breaking news
YSR District Latest News
-
రోడ్లపై ‘గుంత’లు.. పాలకుల కళ్లకు గంతలు!
‘మేం అధికారంలోకి వస్తే రోడ్లను గుంతలు లేని రహదారులుగా చేస్తాం.. ఊరూరా రోడ్లు వేస్తాం’ ఇదీ.. కూటమి నేతలు ఎన్నికలకు ముందు ఊదరగొట్టిన హామీలు... అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతాంది.. కొత్త రోడ్లు కాదుకదా గుంతలు తేలిన ఇలాంటి పాత రోడ్లకు మరమ్మతులు చేసిన పాపాన పోలేదు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసే హడావుడి చారానా కోడికి బారానా మసాలా అన్నట్లుంటుంది. అధికారంలోకి వచ్చిన కొత్తలో ‘వచ్చే సంక్రాంతికల్లా గ్రామీణ రోడ్లను అందంగా మారుస్తాం... అద్దంలా చేస్తా’మంటూ ఊగిపోయారు.. పల్లెల్ని అభివృద్ధి బాట పట్టిస్తామంటూ గొప్పలు చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి అధ్వానంగా ఉంది. రాజుపాళెం మండలంలోని అయ్యవారిపల్లె నుంచి గాదెగూడూరు గ్రామానికి వెళ్లే ఈ దారే దీనికి సాక్ష్యం. గాదెగూడూరు గ్రామ సమీపంలో రాళ్లు తేలి దరిద్రంగా తయారైంది. ఇది మచ్చుకు మాత్రమే.. జిల్లావ్యాప్తంగా పల్లెదారులు చాలా వరకు ఇలానే ఉన్నాయి. ఇప్పటికై నా పాలకులు స్పందించి రోడ్ల నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని.. అధికారులు స్పందించి రాళ్లుతేలిన రహదారిని బాగు చేయాలని ప్రజలు కోరుతున్నారు.– రాజుపాళెం -
అత్తను హత్య చేసిన అల్లుడు
● తర్వాత తానూ ఆత్మహత్యాయత్నం ● కుటుంబ వివాదాల నేపథ్యం చింతకొమ్మదిన్నె/కడప అర్బన్: వైఎస్సార్ కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం వేపమానుసత్రం గ్రామంలో శనివారం అర్ధరాత్రి దారుణం జరిగింది. ఇంటి బయట నిద్రిస్తున్న షేక్ షంషాద్ బేగం (42)ను కొడవలితో హత్య చేసిన అల్లుడు బండారు శ్రీను (31).. ఆపై తానూ బ్లేడ్‌తో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బేగంకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. భర్త వల్లిబాషా ఐదేళ్ల క్రితం మృతి చెందాడు. కుమార్తె మహబూబ్‌చాన్ (21)కు గతంలో వివాహం కాగా, భర్తతో విభేదాల కారణంగా విడిపోయి తల్లి వద్దే ఉండేది. వ్యవసాయ పనులకు వెళ్లే క్రమంలో బేగంకు పెద్దకాంపల్లె గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ శ్రీనుతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో చాన్‌కు శ్రీనుతో ఏడాదిన్నర క్రితం వివాహం చేశారు. వివాహమైన కొన్ని రోజులకు శ్రీను వ్యవహారశైలిపై కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే చాన్ జీవనోపాధి కోసం విదేశాలకు వెళ్లింది. భార్య చాన్‌ను విదేశాల నుంచి రాకుండా అత్త అడ్డుకుంటున్నదనే అనుమానంతో శ్రీను ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన శ్రీను కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. బేగం మామ(భర్త తండ్రి ) హుస్సేన్ పీరా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దరఖాస్తు గడువు పొడిగింపు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : మద్యం దుకాణాల లైసెన్స్ దరఖాస్తు గడువు ఈ నెల 6 వరకు పొడిగించినట్లు కడప ప్రొహిబిషన్ – ఎకై ్సజ్ స్టేషన్ సీఐ కృష్ణకుమార్ తెలిపారు. కడప ప్రొహిబిషన్– ఎకై ్సజ్ స్టేషన్ స్టేషన్ పరిధిలో మొత్తం 7 దుకాణాలు నోటిఫై చేసినట్లు తెలిపారు. వార్షిక లైసెన్స్ ఫీజు రూ. 71.5 లక్షలు కలిగిన దుకాణాలు 5 ఉన్నాయన్నారు. అందులో కడప టౌన్ పరిధిలో 3, ఖాజీపేట మండలం పరిధిలో 2 దుకాణాలు ఉన్నాయని వివరించారు. అలాగే చెన్నూరులో ఒకటి, పెండ్లిమర్రిలో మరొకటి వార్షిక లైసెన్స్ ఫీజు రూ. 61.5 లక్షలు కలిగిన దుకాణాలు ఉన్నాయని.. వీటికోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాలకు కడప ప్రొహిబిషన్ – ఎకై ్సజ్ స్టేషన్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. గండికోటకు వరద నీరుకొండాపురం : నంద్యాల జిల్లాలోని ఆవుకు జలాశయం నుంచి గాలేరు–నగరి సుజల స్రవంతి ప్రధాన కాలువ ద్వారా వరద నీరు గండికోట రిజర్వాయర్‌లోకి వస్తోందని.. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 19 టీఎంసీలు చేరినట్లు జలవనరుల శాఖ ఈఈ ఉమామహేశ్వర్లు తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గండికోట పూర్తి సామర్థ్యం 26.85 టీఎంసీలు కాగా ప్రస్తుతం 19 టీఎంసీలు చేరినట్లు ఆయన వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 695.54 అడుగులు ఉండగా 689.1 అడుగుల నీటిమట్టానికి చేరిందన్నారు. కొండాపురం, ముద్దనూరు, తాడిపత్రికి జేసీ తాగునీటి పథకాలకు సీపీ డబ్లూ స్కీం ద్వారా 20 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తున్నామని తెలిపారు. ఉత్సాహంగా జిల్లాస్థాయి కబడ్డీ ఎంపికలుకడప వైఎస్ఆర్ సర్కిల్ : సబ్‌జూనియర్స్ బాలబాలికల జిల్లాస్థాయి కబడ్డీ ఎంపికలు ఆదివారం కడప నగరంలోని మున్సిపల్ హైస్కూల్లో నిర్వహించినట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి ఆర్. వెంకట సుబ్బయ్య, అధ్యక్షుడు గురుశేఖర్ తెలిపారు. ఈ ఎంపికలను టి.శ్రీవాణి, జె. వెంకటసుబ్బన్న, పీడీ సునీల్, కోచ్ లీలావతి, పీడీ లక్ష్మి, నరేష్ పర్యవేక్షించినట్లు పేర్కొన్నారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా జట్లకు ఎంపిక చేశామని వెల్లడించారు. ఎంపికై న క్రీడాకారులు వెస్ట్ గోదావరి జిల్లా నూజివీడులో ఈ నెల 10, 11, 12 తేదీల్లో నిర్వహించే రాష్ట్ర స్థాయి సబ్‌జూనియర్ కబడ్డీ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు వీరే.. బాలుర జట్టు : వి.జనార్ధన్, వి.చరణ్,డి. మనోజ్, ఎం.అనుదీప్, జి.మేఘశ్యామ్, జి.య శ్వంత్ రెడ్డి, జి.హర్షవర్ధన్, జి.వెంకట విశాల్, సాయినాథ్, టి.నరేంద్ర, బి.నిత్య ప్రియా నాయ క్, కె.వరుణ్ కుమార్, ఎస్.ఉస్మాన్, జి.రామ్ చరణ్, ఎస్.ఎం.డి.అమాన్, ఎం.లోహిత్, బాలికల జట్టు : ఎన్. నాగమణి, కె.కావ్య శ్రీ, ఆర్. అమృత,సి. ధనుష, సి.ప్రణిత, ఎస్. సాయి కుమారి, కె. సాయి కీర్తన, బి. ప్రసన్న, ఎం.శారా, బి. దేవహర్షిణి, ఎం. కీర్తి, పి. హుస్సేన్‌బీ, డి.వి.సుభహేమ, ఎన్.వి. అక్షయ, ఎం.బ్లెస్సీ, కె. త్రివేదితా. గాలివీడు రామాలయానికి పిడుగుపాటు గాలివీడు : అన్నమయ్య జిల్లా గాలివీడు మండల కేంద్రంలో ఆదివారం స్థానిక గేటు సమీపంలో వెలసిన శ్రీరామాలయ ధ్వజస్తంభంపై పిడుగు పడింది. పిడుగుపడిన తీవ్రతకు ఆలయ ధ్వజస్తంభం కింది భాగంలోని రాతి దిమ్మె పాక్షికంగా దెబ్బతింది, ఆదివారం కావడంతో ఆలయంలో పూజల కోసం భక్తులు లేని సమయంలో ఈ ఘటన జరిగింది. పిడుగు పడిన క్షణంలో భారీ శబ్దం రావడంతో ఆలయ ప్రాంగణంలో ఉన్న భక్తులు, స్థానిక నివాసితులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే, ఈ ప్రమాదంలో గర్భాలయానికి కానీ, ఆలయ ప్రాంగణంలో ఉన్న భక్తులకు కానీ ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన ధ్వజస్తంభం పిడుగుపాటుకు గురికావడంపై భక్తులు ఆందోళన చెందుతున్నారు. -
దళితులకు ఆలయ దర్శనం
● నిరసనగా తాళం వేసిన గ్రామస్తులు! కమలాపురం: మండల పరిధిలోని ఎర్రగుడిపాడు గ్రామానికి చెందిన దళితులకు అధికారులు ఆలయ దర్శనం కల్పించారు. ఎర్రగుడిపాడులోని శ్రీ చెన్నకేశవస్వామి ఆలయానికి గతంలో ఎప్పుడూ ఎస్సీలు వెళ్లేవారు కాదు. ఈ నెల 3వ తేదీన అదే గ్రామానికి చెందిన చంద్ర అనే వ్యక్తి తన కుమారుడు, కుమార్తెతో కలసి స్వామివారిని దర్శించుకోవాలని వెళ్లాడు. అక్కడే ఉన్న ఆ గ్రామ మాజీ సర్పంచ్ బ్రహ్మానందరెడ్డి వారిని వారించి గ్రామ కట్టుబాట్లు పాటించాలని, ఆలయంలోకి వెళ్లవద్దని మందలించాడు. బయటి నుంచే స్వామి వారిని దండం పెట్టుకోవాలని మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. జిల్లా ఎస్పీ, కలెక్టర్ వారికి ఆలయ దర్శనం కల్పించాలని డీఎస్పీ బాలస్వామిరెడ్డి, ఆర్డీఓ మురళీకి ఆదేశాలు జారీ చేశారు. దీంతో వారు సీఐ మోహన్, ఎస్ఐ శ్రీనివాసులు, తహసీల్దార్ శ్రీనివాసులరెడ్డితో కలసి అక్కడికి చేరుకుని చంద్ర తల్లి, కుమార్తె, కుమారుడికి ఆలయంలోకి తీసుకెళ్లి, స్వామివారి దర్శనం చేయించి టెంకాయ కొట్టించారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు, మహిళలు అక్కడికి చేరుకుని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి కట్టుబాట్లు ఉంటాయని, కనీసం తమతో చర్చించకుండానే వారికి ఆలయ ప్రవేశం చేయిస్తారా? అని ప్రశ్నించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాము వారికి ఆలయ దర్శనం చేయించామని అధికారులు తెలిపారు. దీంతో అక్కడున్న మహిళలు గుడికి తాళం వేసి ఇకపై తాము ఆలయం తెరవబోమని చెప్పి వెళ్లిపోయారు. -
రుబాబు వద్దు.. జవాబు ముద్దు!
సాక్షి ప్రతినిధి, కడప : సీఎం హోదాలో చంద్రబాబు పలుమార్లు జిల్లాకు వచ్చారు. గతేడాది మూడు రోజుల పాటు మహానాడు నిర్వహించారు. ఆయా బహిరంగ సభల సాక్షిగా.. నిండు వేదికపై ఎన్నో హామీలు గుప్పించారు. ఒక్కటంటే ఒక్కటీ నెరవేర్చింది లేదు.‘నేను రాయలసీమ బిడ్డను’ అని తనంతట తాను గొప్పలు చెప్పుకోవడం మినహా సీమకు ఆయన చేసిందేమీ లేదని జిల్లా ప్రజలు తూర్పారబడుతున్నారు. ఈ ప్రాంతానికి ప్రత్యేకించి అభివృద్ధి ఫలాలు అందించడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శిస్తున్నారు. అందుకు పులివెందుల మెడికల్ కళాశాల ఉదంతాన్ని వివరిస్తున్నారు. పేదింటి బిడ్డలకు వైద్య విద్య అందుబాటులోకి తీసుకురావాలన్న సదాశయంతో రూ.530 కోట్లతో వైఎస్ జగన్ సర్కార్ ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మిస్తే... నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) మంజూరు చేసిన 50 ఎంబీబీఎస్ సీట్లను సైతం చంద్రబాబు తిరస్కరించడాన్ని పలువురు చెప్పుకొస్తున్నారు. మహానాడు వేదికగా ఇచ్చిన రూ.1380 కోట్ల హామీలకు దిక్కులేదు.. జిల్లా కేంద్రమైన కడపలో 2025లో తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించారు. మే 27–29 వరకూ సీఎం చంద్రబాబు ఇక్కడే తిష్టవేశారు. చివరిరోజు సమావేశంలో ‘తమ్ముళ్ల’ సాక్షిగా జిల్లా అభివృద్ధి కోసం హామీలు ఇచ్చారు. జీఎన్ఎస్ఎస్ ఫేజ్–1 పనులు నిధుల లేమి కారణంగా ఆలస్యంగా నడుస్తోన్నాయని అందుకు కోసం రూ.1000 కోట్లు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. వీరపునాయునిపల్లె, వేంపల్లె, వేముల, పెండ్లిమర్రి, చింతకొమ్మదిన్నె, వల్లూరు, కమలాపురం, కడప మండలాల్లో భూసేకరణ, పెండింగ్ పనులు నిర్వహణ కోసం వెచ్చించనున్నట్లు గొప్పలు చెప్పారు. కానీ ఇంతవరకు అవేవీ కార్యరూపం దాల్చలేదు. అలాగే వామికొండ, సర్వారాయసాగర్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ కోసం రూ.170 కోట్లు, గండికోటలో శ్రీకృష్ణదేవరాయులు విగ్రహాం ఏర్పాటుకు రూ.32.5కోట్లు, ఆంధ్రప్రదేశ్ అర్బన్ బ్యూటీఫికేషన్ కార్పొరేషన్ కింద కడపకు రూ.68.45కోట్లు, బుగ్గవంక ప్రాజెక్టు ఆధునికీకరణకు రూ.100కోట్లు, చెన్నూరు సమీపంలో ఉన్న హజ్‌హౌస్ పూర్తి కోసం రూ.10 కోట్లు మొత్తం రూ.1380.9 కోట్లు కేటాయించనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఒకటా రెండా సీఎం హోదాలో హామీలిచ్చి 15నెలలైనా ఇసుమంత పురోగతి లేకపోవడంపై జిల్లా వాసులు మండిపడుతున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్వీర్యం.. వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాయలసీమ కరువు నివారణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. రాయలసీమ ప్రాజెక్టులకు నీటి కొరత లేకుండా ఉండేందుకు రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్టు (ఆర్డీఎంపీ) ప్రణాళికలు చేసింది. శ్రీశైలం రిజర్వాయర్‌లో 800 అడుగుల నీటిమట్టం వద్ద ఎత్తిపోతల పథకానికి 2020లో వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్ శ్రీకారం చుట్టింది. రోజుకు 3టీఎంసీల చొప్పున నీరు డ్రా చేసుకునే వీలుగా కార్యాచరణ చేపట్టింది. తద్వారా రాయలసీమ ప్రాజెక్టులకు నీరు పుష్కలంగా ఉండే చర్యలు చేపట్టింది. అలాగే జీఎన్ఎస్ఎస్–హెచ్ఎన్ఎస్ఎస్ అనుసంధానం ప్రక్రియను ప్రారంభించి వేగవంతంగా పనులు చేపట్టింది. ఇప్పుడా ప్రాజెక్టులన్నీ ప్రశ్నార్థకంగా మారాయి. ఏకంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సీఎం చంద్రబాబు సర్కార్ నిలిపేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభ్యర్థన మేరకు రాయలసీమ వాసులకు సీఎం చంద్రబాబు అన్యాయం చేశారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.నేడు సీఎం రాకప్రొద్దుటూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం ప్రొద్దుటూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం 10.20 గంటలకు ప్రొద్దుటూరు మండలంలోని అమృతానగర్ హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. ప్రజల వినతులను స్వీకరించిన అనంతరం రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి అమృతానగర్‌లో ఏర్పాటు చేసిన జల్‌జీవన్ మిషన్ పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం తిమ్మయ్య కల్యాణ మండపం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదికకు చేరుకుని 10.45 గంటల నుంచి 12.55 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. జిల్లా పర్యటనకు బాబు.. మహానాడు హామీల అమలుపై జిల్లా ప్రజల నిలదీత జల్ జీవన్ మిషన్ శంకుస్థాపన పేరిట ఆర్భాటం.. సీమ ప్రాజెక్టుల ఊసు మరిచిన వైనం పాత వాగ్దానాలు ‘నీళ్ల’ పాలు...‘జల్ జీవన్’తో’ నాటకాలు!శిలాఫలకాలు ఆవిష్కరించడం.. బహిరంగంగా అబద్ధాలు వల్లె వేయడం.. అదీ కాదంటే వైఎస్సార్సీపీ హయాంలో పూర్తయిన పనులను ప్రారంభించి క్రెడిట్ చోరీ చేయడం.. ఇదీ కూటమి ప్రభుత్వం కొలువుదీరాక సీఎం హోదాలో చంద్రబాబు సాగిస్తున్న పాలన తీరు. ప్రస్తుతం సీఎం, డిప్యూటీ సీఎంల ప్రొద్దు‘టూరు’ కూడా ‘క్రెడిట్ చోరీయే’. సీమ ప్రాజెక్టు ఊసు మరిచి.. పాత వాగ్దానాలు ‘నీళ్ల’పాలు చేసి... జల్‌జీవన్‌తో కొత్త నాటకాలకు తెరతీయడంపై జిల్లా ప్రజలు మండిపడుతున్నారు. హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తే రుబాబు చేయడం మినహా.. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలనే చిత్తశుద్ధి బాబుకు కరువైందని తూర్పారబడుతున్నారు.క్రెడిట్ చోరీలో భాగమే.. జల్ జీవన్ మిషన్‌లో భాగమైన పులివెందుల వాటర్ గ్రిడ్ పథకానికి 2021 జూన్‌లో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. కేంద్ర జలజీవన్ మిషన్ నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు కలిపి రూ.480 కోట్లతో ఈ పథకాన్ని రూపొందించి శరవేగంగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేశారు. అందులో భాగంగా 117.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నీటిని పులివెందుల వాటర్ గ్రిడ్ పథకానికి తీసుకురావడానికి పైపులైన్ వేయాల్సి ఉండగా 108 కిలోమీటర్లు పైపులైన్ మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో చేపట్టారు. లింగాల మండలం పార్నపల్లె వద్ద వాటర్ శుద్ధి కేంద్రాన్ని కూడా పూర్తి చేశారు. ఓవర్ హెడ్ ట్యాంకులు సంపుల తదితర పనులను కూడా పూర్తి చేశారు. దాదాపు 90 శాతం పనులు పూర్తి కాగా, రెండేళ్లు కాలంలో 10శాతం పనులు కూడా సీఎం చంద్రబాబు సర్కార్ పూర్తి చేయలేదు. తాజాగా ‘జల్‌జీవన్ మిషన్ అమరజీవి జలధార’ కార్యక్రమం పేరిట ప్రొద్దుటూరులో పైలాన్ ఆవిష్కరించనున్నారు. ఇది పూర్తిగా క్రెడిట్ చోరీ చేయడమేనని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
● అదుపు తప్పిన బొగ్గు లారీ ● క్రాస్ చేస్తూ ట్రాక్టర్‌పై బోల్తా ● ట్రాక్టర్లో ఇరుక్కుపోయి మరణించిన కూలీ చాపాడు : ముందు వెళుతున్న పశుగ్రాసం ట్రాక్టర్‌ను క్రాస్ చేయబోయి బొగ్గు లారీ బోల్తా పడింది. ఈ సమయంలో కొంత వరకు ఢీకొని.. ట్రాక్టర్‌పై బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్లో ప్రయాణించే కూలీ పల్లవోలు ప్రభు కుమార్ (34) మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం చాపాడు సమీపంలో కుందూ నది దగ్గర చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని పల్లవోలు గ్రామానికి చెందిన పల్లవోలు ప్రభు కుమార్ ఇదే గ్రామానికి చెందిన మురళి అనే వ్యక్తికి చెందిన ట్రాక్టర్లో పశుగ్రాసం కోసం శనివారం రాత్రి నెల్లూరు జిల్లా సంఘం వెళ్లారు. అక్కడి నుంచి ఆదివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో పశుగ్రాసం లోడుతో పల్లవోలు గ్రామానికి వస్తుండగా.. కుందూ నది సమీపంలో వెనుకవైపు వస్తున్న బొగ్గు లోడు లారీ ట్రాక్టర్‌ను ఓవర్ టేక్ చేయబోయి బోల్తా పడింది. ఈ ఘటనలో ట్రాక్టర్ కూడా బోల్తా పడటంతో ట్రాక్టర్ నడుపుతున్న మురళి అనే వ్యక్తి బయటికి దూకగా కూలిగా వెళ్లిన ప్రభుకుమార్ ట్రాక్టర్, లారీ కింద ఇరుక్కుపోయాడు. అప్పటికే లారీలో ఉండే డ్రైవర్ బయటికి దూకేయడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ట్రాక్టర్ కింద ఇరుక్కుపోయిన ప్రభుకుమార్‌ను ఎస్ఐ చిన్నపెద్దయ్య పర్యవేక్షణలో.. పోలీసులు 2 గంటల పాటు శ్రమించి జేసీబీ, క్రేన్ల సాయంతో బయటికి తీశారు. అప్పటికే ప్రభుకుమార్ మృతి చెందగా పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సోమవారం ప్రొద్దుటూరులో జరిగే సీఎం ప్రోగ్రాం కార్యక్రమంలో భాగంగా ఈ దారిన వెళుతున్న జేసీ నిధిమీనా దగ్గరికి.. మృతుడి బంధువులు వెళ్లి న్యాయం చేయాలని వేడుకున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ సంఘటన స్థలం వద్దకు చేరుకుని ఆరా తీశారు. ప్రభుకుమార్‌కు భార్య రాణి, కూతర్లు సలోమి(15), చందు(13), లక్ష్మీ(10) ఉన్నారు. ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక జార్జ్ కారోనేషన్ క్లబ్లో నిర్వహించిన ఎస్జీఎఫ్ఐ అండర్ –19 బాలబాలికల రైఫిల్ షూటింగ్, ఫెన్సింగ్ పోటీలు క్రీడాకారుల మధ్య ఉత్సాహంగా సాగాయి. ఈ పోటీల్లో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 100 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. రైఫిల్ షూటింగ్లో ఓపెన్‌సైట్, పీప్సైట్, పిస్టల్ విభాగాలలో పోటీలు నిర్వహించి 12 మంది క్రీడాకారులను, అలాగే ఫెన్సింగ్‌లో ఎప్పి, సాబర్, ఫాయిల్ విభాగాలలో పోటీలు జరిపి 24 మంది క్రీడాకారులను రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ఐ అండర్–19 పోటీలకు ఎంపిక చేశారు. ఈ పోటీలను జార్జ్ కారోనేషన్ క్లబ్ సెక్రటరీ మార్తల సుధాకర్‌రెడ్డి, ఎస్జీఎఫ్ఐ అండర్–19 సెక్రటరీ మురళీకృష్ణ, పోటీల అబ్జర్వర్ రాఘవేంద్ర, వ్యాయామ సంచాలకులు అల్లాబకాష్, నాగేశ్వరరావు, విలోనియారాణి పర్యవేక్షించారు. -
అతిథుల చేతిలో ఇంటర్ భవిత
కడప ఎడ్యుకేషన్ : జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాలల పరిస్థితి దారుణంగా తయారైంది. పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాల్సిన సర్కారు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంతో కళాశాలలను రెగ్యులర్ అధ్యాపకుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. కూటమి ప్రభుత్వం కొత్తగా నియామకాలు చేపట్టకపోవడంతో ఇంటర్ బోధన అంతా కాంట్రాక్టు, గెస్ట్(అతిథి) లెక్చరర్లతోనే సాగుతోంది. దీనికితోడు క్రీడారంగాన్ని కూడా పూర్తిగా పట్టించుకోకపోవడంతో విద్యార్థులు మానసిక, శారీరక ఆరోగ్యంతోపాటు ఆటలకు దూరమవుతున్నారు. అరకొర జీతాలతో కాలం వెల్లదీత! జిల్లాలోని 24 ప్రభుత్వ, 6 ఎయిడెడ్ కళాశాలల్లో కలిపి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి మొత్తం 5,350 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి నాణ్యమైన బోధన అందాలంటే రెగ్యులర్ అధ్యాపకులు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే జిల్లావ్యాప్తంగా మొత్తం 415 అధ్యాపక పోస్టులు ఉండగా, కేవలం 252 మంది మాత్రమే రెగ్యులర్ అధ్యాపకులు ఉన్నారు. మిగిలిన స్థానాల్లో 97 మంది కాంట్రాక్టు, 66 మంది గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారు. రెగ్యులర్ అధ్యాపకులకు రూ. లక్షల్లో జీతాలు ఇవ్వాల్సి వస్తుందని భావిస్తున్న కూటమి సర్కారు.. కాంట్రాక్టు లెక్చరర్లకు రూ. 57,100, గెస్ట్ లెక్చరర్లకు రూ. 27,660 ఇస్తూ కాలం నెట్టుకొస్తోంది. కాంట్రాక్టు లెక్చరర్లకు అదనపు జీతం ఇవ్వాల్సి వస్తుండటంతో, వారిని పక్కన పెట్టి గెస్ట్ లెక్చరర్లను నియమిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. వీరికి గంటకు రూ. 375 చొప్పున, నెలకు గరిష్ఠంగా 72 పీరియడ్లకు (ఏడాదిలో 11 నెలల పాటు మాత్రమే) దాదాపు రూ. 27 వేలు చెల్లిస్తూ సరిపెడుతున్నారు. ప్రమోషన్లు వచ్చినా.. పాత చోటే! జిల్లాలో ఇటీవల జూనియర్ లెక్చరర్లుగా పనిచేస్తున్న పలువురికి డిగ్రీ కళాశాల లెక్చరర్లుగా పదోన్నతి కల్పించారు. విద్యా సంవత్సరం మధ్యలో వీరు వెళ్లిపోతే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధన కుంటుపడుతుందనే నెపంతో వీరిని ఇక్కడే డిప్యూటేషన్‌పై కొనసాగిస్తున్నారు. ఇలా జిల్లావ్యాప్తంగా 28 మంది అధ్యాపకులు డిగ్రీ కళాశాల లెక్చరర్ల హోదా పొందినా.. పాత జూనియర్ లెక్చరర్ల జీతాలనే తీసుకుంటూ ఇక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. వ్యాయామ విద్య నిర్వీర్యం.. జిల్లాకు ఇద్దరే పీడీలు! కూటమి ప్రభుత్వం క్రీడారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, ఉద్యోగ నియామకాల్లో క్రీడాకారులకు 3 శాతం రిజర్వేషన్లు ప్రకటించామని గొప్పలు చెప్పుకుంటోందే తప్ప క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. సాధారణంగా విద్యార్థుల సంఖ్యను బట్టి ప్రతి కళాశాలకు ఒక పీడీ ఉండాలి. కానీ, జిల్లాలోని మొత్తం 30 కళాశాలలకు గాను కేవలం పోరుమామిళ్ల, రాజంపేట జూనియర్ కళాశాలల్లో మాత్రమే ఇద్దరు పీడీలు (ఫిజికల్ డైరెక్టర్లు) పనిచేస్తున్నారు. మిగతా ఎక్కడా వ్యాయామ ఉపాధ్యాయులు లేరు. ఉన్న పోస్టులను కూడా ఇటీవల కూటమి సర్కార్ పీడీ పోస్టుల నుండి లెక్చరర్ పోస్టులుగా కన్వర్షన్ (మార్పిడి) చేసింది. దీంతో కళాశాలల్లో వ్యాయామ విద్య పూర్తిగా నిర్వీర్యమైంది. పాఠశాల స్థాయిలో క్రీడల్లో రాణించిన క్రీడాకారులు.. జూనియర్ కళాశాలకు వచ్చే సరికి క్రీడలకు పూర్తిగా దూరమవుతున్నారు. చదువుతోపాటు క్రీడల్లో రాణించి ఉద్యోగం సాధిద్దామని ఆశపడుతున్న విద్యార్థులకు నిరాశే ఎదురవుతోంది. ఇప్పటికై నా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పూర్తిస్థాయిలో రెగ్యులర్ అధ్యాపకులు, పీడీలను నియమించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. జిల్లాలో వేధిస్తున్న రెగ్యులర్ అధ్యాపకుల కొరత కూటమి సర్కారు నిర్వాకంతో నాణ్యమైన విద్యకు దూరమవుతున్న పేద విద్యార్థులు జిల్లావ్యాప్తంగా కేవలం ఇద్దరే పీడీలు.. క్రీడారంగానికి పూర్తిగా తిలోదకాలుబోధనకు ఎలాంటి ఆటంకం లేదు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనలకు ఎలాంటి ఆటంకం లేదు. ఉద్యోగ విరమణ పొందిన అధ్యాపకుల స్థానాల్లో గెస్టు లెక్చరర్లను నియమించి బోధనలు సాగిస్తున్నాం. ప్రభుత్వం త్వరలోనే రెగ్యులర్ అధ్యాపక పోస్టుల నియామక ప్రక్రియ చేపట్టనుంది. ఆ తర్వాత అన్ని కళాశాలలకు పూర్తిస్థాయిలో రెగ్యులర్ అధ్యాపకులు వస్తారు. – పి.ఎల్.ఎన్. ప్రకాస్రావు పట్నాయక్, డీవీఈఓ, ఇంటర్ విద్య -
బాడుగ కార్లు.. తాకట్టు పెట్టి..
