పులివెందుల బాలిక ఉన్నత పాఠశాల సమీపంలో రాళ్లు రువ్వుతున్న పచ్చమూకలు
పట్టపగలే మంటగలిసిన ప్రజాస్వామ్యం
పచ్చమూకల మాస్ రిగ్గింగ్‌కు పూర్తిగా సహకరించిన ఖాకీలు
సామాన్య ప్రజలు ఓటు వేయకుండా భయభ్రాంతులకు గురిచేసిన వైనం
స్వయంగా పలువురు మహిళలను అడ్డుకున్న డీఎస్పీ
‘ఇతరులు’ విభాగంలో 14 మంది ఓటర్లుంటే 681 ఓట్లు పోలయ్యాయని ప్రకటన
తలకిందులైన ఎన్నికల సంఘం అధికారిక లెక్కలే అక్రమాలకు నిదర్శనం
80 బూత్‌లలో 70 చోట్ల వైఎస్సార్‌సీపీ ఏజెంట్ల గెంటివేత
చైర్‌పర్సన్ అభ్యర్థి వైఎస్ ప్రమీలమ్మపై భౌతిక దాడి.. వాహనం ధ్వంసం
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వెన్నుపోటు పార్టీ దౌర్జన్యాలు, దుర్మార్గాలు
సాక్షి ప్రతినిధి, కడప : పులివెందుల్లో ఎలాగైనా గెలవాలని పచ్చ తోడేళ్లు గుంపులు గుంపులుగా వచ్చి విధ్వంసం సృష్టించాయి. ఖాకీల మాటున దౌర్జన్యకాండ సాగించాయి. తెల్లారకముందే అరాచకానికి తెరతీస్తూ.. ప్రజాస్వామ్యంపై మూకుమ్మడిగా దాడి చేశాయి. ఫలితంగా ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైంది. స్థానిక ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కోలేని వెన్నుపోటు ప్రభుత్వం గూండాలను మోహరించి దొడ్డి దారిని గెలుపు కోసం కుట్రలు, కుతంత్రాలు, దౌర్జన్యాలకు తెర లేపింది. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలను ఎక్కడికక్కడ గృహ నిర్బంధాలు చేసి.. ఓటు హక్కును హరించేశారు.
ఏజెంట్లను అడుగడుగునా అడ్డుకున్నారు. సామాన్య ఓటరును ఆంక్షల సంకెళ్లలో బంధించి వారి ఓటుకూ పచ్చపోటు పొడిచారు. ఖాకీల సమక్షంలో దర్జాగా పోలింగ్ బూత్‌లను క్యాప్చర్ చేసి.. యథేచ్ఛగా రిగ్గింగ్ చేసుకున్నారు. ఏకంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌ను పులివెందుల్లో అడుగుపెట్టనీయకుండా చివరి వరకు కుట్రలుపన్నారు. మునుపెన్నడూ లేని విధంగా వెన్నుపోటు పార్టీ సాగించిన అరాచకం జుగుప్సాకర స్థాయికి చేరింది. తెలుగుదేశం పార్టీ అల్లరిమూకలు ఆదివారం ఉదయం 5 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలను ఆక్రమించారు.
శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు యంత్రాంగం ఏకపక్షంగా కూటమి శ్రేణులకు వంత పాడుతూ ప్రజాస్వామ్యాన్ని నడిరోడ్డుపై ఖూనీ చేయడానికి పూర్తిగా సహకరించాయి. బెంగళూరు నుంచి పులివెందుల చేరుకున్న అనంతరం కాన్వాయ్‌లో వెళ్తున్న వైఎస్ జగన్ భద్రతా వలయాన్ని దాటుకుని, వివేకా హత్య కేసు నిందితుడు/అప్రూవర్ దస్తగిరి తన కారుతో ఒక్కసారిగా కాన్వాయ్ ముందుకు దూసుకురావడం కలకలం రేపింది. స్వయంగా పోలీసుల ప్రొటెక్షన్ మధ్యే దస్తగిరితో టీడీపీ ఈ హైడ్రామాకు తెరలేపిందని, కావాలనే కాన్వాయ్‌లోకి అనుమతించి ఆ తర్వాత పక్కకు తప్పించినట్లు డ్రామాలు ఆడారని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడుతున్నారు.
తమను పోలింగ్ బూత్‌లోకే రానివ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న పులివెందుల 9వ వార్డు అభ్యర్థి, ఏజెంట్, ఓటర్లు
14 మందికి 681 ఓట్లు ఎలా?
పచ్చమూకలు యథేచ్ఛగా సాగించిన మాస్ రిగ్గింగ్ బాగోతం ఎన్నికల అధికారుల అధికారిక గణాంకాల సాక్ష్యాలతో బట్టబయలైంది. ఉదయం 11 గంటల సమయానికి పులివెందులలో ’ఇతరులు’ కేటగిరీలో 1.25 శాతం పోలింగ్ జరిగిందని, అంటే 681 ఓట్లు పోలయ్యాయని అధికారులు ప్రకటించారు. వాస్తవానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారిక రికార్డుల ప్రకారం పులివెందుల మున్సిపాలిటీ మొత్తం మీద ’ఇతరుల’ కేటగిరీలో ఉన్న ఓటర్లు కేవలం 14 మంది మాత్రమే. ఇలాంటప్పుడు 681 ఓట్లు ఎలా పోలవుతాయో అధికారులకే ఎరుక. ఉదయం నుంచే బూత్‌లను ఆక్రమించి టీడీపీ శ్రేణులు ఎడాపెడా దొంగ ఓట్లు గుద్దడం వల్లే ఈ అంకెలు తారుమారయ్యాయని స్పష్టమవుతోంది. కాగా కేవలం 4 గంటల్లోనే పులివెందులలో దాదాపు 40 శాతం పోలింగ్ నమోదు కావడం మాస్ రిగ్గింగ్‌కు అద్దం పడుతోంది.
ఆర్వో ఆఫీస్‌కు తాళాలు..
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 80 పోలింగ్ కేంద్రాల్లో 70 చోట్ల ఏజెంట్లు లేకుండా ఎన్నికలు నిర్వహించారు. పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 80 పోలింగ్ బూత్‌లలో దాదాపు 70 బూత్‌ల నుంచి వైఎస్సార్‌సీపీ పోలింగ్ ఏజెంట్లను పోలీసులు, టీడీపీ గూండాలు బయటకు తోసేయడంతో వైఎస్ జగన్ స్వయంగా ఆ ఏజెంట్లను వెంటబెట్టుకుని రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు. అభ్యర్థులు వస్తున్నారని తెలిసి అధికారులు ఆర్వో ఆఫీస్ ప్రధాన గేట్లకు తాళాలు వేశారు.
లోపలికి వెళ్లకుండా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర తోపులాట జరిగింది. అనంతరం వైఎస్ జగన్ ఏజెంట్లతో కలిసి ఆర్వో ఆఫీస్ ఎదుట రోడ్డుపైనే బైఠాయించి తీవ్ర నిరసన తెలిపారు. ఆర్వో శ్రీనివాస్, ఆర్డీవో చిన్నయ్యలను నిలదీస్తూ.. ‘ఓడిపోతామనే భయం ఉన్నప్పుడు ఈ దొంగ ఎన్నికలు ఎందుకు? మాజీ సీఎం నియోజకవర్గంలోనే ఏజెంట్లు లేకుండా ఏకపక్షంగా రిగ్గింగ్ చేసుకుంటారా? లాఠీచార్జ్ చేస్తారా.. చేయనీయండి.. అదొక్కటే మిగిలింది‘ అంటూ జగన్ గర్జించారు.
