దేశవ్యాప్తంగా పంచాయతీల్లో చార్జింగ్, బ్యాటరీ స్వాపింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళిక
2, 3, 4 చక్రాల వాహనాలతో పాటు భారీ వాహనాలకూ చార్జింగ్
కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ, సీఈఎస్‌ఎల్ ఒప్పందం
దేశంలో ప్రస్తుతం 29,151 పబ్లిక్ ఈవీ చార్జింగ్ కేంద్రాలు
సాక్షి, అమరావతి: ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడంతో పాటు పంచాయతీలకు అదనపు ఆదాయం సమకూర్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు కేంద్రప్రభుత్వం వెల్లడించింది. దేశవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో విద్యుత్ వాహనాల (ఈవీ) చార్జింగ్ కేంద్రాలు, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది.
ఇందుకోసం కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ, కేంద్ర విద్యుత్‌శాఖ పరిధిలోని ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్‌ఎల్) అనుబంధ సంస్థ కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ (సీఈఎస్‌ఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. న్యూఢిల్లీలో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్‌శాఖ సంయుక్త కార్యదర్శి ముక్తా శేఖర్, సీఈఎస్‌ఎల్ సీఈవో అఖిలేశ్‌కుమార్ దీక్షిత్ ఒప్పందపత్రాలపై సంతకాలు చేశారు.
పంచాయతీలకు ఆర్థిక ప్రయోజనం
ఈ ఒప్పందం ద్వారా గ్రామ పంచాయతీలకు చెందిన భూములను దీనికి వినియోగించనున్నారు. పంచాయతీ కార్యాలయాల సమీపంలో, రాష్ట్ర, జాతీయ రహదారుల పక్కన అనువైన స్థలాలను గుర్తిస్తారు. రెండు, మూడు, నాలుగుచక్రాల వాహనాలతో పాటు మధ్యస్థ, భారీ వాహనాలకు కూడా చార్జింగ్ సదుపాయాలు కల్పించనున్నారు. తద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య ఈవీ ప్రయాణాలకు అనుకూలత పెరుగుతుందని కేంద్రం చెబుతోంది.
పూర్తిస్థాయిలో వినియోగంలో లేని పంచాయతీ భూములను ఆదాయ వనరులుగా మార్చుకునే అవకాశం కలుగుతుందని, ఈ కేంద్రాల నిర్వహణ ద్వారా పంచాయతీలకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని కేంద్రం వివరించింది. స్థలాల గుర్తింపు, రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖలతో సమన్వయ బాధ్యతలను సీఈఎస్‌ఎల్ చూస్తుంది. స్థలాల పరిశీలన, డిమాండ్ అంచనా, పరికరాల సరఫరా, ఏర్పాటు, పరీక్షలు, నిర్వహణ చేపడుతుంది.
పెట్రోల్, డీజిల్‌పై ఆధారపడటం తగ్గాలి
ఢిల్లీ, సూరత్, హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో అమలవుతున్న పీఎం ఈ–బస్ సేవా కార్యక్రమంలోను తాము భాగస్వామిగా ఉన్నట్లు సీఈఎస్‌ఎల్ తెలిపింది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు ఈవీ మౌలిక వసతులను విస్తరించడంపై దృష్టిపెట్టినట్లు వెల్లడించింది. ఈ ప్రాజెక్టు ద్వారా కర్బన ఉద్గారాలు తగ్గించడం, గాలి నాణ్యత మెరుగుపరచడం, దిగుమతి చేసుకునే పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించింది. తద్వారా ఉపాధి, స్థానిక ఆర్థిక అవకాశాలు పెరగడంతోపాటు వినియోగదారులకు ప్రయాణ వ్యయం తగ్గుతుందని పేర్కొంది. ఈ ఏడాది ప్రారంభం నాటికే దేశంలో 29,151 పబ్లిక్ ఈవీ చార్జింగ్ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో విస్తరిస్తున్న ఈ సదుపాయాలను గ్రామీణ ప్రాంతాలకు కూడా తీసుకెళ్లాలని కేంద్రం భావిస్తున్నట్లు పేర్కొంది.