● కలసపాడు యువకుడు ఘరానా మోసం ● హైదరాబాద్ సంస్థ బోర్డు తిప్పేయడంతో వెలుగులోకి.. ● జిల్లాలో 50 కార్ల గుర్తింపు కలసపాడు : కలసపాడు, కాశినాయన మండలాల్లో.. బాడుగ కార్లతో తాకట్టు దందా వెలుగులోకి వచ్చింది. కార్లను బోగస్‌గా తాకట్టుపెట్టి లక్షలాది రూపాయలు వసూలు చేసి తాకట్టుదారులను నిలువునా ముంచాడు ఓ ఘనుడు. అసలు యజమానులు తమ కార్లు తాకట్టులో ఉన్నాయని గగ్గోలు పెట్టడంతో.. బోగస్ కార్ల దందా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా కొందరు.. కార్లను బాడుగకు పెట్టుకుంటామని సంస్థను స్థాపించి పలువురి వద్ద నుంచి కార్లను సేకరించారు. నెల నెలా బాడుగ పంపుతున్న సంస్థ నుంచి బాడుగ రాకపోవడంతో కార్ల యజమానులు ఆరా తీశారు. సంస్థ బోర్డు తిప్పేయడంతో తమ కార్ల గురించి విచారణ చేశారు. కలసపాడు, కాశినాయన మండలాల్లో హైదరాబాద్‌కు చెందిన సుమారు 50 కార్ల వరకు ఉన్నట్లు గుర్తించారు. పోలీస్‌స్టేషన్‌కు చేరిన సమస్య కలసపాడు మండలం మహానందిపల్లెకి చెందిన ఓ యువకుడు హైదరాబాద్‌లో ఉంటున్నాడు. అతను హైదరాబాద్‌లోని సంస్థ నుంచి కార్లు బాడుగకు తీసుకున్నాడు. వాటిని ఇక్కడ కుదవ పెట్టాడు. తమ వద్ద కార్లు ఉన్నాయని, కొంత డబ్బు అవసరం ఉందని.. తిరిగి వడ్డీతో సహా చెల్లిస్తామని, కార్లు ఉంచుకుని తాకట్టుకు ఇవ్వాలని అతను ఇక్కడి ప్రజలను నమ్మించాడు. తమ డబ్బుకు వడ్డీతోపాటు కార్లు వస్తున్నాయని ఆశపడ్డ జనం తాకట్టుకు ఎగపడ్డారు. తీరా తెలంగాణ కార్ల యజమానులు ఆరా తీయడంతో.. అవి అసలు తాకట్టు కార్లు కావని, బోగస్ సంస్థ నుంచి తమకు అందజేశారని తెలుసుకున్నారు. కార్ల యజమానులు వచ్చి తమ కార్లను తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. తాకట్టుదారులు అందజేసేందుకు నిరాకరించారు. విషయం పోలీసుల వరకు వెళ్లడంతో.. తెలంగాణ కార్ల యజమానులకు వారు సర్దిచెప్పి డబ్బు చెల్లించి తీసుకెళ్లాలని తేల్చి చెప్పారు. తెలంగాణ కార్ల యజమానులు లీగల్ గానే ముందుకెళ్లేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. అక్కడ కేసు నమోదు చేయించి లీగల్‌గా కార్లు తీసుకెళ్లాలని వారు భావిస్తున్నట్లు తెలిసింది. దీంతో కార్లు తాకట్టులో పెట్టుకుని డబ్బులు అందజేసిన వారు ఆందోళనకు గురవుతున్నారు. తమ డబ్బు పోగొట్టుకోవడమే కాకుండా లీగల్‌గా కేసును ఎదుర్కోవాల్సి వచ్చిందని భయాందోళన చెందుతున్నారు. కార్ల దందా పంచాయతీపై తెలంగాణ పోలీసులు ఏవిధంగా చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. -
కార్యకర్తల జోలికొస్తే సహించం
రాజంపేట : అధికారం అండతో ఈ రోజు విర్రవీగుతున్న వారికి ఒకటే చెబుతున్నామని, ఈ ప్రభుత్వానికి మిగిలింది కేవలం రెండేళ్ల కాలం మాత్రమేనని రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి హెచ్చరించారు. వచ్చేది మన ప్రభుత్వమేనని, ఆ రోజు వీరంతా ఎక్కడ పోయి దాక్కుంటారని ఆయన ఎద్దేవా చేశారు. రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి అధ్యక్షతన ఆకేపాటి ఎస్టేట్‌లోని సభాభవనంలో నిర్వహించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఎంపీ మిథున్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని అహంకారంతో ప్రవర్తిస్తే, ఆ తర్వాత ఐదేళ్లు వారి పరిస్థితి అత్యంత దారుణంగా ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల వేళ అనవసరంగా రాద్ధాంతాలు చేస్తూ, గొడవలకు దిగితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని గుర్తుంచుకోవాలన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో గత ఐదేళ్ల పాటు అందరూ సామరస్యంగా ఉన్నారని, ఎక్కడా కక్షసాధింపులు జరగలేదని గుర్తుచేశారు. గణేష్ నిమజ్జనం పర్వదినం తర్వాత కొందరు కావాలనే తమ ఇంటి ముందు డీజేలు పెట్టి, పోలీసు బందోబస్తు మధ్య దూషిస్తూ అవమానకరంగా ప్రవర్తించారని మండిపడ్డారు. తాము గనుక ఆ రోజు దృష్టి పెట్టి ఉంటే రాష్ట్రంలో ఈ రోజు వారు ఉండే వారా అని ప్రశ్నించారు. కార్యకర్తలకు కొండంత అండ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని, న్యాయపరంగా వైఎస్సార్సీపీ పూర్తి వకాల్తా పుచ్చుకుని కేసులను నడిపిస్తుందని ఎంపీ భరోసా ఇచ్చారు. కార్యకర్తలకు ఎలాంటి నష్టం జరిగినా.. దాన్ని నా సొంత నష్టంగా భావించి అండగా ఉంటానని ప్రకటించారు. తాను ఎంపీగా ఉన్నానంటే దానికి కారణం ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి అని అన్నారు. అలాగే రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డికి ఎల్లప్పుడూ సాయం చేసే గుణం ఉందని కొనియాడారు. పార్టీలో ఎలాంటి వర్గాలు లేవని, ఇక్కడ ఉన్నదల్లా ఒకే ఒక్క ’జగనన్న వర్గం’.. అది ’వైఎస్సార్సీపీ’ మాత్రమేనని స్పష్టం చేశారు. రాజంపేటపై చంద్రబాబు కక్ష గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీని గెలిపించారనే కక్షతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజంపేట నియోజకవర్గంపై కక్షగట్టారని, ఆ విషయాన్ని వారి పార్టీ నేతలే స్వయంగా చెప్పుకొంటున్నారని మిథున్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికల ముందు కూటమి అధికారంలోకి వస్తే చెయ్యేరు ప్రాజెక్టు పూర్తి చేసి నీటి సమస్య లేకుండా చేస్తామని హామీ ఇచ్చి, తీరా గెలిచాక గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలను, టెండర్లను రద్దు చేయడం ఎంత వరకు సమంజసమని నిలదీశారు. వైఎస్సార్సీపీని గెలిపించి మళ్లీ మా దగ్గరికే నిధుల కోసం వస్తున్నారా అంటూ చంద్రబాబు హేళనగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఖజానాలోని డబ్బునంతా చంద్రబాబు తన భూముల చుట్టూ ఉన్న అమరావతికే కేటాయిస్తున్నారని ఆరోపించారు. అన్నమయ్య డ్యామ్‌ను పట్టించుకోరేమి? అమరావతిలో చదరపు అడుగుకు రూ.2 వేల విలువైన కాంట్రాక్టు పనులను రూ.20 వేలకు కట్టబెడుతూ భారీ కుంభకోణానికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. అక్కడ నీళ్లు తోడిపోసేందుకు వృథా చేస్తున్న నిధులను అన్నమయ్య డ్యామ్‌కు కేటాయిస్తే ప్రాజెక్టు నిర్మాణం ఎప్పుడో పూర్తయ్యేదన్నారు. సామాన్య ప్రజల కోసం రూ.2 కోట్లు ఇవ్వాలంటే వందసార్లు ఆలోచించే ఈ ప్రభుత్వం, అమరావతిలో మాత్రం ప్రజాధనాన్ని విచ్చలవిడిగా తగలేస్తోందని విమర్శించారు. గతంలో వైఎస్ జగన్మోన్రెడ్డి ఇచ్చిన హామీలైన మెడికల్ కాలేజీ, చెయ్యేరు ప్రాజెక్టుతోపాటు అన్ని హామీలను మళ్లీ జగనన్న ప్రభుత్వం రాగానే నెరవేరుస్తామని స్పష్టం చేశారు. రాజంపేట పార్లమెంట్ పరిశీలకుడు సురేష్‌బాబు, కడప పార్లమెంట్ పరిశీలకుడు అజయ్‌రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో రాజంపేట పరిశీలకులు దేవనాథరెడ్డి, రాజంపేట ఇన్చార్జి ఆకేపాటి అనిల్‌రెడ్డి, మున్సిపాలిటీ చైర్మన్ పోలా శ్రీనివాసులరెడ్డి, ఏఐటీఎస్ వైస్ చైర్మన్ చొప్పాఎల్లారెడ్డి, వైఎస్సార్సీపీ మహిళ ప్రధాన కార్యదర్శి ఏకుల రాజేశ్వరీరెడ్డి, వివిధ మండలాల పార్టీ కన్వీనర్లు గోపిరెడ్డి, టక్కోలు శివారెడ్డి, మణిరాజు, రామస్వామిరెడ్డి, నీలకంఠారెడ్డి, భాస్కరరాజుతోపాటు నియోజకవర్గ నేతలు పాల్గొన్నారు. ఇక మిగిలింది రెండేళ్లే.. వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే అక్రమ కేసులకు భయపడొద్దు ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జెండాను ఎగురవేయాలి. నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా శ్రమించి పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలి. రాజంపేట అంటే వైఎస్సార్సీపీ కంచుకోట అని మరోసారి నిరూపించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. భవిష్యత్తులో కష్టపడిన క్యాడర్‌కే సముచిత ప్రాధాన్యత ఉంటుంది. – ఆకేపాటి అమర్నాథరెడ్డి, ఎమ్మెల్యే, రాజంపేట రాజంపేట నియోజకవర్గంలోని మున్సిపాలిటీతోపాటు ఆరు మండలాల్లోనూ వైఎస్సార్సీపీ సత్తా చాటాలి. పార్టీ శ్రేణులందరికీ నేను, ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి ఎల్లప్పుడూ అండగా ఉంటాం. కార్యకర్తలు, నాయకులు చిత్తశుద్ధితో పని చేయాలి, పార్టీ మీకు వెనుదన్నుగా నిలుస్తుంది. – మేడా రఘునాథరెడ్డి, రాజ్యసభ సభ్యుడు -
నేడు ప్రొద్దుటూరులో ట్రాఫిక్ ఆంక్షలు
ప్రొద్దుటూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆధ్వర్యంలో 2000 మంది పోలీసులతో పటిష్టబందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా పట్టణంలో సోమవారం ఉదయం 7 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కడప నుంచి జమ్మలమడుగు లేదా ఎర్రగుంట్ల వైపు వెళ్లే వాహనాలను కొత్తపల్లి సర్కిల్లోని డీ మార్ట్ వద్ద డైవర్షన్ చేయనున్నట్లు తెలిపారు. అక్కడి నుంచి రిలయన్స్ పెట్రోలు బంకు మీదుగా వాసవి సర్కిల్ నుంచి జమ్మలమడుగు, ఎర్రగుంట్ల వైపు వాహనాలు వెళ్లాల్సి ఉంటుందన్నారు. జమ్మలమడుగు నుంచి కడప వైపునకు వెళ్లే వాహనాలు వైఎస్సార్ సర్కిల్ నుంచి వాసవి సర్కిల్, రిలయన్స్ పెట్రోలు బంకు మీదుగా కొత్తపల్లె సర్కిల్‌కు వెళ్లాల్సి ఉంటుందన్నారు. మైదుకూరు వైపు నుంచి వచ్చే వాహనాలు కొత్తపల్లె సర్కిల్, వాసవి సర్కిల్, వైఎస్సార్ సర్కిల్ మీదుగా బొల్లవరంలోని మున్సిపల్ ప్లాట్లలో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలలో వాహనాలను నిలుపుకోవాలని సూచించారు. -
అధికారమే అండ.. తవ్వేస్తున్నారు ముక్కొండ
చాపాడు: మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని ముక్కొండ గగ్గితిప్పను బోడి గుండు కొట్టిస్తున్నారు. రోజూ వందల కొద్దీ టిప్పర్లు, ట్రాక్టర్లతో కొండ మట్టిని అక్రమంగా తరలిస్తూ అధికార పార్టీ నేతలు జేబులు నింపుకొంటున్నారు. పేరుకేమో బెంగళూరు–విజయవాడ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే రోడ్డు నిర్మాణానికి.. మట్టి తరలించేందుకు సదరు నిర్మాణ సంస్థ అనుమతులు తెచ్చుకుంది. ఇప్పటికే రోడ్డు నిర్మాణానికి అవసరమైన మేరకు మట్టిని తరలించేశారు. రోడ్డుపై బీటీ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రోడ్డు నిర్మాణ పనుల మాటున అధికార పార్టీ నేతలు వందల సంఖ్యలో టిప్పర్లు, ట్రాక్టర్లతో మట్టిని మైదుకూరు, ప్రొద్దుటూరు, బద్వేలు, కడప నియోజకవర్గాలకు తరలిస్తూ కోట్లాది రూపాయలు అక్రమ మార్గంలో సంపాదిస్తున్నారు. ఈ తతంగం మొత్తం అన్ని శాఖలకు చెందిన అధికారులు చూస్తున్నప్పటికీ చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. మల్లేశ్వరస్వామి కొలువుదీరి ఉన్నా... గత ప్రభుత్వ హయాంలో వైజాగ్ వద్ద గల రుషికొండను పర్యాటక అభివృద్ధి చేస్తూ భవనాలను నిర్మించే క్రమంలో.. రుషికొండను బోడిగుండు కొట్టిస్తున్నారంటూ ఇప్పటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అప్పట్లో నానా హంగామా చేసిన విషయం తెలిసిందే. మైదుకూరు – బద్వేలు జాతీయ రహదారి పక్కనే ఉన్న ఈ కొండపై మల్లేశ్వరస్వామి కొలువుదీరి ఉన్నారు. దారిన వెళ్లే చూపరులను ఈ ముక్కొండ అందాలు కనువిందు చేస్తాయి. ఇలాంటి కొండ చుట్టూ పెద్ద ఎత్తున తవ్వకాలు చేపట్టడంతో.. కొండను ముక్కలు చేస్తున్నారంటూ దారిన వెళ్లే వారు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికార యంత్రాంగం స్పందించి ముక్కొండను కొల్లగొట్టడంపై చర్యలు తీసుకుని ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని కోరుకుంటున్నారు. రోడ్డు నిర్మాణం మాటున మట్టి దోపిడీ రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా పట్టించుకోని అధికార యంత్రాంగం -
రామయ్య సన్నిధిలో కేంద్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి
ఒంటిమిట్ట: ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయాన్ని శనివారం కేంద్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి ఎ. వెంకటేశ్వర రావు, ఆయన కుటుంబ సభ్యులు సందర్శించారు. ఈ సందర్భంగా అర్చకులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. గర్భాలయంలోని సీతారామలక్ష్మణుల మూల విరాట్ విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆలయ రంగమండపంలో సేదతీరిన వారికి ఆలయ అర్చకులు వీణా రాఘవాచార్యులు ఆలయ విశిష్టత గురించి వివరించి, స్వామి వారి తీర్థప్రసాదాలను అందించారు. ఆలయ ఏఈవో రవి, సిబ్బంది పాల్గొన్నారు. -
● పెనవేసుకుంటున్న పెంపుడు బంధాలు
కడప అగ్రికల్చర్: ఉరుకుల పరుగుల జీవితంలో ఒంటరితనం, మానసిక ఒత్తిడిని దూరం చేసుకునేందుకు నేడు చాలామంది పెంపుడు జంతువులను (పెట్స్) ఆశ్రయిస్తున్నారు. ఒకప్పుడు కేవలం ఇంటి కాపలా కోసమే కుక్కలను పెంచేవారు. కానీ, ప్రస్తుతం కాలం మారడంతో వాటిని కుటుంబంలో ఒకరిగా భావిస్తూ ఎంత ఖర్చయినా వెనకాడకుండా కన్నబిడ్డల్లా సాకుతున్నారు. మరికొందరు వీధి కుక్కలను దత్తత తీసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మనుషుల బంధాలలో కల్తీ ఉండొచ్చేమో కానీ, మూగజీవాల ప్రేమానురాగాలలో ఎలాంటి కల్మషం ఉండదని జంతు ప్రేమికులు చెబుతున్నారు. పెంపుడు జంతువులతో సమ యం గడపడం వల్ల ఒత్తిడి తగ్గి, రక్తపోటు అదుపులో ఉంటుందని వైద్య పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. పెంపుడు జంతువులపై నిస్వార్థమైన ప్రేమ.. పెంపుడు జంతువులు కేవలం సరదాకో, హోదా కోసమో కాకుండా కుటుంబ సభ్యుల్లా నిస్వార్థమైన ప్రేమను పంచుతూ విడదీయరాని బంధాన్ని ఏర్పరుచుకుంటున్నాయని ఇన్సూరెన్స్ మేనేజర్ జగదీష్, సేల్స్ మేనేజర్ వెంకటసుబ్బయ్య, దేవుని కడపకు చెందిన మంజుల, జంతు ప్రేమికురాలు కావ్య తమ అనుభవాలను పంచుకున్నారు. ఒక్కోసారి వాటి సంరక్షణ కోసం తిరుపతి ట్రిప్స్ కూడా రద్దు చేసుకుంటున్నామని, వాటి తిండి, హెయిర్ కటింగ్ కోసం నెల నెలా వేల రూపాయలు ఖర్చు చేస్తున్నా భారం కాదని, ఇంట్లో మనుషుల్లా చూసుకుంటున్నామని వారు వివ రించారు. ఈ మూగజీవులను తెచ్చుకున్నాక భారంగా భావించి రోడ్లపై వదిలేయడం నేరమని, జీవితాంతం చూసుకునే నిబద్ధత ఉన్నప్పుడే పెంచాలని బద్వేలు అర్బన్ సీఐ బావిగడ్డ రామకృష్ణ స్పష్టం చేశారు. అదే సమయంలో, పెంపుడు జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే జూనోటిక్ వ్యాధుల పట్ల యజమానులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కడప పీవీపీ డీడీ రంగస్వామి సూచించారు. 1. ప్రాజెక్ట్ రీ–హాబ్ (కర్ణాటక మోడల్) తేనెటీగల కంచె : కర్ణాటకలోని కొడగు ప్రాంతంలో ఈ వినూత్న ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేశారు. ఏనుగులు వచ్చే దారుల్లో వరుసగా తేనెటీగల పెట్టెలను తాడుతో అనుసంధానించి ఏర్పాటు చేస్తారు. ఏనుగులు ఆ తాడును తాకగానే తేనెటీగలు ఒక్కసారిగా పైకి లేస్తాయి. ఏనుగులకు తేనెటీగల జుమ్మనే శబ్దం అస్సలు పడదు. దీంతో ఏనుగుల మందలు గాయపడకుండానే వెనక్కి వెళ్లిపోతాయి. 2. ఏఐ ముందస్తు హెచ్చరికలు (అస్సాం, ఏపీ) ఏఐ ఆధారిత నిఘా: అడవి సరిహద్దుల్లో థర్మల్ కెమెరాలు, సెన్సార్లతో కూడిన ఏఐ సిస్టమ్‌లను ఏర్పాటు చేశారు. ఏనుగుల మంద అడవి దాటి గ్రామ సరిహద్దుల్లోకి రాగానే ఈ ఏఐ కెమెరాలు వాటిని గుర్తించి, తక్షణమే అటవీ అధికారులకు ఆటోమేటిక్ అలర్ట్ మెసేజ్‌లను పంపుతాయి. 3. ప్రత్యామ్నాయ పంటల సాగు (కేరళ మోడల్) పంటల మార్పిడి వ్యూహం: కేరళ అటవీ శాఖ సరిహద్దు గ్రామాల్లోని రైతులతో ఏనుగులు అస్సలు తినని, అసహ్యించుకునే లెమన్‌గ్రాస్, అల్లం, పసుపు, మిరప వంటి ప్రత్యామ్నాయ వాణిజ్య పంటలను సాగు చేయిస్తోంది. దీనివల్ల పంట నష్టం పూర్తిగా తగ్గింది. -
పులిచెర్లకు గజగండం !
పులిచెర్ల(కల్లూరు): అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో ఎక్కడ లేని విధంగా పులిచెర్ల మండలంలో ఏనుగుల సమస్య పరాకాష్టకు చేరింది. గత రెండేళ్లుగా ఇక్కడ ఏదో ఒక గ్రామంలో ఏనుగుల గుంపు తిష్ఠ వేస్తూనే ఉంది. ఎందరో అధికారులు వచ్చి వీటిని వేరే ప్రాంతానికి తరలించాలని చూస్తున్నా.. గజరాజులు మాత్రం పులిచెర్ల సరిహద్దులు దాటడం లేదు. చుట్టూ దట్టమైన అడవి ఉండటంతో.. పగలంతా అడవుల్లో ప్రశాంతంగా సేదతీరుతున్న ఏనుగులు, చీకటి పడగానే పొలాలపై పడి బీభత్సం సృష్టిస్తున్నాయి. మామిడి తోటలే వాటికి ‘మధురాహారం’ పులిచెర్ల మండలంలో విస్తారంగా మామిడి తోటలు ఉండటమే ఈ సమస్యకు ప్రధాన కారణంగా మారింది. ఏనుగులకు ఇక్కడ ఆహారం సులభంగా, పుష్కలంగా దొరుకుతోంది. ముఖ్యంగా సీజన్ వచ్చిందంటే చాలు.. మామిడి తోపుల్లో చేరి, కాయలను తినడమే కాకుండా ఎంతో కాలంగా పెంచిన పెద్ద పెద్ద కొమ్మలను సైతం విరిచేస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా కంటికి రెప్పలా కాపాడుకున్న చెట్లు కళ్ల ముందే విరిగిపోతుంటే రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. దీనికి తోడు నెమళ్ల గుంపులు కూడా తోటలపై పడి పంటను నాశనం చేస్తున్నాయి. -
ఆకలి పంజరంలో
భూమిపై ఉన్న అత్యంత తెలివైన, గంభీరమైన వన్యప్రాణులలో ఏనుగులు అగ్రస్థానంలో నిలుస్తాయి. పర్యావరణ వ్యవస్థను సమతుల్యంగా ఉంచడంలో వాటిని ‘అడవుల సంరక్షకులు’గా పిలుస్తాం. అయితే, ప్రస్తుతం భారతదేశంలో నెలకొన్న పరిస్థితులు ఈ గజరాజుల ఉనికికే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది అన్నదాతల జీవనోపాధికి కూడా పెద్ద సవాలుగా మారాయి. ఇటీవల అన్నమయ్య జిల్లా శివారు,వైఎస్సార్ జిల్లా, చిత్తూరు జిల్లా పులిచెర్ల (కల్లూరు) మండలంలో ఏనుగుల గుంపు హఠాత్తుగా చొరబడి వరి, అరటి, మామిడి, కొబ్బరి తోటలను పూర్తిగా ధ్వంసం చేసింది. ఎందరో అన్నదాతలు చేతికొచ్చే పంట నేలపాలై కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ స్థానిక సమస్య కేవలం ఒక జిల్లాకో, రాష్ట్రానికో పరిమితమైంది కాదు.. ఇది నేడు జాతీయస్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ‘మానవ–వన్యప్రాణి సంఘర్షణ’కు సజీవ సాక్ష్యం. (షేక్ ముజుబుద్దీన్) ● ముక్కలవుతున్న అడవులు.. పొలాలపై భీకరి దాడులు ● గజ..గజ.. వణుకుతున్న రైతులు ‘నేడు వరల్డ్ యానిమల్ డే. ఈ ఏడాది థీమ్ See the World Through Their Eyes (వాటి కళ్ళ ద్వారా ప్రపంచాన్ని చూడండి). అడవుల ఆక్రమణతో మూగజీవాలు అనుభవిస్తున్న ఆకలిని, ఆవాసాల విచ్ఛిన్నాన్ని వాటి కోణంలో అర్థం చేసుకున్నప్పుడే నిజమైన పరిష్కారం దొరుకుతుంది. పులిచెర్ల రైతాంగానికి పంట భరోసా కల్పిస్తూనే, గజరాజుల ఉనికికి ముప్పు రాకుండా సాంకేతిక సహజీవనం వైపు అడుగులు వేయడమే మనం సాధించాల్సిన అసలైన లక్ష్యం. -
ముఖ్యమంత్రి సభకు పకడ్బందీ ఏర్పాట్లు
ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరులోని జమ్మలమడుగు బైపాస్ రోడ్డులో సోమవారం నిర్వహించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ల భారీ బహిరంగ సభకు పకడ్బందీ ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ మెగా సభకు ఉమ్మడి జిల్లాలోని దాదాపు 10 నియోజకవర్గాల నుండి సుమారు లక్ష మంది హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు రాష్ట్ర మంత్రులు బి.సి.జనార్ధన్‌రెడ్డి, పొంగూరు నారాయణ, జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్‌లు అధికారులతో కలిసి సభా ప్రాంగణాన్ని క్షేత్రస్థాయిలో ముమ్మరంగా పరిశీలించారు. ఎన్నికల హామీల అమలులో భాగంగా రూ. 30 వేల కోట్ల భారీ వ్యయంతో ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందించేందుకు జలజీవన్ మిషన్ పనుల పైలాన్, శిలాఫలక నిర్మాణ పనులను కలెక్టర్, ఎస్పీలు పర్యవేక్షించారు. సభకు వేలాదిగా ప్రజలు తరలివస్తున్నందున ప్రాంగణంలో గ్యాలరీలు,వీఐపీ భద్రత, నేతల లైనప్, బారికేడ్ల ఏర్పాటు, వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ మళ్లింపు, పారిశుధ్యం మరియు తాగునీటి సరఫరా అంశాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అత్యంత పకడ్బందీగా చర్యలు చేపట్టాలని మంత్రులు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే 50 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను ఆది వారం సాయంత్రం లోపు పూర్తి చేస్తామని స్థానిక ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వెల్లడించారు. -
రైల్వే సమస్యల పరిష్కారానికి కృషి
రాజంపేట: ప్రాంతీయ రైల్వే సమస్యల పరిష్కారానికి, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు నిరంతరం కృషి చేస్తానని రైల్వే స్టాండింగ్ కమిటీ సభ్యుడు, రాజ్య సభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి తెలిపారు. శనివారం రాజంపేటలోని మేడా భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తనకు రెండో సారి ఈ అవకాశం కల్పించినందుకు కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కమిటీ సమావేశాల్లో రైల్వే భద్రత, స్టేషన్ల పునరుద్ధరణపై దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు. జిల్లా మీదుగా నడిచే ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కోవిడ్–19 కంటే ముందున్న హాల్టింగ్స్‌ను పునరుద్ధరించాలని రైల్వే బోర్డును కోరనున్నట్లు వివరించారు. నందలూరు: కాచిగూడ–చిత్తూరు మధ్య నడిచే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌కు నందలూరు రైల్వే స్టేషన్లో నిలుపుదల (హాల్ట్) కల్పించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. శనివారం రైలు స్టేషన్‌కు చేరుకున్న సందర్భంగా వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ సిద్ధవరం గోపిరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు ఘనస్వాగతం పలికారు. రైలు డ్రైవర్‌ను శాలువాతో సన్మానించి, ప్రయాణికులకు స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. నందలూరు ప్రజల చిరకాల డిమాండ్‌పై స్పందించి, రైలు నిలుపుదలకు ప్రత్యేకంగా కృషి చేసిన రాజ్యసభ సభ్యుడు మేడ రఘునాథరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. -
డాక్టర్ ఇ.సి.గంగిరెడ్డి జీవితం.. ఆదర్శనీయం
పులివెందుల : ప్రముఖ వైద్యుడు డాక్టర్ ఇ.సి.గంగిరెడ్డి జీవితం ఆదర్శవంతమైనదని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి వైఎస్ భారతీరెడ్డి పేర్కొన్నారు. శనివారం పులివెందులలో డాక్టర్ ఇ.సి.గంగిరెడ్డి 6వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. స్థానిక డిగ్రీ కళాశాల రోడ్డులో గల వైఎస్ కుటుంబ సమాధుల తోటలో ఉన్న డాక్టర్ ఇ.సి.గంగిరెడ్డి ఘాట్ వద్ద గంగిరెడ్డి కుమార్తె, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతీరెడ్డి, డాక్టర్ ఇ.సి.గంగిరెడ్డి సతీమణి డాక్టర్ ఇ.సి.సుగుణమ్మ, కుమారుడు డాక్టర్ ఇ.సి.దినేష్‌రెడ్డిలు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భాకరాపురంలో ఉన్న దినేష్ నర్సింగ్ హోం (గంగిరెడ్డి ఆసుపత్రి)లో వైఎస్ భారతీరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి డాక్టర్ ఇ.సి.గంగిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం అక్కడ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ భారతీరెడ్డి మాట్లాడుతూ తన తండ్రి డాక్టర్ ఇ.సి.గంగిరెడ్డి పేద ప్రజల పట్ల ఎంతో ప్రేమ, దయతో ఉండేవారన్నారు. ఎంతో మంది పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించి ఈ ప్రాంతంలో ప్రాణదాతగా నిలిచారన్నారు. పేదల జీవితాలను మెరుగుపరచాలని ఆయన తపనపడేవారన్నారు. ఆయనను చూసి తాము ఎంతో నేర్చుకోగలిగామని, తమ పిల్లలకు కూడా ఆయన పేదల పట్ల సేవాభావంతో ఉండాలని సూచించేవారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి సతీమణి వైఎస్ లక్ష్మీదేవమ్మ, వైఎస్ ప్రతాప్‌రెడ్డి, పులివెందుల మున్సిపల్ ఇన్‌ఛార్జి వైఎస్ మనోహర్‌రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ ప్రమీలమ్మ,.. వైఎస్ ప్రతాప్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, వైఎస్సార్ ఫౌండేషన్ చైర్మన్ జనార్ధన్‌రెడ్డి, ఇ.సి.గంగిరెడ్డి సోదరి పెద్దక్క, వైఎస్సార్ అర్కిటెక్చర్ కళాశాల మాజీ రిజిస్ట్రార్ సురేంద్రనాథరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు నాగెళ్ల సాంబశివారెడ్డి, లక్ష్మీరెడ్డి, రసూల్, సుధీకర్‌రెడ్డి, ఈశ్వరయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు. ఘనంగా డా.ఇ.సి.గంగిరెడ్డి 6వ వర్ధంతి నివాళులర్పించిన కుమార్తె వైఎస్ భారతి, సతీమణి సుగుణమ్మ, కుమారుడు దినేష్‌రెడ్డి దినేష్ నర్సింగ్ హోంలో ప్రత్యేక ప్రార్థనలు, అన్నదానం -
కేసుల పరిష్కారానికి కృషి చేయాలి
కడప అర్బన్ : రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మార్గదర్శకాల మేరకు కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి.రామగోపాల్ జిల్లాలోని న్యాయమూర్తులతో జిల్లా కోర్ట్ హాల్లో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో నల్సా మీడియేషన్ 3.0, నవంబర్ 21న నిర్వహించనున్న ప్రత్యేక లోక్ అదాలత్, డిసెంబర్ 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌పై చర్చించారు. రాజీకి అవకాశం ఉన్న కేసులను గుర్తించి, కక్షిదారులకు అవగాహన కల్పించి, ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యేలా సమన్వయంతో కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికారసంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి ఎస్.బాబా ఫకృద్దీన్, ఉమ్మడి కడప జిల్లా న్యాయమూర్తులు పాల్గొన్నారు. శిక్షణ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రామ్‌గోపాల్ ఆధ్వర్యంలో కడప యూనిట్లో న్యాయమూర్తులకు జిల్లా కోర్టు ఆవరణలో ‘కంప్యూటర్ నైపుణ్యాల పెంపుదల స్థాయి 1 స్థాయి 2లపై కార్యక్రమం నిర్వహించారు. మాస్టర్ ట్రైనర్, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జ్ జి.సి.ఆసిఫా సుల్తానా, మాస్టర్ ట్రైనర్ అండ్ జూనియర్ సివిల్ జడ్జి కమలాపురం ఎస్.మధుసూదన్ రావు శిక్షణ ఇచ్చారు. -
‘ఇన్స్పైర్ మనాక్’లో మెరిసిన మనోళ్లు
● జాతీయ స్థాయికి జిల్లా నుంచి రెండు ప్రాజెక్టులు ఎంపిక ● విద్యార్థులను అభినందించిన డీఈఓ, డీఎస్ఓకడప ఎడ్యుకేషన్ : ఇన్స్పైర్ మనాక్ పోటీల్లో వైఎస్సార్ జిల్లా విద్యార్థులు తమ అద్భుత ప్రతిభతో మెరిశారు. ఇన్స్పైర్ మనాక్ జాతీయ స్థాయి పోటీలకు వైఎస్సార్ జిల్లాకు చెందిన రెండు ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. ఇందులో 2023–24 విద్యా సంవత్సరానికి అలాగే 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థులు వినూత్న రీతిలో రూపొందించి ప్రదర్శించిన ప్రాజెక్టులు జాతీయ స్థాయికి ఎంపికయ్యాయి. 2023–24 విద్యా సంవత్సరానికి.. కడపలోని నిర్మలా ఇంగ్లిష్ మీడియం హైస్కూల్‌కు చెందిన విద్యార్థి ఇ.బాలమధు రూపొందించిన ‘స్మాట్ చార్జింగ్ విత్ అటోమేనిట్ పవర్ కట్ ఆఫ్ ఫర్ ఎలక్ట్రిటిక్ వెహిల్స్’ అనే ప్రాజెక్టు జాతీయస్థాయికి ఎంపికై ంది. ఈ ప్రాజెక్టుకు మార్గదర్శక ఉపాధ్యాయులుగా చిన్నపుల్లయ్య వ్యవహరించారు. 2024–25 విద్యా సంత్సరానికి.. కడపలోని హజ్రత్ ఆయేషా ఇంగ్లిష్ మీడియం హైస్కూల్‌కు చెందిన విద్యార్థి ఎస్.సనా ఫాతిమా రూపొందించిన ‘సెల్ప్ డ్రైవ్ ఓవర్ టేకింగ్ అలెర్ట్ సిస్టమ్’ అనే ప్రాజెక్టు జాతీయ స్థాయికి ఎంపికై ంది. ఈ ప్రాజెక్టుకు మార్గదర్శక ఉపాధ్యాయురాలిగా సయ్యద్ నజ్నీస్ వ్యవహరించారు. జాతీయస్థాయి ఇన్‌స్పైర్‌కు ఎంపికై న విద్యార్థులను, మార్గదర్శకం వహించిన ఉపాధ్యాయులను డీఈఓ షేక్ షంషుద్దీన్, డీఎస్ఓ లేవాక బాలాజీ అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల్లో శాసీ్త్రయ ఆలోచన, సృజనాత్మకత, నూతన ఆవిష్కరణ పట్ల ఆసక్తి, పరిశోధన దృకృథాన్ని పెంపొందించడంలో ఇన్స్పైర్ మనాక్ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. 2026 అక్టోబర్ 12 నుంచి 14వ తేదీ వరకు ఢిల్లీలో నిర్వహించనున్న జాతీయ స్థాయి ఇన్స్పైర్ మనాక్ కార్యక్రమంలో విద్యార్థులు ఈ ప్రాజెక్టులను ప్రదర్శిస్తారని తెలిపారు. జాతీయ స్థాయిలో కూడా విజయం సాధించి జిల్లాకు మరింత గుర్తింపు తీసుకురావాలని వారు విద్యార్థులకు సూచించారు. -
చిన్నారికి పునర్జన్మ
కడప రూరల్ : కేవలం 6 నెలలకే 610 గ్రాముల బరువుతో జన్మించిన చిన్నారికి చికిత్స అనంతరం పునర్జన్మ లభించింది. శనివారం స్థానిక కడప నగరంలోని కేఎస్‌హెచ్ పురిటి చిన్నపిల్లల ఆసుపత్రిలో చిన్నపిల్లల వైద్యులు కే సద్దాం హుస్సేన్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బద్వేలు మండలం మడకవారిపల్లెకు చెందిన గంగులయ్య, విజయ దంపతులకు ఆరు నెలలకే 610 గ్రాములతో మగ శిశువు జన్మించాడని తెలిపారు. జననం నెలలు తక్కువగా, సాధారణ బరువు కంటే అతి తక్కువగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం, ఒక రోజు నవజాత శిశువును ఆసుపత్రికి తీసుకువచ్చారని పేర్కొన్నారు. ఈ దశలో అవయవాలు సక్రమంగా ఎదగవు, పనిచేయవన్నారు. శిశువుకు ఆక్సిజన్ కుడా సక్రమంగా అందక అనారోగ్యంతో ఉన్నట్లు పరీక్షించి, అడ్వాన్స్ వెంటిలేటర్ హెచ్ఎఫ్ఓయూలో ఉంచి 10 రోజులు వైద్య చికిత్సను అందించామన్నారు. మొత్తం 79 రోజుల పాటు అవసరమైన చికిత్సను అందించడంతో, శిశువు 1570 గ్రాముల బరువు కలిగి ఆరోగ్యంగా ఉన్నట్లు పేర్కొన్నారు. తమ బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడం పట్ల దంపతులు విజయ, గంగులయ్య సంతోషం వ్యక్తం చేశారు. 5న పీజీఆర్ఎస్ రద్దు కడప సెవెన్‌రోడ్స్ : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 5వ తేదీన (సోమవారం) జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో.. జిల్లా కలెక్టరేట్లో నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి కె.మల్లికార్జునుడు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.● 6 నెలలకే 610 గ్రాముల బరువుతో జననం ● 79 రోజుల చికిత్స అనంతరం కోలుకున్న వైనం -
ఉల్లి రైతుల ఆశలపై నీళ్లు
● దళారుల మాయాజాలం ● ఒక్కసారిగా ధర తగ్గించిన వైనంమైదుకూరు : మార్కెట్లో మంచి డిమాండ్, చేతికొచ్చిన అద్భుతమైన దిగుబడి ఉన్నా.. ఉల్లి రైతుల ఆశలు అడుగంటిపోతున్నాయి. దళారుల సిండికేట్ కారణంగా వారం రోజుల వ్యవధిలోనే ఉల్లి ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో మైదుకూరు మండల పరిధిలోని పెద్ద బళ్లారి ఉల్లి సాగుదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. మహారాష్ట్రలో పంట నష్టాన్ని ఇక్కడి వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకుంటూ, రైతులకు మాత్రం గిట్టుబాటు ధర దక్కకుండా చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వారం వ్యవధిలో.. మైదుకూరు మండలంలో సుమారు 2,400 ఎకరాల్లో రైతులు పెద్ద బళ్లారి రకం ఉల్లిని సాగు చేశారు. ప్రస్తుతం పంట కోత దశకు చేరగా, ఎకరాకు 20 క్వింటాళ్లకు పైగా ఆశించిన రీతిలో దిగుబడి వస్తోంది. వారం రోజుల క్రితం వరకు క్వింటాల్ ఉల్లి ధర రూ. 4,500 పలకడంతో రైతులు మంచి లాభాలు వస్తాయని ఆశించారు. అయితే, శనివారానికి దళారులు ఒక్కసారిగా ధరను రూ.2,500కు తగ్గించడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఎగుమతులు సాగుతున్నా.. దక్కని లాభం మహారాష్ట్రలో వర్షాల కారణంగా ఉల్లి పంట దెబ్బతినడంతో, ప్రస్తుతం అక్కడి మార్కెట్లలో మన ఉల్లికి భారీ డిమాండ్ ఏర్పడింది. మైదుకూరు నుంచి పెద్ద ఎత్తున ఉల్లి మహారాష్ట్రకు ఎగుమతి అవుతోంది. ఇంత డిమాండ్ ఉన్న సమయంలో కూడా క్వింటాల్‌పై ఏకంగా రూ.2,000 తగ్గించడం వెనుక దళారుల కుట్ర దాగి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, గత సీజన్‌తో పోలిస్తే ప్రస్తుతమున్న రూ. 2,500 ధర మెరుగైనదేనని వ్యవసాయ అధికారులు చెబుతున్నప్పటికీ.. మార్కెట్లో ఉన్న అసలు డిమాండ్‌కు అనుగుణంగా గరిష్ట ధర దక్కకపోవడం వల్ల తాము భారీగా ఆదాయాన్ని కోల్పోతున్నామని అన్నదాతలు వాపోతున్నారు.ధర తగ్గడంతో ఆదాయం తగ్గింది ధర తగ్గడంతో వస్తుందనుకున్న ఆదాయం తగ్గుతోంది. నాకున్న 1.10 ఎకరాల్లో ఉల్లిపంట సాగు చేశాను. సాగుకు రూ.30 వేలు ఖర్చుయింది. పంట ఎలా ఉన్నా ధర ఎంత ఉన్నా అమ్ముకోక తప్పని పరిస్థితి. – బండి పెద్ద నారాయణ, రైతు, కేశలింగాయపల్లె, మైదుకూరు మండలం -
నష్టం మిగిల్చిన అరటి
● దక్కని గిట్టుబాటు ధర ● ప్రకృతి కన్నెర్రతో తీరని వేదనసింహాద్రిపురం : పెట్టిన పెట్టుబడులు రాక, పాలకుల ఆదరణ కరువై అరటి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు గిట్టుబాటు ధర లేకపోవడం, మరోవైపు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతినడంతో అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఇటీవల ఏప్రిల్ నెలలో వీచిన ఈదురుగాలులకు అరటి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గెలలతో సహా పంట నేలకొరగడంతో రైతులు లక్షలాది రూపాయలు నష్టపోయారు. అయినా ఆశ చావని రైతులు, రెండో దశ పంటలోనైనా దిగుబడి వస్తుందనే నమ్మకంతో మళ్లీ అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టారు. అయితే ప్రస్తుత కరువు పరిస్థితులు, వర్షభావం వల్ల పంట ఆశించిన స్థాయిలో పండలేదు. దీనికి నిదర్శనంగా శనివారం సింహాద్రిపురం మండలం కసనూరు గ్రామానికి చెందిన రైతు మధుసూదన్‌రెడ్డి.. దిగుబడి రాదనే వేదనతో తన నాలుగు ఎకరాల అరటి తోటను ట్రాక్టర్‌తో దున్నించేసి పంటను తొలగించారు. కరువైన నష్టపరిహారం పంటలు దెబ్బతిని ఇంతలా నష్టపోతున్నా కూటమి ప్రభుత్వం కానీ, అధికారులు కానీ స్పందించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులు కేవలం క్షేత్రస్థాయి పరిశీలనలకే పరిమితమయ్యారని, ఇంతవరకు ఎలాంటి నష్టపరిహారం అందించలేదని వాపోతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, అరటి రైతుల దుస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని రైతాంగం డిమాండ్ చేస్తోంది. -
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
కడప ఎడ్యుకేషన్ : జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీని ‘వర్కింగ్ జర్నలిస్టుల కోర్కెల దినం’గా పాటించాలని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్(ఐజేయూ) ఇచ్చిన దేశవ్యాప్త పిలుపు మేరకు.. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయుడబ్లూజే) ఆధ్వర్యంలో శుక్రవారం కడపలో వర్కింగ్ జర్నలిస్టులు కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి డీఆర్ఓ మల్లికార్జునుడును కలిసి జర్నలిస్టుల సమస్యలకు సంబంధించిన వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వర్కింగ్ జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వర్కింగ్ జర్నలిస్టులు, మీడియా సంస్థలకు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే దృష్టి సారించాలని కోరారు. ప్రధాన డిమాండ్లు ● ప్రస్తుత మీడియా రంగంలో వచ్చిన సాంకేతిక, సామాజిక మార్పులను సమగ్రంగా సమీక్షించి వెంటనే మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి. ● జర్నలిస్టులు, మీడియా సిబ్బంది, మీడియా సంస్థలకు భద్రత కల్పించే విధంగా ప్రత్యేక కేంద్ర జర్నలిస్టుల భద్రతా చట్టం తీసుకురావాలి. ● వర్కింగ్ జర్నలిస్టుల చట్టబద్ధమైన హక్కులు, రక్షణలను పునరుద్ధరించాలి. ● ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అమలులో ఉన్న వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్ పథకాన్ని పునఃప్రారంభించాలి. ● ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి. ఉద్యోగ విరమణ చేసిన సీనియర్ పాత్రికేయులకు పింఛన్ సౌకర్యం కల్పించాలి. ● గతంలో జర్నలిస్టులకు అందుబాటులో ఉన్న 50 శాతం రైల్వే ప్రయాణ రాయితీని పునరుద్ధరించాలి. ● ఈ కార్యక్రమంలో ఏపీయుడబ్లూజే జిల్లా అధ్యక్షుడు మోపూరి బాలకృష్ణారెడ్డి, కార్యదర్శి శ్రీనివాసులు, రాష్ట్ర కార్యదర్శి శ్రీనాథ్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు రామసుబ్బారెడ్డి, వెన్ను శ్రీనివాస్, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ వెంకటరెడ్డి, వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు లక్ష్మినాథ్‌రెడ్డి, ఎలక్ట్రాన్ మీడియా అధ్యక్షుడు రమణారెడ్డి, ఐజేయూ నాయకుడు రామాంజనేయరెడ్డి, ఏపీయుడబ్లూజే సీనియర్ నాయకులు శివరాం, స్టాఫ్ రిపోర్టర్లు, కెమెరామెన్లు తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ వద్ద ఏపీయూడబ్లూజే నాయకుల నిరసన, ర్యాలీ డీఆర్ఓ మల్లికార్జునుడికి వినతి -
అడవి పంది దాడి.. వృద్ధురాలి మృతి
మైదుకూరు : మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని శెట్టివారిపల్లె వద్ద శుక్రవారం ఉదయం అడవి పంది దాడి చేయడంతో నారపురెడ్డి బాలసుబ్బమ్మ (65) అనే వృద్ధురాలు మృతి చెందింది. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి. శెట్టివారిపల్లెకు చెందిన బాలసుబ్బమ్మ కుటుంబం గ్రామ సమీపంలోని తమ పొలంలో పశుగ్రాసం సాగు చేసింది. రోజూ ఆమె పొలం వద్దకు వెళ్లి పశుగ్రాసం కోసుకొని వచ్చేది. ఆ క్రమంలో శుక్రవారం తన మనవడు సందీప్ కుమార్‌రెడ్డితో కలిసి పొలం వద్దకు వెళ్లింది. బాల సుబ్బమ్మ గడ్డి కోస్తుండగా సందీప్‌కుమార్‌రెడ్డి బహిర్భూమికి వెళ్లాడు. అతను తిరిగి పొలం వద్దకు వచ్చే సరికి బాలసుబ్బమ్మపై అడవి పంది దాడి చేసి ఆమెను తీవ్రంగా గాయపరిచింది. అది చూసిన సందీప్ గట్టిగా కేకలు వేయడంతో.. సమీపంలోని పొలాల్లో ఉన్న మహిళలు పరుగున అక్కడికి చేరుకున్నారు. అప్పటికే తీవ్ర రక్తస్రావంతో బాలసుబ్బమ్మ మృతి చెందింది. గడ్డి కోసుకుంటున్న బాల సుబ్బమ్మపై అడవి పంది దాడి చేయడంతో ఆమె నోరు, ముక్కు ఛిద్రమయ్యాయి. సంఘటన గురించి తెలియగానే అర్బన్ ఎస్ఐ కత్తి వెంకటరమణ, వనిపెంట అటవీ రేంజి డీఆర్ఓ అన్వర్ హుస్సేన్, బీట్ ఆఫీసర్ లింగారెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని బాలసుబ్బమ్మ మృతదేహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ అన్వర్ హుస్సేన్ మాట్లాడుతూ ఒంటరిగాడు అనే అడవి పందులు మనుషుల నడుము కింది భాగాల్లో దాడి చేస్తాయని తెలిపారు. వృద్ధురాలు కూర్చుని గడ్డి కోస్తుండటంతో పంది ఆమె ముఖంపై దాడి చేసి ఉంటుందని పేర్కొన్నారు. కాగా బాలసుబ్బమ్మపై దాడి చేసింది అడవి పందా లేక ఎలుగుబంటా అనేది పోస్టుమార్టం రిపోర్టులో తెలుస్తుందని చెప్పారు. బాల సుబ్బమ్మ కుమారుడు వెంకటేశ్వరరెడ్డి ఫిర్యాదు మేరకు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి, ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
పేదల డాక్టర్... ఈసీ గంగిరెడ్డి
పులివెందుల రూరల్ : దివంగత డాక్టర్ ఈసీ గంగిరెడ్డి పేదల డాక్టర్‌గా పులివెందుల ప్రాంతంలో గుర్తింపు పొందారు. ఆయన హస్తవాసి తగిలితే ఎంతటి రోగమైనా ఇట్టే నయమవుతుందని ఈ ప్రాంత వాసుల నమ్మకం. ప్రముఖ వైద్యుడు డాక్టర్ ఈసీ గంగిరెడ్డి చిన్నపిల్లల డాక్టర్‌గా ప్రాచుర్యం పొందారు. 1949 ఏప్రిల్ 20వ తేదీన ఈసీ సిద్ధారెడ్డి, తులశమ్మ దంపతులకు రెండవ సంతానంగా వేముల మండలంలోని గొల్లలగూడూరులో ఈసీ గంగిరెడ్డి జన్మించారు. ఆయన తన విద్యాభ్యాసం 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు గొల్లలగూడూరు ఆర్సీఎం స్కూలు, 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు పులివెందులలోని జెడ్పీ హైస్కూలు, 9వ తరగతి నుంచి 11వ తరగతి వరకు వేముల జెడ్పీ హైస్కూలు, అనంతరం ఎంబీబీఎస్ వారణాసిలోని బెనారస్ యూనివర్సిటీలో విద్యనభ్యసించారు. బెనారస్ యూనివర్సిటీలో ఆయన పీడీ కూడా పూర్తి చేశారు. అనంతరం పులివెందులలోని వైఎస్ రాజారెడ్డి ఆసుపత్రిలో వైద్య సేవలు ప్రారంభించారు. అనంతరం పులివెందులలోని శ్రీనివాసహాలు వీధిలో తన సతీమణి డాక్టర్ ఈసీ సుగుణమ్మతో కలిసి గంగిరెడ్డి ఆసుపత్రి స్థాపించి దంపతులిద్దరూ వైద్య సేవలు అందించేవారు. పులివెందులలోని గంగిరెడ్డి ఆసుపత్రి అంటే ఎంతో ప్రాచుర్యం పొందింది. పులివెందుల ప్రాంతంలో పేదల వైద్యునిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. వైద్యం చేయడమే ప్రధాన ఆశయంగా ప్రతిఫలం ఆశించని డాక్టర్‌గా ఇక్కడ గుర్తింపు పొందారు. ఎలాంటి రోగమైనా ఆయన దగ్గరకు వెళ్లి ఆయన చేయి పడితే నయమవుతుందని పులివెందుల ప్రాంత ప్రజల నమ్మకం. పులివెందుల ప్రాంత ప్రజలే కాకుండా జిల్లాలోని నలుమూలల నుంచి పక్క జిల్లాలైన అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల నుంచి కూడా ఆయన వద్దకు వచ్చి రోగులు వైద్య సేవలు పొందేవారు. వైద్య సేవలలో మారుతున్న కాలాన్ని బట్టి ఆయన భాకరాపురంలో అత్యాధునిక వైద్య పరికరాలతో తన కుమారుడి పేరిట దినేష్ నర్సింగ్ హోం (ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రి)ని స్థాపించి వైద్య సేవలు అందించారు. ఈసీ గంగిరెడ్డి కుమారుడు ఈసీ దినేష్‌రెడ్డి కూడా వైద్యునిగా సేవలు అందిస్తున్నారు. ఈసీ గంగిరెడ్డి తన దగ్గరకు వచ్చే రోగుల పట్ల ఎంతో ప్రేమ, ఆప్యాయతను కనబరిచే వారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నిరంతరాయంగా వైద్య సేవలు అందించేందుకు తపన పడేవారు. దినేష్ నర్సింగ్ హోం ద్వారా అనేక ఉచిత మెగా మెడికల్ క్యాంపులు నిర్వహించి పేద ప్రజలకు సేవ చేశారు. రాజకీయ ప్రస్థానం డాక్టర్ ఈసీ గంగిరెడ్డి 2001 నుంచి 2005 వరకు పులివెందుల మండల ప్రెసిడెంట్‌గా ప్రజలకు సేవలు అందించారు. వైఎస్ కుటుంబం పోటీ చేసే ప్రతి ఎన్నికలలోనూ ఆయన తనవంతు పాత్ర పోషించారు. ఎన్నికల సమయంలో వైఎస్ కుటుంబానికి మద్దతుగా నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. 2003 రబీ సీజన్లో అప్పటి టీడీపీ ప్రభుత్వం రైతులకు విత్తనాలు సక్రమంగా సరఫరా చేయలేదని పులివెందుల నుంచి కడప కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేశారు. నేడు అన్నదానం దివంగత డాక్టర్ ఈసీ గంగిరెడ్డి ఆరో వర్ధంతి కార్యక్రమం శనివారం పులివెందులలో జరగనుంది. డిగ్రీ కళాశాల రోడ్డులో గల వైఎస్సార్ సమాధుల తోటలో ఉన్న డాక్టర్ ఈసీ గంగిరెడ్డి ఘాట్ వద్ద డాక్టర్ ఈసీ గంగిరెడ్డి కుమార్తె వైఎస్ భారతిరెడ్డి, సతీమణి ఈసీ సుగుణమ్మ, కుమారుడు ఈసీ దినేష్‌రెడ్డి, వైఎస్ కుటుంబీకులు నివాళులు అర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. అనంతరం స్థానిక భాకరాపురంలో గల దినేష్ నర్సింగ్ హోంలో ప్రత్యేక ప్రార్థనలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. చిన్నపిల్లల హస్తవాసిగా ప్రాచుర్యం రాజకీయ నాయకుడిగా తనదైన పాత్ర నేడు దివంగత డాక్టర్ ఈసీ గంగిరెడ్డి 6వ వర్ధంతి పాల్గొననున్న వైఎస్ కుటుంబ సభ్యులు -
చిత్తూరు జిల్లాలో పోరుమామిళ్ల వాసి మృతి
వి.కోట : కారు బోల్తా పడి ఓ వ్యక్తి మృతి చెంది, ఇద్దరు గాయాల పాలైన సంఘటన చిత్తూరు జిల్లా వి.కోట మండల పరిధిలోని చైన్నె–బెంగళూరు ఎక్స్‌ప్రెస్ హైవేలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిళ్లకు చెందిన ఇస్మాయిల్(67), అతని కుమారుడు, భార్యతో కలసి తమ సొంత కారులో నెల్లూరుకు వెళ్లి తిరిగి బెంగళూరుకు పయనమయ్యారు. చైన్నె–బెంగళూరు ఎక్స్‌ప్రెస్ హైవేలో వెళుతుండగా వి.కోట మండల పరిధిలోని ఎగువపల్లి గ్రామ సమీపాన కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇస్మాయిల్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతని భార్య, కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. వేగాన్ని నియంత్రించలేక కారు బోల్తాపడి నుజ్జునుజ్జయింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఇస్మాయిల్ మృతదేహాన్ని పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయబడిన అతని భార్య, కుమారుడిని చికిత్స నిమిత్తం కుప్పం పీఈఎస్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సోమశేఖర్‌రెడ్డి తెలిపారు. కారు బోల్తాతో ఘటన ఇద్దరికి గాయాలు -
కూలిన ఇల్లు.. నిరాశ్రయురాలిగా అభాగ్యురాలు
దువ్వూరు : మండలంలోని నేలటూరు గ్రామ ఎస్సీ కాలనీలో వారం రోజుల కిందట వర్షాలకు పందిటి కదిరెమ్మ(60) అనే వృద్ధురాలి మట్టి మిద్దె కూలిపోయింది. దీంతో ఆమె విధిలేని పరిస్థితుల్లో కూలిన మట్టిమిద్దె వద్దే చెట్టు కింద జీవనం సాగిస్తోంది. గత నెల 23వ తేది రాత్రి వర్షం పడుతుండగా ఇంట్లో ఉన్నానని, ఏదో శబ్దం రావడంతో తాను బయటికి వచ్చిన వెంటనే మిద్దె కూలిపోయిందని, ప్రాణాలతో బయటపడ్డానని పందిటి కదిరెమ్మ కన్నీటి పర్యంతమైంది. ఈ విషయం రెవెన్యూ అధికారులకు తెలిపినా స్పందించలేదని, ఇంత వరకు ఎలాంటి న్యాయం చేయలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇంట్లో ఉన్న ఒక్క వస్తువు కూడా పనికిరాకుండా పోయిందని తెలిపారు. తనకు అయిన వారు ఉన్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని వేడుకున్నారు. -
ట్యాంకర్ బోల్తా
ముద్దనూరు : ముద్దనూరు–జమ్మలమడుగు ప్రధాన రహదారిలో స్థానిక శివాలయం సమీపంలో శుక్రవారం సాయంత్రం భారీ ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడింది. దాల్మియా సిమెంటు కర్మాగారం నుంచి సిమెంటు లోడుతో బెంగళూరుకు ప్రయాణిస్తున్న ట్యాంకరు బైపాస్ రహదారిలోని ఓవర్ బ్రిడ్జి వద్దకు రాగానే.. అదుపుతప్పి రహదారి పక్కనే వున్న లోతట్టు ప్రాంతంలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో ట్యాంకరు క్యాబిన్ భాగం నుజ్జునుజ్జయింది. ఎత్తయిన ప్రదేశం నుంచి ట్యాంకరు బోల్తా కొట్టినా అదృష్టవశాత్తు అందులోని డ్రైవరుకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. ● యువకుడి మృతి జమ్మలమడుగు రూరల్ : జమ్మలమడుగు పట్టణంలోని ముద్దనూరు రహదారిలో బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని గురుతేజ(22) అనే యువకుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని నీళ్ల ట్యాంక్ వీధికి చెందిన గురుతేజ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనులు చేసుకుని జీవించేవాడు. శుక్రవారం సాయంత్రం పట్టణం నుంచి ఇంటికి వెళ్తుండగా మార్గంమధ్యలోని ముద్దనూరు రహదారిలో డివైడర్‌ను ఢీకొన్నాడు. వెంటనే స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరిశీలించి, అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. -
అన్నదాతకు అండగా నిలవాలి
● ఎకరాకు రూ.50 వేల ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి! ● దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వేంపల్లె : అకాల వడగండ్ల వాన, ఈదురు గాలుల వల్ల కోలుకోలేని విధంగా నష్టపోయిన అరటి రైతులకు ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎకరాకు రూ.50 వేల ఇన్పుట్ సబ్సిడీని అందించాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం రాత్రి వీచిన ఈదురు గాలుల బీభత్సానికి వేంపల్లె మండలంలోని తాళ్లపల్లె, నందిపల్లె, కుప్పాలపల్లె, టి.వెలమవారిపల్లె, బక్కన్నగారిపల్లె గ్రామాల్లో దాదాపు 500 ఎకరాల్లో అరటి పంట పూర్తిగా నేలమట్టమైంది. ఈ నేపథ్యంలో తాళ్లపల్లె, కుప్పాలపల్లె, టి.వెలమవారిపల్లె ప్రాంతాల్లో దెబ్బతిన్న తోటలను శుక్రవారం ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. సాగుదారులైన బంక సోమశేఖర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, వెంకటరమణారెడ్డి, ప్రసాద్ రెడ్డి తదితర రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీ అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మరో నాలుగు, ఐదు రోజుల్లో కోత కోసి మార్కెట్‌కు తరలించాల్సిన, ఒక్కోటి 30 నుంచి 40 కిలోల బరువున్న అరటి గెలలు నేలకొరగడం బాధాకరమన్నారు. సగటున ఎకరాకు రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టి, అప్పుల పాలైన రైతులకు ఇది తీరని నష్టమని అన్నారు. ఇటువంటి భారీ విపత్తుల సమయంలో ప్రభుత్వాలు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి అన్నదాతను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బీమా నిబంధనలు పూర్తిగా లోపభూయిష్టం.. ప్రస్తుత క్రాప్ ఇన్సూరెన్స్ విధానం, వాతావరణ ఆధారిత స్టేషన్ల నమోదు ప్రక్రియపై ఎంపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గాలులు వీచిన గ్రామాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగం ఉంటే, వేంపల్లెలోని వెదర్ స్టేషన్లో కేవలం 5 నుండి 6 కిలోమీటర్ల వేగమే నమోదు కావడం హాస్యాస్పదమన్నారు. ఆ రీడింగ్ ఆధారంగా బీమాను ఎలా నిర్ణయిస్తారని ప్రభుత్వాలను, ఇన్సూరెన్స్ కంపెనీలను ప్రశ్నించారు. ఎకరాకు రూ.3 వేలు ప్రీమియం కడుతున్న రైతులకు, నష్టపరిహారం ఇచ్చేటప్పుడు సాకులు చెప్పడం అన్యాయమన్నారు. ఈ రెండేళ్లుగా జిల్లా కలెక్టర్, ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్తున్నామని.. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఇన్సూరెన్స్ కంపెనీల నిబంధనల లోపాలను సరిదిద్ది, బాధితులందరికీ న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ చంద్ర ఓబుల్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి, వైఎస్సార్సీపీ బీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొట్లూరు సుదర్శన్, వైఎస్సార్సీపీ నాయకులు ఉత్తమారెడ్డి, ప్రసాద్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు. -
మైలవరం జలాశయం సందర్శన
మైలవరం: మైలవరం జలాశయాన్ని సెప్టీ అధికారులు శుక్రవారం సందర్శించారు. ఈఈ చిన్న రంగప్పతో కలిసి సేప్టీ కమిటీ సభ్యులు జలాశయం గేట్ల వద్ద తనీఖీలను నిర్వహించారు. అలాగే మైలవరం రిజర్వాయర్ ఆనకట్టను గేట్లను, ప్రహారి పనులను పరిశీలించారు. కార్యక్రమంలో రిటైర్డు సీనియర్ అధికారులు ఎంకె శ్రీనివాస్, ఎన్.వెంకటరమణ, పి.సుబ్బారావు, యు.రమేష్‌లు ఉన్నారు.ప్రస్తుత డ్యాం పరిస్థితిపై నివేదికను తయారు చేసి ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లు తెలిపారు. ఏఈలు సుబ్బారావు, హనుమాన్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. 4న జిల్లా సబ్–జూనియర్స్ కబడ్డీ ఎంపికలు కడప వైఎస్ఆర్ సర్కిల్: జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 4న 36వ జిల్లా సబ్–జూనియర్స్ బాలబాలికల కబడ్డీ ఎంపికలు కడప మెయిన్ స్కూల్ మైదానంలో నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు గురు శేఖర్, కార్యదర్శి ఆర్. వెంకట సుబ్బయ్య, వర్కింగ్ సెక్రటరీ టి. శ్రీవాణి తెలిపారు. బాలుర విభాగంలో గరిష్ట బరువు – 60 కిలోలు 2010 డిసెంబర్ 12 లోపు జన్మించి ఉండాలన్నారు. బాలికల విభాగంలో గరిష్ట బరువు – 55 కిలోలు 2010 డిసెంబర్ 29 లోపు జన్మించి ఉండాలన్నారు. ఇతర వివరాలకు 9949304160, 9121497412 నంబర్లలో సంప్రదించాలన్నారు. రెండు పాఠశాలల్లో ఎస్ఎంసీ ఎన్నికలు రద్దు కడప సెవెన్‌రోడ్స్ : కలసపాడు మండలంలోని తెల్లపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కొండపేట గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించాల్సిన పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికలను కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి రద్దు చేశారు. ఎస్ఎంసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి డబ్బుల పంపిణీ జరిగినట్లు వచ్చిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని ఈ రెండు పాఠశాలల్లో జరగాల్సిన ఎన్నికలను రద్దు చేస్తూ కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు.ఎన్నికల ప్రక్రియలో డబ్బుల పంపిణీ, ప్రలోభాలు లేదా ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలు జరిగినట్లు గుర్తించినా, లేదా ఫిర్యాదు అందినా, విచారణ చేపట్టి సంబంధిత ఎన్నికలను రద్దు చేసి, బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరిశుభ్రత..అందరి బాధ్యత కడప సెవెన్‌రోడ్స్ : పరిశుభ్రతను పాటించడం ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా స్వీకరించాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్చెరుకూరి తెలిపారు. శుక్రవారం మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్ సభా భవనంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర అవార్డులు–2026 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తొలుత గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. స్వచ్ఛత పరిశుభ్రత రంగాల్లో సేవలు అందించిన వ్యక్తులు, సంస్థలు, స్థానిక సంస్థలను అభినందించి అవార్డులను అందజేశారు. మొత్తం 65 మందికి అవార్డుల ప్రధానం చేశారు. జెడ్పీ సీఈఓకు అవార్డు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి సి.సుబ్రమణ్యంకు స్వచ్ఛ కార్యాలయ విశిష్ట గుర్తింపు అవార్డును కలెక్టర్ అందజేశారు. జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో పరిశుభ్రత, పచ్చదనం, పరిసరాల పరిరక్షణ వంటి అంశాల్లో చేపట్టిన చర్యలకు గుర్తింపుగా ఈ అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. నియామకం కడప అర్బన్: కడపలోని జిల్లాకోర్టులో 6వ ఏడీజే ఫ్యామిలీకోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా భరణికుమార్ నాయుడును నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ ఆయ్యాయి. ఈయన 1997 నుంచి కడపలోని జిల్లా కోర్టులో న్యాయవాదిగా విధులను నిర్వహిస్తున్నారు. -
అన్నదాత ఆశలపై ఎల్‌నినో నీళ్లు చల్లింది. నమ్ముకున్న నైరుతి రుతుపవనాలు నట్టేట ముంచడంతో జిల్లాలో కరువు రాక్షసి కోరలు చాచింది. ఆకాశం వైపు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసినా వాన చుక్క రాలకపోవడంతో.. పచ్చని చేలు కాస్తా కళ్లముందే ఎండి బీళ్లుగా మారుతున్నాయి. జరగాల్సిన
● రైతన్న గుండెల్లో ఆందోళన తీవ్రం! ● కరువు జాబితాలో 37 మండలాలు కడప సెవెన్‌రోడ్స్ : జిల్లాలో 37 మండలాలను కరువు కింద ప్రభుత్వం గుర్తించింది. ఇందులో 14 మండలాలు తీవ్ర కరువుగా, 23 మండలాల్లో మోడరేట్ కరువుగా ప్రకటించారు. రెవెన్యూ (డిజాస్టర్ మేనేజ్మెంట్) శాఖ ఈ మేరకు జీఓ ఎంఎస్ నెం. 4 విడుదల చేసింది. జిల్లాలోని మైలవరం, మైదుకూరు, లింగాల, పులివెందుల, తొండూరు, కమలాపురం, వేంపల్లె, చక్రాయపేట, వీరబల్లి, పెద్దముడియం, రాజుపాలెం, జమ్మలమడుగు, వీఎన్ పల్లె, సుండుపల్లె మండలాలను తీవ్ర కరువు ప్రభావిత మండలాలుగా గుర్తించారు. ఇక దువ్వూరు, ముద్దనూరు, బ్రహ్మంగారిమఠం, శ్రీ అవధూత కాశినాయన, కలసపాడు, పోరుమామిళ్ల, బి.కోడూరు, బద్వేలు, చాపాడు, ప్రొద్దుటూరు, సింహాద్రిపురం, అట్లూరు, ఎర్రగుంట్ల, వల్లూరు, చెన్నూరు, చింతకొమ్మదిన్నె, పెండ్లిమర్రి, రాజంపేట, కొండాపురం, గోపవరం, ఖాజీపేట, వేముల, కడప మండలాలను మోడరేట్ కరువు కింద ప్రకటించారు. జిల్లా మొత్తాన్ని కరువు జాబితా కింద ప్రకటించాలని అధికార యంత్రాంగం రాష్ట్ర విపత్తుల నిర్వహణ విభాగం కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపింది. అయితే సిద్దవటం, ఒంటిమిట్ట, నందలూరు మండలాలను కరువు కింద ప్రభుత్వం గుర్తించలేదు. కరువు ప్రకటనకు ఇవీ సూచికలు.... కరువు ప్రకటనకు వర్షపాతలోటు, డ్రై స్పెల్స్ మాండెటరీ ఇండికేటర్స్‌గా తీసుకున్నారు. జిల్లా వార్షిక సాధారణ వర్షపాతం 689 మిల్లీమీటర్లు. జూన్ 1 నుంచి ఇప్పటివరకు 377.2 మిల్లీమీటర్లు సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 205.1 మి.మీ. నమోదైంది. దీంతో –45.6 డీవియేషన్ ఏర్పడింది. +19 శాతం నుంచి –19 శాతం డీవియేషన్‌ను సాధారణమైనదిగా పరిగణిస్తారు. –20 శాతం నుంచి –59 శాతం వరకు డెఫిషియంట్గా, –60 శాతం నుంచి ఆపైన స్కాంటిగా పరిగణిస్తారు. ఆ విధంగా జూన్ 1 నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు 14 మండలాలు స్కాంటిగా, మిగిలిన 26 మండలాలు డెఫిషియంట్గా గుర్తించారు. 20 మండలాల్లో రెండు చొప్పున, మరో 20 మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున డ్రై స్పెల్స్ నమోదయ్యాయి. ప్రామాణిక వర్షపాత సూచిక (ఎస్పీఐ) మరో ప్రధానమైనది. ఒక నిర్దిష్టకాలంలో సంభవించే వర్షపాత కొరతను శాసీ్త్రయంగా అంచనా వేస్తారు. ఎస్పీఐ విలువ 1 లేదా అంతకన్న తక్కువ ఉంటే వాతావరణ కరువుగా పరిగణిస్తారు. పై మూడు ఇండికేటర్స్ జిల్లాలో నిర్దారణ అయ్యాయి. ఇక ఇంపాక్ట్ ఇండికేటర్ అయిన పంటల సాగు విసీ్త్రర్ణం, రిమోట్ సెన్సింగ్, భూమిలో తేమ శాతం, భూగర్బ జలాలు, జలాశయాల్లో నీటిమట్టాలను పరిగణలోకి తీసుకున్నారు. జిల్లాలో ఉన్న గండికోట, మైలవరం, బ్రహ్మంసాగర్, సీబీఆర్ తదితర 11 ప్రాజెక్టుల పూర్తి సామర్థ్యం 82 టీఎంసీలకుగాను ప్రస్తుతం 37 టీఎంసీలే అందుబాటులో ఉన్నట్లు గుర్తించారు. గత సంవత్సరం ఇదే సమయానికి జిల్లాలో 10.45 మీటర్లలో భూగర్బ జలాలు ఉండేవి. నేడు 13.05కు చేరుకున్నాయి. వర్షాభావ పరిస్థితులు కొనసాగుతుండడంతో భూగర్బ జలమట్టం పడిపోతోంది. వీటన్నింటిని పరిగణలోకి తీసుకుని జిల్లా మొత్తాన్ని కరువు కింద ప్రకటించాలని జిల్లా యంత్రాంగం సిఫార్సు చేసింది. వీటిని పరిశీలించిన ప్రభుత్వం కరువు మండలాల ప్రకటన విడుదల చేసింది. బహుశా ఈనెలాఖరులోపు కేంద్ర బృందం కరువు పరిశీలనకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. -
గాంధీజీ ఆశయాలు స్ఫూర్తిదాయకం
కడప అర్బన్: జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్బంగా శుక్రవారం జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ జాతిపిత చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ అహింసనే ఆయుధంగా చేసుకుని బ్రిటిష్ వారిని ఎదిరించి, శాంతియుతంగా పోరాడి దేశానికి స్వాతంత్య్రాన్ని అందించి చరిత్రలోనే మహోన్నత వ్యక్తిగా, జాతిపితగా నిలిచారని కొనియాడారు.గాంధీజీ ఆశయాలు నేటితరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. . కలెక్టరేట్లో .. కడప సెవెన్‌రోడ్స్ : కడప కలెక్టరేట్లో శుక్రవారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించకుని జిల్లా రెవెన్యూ అధికారి మల్లికార్జునుడు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ, గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి, సేవా మార్గాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. డిప్యూటీ కలెక్టర్ వేంకటపతి, డీడీ సోషల్ వెల్ఫేర్ చింతామణి, జిల్లా పరిశ్రమల శాఖాధికారి చాంద్ బాషా తదితరులు పాల్గొన్నారు. గాంధీజీ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, డీఆర్వో మల్లికార్జునుడు తదితరులు -
నేరప్రవృత్తికి ఖైదీలు దూరంగా ఉండాలి
కడప అర్బన్: కడప కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ప్రతి ఖైదీ నేరప్రవృత్తికి దూరంగా ఉండాలని, సత్ప్రవర్తనతో ముందుకు వెళ్లాలని ఆకాంక్షిస్తున్నామనీ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రామ్‌గోపాల్ పేర్కొన్నారు. మహాత్మాగాంధీ, లాల్‌బహదూర్‌శాస్త్రి జయంతి, ఖైదీల సంక్షేమ దినోత్సవాన్ని కడపలోని కేంద్రకారాగారం, ప్రత్యేక మహిళా కారాగారాల్లో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తిమాట్లాడుతూ ఖైదీలు సత్యం, అహింస, ధర్మబద్ధమైన జీవన విధానం పాటిస్తూ భవిష్యత్తులో నేర ప్రవృత్తికి దూరంగా ఉండాలని సూచించారు. అంతకు ముందు అతిథులు గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కడప కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ ఎస్.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ‘జైలు అనేది కేవలం శిక్షను అనుభవించే ప్రదేశం మాత్రమే కాదు; చేసిన తప్పులను తెలుసుకొని, వాటిని సరిదిద్దుకొని, కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఒక అవకాశం’ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికారసంస్థ సెక్రటరీ షేక్ బాబా ఫక్రుద్దీన్, రిమ్స్సూపరింటెండెంట్ డాక్టర్ కె.పెంచలయ్య, కడప ఇన్చార్జి డీఎస్పీ ఈ. బాలస్వామి రెడ్డి, కడప కేంద్ర కారగారం సూపరింటెండెంట్ ఎస్. వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. -
●కుల గణన తారుమారు...
సాక్షి ప్రతినిధి, కడప: కడప కార్పొరేషన్ కార్యాలయంలో ‘ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు’గా నివేదికలు పొందుపరుస్తున్నారు. డిఫాక్టో కమిషనర్‌గా అవతరించిన ఓ అధికారి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. టీడీపీ నేతలు చెప్పింది చెప్పినట్లుగా తూచ తప్పకుండా పాటిస్తున్నారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఇక్కట్లు చవిచూడాల్సి వస్తుందని సహచరులు హెచ్చరించినా అవేవి పట్టించుకునే స్థితిలో లేరు. పైగా అధికార పార్టీ నేతలకు చాడీలు చెబుతూ కార్పొరేషన్ ముఖ్య అధికారిని లోబర్చుకున్నారు. ఆపై ఫ్లానింగ్ విభాగంలో మరో అధికారితో జట్టుకట్టారు. వెరశి ఓటర్లు గణన మొదలు డివిజన్లు రిజర్వేషన్లు ఏకపక్షంగా చేపట్టుతున్నారు. ‘అధికారం ఉంది, మాకు అనువుగా డివిజన్ల రిజర్వేషన్లు కేటాయింపు చేపట్టాలి. మాకు అనువైన ప్రాంతంలో మా అభ్యర్థికి అనువుగా కేటాయింపులు చేపడతాం. అందుకు మీరంతా సహకరించాలి, మేము ఫలానా అధికారికి వివరాలు చెబుతాం, ఆయన చెప్పినట్లు మీరు ఆచరించండి.’ అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే కార్పొరేషన్ యంత్రాంగానికి ఇచ్చిన దిశా–నిర్దేశం చేశారు. ఆ మేరకు చట్టానికి వ్యతిరేకంగా డిఫాక్టో కమిషనర్‌గా అవతరించిన అధికారి తెలుగుతమ్ముళ్లకు అనువుగా రిజర్వేషన్లు కేటాయిస్తున్నారనే ఆరోపణలు మిన్నంటాయి. ఈక్రమంలో పార్టీ ఫిరాయించిన తాజా మాజీ కార్పొరేటర్లు అందరికీ వారి వారి డివిజన్లలో ఎలాంటి మార్పులు లేకుండా రిజర్వేషన్లు కేటాయిస్తున్నట్లు విశ్లేషకులు వివరిస్తున్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘన... కడప నగరపాలక సంస్థ అధికారులు ఎన్నికల కమిషన్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 26వ తేదీ కుల గణనకు సంబంధించిన ఓటర్ల జాబితాను ప్రకటించాల్సి ఉండగా, 27వ తేదీ రాత్రి వరకూ ప్రకటించలేదు. 28వ తేదీ సాయంత్రంలోపు అభ్యంతరాలు ఇవ్వమని కోరారు. ఎలా సాధ్యమని రాజకీయ పక్షాలు వాపోతున్నాయి. ఓటర్ల జాబితా, కులగణన ఇవన్నీ పారదర్శకంగా చేపట్టాల్సి ఉండగా ఆలా చేయాలనే ఆలోచన కూడా కార్పొరేషన్ అధికారులకు రాలేదని పలువురు ఆరోపిస్తున్నారు. విస్తరించిన డివిజన్లు ప్రకారం 51వ డివిజన్ (మరియాపురం ఏరియా) ఎస్సీ ఓటర్లు సుమారు 16వందల మందికి పైగా ఉన్నారు. ఎటుతిరిగి ఆ డివిజన్ ఎస్సీకి రిజర్వుడ్ కావాల్సి ఉంది. టీడీపీ కోరిక మేరకు ఆ డివిజన్ ఓసీకి కేటాయించినట్లు సమాచారం. ఆమేరకు డివిజన్ల రిజర్వేషన్లు ప్రకటించకమునుపే అక్కడి టీడీపీ నేత అధికార పార్టీ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం విశేషం. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లుగా గెలుపొంది, 11 మంది తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. వారు ఆశించినట్లుగానే అనువుగా రిజర్వేషన్లు కేటాయింపులు చేపట్టినట్లు సమాచారం. ఆమేరకు ఫిరాయింపుదారులందరికీ ఆయా డివిజన్లు బెర్త్‌లు కన్ఫర్మ్ అయినట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. రిజర్వేషన్ల ప్రక్రియలో ఎలాంటి ఇక్కట్లు తలెత్తకుండా డిఫాక్టో కమిషనర్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా ఎప్పటికప్పుడు టీడీపీ కార్యాలయం నుంచి వచ్చే ఆదేశాలను అమలు చేస్తూ కార్పొరేషన్ యంత్రాంగాన్ని ఏకతాటిపై నడపంలో డిఫాక్టో కమీషనర్ సఫలీకృతులయ్యారని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. నగరపాలక సంస్థ అధికారులు చేపట్టిన కుల గణనలో నగర వాసుల కులాలు తారుమారు అయ్యాయి. ఓసీలు బీసీలుగాను, బీసీలు ఎస్సీలుగాను, ఎస్సీలు బీసీలుగాను గుర్తించబడ్డారు. అదెలాగంటారా... మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇటీవల వార్డుల పునర్విభజన చేపట్టారు. దాని తర్వాత కులగణన చేపట్టి వార్డుల రిజర్వేషన్లు ప్రకటించాల్సి ఉంది. ఇంటింటికీ వెళ్లి కుల గణన చేయాల్సిన అధికారులు కార్యాలయాల్లో కూర్చొని పేర్లను బట్టి వారి కులాన్ని అంచనా వేసినట్లు తెలుస్తోంది. ఈ తప్పుడు విధానం కారణంగా వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియలో కోరుకున్న వారికి కోరుకున్న డివిజన్ అప్పగించేందుకు సిద్ధమయ్యారు. ఈక్రమంలో రాజకీయ పార్టీలు అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా, తప్పులు బహిర్గతం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో కులగణన రహస్యంగా ఉంచారని సమాచారం. -
నూతన స్టాట్యూటరీ అధికారుల నియామకం
వేంపల్లె : ఆర్జీయూకేటీ పరిధిలోని ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో వివిధ విద్యా, పరిపాలన, విద్యార్థి సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు నూతన స్టాట్యూటరీ అధికారులను నియమించినట్లు డైరెక్టర్ విజయ ప్రకాష్ పేర్కొన్నారు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా సీఎస్ఈ డిపార్ట్మెంట్కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సి.రత్నకుమారి, డీన్ ఆఫ్ అకాడమిక్స్గా ఎంఎంఈ డిపార్ట్మెంట్కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ మహబూబ్ జిలాని, బాలుర డీన్ స్టూడెంట్ వెల్ఫేర్‌గా ఫిజికల్ డైరెక్టర్ పి.వెంకట రమణారెడ్డి, బాలికల డీన్ స్టూడెంట్ వెల్ఫేర్‌గా ఫిజిక్స్ లెక్చరర్ బి.దీపిక బాలను నియమించినట్లు తెలిపారు. గురువారం క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ జి.విజయ ప్రకాష్ నూతనంగా నియమితులైన స్టాట్యూటరీ అధికారులకు నియామక ఉత్తర్వుల ప్రతులను అధికారికంగా అందజేశారు. అదే విధంగా, బాధ్యతల నుంచి రిలీవ్ అవుతున్న స్టాట్యూటరీ అధికారులైన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డా.పెనుగొండ రవి కుమార్, డీన్ ఆఫ్ అకడమిక్స్ డౌండ్కర్ రమేష్ కై లాస్, డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ డా.జి.వెంకటేష్ అందించిన సేవలను డైరెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. -
4న జిల్లాస్థాయి ఎంపికలు
కడప వైఎస్ఆర్ సర్కిల్: ఈనెల 4న అండర్–19 షూటింగ్, ఫెన్సింగ్ జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహించనున్నట్లు ఎస్జీఎఫ్ అండర్–19 జిల్లా సెక్రటరీ మురళీకృష్ణారెడ్డి తెలిపారు. ఈ ఎంపికలు జిల్లాలోని ప్రొద్దుటూరు జార్జి కారోనేషన్ క్లబ్లో ఉంటాయని పేర్కొన్నారు. క్రీడాకారులు ఉదయం 9 గంటల కల్లా హాజరుకావాలని కోరారు. జిల్లా స్థాయి కబడ్డీ జట్టు ఎంపిక కమలాపురం : జిల్లా స్థాయి అసోసియేషన్ (జూనియర్స్) కబడ్డీ జట్టును గురువారం స్థానిక జడ్పీ బాయ్స్ హైస్కూల్ ప్లే గ్రౌండ్లో ఎంపిక చేశారు. జిల్లాలోని కడప, కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరు, వేంపల్లె, ఎర్రగుంట్ల తదితర మండలాల నుంచి బాల బాలికలకు వేర్వేరుగా పోటీలు నిర్వహించారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు గురు శేఖర్, క్రీడాకా రులను పరిచయం చేసుకున్నారు. అనంతరం ఏపీ పీడీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ కిరణ్ , కబడ్డీ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు ఓ. రవీంద్రారెడ్డి, కమలాపురం జెడ్పీ బాయ్స్ హైస్కూల్ హెచ్ఎం కాజా ప్రవీణ కబడ్డీ జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహించారు. ప్రతి క్రీడాకారుడు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జట్టు విజయానికి తోడ్పడాలని సూచించారు. ఎస్జీఎఫ్ అథ్లెటిక్స్ పోటీలు స్థానిక బాయ్స్ హైస్కూల్లో రెండో రోజు ఎస్జీఎఫ్ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. పరుగు పందెం (100మీ., 200 మీ.), లాంగ్ జంప్, హైజంప్, డిస్కస్ త్రో, షాట్ పుట్ తదితర పోటీలు నిర్వహించి అన్ని ఈవెంట్లలో మండల స్థాయి విజేతలకు ఎంపిక చేశారు.అంతకుముందు ఎంఈఓలు క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల పీడీలు, పీఈటీలు, విద్యార్థులు పాల్గొన్నారు. కడప మీదుగాసికింద్రాబాద్కు ప్రత్యేక రైలు కడప కోటిరెడ్డి సర్కిల్: తిరుపతి... సికింద్రాబాద్ మధ్య కడప మీదుగా ప్రత్యేక రైలును నడపనున్నారని కడప రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. ఈ రైలు ఆదివా రం సాయంత్రం 4.30కి తిరుపతిలో బయలుదేరి రేణిగుంట, కోడూరు, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం రోడ్, వికారాబాద్ మీదుగా సికింద్రాబాద్‌కు మరుసటి రోజు 7 గంటలకు చేరుకుంటుందని తెలిపారు. తిరిగి ఇదే రైలు (07422) సోమవారం సాయంత్రం 4.15 కు సికింద్రాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు 6.45కు తిరుపతికి చేరుకుంటుందని జనార్దన్ తెలిపారు. 9 మంది డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు కడప వైఎస్ఆర్ సర్కిల్: రోడ్డు భద్రతా నియమాలను ఉల్లంఘించిన 9 మంది వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్‌లను ఆరు నెలల పాటు రద్దు చేసినట్లు జిల్లా ఉప రవాణా శాఖ ఇన్చార్జ్ కమిషనర్ వీర్రాజు తెలిపారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం ప్రమాదకరంగా వాహనాలు నడిపినందుకు ఆర్నెళ్ల పాటు లైసెన్సులు రద్దు చేసినట్లు తెలిపారు.ఇందులో కళ్యాణ్‌బాబు, డి. తేజ్‌దీప్, చేరెడ్డి మారుతి శివ ప్రసాద్‌రెడ్డి, గజ్జల లక్ష్మీ దీపక్ రెడ్డి, బి. వినయ్‌కుమార్‌రెడ్డి, కిన్నెర లోకేష్, ఖాదరబాద్ పవన్‌కుమార్, వినయ్‌కుమార్ రెడ్డి, వీరంపెద్ది ప్రతాప్‌రెడ్డి ఉన్నారు. వీరు ఎట్టి పరిస్థితుల్లోను వాహనాలను నడపరాదన్నారు. ప్రజలందరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని సూచించారు. మదనపల్లెకు నేడు సీఎం, కేంద్ర మంత్రి రాక సాక్షి, మదనపల్లె: మదనపల్లెలో ఏర్పాటు చేసిన రాయలసీమ హార్టికల్చర్ హాబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన కార్యక్రమానికి శుక్రవారం సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, మంత్రి లోకేష్ హాజరుకానున్నా రు. అలాగే బీకేపల్లెలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. వీరి రాక కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. మదనపల్లె మండలంలోని కొండామర్రిపల్లె సమీపంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ , సభా వేదికను మంత్రులు బీసీ జనార్ధన్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, కలెక్టర్ నిశాంత్ కుమార్ పరిశీలించి భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. సీఎం పర్యటనకు భారీ బందోబస్తు మదనపల్లె టౌన్: ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రుల పర్యటన నేపథ్యంలో 2500 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలి పారు. హెలీపాడ్, సభా ప్రాంగణం, వీఐపీ గ్యాలరీ, పార్కింగ్ ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉంటుందన్నారు. -
కొత్త పింఛన్... ఎప్పుడో !
కడప రూరల్: వృద్ధాప్యంతో వణుకుతున్న చేతులు....భర్తను కోల్పోయి ఒంటరిగా మిగిలిన జీవితాలు... రెండేళ్లుగా ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరిగి అలసిపోయిన అడుగులు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వృద్ధాప్య, వితంతు పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న లక్షలామంది నిరుపేదల దీన గాథ ఇది.. రెండేళ్లకు పైగా పండుటాకులు, అభాగ్యులు పింఛన్ కోసం ఎదురుచూస్తున్నారు. స్థానిక ఎన్నికలు వస్తున్నాయన్న నేపథ్యంలో గత నెలలో హడావుడిగా పింఛన్ పోర్టల్ తెరిచిన ప్రభుత్వం.. కొద్ది రోజులుకే మూసేసింది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ముగిసింది.. కొత్త పింఛన్‌కు సంబంధించిన జీవో ఇంతవరకు రాలేదు.. ఈ నెల 1వ తేదీ పింఛన్ వస్తుందని ఆశగా సచివాలయాలకు వెళ్లిన పండుటాకులు.. పింఛన్ రాలేదనే సరికి నిరాశగా వెనుదిరిగారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో పెన్షన్ అర్హత వచ్చిన వెంటనే గ్రామ/వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే మరుసటి నెల నుంచి వయసు నిండిన వృద్ధులు, భర్తను కోల్పోయిన మహిళలు నెల తిరగకుండానే లబ్ధిదారులుగా జాబితాలో చేరేవారు. సంక్షేమాన్ని నిరంతర ప్రక్రియగా నడిపించారు. అర్హులు‘పోర్టల్’కే పరిమితం... టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు రెండున్నరేళ్లవుతోంది. కనికరం లేని ఈ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క కొత్త పింఛన్ మంజూరు చేయలేదు. దీంతో జీవిత చరమాంకంలో ఉన్న వృద్ధులు, అభాగ్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం వచ్చింది. ఇది గమనించిన పాలక ప్రభుత్వం ఓట్ల కోసం అవ్వ తాతలపై ప్రేమ ఒలకబోసింది. కొత్త పింఛన్లను మంజూరు చేస్తున్నామని ఆర్భాటంగా ప్రకటించింది . ఆ మేరకు కొత్త పింఛన్ల దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 18వ తేదీ నాటికి ముగిసింది. అనంతరం సచివాలయాల వెల్ఫేర్ సిబ్బంది వెరిఫికేషన్ చేసి తమ లాగిన్ ద్వారా ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల లాగిన్ లకు పంపారు. ఈ వివరాలను అమరావతి లోని ‘సెర్ఫ్’కు పంపితే, అక్కడి నుంచి అనుమతులు రావాల్సి ఉంది. కాగా సెప్టెంబర్ 26వ తేదీ నాటికి పింఛన్ పోర్టల్ ను మూసివేయడం గమనార్హం. ఏం జరుగుతుందో... ! కొత్త పింఛన్‌కు జిల్లా వ్యాప్తంగా వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళ, చర్మకారులు, డప్పు కళాకారులు, కల్లుగీత, మత్స్యకారులు, చేనేత కేటగిరి కి చెందిన వారు దరఖాస్తు చేసుకున్నారు. వారంతా అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త పింఛన్ వస్తుందని ఎంతో ఆశపడ్డారు. తీరా చూస్తే ఆ ఊసే లేకపోవడంతో నిరాశ చెందారు. అధికారులను అడిగితే ఒకటే మాట ‘మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు.. కొత్త పింఛన్ మంజూరు కాలేదు...’ అనే సమాధానం చెప్పారు. ‘పచ్చ’పింఛన్ లా మార్చాలని...? ఈ ప్రభుత్వం అర్హులకు పథకాలు దక్కకుండా చేస్తోంది. ప్రతి ఒక్కటి తమ పార్టీ కార్యకర్తలకే దక్కేలా చూస్తోంది. అందులో భాగంగానే కొత్తగా ఇచ్చే ఎన్టీఆర్ భరోసా పింఛన్ లు తమ పార్టీకి చెందిన వారికి దక్కడానికి పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా ‘సిక్స్ స్టెప్’ ‘వడపోతతో పాటే’ ‘సెవెంత్ స్టెప్’ వేసి అంటే తమ పార్టీకి చెందిన వారికి కొత్త పింఛన్ వచ్చేలా టీడీపీనేతలు కుట్ర పన్నుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నియోజకవర్గం వచ్చిన పెండింగ్ అర్హులు తిరస్కరించినవి దరఖాస్తులుకడప 7,386 3,283 3,938 165 బద్వేలు 7,381 48 6.678 655 జమ్మలమడుగు 8,049 57 7,121 871 కమలాపురం 6,203 196 5,589 418 మైదుకూరు 6,795 167 6,035 593 ప్రొద్దుటూరు 6,789 11 5,761 1,017 పులివెందుల 7,076 73 6,121 882 రాజంపేట 8,059 75 7,062 922 మొత్తం 57,738 3,910 48,305 5,523 దరఖాస్తు గడువు ముగిసింది.. వెరిఫికేషన్ పూర్తయింది విడుదల కాని జీఓ.. చేతికందని పింఛన్ ఎన్నికలవేళ కూటమి ప్రభుత్వం’కుట్ర జిల్లాలో కొత్త పింఛన్‌కు మొత్తం 57,738 మంది దరఖాస్తు -
అనుకూల వర్గాలకు లబ్ధి చేకూర్చేందుకే
