చీమకుర్తిలో పోలీసుల అరాచకం | Police place YSRCP district president and Darsi MLA Buchepalli under house arrest | Sakshi
Sakshi News home page

చీమకుర్తిలో పోలీసుల అరాచకం

Nov 2 2026 4:51 AM | Updated on Nov 2 2026 4:51 AM

Police place YSRCP district president and Darsi MLA Buchepalli under house arrest

మార్కాపురం జిల్లా గిద్దలూరు యాదవ బజారులో వైఎస్సార్‌ సీపీ అభ్యర్ధులను లాగి పడేస్తున్న పోలీసులు

దొంగ ఓట్లపై అభ్యంతరం చెప్పిన ఏజెంట్లను గెంటేసి టీడీపీ రిగ్గింగ్‌కు సహకారం  

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లిని గృహనిర్బంధం చేసిన పోలీసులు  

చీమకుర్తి 14వ బూత్‌లో రీపోలింగ్‌ జరపాలని బూచేపల్లి, మాజీమంత్రి మేరుగ డిమాండ్‌  

అవకతవకల్ని పరిశీలించి రీపోలింగ్‌కు ఆదేశించిన కలెక్టర్‌  

ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఎన్నికల్లో బరితెగించిన టీడీపీ మూకలు  

గిద్దలూరులో మధ్యాహ్నం నుంచి, మార్కాపురంలో ఉదయం నుంచే యథేచ్ఛగా రిగ్గింగ్‌  

అద్దంకిలో టీడీపీకి అనుమానం ఉన్న బూత్‌లపై ఫోకస్‌ చేసి మరీ దొంగ ఓట్లు  

పచ్చమూకలకు పోలీసులు, ఎన్నికల అధికారుల సహకారం  

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఒంగోలు కార్పొరేషన్, చీమకుర్తి, అద్దంకి, మార్కాపురం, గిద్దలూరు మున్సిపాలిటీల్లో టీడీపీ మూకలు యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడ్డాయి. చీమకుర్తిలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పార్టీ దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డిని గృహ నిర్బంధం చేసిన పోలీసులు.. రిగ్గింగ్‌లో టీడీపీ మూకలకు సహకరించారు. ఇక్కడ పోలీసుల అరాచకానికి అడ్డు, అదుపు లేకుండా పోయింది. శనివారం రాత్రి నుంచే ఎన్నికల చీఫ్‌ ఏజెంట్లను, పోలింగ్‌ ఏజెంట్లను పోలీసులు అదుపులోకి తీసుకుని భయభ్రాంతులకు గురిచేశారు. డీఎస్పీ రాయపాటి శ్రీనివాస్‌ కనుసన్నల్లో పోలీసులు టీడీపీ గూండాలకు అండగా ఉండి రెచ్చిపోయారు. 

ఏజెంట్లుగా కూర్చుంటే కేసులు పెడతామని హెచ్చరించారు. ఉదయం నుంచే 7, 8 బూత్‌లలో పోలీసులే వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను నెట్టేసి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. మధ్యాహ్నం నుంచి ప్రతి బూత్‌లో 100–150 ఓట్లు సైక్లింగ్‌ చేస్తూ దొంగ ఓట్లు వేశారు. దొంగ ఓట్లకు అభ్యంతరం చెప్పిన ఏజెంట్లను పోలీసులే మెడపట్టి గెంటేసి, టీడీపీ రిగ్గింగ్‌కు సహకరించారు. చీమకుర్తి 14వ పోలింగ్‌ బూత్‌లో అవకతవకల్ని అధికారులకు నివేదించిన బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, మాజీ మంత్రి మేరుగ నాగార్జున రీపోలింగ్‌ జరపాలని డిమాండ్‌ చేస్తూ అక్కడ నిరసన చేపట్టారు. అన్ని ఆధారాలు పరిశీలించిన కలెక్టర్‌ రాజాబాబు ఆ పోలింగ్‌ బూత్‌లో రీపోలింగ్‌కు ఆదేశించారు.   

పక్కా ప్రణాళికతో రిగ్గింగ్‌ 
ఒంగోలులో మధ్యాహ్నం ఒంటిగంటకు 39.85 శాతం పోలింగ్‌ జరగగా, సాయంత్రానికి భారీగా పోలింగ్‌ నమోదైంది. మధ్యాహ్నం నుంచి టీడీపీ నేతలు పక్కా ప్రణాళికతో 20 డివిజన్లలో పెద్ద ఎత్తున్న రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. గిద్దలూరు, మార్కాపురం, అద్దంకి మున్సిపాలిటీల్లోను ఇదేవిధంగా టీడీపీ శ్రేణులు రిగ్గింగ్‌ చేశాయి. అద్దంకిలో సీఐ ఏడుకొండలు, ఎస్‌ఐ రామకృష్ణ పోలింగ్‌ బూత్‌ల వద్ద ఓవరాక్షన్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను ఇబ్బంది పెట్టేలా ప్రవర్తిస్తూ టీడీపీ శ్రేణులు దొంగ ఓట్లు వేసుకునేందుకు సహకరించారు. 

ఇక్కడ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ కనుసన్నల్లో 1, 23, 27, 30, 31, 32 బూత్‌లలో పెద్ద ఎత్తున రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. మిగిలిన బూత్‌ల్లో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేసుకున్నారు. గిద్దలూరులో మధ్యాహ్నం నుంచి వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను టీడీపీ గూండాలు బెదిరించి బయటకు పంపి యథేచ్ఛగా దొంగ ఓట్లు వేసుకున్నారు. మార్కాపురంలో ఉదయం నుంచి కొన్ని బూత్‌లలో రిగ్గింగ్‌ చేశారు. మధ్యాహ్నం తరువాత సైలెంట్‌ రిగ్గింగ్‌కి దిగారు. తమ కళ్లముందే ఇన్ని అక్రమాలు జరుగుతున్నా పోలీసులు, ఎన్నికల అధికారులు కనీసం అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు.  

సుప్రీం ఆదేశాలూ పట్టవా? 
మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఎన్నికల అధికారులు పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా కొన్ని కేంద్రాల్లో చేయలేదు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులోని 13, 16, 17, 18, 22, 23, 24 కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. దీనిపై అధికారులను ఆరా తీస్తే.. వీడియో షూటింగ్‌ చేశామని చెబుతున్నారు.    – పెరవలి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement