ఖాకీల అండతోనే ఓట్ల దోపిడీ | - | Sakshi
Sakshi News home page

ఖాకీల అండతోనే ఓట్ల దోపిడీ

Nov 2 2026 2:17 AM | Updated on Nov 2 2026 2:17 AM

కడప కార్పొరేషన్‌ : మున్సిపల్‌ ఎన్నికల్లో పోలింగ్‌ రోజు ఖాకీల నీడలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. పోలీసుల సహకారంతోనే కూటమి ఓట్ల దోపిడీకి పాల్పడిందని మండిపడ్డారు. ఆదివారం మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి, మేయర్‌ అభ్యర్థి బండి దీప్తిరెడ్డితో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇంత దుర్మార్గంగా ఎప్పుడూ ఎన్నికలు జరగలేదన్నారు. కడపలో ఏ పోలింగ్‌ బూత్‌లో కూడా వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు లేకుండా కొట్టి తరిమేశారని, టీడీపీ ఆఫీసు నుంచి వచ్చిన వాళ్లే వివిధ పార్టీల పేరుతో ఏజెంట్లుగా కూర్చొన్నారన్నారు. తమ పార్టీ ఏజెంట్లను కొట్టి, వారి ఏజెంటు ఫారాలు చించివేస్తున్న వీడియోలు ప్రదర్శించారు. ఇవి టీడీపీకి, వైఎస్సార్‌సీపీ మధ్య జరిగిన ఎన్నికలు కావని, వైఎస్సార్‌సీపీకి పోలీసులకు మధ్య జరిగాయని తెలిపారు. ఇన్ని అరాచకాలు, దుర్మార్గాలు చేసి ఎన్నికలు ఎందుకు జరపాలి... ప్రజల సొమ్మును ఎందుకు దుర్వినియోగం చేయాలని ప్రశ్నించారు. కొన్ని చోట్ల తాము ఏజెంట్లను కూర్చొబెట్టినా మళ్లీ తరిమేస్తున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిచోటా సైక్లింగ్‌, రిగ్గింగ్‌ యథేచ్ఛగా జరిగాయని, పోలీసులు వీటిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీకి ఏజెంట్లు లేరని టీడీపీ జోనల్‌ కో ఆర్డినేటర్‌ శ్రీనివాసులరెడ్డి చెప్పడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు కంచుకోట లాంటి కడపలో వైఎస్సార్‌సీపీకి ఏజెంట్లు లేరు అని ఎలా అంటారని ప్రశ్నించారు. పులివెందులలో అయితే మరింత బరితెగించి బహిరంగంగానే రిగ్గింగ్‌ చేశారన్నారు. 2029లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాగానే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు ఎలా జరపాలో చూపిస్తామని హెచ్చరించారు.

ఎన్నికల పేరుతో రూ.కోట్ల ప్రజాధనం దుర్వినియోగం : అంజద్‌బాషా

ఎన్నికల పేరుతో దాడులు, దౌర్జన్యాలు చేసి కూటమి ప్రభుత్వం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా ధ్వజమెత్తారు. రౌడీలు, గూండాల చేతికి ఎన్నికల నిర్వహణ అప్పగించారన్నారు. పోలీసులు కిరాయి గుండాలుగా వ్యవహరించారని, స్థానికులు కానివారు, ఇతర ప్రాంతాల నుంచి తరలించిన వారు గుంపులు, గుంపులుగా ఉంటూ యథేచ్ఛగా సైక్లింగ్‌ చేస్తున్నా.. చూస్తూ ఉండిపోయారే తప్ప అడ్డుకునే ప్రయత్నం చేయలేదన్నారు. ఎమ్మెల్యే మధవీరెడ్డి ఆదేశాల మేరకు నగరపాలక అధికారులు స్లిప్పులను ఓటర్లకు పంచకుండా ఆమె ఇంటికి చేర్చారని, ఈ మేరకు ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద టీడీపీ గూండాలు దుకాణం తెరిచి ఇష్టం వచ్చినట్లు ఓట్లు వేసుకున్నారన్నారు. ఆడ, మగ తేడా లేకుండా ఎవరి ఓటు ఎవరైనా వేయొచ్చు అనే రీతిలో రిగ్గింగ్‌ చేసుకున్నారన్నారు. టీడీపీ రౌడీలు పోలింగ్‌ కేంద్రాల లోపల, బయట యథేచ్ఛగా స్వైర విహారం చేశారన్నారు. టీడీపీ నాయకులకు దమ్ముంటే పోలీసులను పక్కకు పంపి రావాలని... మీరో మేమో తేల్చుకుందామని సవాల్‌ విసిరారు. ఎన్నికల మాటున కడప ఎమ్మెల్యే, ఆమె భర్త రూ.60 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ప్రజాక్షేత్రంలో గెలిచే దమ్ము లేకనే ఇలా దౌర్జన్యం చేశారని, ఈ పదవులు శాశ్వతం కాదని, భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ప్రజలు తిరగబడే రోజులు వస్తాయని తెలిపారు.

ఎందుకు పోటీ చేశానా.. అని బాధపడుతున్నా: మేయర్‌ అభ్యర్థి బండి దీప్తి

పోలింగ్‌ రోజు టీడీపీ అరాచక మూకలు చేసిన దౌర్జన్యం, పోలీసుల ప్రేక్షక పాత్ర చూసిన తర్వాత ఈ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేశానా అని బాధపడుతున్నానని వైఎస్సార్‌సీపీ మేయర్‌ అభ్యర్థి బండి దీప్తిరెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. కోటిరెడ్డి ఉమెన్స్‌ కళాశాలలో వైఎస్సార్‌సీపీ మహిళా ఏజెంటు జాకెట్‌లో భద్రపరుచుకున్న ఏజెంటు ఫారాలను లాగుతుంటే పక్కనే ఉన్న మహిళా డీఎస్పీ భవానీ అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం దారుణమన్నారు. ఇంత నీచాతి నీచంగా ఎన్నికలు జరిపిస్తారని ఊహించలేదన్నారు. 12వ డివిజన్‌లో వైఎస్సార్‌సీపీ తరఫున నాగమణి అనే ఏజెంటును తాము కూర్చొబెట్టి వస్తే ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ రమాదేవి అంట.. కొద్ది నిమిషాలకే ఆమెను బయటికి పంపేసిందన్నారు. పది శాతం పారదర్శకంగా కూడా ఎన్నికలు జరగలేదని, పోలీసు శాఖపై ఉన్న గౌరవం, మర్యాద మంటగలిసి పోయాయన్నారు. నడిరోడ్డుపై ఉమ్మేసినా వారు తుడుచుకుని పోయేలా ఉన్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రజల సొమ్ముతోనే కదా మీరు జీతాలు తీసుకుంటున్నారు, వారు కట్టే పన్నుల నుంచే కదా ఈ ఎన్నికలు జరుపుతున్నారు.. ఇంత దుర్మార్గంగా వ్యవహరించడానికి మనసెలా వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద స్లిప్పులు, మద్యం బాటిళ్లు సిద్ధంగా ఉంచి 18 ఏళ్లు కూడా నిండని వారితో ఓట్లు వేయించారని, వారినే ఏజెంట్లుగా కూర్చొబెట్టారని తెలిపారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి, ఆమె భర్త శ్రీనివాసులరెడ్డి, వారి కుమారుడు యథేచ్ఛగా వాహనాల్లో తిరుగుతూ స్లిప్పుల బండిల్స్‌ పంపిణీ చేశారన్నారు. ఇన్ని అనైతిక కార్యక్రమాలు చేసి గెలవబోతున్న ఎమ్మెల్యే కం మేయర్‌కు శుభాకాంక్షలు అంటూ ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు పులి సునీల్‌ కుమార్‌, దాసరి శివప్రసాద్‌, పి.రామ్మోహన్‌రెడ్డి, షేక్‌ ఉమైర్‌ పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ ఏజెంట్లే లేకుండా

పోలింగ్‌ నిర్వహణ

ఇంత దుర్మార్గంగా ఎన్నికలు ఎప్పుడూ జరగలేదు

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు

పి.రవీంద్రనాథ్‌రెడ్డి ధ్వజం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement