ప్రజాస్వామ్యాన్ని కాపాడండి | YS Jagan stages a protest at the Pulivendula RO office | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యాన్ని కాపాడండి

Nov 2 2026 4:17 AM | Updated on Nov 2 2026 4:17 AM

YS Jagan stages a protest at the Pulivendula RO office

ఆర్వో కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న వైఎస్సార్‌సీపీ ఏజెంట్లతో మాట్లాడుతున్న వైఎస్‌ జగన్‌

పులివెందుల ఆర్‌ఓ కార్యాలయం వద్ద వైఎస్‌ జగన్‌ ధర్నా

నిష్పక్షపాత విచారణ జరిపించి, రీ పోలింగ్‌కు ఆదేశాలివ్వండి

మీ చేతుల్లో అధికారం ఉంది.. మీ మనస్సాక్షి ప్రకారం నిర్ణయం తీసుకోండి 

మీ నిర్ణయం రాష్ట్రంలో, దేశంలో భవిష్యత్‌ ఎన్నికలకు ఒక ప్రమాణంగా నిలుస్తుంది 

70 మంది పోలింగ్‌ ఏజెంట్లు జరిగిన అన్యాయాన్ని వివరిస్తున్నారు 

మీకు ఇంతకంటే ఏం ఆధారాలు కావాలి?  

లేదంటే భవిష్యత్‌లో ఎన్నికలు జరగని పరిస్థితికి దారితీస్తుంది   

ఎన్నికల ప్రక్రియపై నమ్మకం కలిగేలా నిష్పక్షపాతంగా వ్యవహరించండి

ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడి నియోజకవర్గంలోనే ఇంత దారుణంగా ఎన్నికలు జరిగితే ఇక ప్రజాస్వామ్యం ఎక్కడ బతుకుతుంది?

నేను తలచుకుంటే ఈ రోజు ఎన్నికల ప్రక్రియను పూర్తిగా నిలిపివేయగలిగేవాడిని. మా కార్యకర్తలు కూడా తిరగబడే పరిస్థితి రావచ్చు. కానీ నేను అలా చేయడం లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని నేనే గౌరవించకపోతే, ఎన్నికల ప్రక్రియను నేనే గౌరవించకపోతే ప్రజలకు ఎలాంటి సందేశం ఇచ్చినట్లవుతుంది? అందుకే బాధితులైన పోలింగ్‌ ఏజెంట్లను, రిలీవింగ్‌ ఏజెంట్లను మాత్రమే మీ ముందుకు తీసుకొచ్చి, ఆధారాలతో సహా జరిగిన అన్యాయాన్ని వివరిస్తున్నాను.

సాక్షి, కడప / పులివెందుల: ‘మీ చేతుల్లో అధికారం ఉంది. మీ మనస్సాక్షి ప్రకారం నిర్ణయం తీసుకోండి. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం కేవలం పులివెందుల ఎన్నికలకే పరిమితం కాదు. రాష్ట్రంలో, దేశంలో భవిష్యత్తు ఎన్నికలు ఎలా జరగాలన్న దానికి కూడా ఒక ప్రమాణంగా నిలుస్తుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత మీపై ఉంది. 70 మంది పోలింగ్‌ ఏజెంట్లు, రిలీవింగ్‌ ఏజెంట్లు మీ ముందుకు వచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తున్నారు. ఇంతకంటే ఏం ఆధారాలు కావాలి? నిష్పక్షపాత విచారణ జరిపించి, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు రీ పోల్‌కు ఆదేశాలు ఇవ్వండి. 

మీరు ఈరోజు న్యాయం చేయకపోతే ప్రజాస్వామ్యం శాశ్వతంగా దెబ్బ తింటుంది. ఇది మీ చేతుల్లోనే ఉంది. నిర్ణయం మీరే తీసుకోండి’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల రిటర్నింగ్‌ (ఆర్వో) అధికారిని కోరారు. వైఎస్సార్‌ జిల్లా పులివెందులలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా టీడీపీ మూకల దౌర్జన్యాలు, అవన్నీ చూస్తూ కూర్చున్న అధికారుల నిర్లక్ష్యాన్ని ఎలుగెత్తి చాటుతూ.. 70 పోలింగ్‌ బూత్‌ల నుంచి వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను తరిమి వేయడాన్ని ప్రశ్నిస్తూ ఆర్‌ఓ కార్యాలయం వద్ద ఆదివారం ఆయన ధర్నాకు దిగారు. బాధిత పోలింగ్‌ ఏజెంట్లు, రిలీవింగ్‌ ఏజెంట్లతో కలిసి రిటర్నింగ్‌ అధికారిని కలిసి టీడీపీ మూకల అరాచకాలను వివరించారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 

మీ మనస్సాక్షిని అడగండి 
‘మీ మనస్సాక్షిని ఒక్కసారి ప్రశ్నించుకోండి. ఇంతమంది ఆధారాలతో సహా వచ్చి జరిగిన అన్యాయాన్ని వివరిస్తున్నప్పుడు దానిని అడ్డుకోవడం ధర్మమా? లేక న్యాయం చేయడం ధర్మమా? మీపై ఎవరి ప్రభావం ఉండకూడదు. మీకు ఉన్న అధికారాన్ని ఉపయోగించి న్యాయం చేయాలి. కనీసం ఇప్పుడు న్యాయం చేయకపోతే భవిష్యత్తులో ప్రజాస్వామ్యాన్ని ఎవరు కాపాడుతారు? మీకు (ఆర్‌ఓ) పైస్థాయి నుంచి ఒత్తిళ్లు రావచ్చు. కానీ మీ చేతుల్లో ఉన్న అధికారంతో న్యాయం చేయవచ్చు. మీరు ఈరోజు మౌనంగా ఉంటే ప్రజాస్వామ్యం శాశ్వతంగా చితికిపోతుంది. రేపు భవిష్యత్తులో ఎన్నికలే జరగని పరిస్థితి వస్తుంది. 

ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడి నియోజకవర్గంలోనే ఇంత దారుణంగా ఎన్నికలు జరిగితే ఇక ప్రజాస్వామ్యం ఎక్కడ బతుకుతుంది? మేము 70 బూత్‌లకు సంబంధించిన ఏజెంట్లు, రిలీవింగ్‌ ఏజెంట్లందర్నీ మీ ముందుకు తీసుకొచ్చాం. ఒక్కొక్కరిని విచారించండి. అవసరమైతే విచారణ జరిపించండి. మేము ఇక్కడే కూర్చుంటాం. జరిగిన అక్రమాలకు సంబంధించి మా దగ్గర వందలాది వీడియో ఆధారాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో సీసీ టీవీ ఫుటేజ్‌ కూడా ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో సీసీ టీవీలు లేకపోయినా పోలింగ్‌ సరళిని పరిశీలిస్తే రిగ్గింగ్, ఓట్ల రీసైక్లింగ్‌ జరిగిన విషయం స్పష్టమవుతుంది. 

     పులివెందులలో దౌర్జన్యాలను సాక్ష్యాలతో ఎన్నికల అధికారికి వివరిస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

ప్రజాస్వామ్యాన్ని గౌరవించేవాడిని కాబట్టి 
వైఎస్సార్‌సీపీకి చెందిన ఏజెంట్లను పోలింగ్‌ కేంద్రాల నుంచి బయటకు పంపించడం, వారి ఏజెంట్‌ కార్డులను లాక్కోవడం వంటి ఘటనలు పోలీసుల సహకారంతోనే జరిగాయి. తెల్లవారుజామున ఐదు గంటలకే కొన్ని బూత్‌లను తమ ఆధీనంలోకి తీసుకుని, తమ మనుషులను ముందుగానే పెట్టుకున్నారు. ఓటు వేయడానికి వచ్చి­న వారిని అడ్డుకోవడమే కాకుండా, ఓటర్‌ స్లిప్పులను చింపేసి, ఓటు వేసేశారని చెప్పి వెనక్కి పంపిస్తున్నారు. ఓటర్లను గుర్తించి, అక్రమాలను ప్రశ్నించాల్సిన పోలింగ్‌ ఏజెంట్లనే లేకుండా చేస్తున్నారు.

నేను తలచుకుంటే ఈ రోజు ఎన్నికల ప్రక్రియను పూర్తిగా నిలిపివేయగలిగేవాడిని. మా కార్యకర్తలు కూడా తిరగబడే పరిస్థితి రావచ్చు. కానీ నేను అలా చేయడం లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని నేనే గౌరవించకపోతే, ఎన్నికల ప్రక్రియను నేనే గౌరవించకపోతే ప్రజలకు ఎలాంటి సందేశం ఇచ్చినట్లవుతుంది? అందుకే బాధితులైన పోలింగ్‌ ఏజెంట్లను, రిలీవింగ్‌ ఏజెంట్లను మాత్రమే మీ ముందుకు తీసుకొచ్చి, ఆధారాలతో సహా జరిగిన అన్యాయాన్ని వివరిస్తున్నాను. ఎన్నికల ప్రక్రియపై మాకు నమ్మకం ఉండాలంటే అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి.

ప్రజల్లో వ్యతిరేకతతోనే అరాచకం
ప్రభుత్వానికి ప్రజల మద్దతు లేదనే విషయం వారికి కూడా తెలుసు. సూపర్‌ సిక్స్‌లు లేవు, సూపర్‌ సెవెన్‌లు లేవు. ఇంటింటికీ బాండ్లు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ప్రజల్లో వ్యతిరేకత ఉందనే భయంతోనే ఎన్నికలను స్వేచ్ఛగా నిర్వహించలేని పరిస్థితి తెచ్చారు. ఎన్నికలంటే పోటీ జరగాలి.. ప్రజలు తమ తీర్పు చెప్పాలి. కానీ ఇక్కడ టీడీపీ గూండాలు బూత్‌లను ఆక్రమించుకోవడం, పోలీసుల సహకారంతో ప్రత్యర్థి ఏజెంట్లను బయటకు పంపించడం జరుగుతోంది. ఇది ఎన్నికల నిర్వహణ కాదు. ప్రజాస్వామ్యాన్ని కళ్ల ముందే కూల్చి వేయడం. ఈ వ్యవహారంపై మరింత లోతైన విచారణ జరగాలి. మా దగ్గర ఉన్న అన్ని వీడియో ఆధారాలను అందిస్తాం’ అని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement