● రౌడీయిజానికి దిగిన బాబాయ్, అబ్బాయిలు
● అభివృద్ధి చేసి ఉంటే ప్రజలు ఓటు వేస్తారు
● ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి
జమ్మలమడుగు : మున్సిపాలిటీ పరిధిలో బాబాయ్, అబ్బాయ్‌లు నిజంగా అభివృద్ధి చేసి ఉంటే ప్రజలు దానిని చూసి ఓటు వేస్తారు... వారు అభివృద్ధి చేయకపోవడంతో ప్రజలు ఓటు వేసి గెలిపించరనే భావనతోనే రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన స్థానిక సంజామల మోటులో ఉన్న తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. పట్టణం నిండా గుండాలతో నిండిపోయి రిగ్గింగ్ జరుగుతున్నా.. నియంత్రణ చేయవలసిన పోలీసులు, ఎన్నికల అధికారులు, కలెక్టర్, జిల్లా ఎస్పీలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. పోలీసులు పూర్తిగా కూటమి ప్రభుత్వానికి పూర్తిగా మద్దతూ ప్రకటించడంలోనే విచ్చలవిడిగా రిగ్గింగ్, దాడులు జరుగుతున్నాయన్నారు. పోలింగ్ బూత్‌లలో కూటమి గూండాలే తమ ఓటు వేసుకున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఓటు వేయటానికి పోతున్న మహిళల చేతుల్లో నుంచి స్లిప్పులు లాక్కొని చించివేస్తుండగా.. ఇదేమని ప్రశ్నించిన మహిళలపై, ఓటర్లను పోలీసుల ముందే బెదిరింపులకు పాల్పడుతున్నా పోలీసులు చూస్తుండి పోయారన్నారు. కూటమి నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని పూర్తి స్థాయిలో రిగ్గింగ్ చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. మమ్మల్ని హౌస్ అరెస్టులు చేసి టీడీపీ, బీజేపీ గూండాలను బయట తిరిగే విధంగా పోలీసులు చూస్తున్నారన్నారు. ఎన్నికల సంఘం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలంటే కచ్చితంగా రీ ఎలక్షన్ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్య బద్ధంగా పోరాటం: హైమావతి
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాస్వామ్య బద్ధంగా వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థులు, కార్యకర్తలు, నాయకులు పోరాటం చేశామని వైఎస్సార్‌సీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి హైమావతి అన్నారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, భూపేష్‌రెడ్డిలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపిస్తే ఓడిపోతామనే భయంతోనే రిగ్గింగ్‌కు పాల్పడ్డారని మండిపడ్డారు. పోలీసులు సైతం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నారు. ధైర్యంగా ప్రాణాలకు తెగించి తమ కార్యకర్తలు పోలింగ్ బూత్‌లలో ఏజెంట్లుగా కూర్చున్నారని.. తాము మొగోళ్ల మాదిరిగా రాజకీయం చేశామని, కాబట్టి మేము ఓడిపోయినా తమకు ఎలాంటి బాధలేదని వ్యాఖ్యానించారు. ప్రజలు కూడా ఇక్కడ జరుగుతున్న దౌర్జన్యాలు, రిగ్గింగ్‌లు, కూటమి నాయకుల అరాచాకాలు గమనించారన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరుపలేని కూటమి నాయకులు మీరు గెలిచిన ఓడినట్లే అని తెలుసుకోవాలని సూచించారు. ప్రజా క్షేత్రంలో ఇప్పటికే తమదే గెలుపు అన్నారు. ఈ సమావేశంలో లక్ష్మీదేవమ్మ, వెంకటశివారెడ్డి, ఇందిరమ్మ, గిరిధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