జగన్ ప్రాణాలతో చెలగాటం
వైఎస్ జగన్ పులివెందుల పర్యటనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం ఆఖరి నిమిషం వరకు కుట్రలు పన్నింది. శనివారమే హెలికాఫ్టర్ ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చిన పోలీసులు, ఆదివారం హఠాత్తుగా మాట మార్చారు. మధ్యాహ్నం 2:30 గంటల తర్వాతే ల్యాండింగ్‌కు అనుమతిస్తామని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆకస్మికంగా కొత్త ఆదేశాలు జారీ చేశారు. అప్పటికే బెంగళూరు నుంచి విచ్చేస్తూ.. మార్గం మధ్యలో ఉన్న హెలికాప్టర్ పైలెట్‌ను తీవ్ర ఒత్తిడి, గందరగోళానికి గురి చేశారు. పైలట్ తీవ్ర ఉత్కంఠ మధ్య పులివెందులలోనే హెలికాప్టర్‌ను ఎమర్జెన్సీ ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఒక మాజీ సీఎం ప్రాణాలతో ప్రభుత్వం ఇంత దారుణంగా చెలగాటమాడటంపై ప్రజాస్వామ్యవాదులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు నిప్పులు చెరుగుతున్నాయి.

పులివెందులలో దాడులకు కర్రలను సిద్ధం చేస్తున్న టీడీపీ గూండాలు
అభ్యర్థులపై దాడులు.. ప్రశ్నిస్తే లాఠీచార్జ్!
పులివెందుల మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి వైఎస్ ప్రమీలమ్మ బూత్ నంబర్ 21 వద్దకు వెళ్లగా, ఆమెపై టీడీపీ రౌడీలు భౌతిక దాడికి తెగబడటమే కాకుండా, ఆమె ప్రయాణిస్తున్న అధికారిక వాహనాన్ని కర్రలతో కొట్టి పూర్తిగా ధ్వంసం చేశారు. పోలింగ్ బూత్‌లో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు రాకుండా అడ్డుకుని, టీడీపీ ఏజెంట్లతో ఏకపక్షంగా పోలింగ్ నిర్వహించడాన్ని ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ శ్రేణులపై పోలీసులు, టీడీపీ శ్రేణులు దాడి చేశాయి. పులివెందులలో చెన్నారెడ్డి కాలనీ, ఇస్లాంపురం, పెద్ద రంగాపురం, ఐదో వార్డు పోలింగ్ బూత్‌ల వద్ద దౌర్జన్యాలు పతాక స్థాయికి చేరాయి.

తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన వృద్ధులను, మహిళలను పోలీసులు లోపలికి వెళ్లనివ్వకుండా క్యూలైన్ల నుంచి బలవంతంగా వెనక్కు తోసేశారు. దారుణంగా లాగి అవతలకు పడేశారు. ‘మర్యాదగా ఇక్కడి నుండి వెళ్లిపోండి.. మీకు ఓటు వేసే హక్కే లేదు.. మీ ఓట్లు మేము ముందే వేసేసుకున్నాం‘ అంటూ డీఎస్పీ మురళీ నాయక్ ఓటర్లకు వార్నింగ్ ఇచ్చారు. ఈ అరాచకాలపై సాక్షి టీవీ ఇన్‌ఫుట్ ఎడిటర్ ఇస్మాయిల్, మహిళా ఓటర్లు ఒక్కసారిగా డీఎస్పీని నిలదీయడంతో ఆయన సమాధానం చెప్పలేక పరారయ్యారు. అక్కడ విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుళ్లే స్వయంగా కట్టెలను సమకూర్చుకుని ఓటర్లను బెదిరిస్తున్నారని మహిళలు ఆధారాలు బయటపెట్టారు.

పులివెందులలో పచ్చగూండాల వీరంగం
27వ వార్డులో ఒక వృద్ధురాలి నుంచి బ్యాలెట్ పేపర్లను లాక్కొని టీడీపీ ఏజెంటే స్వయంగా ఓటు వేశాడు. ఈ అన్యాయాలపై పులివెందుల బాలుర జూనియర్ కాలేజీ వద్ద సుమారు 400 మందికి పైగా సామాన్య ఓటర్లు రోడ్డుపైనే బైఠాయించి తీవ్ర నిరసనకు దిగారు. ఈ దారుణాలను చిత్రీకరిస్తున్న జాతీయ మీడియా ప్రతినిధులపై కూడా పచ్చ మూకలు దాడికి పాల్పడటం విస్తుగొలుపుతోంది. మొత్తంగా పులివెందుల మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక చీకటి రోజుగా మిగిలిపోయింది.


