్రయాల మైలురాయిని భారత్ చేరుకునే దిశగా సాగుతోందని ఫాడా తెలిపింది. ఈ లక్ష్య సాధనకు పండుగ సీజన్ బలమైన పునాది
వేసిందని పేర్కొంది.


