పర్యావరణ పునరుద్ధరణలో ప్రపంచ దేశాలు మందగమనం
2030 నాటికి లక్ష్యం బిలియన్ హెక్టార్లు
ఇప్పటివరకు చేరువైంది 25 శాతమే
ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక వెల్లడి
సాక్షి, అమరావతి: పర్యావరణ వ్యవస్థల పునరుద్ధరణకు ప్రపంచంలోని పలు దేశాలు ప్రకటించిన లక్ష్యాలను చేరుకోవడం లేదు. మొత్తం బిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్ధరించాలని ప్రపంచ దేశాలు లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకు కేవలం 252 మిలియన్ హెక్టార్లు (25.2 శాతం) మాత్రమే పునరుద్ధరణ చర్యల కిందకు వచ్చినట్టు ఐక్యరాజ్య సమితి (యూఎన్) తాజా నివేదిక వెల్లడించింది. 2030 నాటికి నిర్దేశించిన ప్రపంచ జీవవైవిధ్య లక్ష్యాలను చేరుకోవాలంటే.. ప్రస్తుత పునరుద్ధరణ కార్యక్రమాలను మూడు రెట్లు వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని హెచ్చరించింది.
‘నేచర్స్ కమ్‌బ్యాక్–స్కేలింగ్ ఎకో సిస్టమ్ రెస్టొరేషన్ ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్’ పేరుతో ఇటీవల విడుదల చేసిన నివేదికలో కీలక అంశాలను వెల్లడించింది. పర్యావరణ పరిరక్షణలో భూసంబంధిత వ్యవస్థలదే కీలక భూమిక అని పేర్కొంది. వీటితోపాటు మంచినీటి పర్యావరణ వ్యవస్థల పునరుద్ధరణ, సముద్ర, తీర ప్రాంతాల పునరుద్ధరణ కార్యక్రమాలు వేగవంతం కావాలని సూచించింది.
2030 లక్ష్యాలపై ఆందోళన
» ఐక్యరాజ్య సమితి 2021–2030 దశాబ్దాన్ని పర్యావరణ వ్యవస్థల పునరుద్ధరణ దశాబ్దంగా ప్రకటించింది.
» దీని ప్రకారం 2030 నాటికి క్షీణించిన భూభాగాలు, మంచినీటి, సముద్ర, తీర ప్రాంతాల్లో కనీసం 30 శాతం సమర్థవంతమైన పునరుద్ధరణ చేపట్టాల్సి ఉన్నా.. ఆ స్థాయిలో పురోగతి లేదని ఆందోళన వ్యక్తం చేసింది.
» పర్యావరణ పరిరక్షణకు ప్రపంచ దేశాలు లక్ష్యాలు ప్రకటిస్తున్నప్పటికీ అమలు ఆశించిన స్థాయిలో లేదని వెల్లడించింది.
» 2030 నాటికి జీవవైవిధ్య లక్ష్యాలను చేరుకోవాలంటే అడవులతో పాటు నదులు, చిత్తడి నేలలు, సముద్రాలు, మడ అడవుల పునరుద్ధరణకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని యూఎన్ నివేదిక స్పష్టం చేసింది.
పర్యావరణ పునరుద్ధరణతో బహుళ ప్రయోజనాలు
» ప్రపంచంలోని కీలక పర్యావరణ ప్రాంతాల్లో 15 శాతం మేర పునరుద్ధరణ చేపడితే అనేక ప్రయోజనాలు ఉంటాయని నివేదిక అంచనా వేసింది.
» పారిశ్రామిక విప్లవం నుంచి వాతావరణంలో పెరిగిన కార్బన్ డయాక్సైడ్‌లో 30 శాతానికి సమానమైన కార్బన్‌ను గ్రహించే అవకాశం ఉంటుందని పేర్కొంది.
» మరోవైపు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జాతుల్లో 60 శాతం వరకు కాపాడే అవకాశం ఉంటుందని వెల్లడించింది.
» వ్యవసాయ అడవుల పెంపకం ద్వారా 130 కోట్ల మందికి ఆహార భద్రత మెరుగుపడే అవకాశం ఉందని పేర్కొంది.
ఆసియాలో చర్యలు భేష్
ప్రాంతాల వారీగా చూస్తే పర్యావరణ పునరుద్ధరణలో ఆసియా అగ్రస్థానంలో ఉందని వెల్లడించింది. ఈ ప్రాంతంలో సుమారు 185 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణం పునరుద్ధరణ చర్యల కింద ఉన్నట్టు పేర్కొంది. ఆఫ్రికాలో ఈ విస్తీర్ణం 33.7 మిలియన్ హెక్టార్లు కాగా.. చైనా ఒక్కటే 127.4 మిలియన్ హెక్టార్ల పునరుద్ధరణను నమోదు చేసిందని తెలిపింది.