బీటెక్ వంటి ఉన్నత చదువులు చదువుకున్న వారికి ఉద్యోగాలు రాక అవస్థలు పడుతున్నారు. ఇస్తామన్న నిరుద్యోగ భృతిని రెండున్నరేళ్లుగా ఎగ్గొట్టారు. ప్రచార యావతో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు నెలకు రూ.1.50 లక్షల వరకు ప్రజాధనం దోచిపెట్టడం ఎంత వరకు న్యాయం. జగన్ ప్రభుత్వ హయాంలో వలంటీర్‌గా పని చేసే వారికి రూ.5 వేలు ఇచ్చారు. మేము అధికారంలోకి వస్తే రూ.10 వేలు ఇస్తామని ఊదరగొట్టారు. ఉన్న వలంటీర్లను పీకేశారు. ఎంతో కష్టపడి చదువుకున్న నిరుద్యోగులను నట్టేట ముంచారు. – అజ్మీర్, నరసాపురం, కాశినాయన మండలం. -
టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిక
మైదుకూరు : మైదుకూరు రూరల్ మండల పరిధిలో ఎన్.ఎర్రబల్లె పంచాయతీకి చెందిన బొజ్జ ఓబన్న 20 కుటుంబాల వారితో కలిసి గురువారం టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. మైదుకూరు పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో పంచాయతీలోని లక్ష్మీనారాయణపురం గ్రామానికి చెందిన బొజ్జ ఓబన్న తదితర 20 కుటుంబాల వారికి పార్టీ కండువాలను వేసి రఘురామిరెడ్డి వారిని వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారు. బొజ్జ నారాయణ, బొజ్జ కృష్ణయ్య, బొజ్జ పెద్ద ఓబయ్య, బొజ్జ బాలయ్య, భూమిరెడ్డి నారాయణరెడ్డి, భూమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, పెద్దిరెడ్డి నారాయణరెడ్డి, మేకల వీరనారాయణ, బయన బోయిన నరసింహులు, అంకిరెడ్డిపల్లె రమణారెడ్డి, బొజ్జ నాగరాజు, బొజ్జ చిన్న ఓబులేసు, బొజ్జ చిన్న ఓబయ్య, హరికోటం ఓబయ్య, భూమిరెడ్డి బసిరెడ్డి, అంబవరం ఓబయ్య వైఎస్సార్సీపీలో చేరిన వారిలో ఉన్నారు. వైఎస్సార్సీపీలోనే గుర్తింపు ఈ సందర్భంగా రఘురామిరెడ్డి మాట్లాడుతూ ఎన్.ఎర్రబల్లె పంచాయతీలో టీడీపీ నుంచి 20 కుటుంబాల వారు వైఎస్సార్సీపీలోకి చేరడం అభినందనీయమని అన్నారు. టీడీపీలో కష్టపడి పని చేసే వారికి గుర్తింపు లేదని, అది ఒక్క వైఎస్సార్సీపీలో మాత్రమే ఉంటుందన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును ప్రతి ఒక్కరూ బేరీజు వేసుకోవాలని సూచించారు. ఎంత కష్టపడినా గుర్తింపు లేదు టీడీపీ అభివృద్ధికి ఎంతో క్టష్టపడ్డామని ఎన్నో ఇబ్బందులు పడి పార్టీ గెలుపు కోసం కృషి చేశామని అయినా అక్కడ గుర్తింపు లేదని టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరిన బొజ్జ ఓబన్న విలేకరులతో అన్నారు. అధికారంలోకి వచ్చాక పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. పార్టీ గెలుపు కోసం కృషి చేసిన తనను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని, అధికారంలో ఉండి కూడా పడరాని ఇబ్బందులు పడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు టీడీపీలో న్యాయం జరగలేదని మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డికి విన్నవించగా ఆయన సంతోషంగా తనను వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపు కోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఎంపీటీసీ అభ్యర్థిగా బొజ్జ ఓబన్న ఎన్.ఎర్రబల్లె ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా బొజ్జ ఓబన్నను మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి నియోజకవర్గంలో తొలిగా ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బొజ్జ ఓబన్న తమ ఎంపీటీసీ అభ్యర్థి అని రఘురామిరెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ గల్లా నరసింహారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ ఊటుకూరు రఘురామిరెడ్డి, సీనియర్ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి, నేట్లపల్లి శివరాం, తవ్వా వెంకటయ్య, పెద్దిరెడ్డి దశరథరామిరెడ్డి, పెద్దిరెడ్డి ఉపేంద్రరెడ్డి, పెరుగు రాముడు, నాగేశ్వరరెడ్డి, మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘స్థానిక’ పోరులో పోలీసులను నమ్ముకున్న కూటమి
జమ్మలమడుగు : రాబోయే మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో గెలవడానికి అధికార పార్టీ కేవలం పోలీసులను నమ్ముకుని రంగంలోకి దిగుతుందని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అన్నారు. గురువారం ఎర్రగుంట్లలో కార్యకర్తలు, నాయకుల సమావేశాన్ని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ నాయకులు పోలీసులను మాత్రమే నమ్ముకున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనం అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నాయకులను నామినేషన్ వేయనివ్వబోం, గెలువనివ్వం అని చెబుతున్నాడని పేర్కొన్నారు. ఇది కేవలం పోలీసుల అండతో ఎన్నికలు నిర్వహించాలనే లక్ష్యంతో ఆయన మాట్లాడుతున్నారన్నారు. అంతేకాకుండా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై ఆపరేషన్ సింధూర్ చేపడుతామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. తాము అధికారంలోకి వస్తే.. ఆదినారాయణరెడ్డి తనకు తానుగా సింధూర్ పరార్‌గా అంటూ పరిపోవడం జరుగుతుందన్నారు. గతంలో ఆయనను తాము చూశామన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో డబుల్ ఇంజన్ సర్కార్ కాదు నడిచేది డబుల్ ట్యాక్స్ సర్కార్ అన్నారు. బాబాయ్ ఆదినారాయణరెడ్డి, అబ్బాయ్ భూపేష్‌రెడ్డి జమ్మలమడుగు నియోజవర్గంలోని సిమెంట్ ఫ్యాక్టరీలు, సోలార్ పవర్ ప్రాజెక్టులు, ఫ్లయాష్లతోపాటు వ్యాపారులపై పడి వారి వద్ద నుంచి భారీగా ట్యాక్స్‌లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఆల్ట్రాటెక్(ఐసీఎల్) యాజమాన్యంపై అనుచరులతో బెదిరింపులకు పాల్పడటంతోపాటు సిమెంట్ పరిశ్రమలో పనులు జరగకుండా నిలిపివేసి.. అందులో ప్రతి కాంట్రాక్ట్ తమకే కావాలంటూ ఒత్తిడి చేసి వేలాది మంది కార్మికుల కడుపులు కొట్టారన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు కూడా పరిశ్రమల జోలికి వెళ్లలేదన్నారు. ఈ ఎన్నికలు మనకు ప్రతిష్టాత్మకం చంద్రబాబు నాయుడు, లోకేష్‌ల వద్దకు వెళ్లి జిల్లాలో బద్వేలు, పులివెందుల నియోజకవర్గాల్లో మున్సిపల్ ఎన్నికల్లో తన మంది మార్భాలంతో వెళ్లి గెలిపించుకుని వస్తానంటూ ఆదినారాయణరెడ్డి ప్రగాల్భాలు పలుకుతున్నాడన్నారు. గతంలో ఆదినారాయణరెడ్డి 50 వేల రూపాయల కోసం పులివెందులలోని రాజారెడ్డి వద్దకు వచ్చి రాత్రింబవళ్లు కొన్ని రోజుల పాటు ఇంటి వద్ద కాపలా ఉండే వారన్నారు. వారికి కావాల్సిన వాహనాలను వైఎస్ రాజశేఖరరెడ్డి సమకూర్చే వారన్నారు. అలాంటి వారిపైన ఆదినారాయణరెడ్డి విమర్శలు చేస్తున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను కార్యకర్తలు, నాయకులు తమ భుజస్కంధాలపై వేసుకుని పని చేయాలన్నారు. ఇప్పటికే అధికారులకు ఆదేశాలు అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతూ ఇప్పటికే అన్నమయ్య జిల్లా కలెక్టర్ వార్డు, గ్రామ సెక్రటరీలు.. ప్రతిపక్ష పార్టీ నాయకులకు కుల ధ్రువీకరణ పత్రాలు, ఇంకా పత్రాలు ఇవ్వకుండా వారికి అందుబాటులో లేకుండా పోవాలంటూ ఆదేశాలు జారీ చేశారన్నారు. కాబట్టి ఎన్నికలకు ముందు పోటీ చేయటానికి కావాల్సిన ధ్రువీకరణ పత్రాలను సిద్ధం చేసుకోవాలన్నారు. రాబోయేవి మంచి రోజులు ఇప్పటికే వైఎస్ జగన్మోహన్రెడ్డి.. రామసుబ్బారెడ్డికి ఇచ్చిన ప్రాధాన్యత సుధీర్‌రెడ్డికి కూడా ఇవ్వడం జరుగుతుందని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో సుధీర్‌రెడ్డి, రామసుబ్బారెడ్డి ఎర్రగుంట్ల, జమ్మలమడుగు నియోజకవర్గంలోని కార్యకర్తలు, నాయకులకు అండగా నిలుస్తారన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధికారంలోనికి రావడం ఖాయమని, కావున కార్యకర్తలకు మంచి రోజులు వస్తాయని భరోసా ఇచ్చారు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఎన్నికల్లో గట్టిగా నిలిచి పోటీ చేయాలని, తాము అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. అన్నమయ్య జిల్లాలో స్వయంగా కలెక్టర్ సిబ్బందికి దిశానిర్దేశం ఆదినారాయణరెడ్డికి భయపడాల్సిన అవసరం లేదు కార్యకర్తలు, నాయకులకు అండగా నిలుస్తాం ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి -
నేలకొరిగిన ఉద్యాన పంటలు
వేంపల్లె : అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో వీచిన ఈదురుగాలులతో ఉద్యాన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వేంపల్లె మండలంలోని కుప్పాలపల్లె, తాళ్లపల్లె, టి.వెలమవారిపల్లె, గిడ్డంగివారిపల్లె, బక్కన్నగారిపల్లె, నందిపల్లె, కత్తులూరు తదితర గ్రామాల్లో సాగు చేసిన 190 రైతులకు చెందిన అరటి పంట దాదాపు 400 ఎకరాల్లో నేలమట్టమయ్యింది. బుధవారం రాత్రి వీచిన బలమైన ఈదురు గాలుల ధాటికి పూర్తిగా అరటి తోటలు నేలమట్టం కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. 400 ఎకరాల్లో అరటి పంట నష్టం జరగడంతో రూ.6 కోట్ల నష్టం వాటిల్లినట్లు రైతులు వాపోతున్నారు. నందిపల్లె గ్రామానికి చెందిన మారం రామాంజనేయరెడ్డి, మారం శివ ప్రసాద్‌రెడ్డి, బంక వేణుగోపాల్‌రెడ్డి, సోమశేఖర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, కుప్పాలపల్లెకు చెందిన చాపటి రామిరెడ్డి, టి.వెలమవారిపల్లెకు చెందిన చవ్వా రవిశంకర్‌రెడ్డి, శనివారపు గోపాల్ రెడ్డి, అండ్లూరు రామాంజనేయరెడ్డిలతోపాటు పలువురి రైతులకు చెందిన అరటి పంట నష్టం జరిగింది. చేతికొచ్చే సమయంలో పంట నేలకొరగడంతో రైతులు లబోదిబోమంటున్నారు. అరటి సాగుకు ఎకరాకు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు పెట్టుబడి కింద ఖర్చు చేసినట్లు రైతులు తెలిపారు. పంట సాగు, ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చులు, నీటి పారుదల తదితర వాటిపై భారీగా పెట్టుబడులు పెట్టినట్లు పేర్కొన్నారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందించి, వచ్చే సాగుకు ఆర్థికంగా అండగా నిలవాలని వారు కోరుతున్నారు. టి.వెలమవారిపల్లెలో 45 మంది రైతులకు చెందిన అరటి పంట 40 హెక్టార్లు, తాళ్లపల్లెలో 135 మంది రైతులకు చెందిన అరటి పంట 115 హెక్టార్లు, కత్తులూరులో 10 మంది రైతులకు చెందిన 5 హెక్టార్లలో అరటి పంట దెబ్బతిందని ఉద్యానవన శాఖ అధికారి రాఘవేంద్రారెడ్డి తెలిపారు. బొప్పాయి కూడా.. తాళ్లపల్లె, బకన్నగారిపల్లె, టి.వెలమవారిపల్లె ప్రాంతాల్లో నిమ్మ చెట్లు నేలకొరిగినట్లు రైతులు వాపోతున్నారు. తాళ్లపల్లె గ్రామానికి చెందిన అల్తాఫ్, రఫి, గంగరాజు, షరీఫ్, పవన్, నారాయణరెడ్డి, నాగముని, శేఖర్ అనే రైతులకు సంబంధించి దాదాపు 200 నిమ్మ చెట్లు పడిపోయినట్లు తెలిసింది. బొప్పాయి కూడా అక్కడక్కడా దెబ్బతిన్నట్లు ఉద్యానవనాధికారి రాఘవేంద్రరెడ్డి తెలిపారు. పంటలను పరిశీలించి పూర్తి నివేదికను జిల్లా ఉన్నతాధికారుల పంపించి రైతులకు ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం అందేలాగా చూస్తామని ఆయన పేర్కొన్నారు. ఈదురుగాలులకు దెబ్బతిన్న అరటి, నిమ్మ తోటలు -
గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు
● నేడు 629 పంచాయతీల్లో గ్రామ సభలు ● కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి కడప సెవెన్‌రోడ్స్ : గ్రామాల అవసరాలను ప్రజల భాగస్వామ్యంతో గుర్తించి, వాటికి అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు జిల్లాలోని 629 గ్రామ పంచాయతీల్లో శుక్రవారం గ్రామ సభలు నిర్వహించి, 2027–28 ఆర్థిక సంవత్సరంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను గ్రామస్థాయిలోనే గుర్తించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. గ్రామ సభల్లో ప్రజలు, కూలీలు, ప్రజాప్రతినిధులు తమ గ్రామాలకు అవసరమైన పనులను సూచించాలని కలెక్టర్ కోరారు. గ్రామాల సమగ్ర అభివద్ధికి ఉపయోగపడే పనులకు ప్రాధాన్యం ఇచ్చి, ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలి ప్రొద్దుటూరు : జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 5న ప్రొద్దుటూరుకు రానున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. స్థానిక ఆర్అండ్బీ గెస్ట్ హౌస్‌లో గురువారం ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, జేసీ నిధిమీనాతో కలిసి ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీఎం పర్యటనకు సంబంధించిన సభా ప్రాంగణం వేదిక, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత ఏర్పాట్లను సమన్వ యంతో పూర్తి చేయాలని సూచించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిమారు ముఖ్యమంత్రి నియోజకవర్గానికి వస్తున్న నేపథ్యంలో సభ విజయవంతమయ్యేలా అధికారులు పనిచేయాలని తెలిపారు. షేక్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వీఎస్ ముక్తియార్ పాల్గొన్నారు. అనంతరం అధికారులు బహిరంగ సభ ప్రదేశం, హెలిప్యాడ్ ప్రాంతాలను పరిశీంచారు. -
నిరుద్యోగ భృతి ఏది సారూ...
నిరుద్యోగ భృతి ఇంత వరకు ఇవ్వలేదు కాని సోషల్ మీడియాలో ఇన్ప్లుయెన్సర్లకు వేతనాలు ఇస్తా రా? నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇప్పటి వరకు అమలు చేయలేదు. గ్రామ వలంటీర్లకు రూ.5 వేలు వేతనం ఇవ్వడమే దండగ అని గగ్గోలు పెట్టి ఆ వ్యవస్థనే తీసేసి వారిని నిరుద్యోగులుగా మార్చారు. ఇప్పుడేమో ప్రభుత్వానికి డప్పు కొట్టే సోషల్ మీడియా ఇన్ప్లుయెన్సర్లకు భారీ వేతనాలు ఇవ్వడం దారుణం. ఇదంతా కూటమి సోషల్ మీడియా బ్యాచ్‌కు లబ్ధి కూర్చే ప్రయత్నం తప్ప ఇంకేమి లేదు. ఈ నిర్ణియాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. – శివరామ్, మాజీ వలంటీర్, సంబేపల్లె మండలం -
● బీసీలను వంచించడానికే 34 శాతం రిజర్వేషన్ల ప్రకటన
కడప కార్పొరేషన్: వెనుకబడిన వర్గాలు(బీసీ)లను వంచించడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు 34 శాతం రిజర్వేషన్లను ప్రకటించారని వైఎస్సార్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు సిద్దవటం యానాదయ్య విమర్శించారు. గురు వారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండకూడదని సుప్రీం కోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే బీసీల గణన చేపట్టి పార్లమెంటులో చట్టం చేయడం ద్వారా బీసీ రిజర్వేషన్లు ఇచ్చే అవకాశముందన్నారు. కానీ చంద్రబాబుకు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టం లేదని,బీసీలు ఎప్పటికీ ఓట్లు వేసే యంత్రాలుగా ఉండాలి. కులవృత్తులు చేసుకుంటూ ఉండాలన్నదే ఆయన సిద్ధాంతమన్నారు. కూటమి ప్రభుత్వం 34 శాతం రిజర్వేషన్లపై వేసిన డెడికేషన్ కమిషన్ రాష్ట్రంలో ఎక్కడా పర్యటించలేదని, ఆ కమిటీ నివేదిక కూడా సమర్పించలేదన్నారు. అందుకే హైకోర్టులో ఈ అంశం వీగిపోయిందన్నారు. బీసీల పట్ల చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరికి స్థానిక ఎన్నికల్లో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర బీసీ విభాగం ప్రధాన కార్యదర్శి ఎస్. బసవరాజు మాట్లాడుతూ బీసీలను మోసం చేయడానికి చంద్రబాబు రెండు నెలలుగా డ్రామాలాడుతున్నారన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ బీసీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి సింధే రవిచంద్రరావు, బహుజన నగర్ వెంకటేష్ పాల్గొన్నారు. -
మేఘాల దోబూచులాటలు... అప్పుడప్పుడు రెండు ఉరుములు..మూడు మెరుపులు.. ఆపై ఎప్పుడో ఒకసారి నాలుగు చినుకులు.. పగలంతా భానుడి భగభగలు.. ఖరీఫ్ సీజనంతా కనిపించిన వాతావరణమిది... ‘ఎల్‌నినో’తో వర్షాభావం.. ‘ఎల్లోనినో’తో తీవ్ర నిర్లక్ష్యం.. వెరసి పంట సాగుకాక పుడమి తల్లి బ
● జిల్లావ్యాప్తంగా 63.3 శాతానికే పరిమితమైన పంటలసాగు ● నిరాశే మిగిల్చిన సీజన్ ● ఇటీవల కురిసిన వర్షంతో 7982 హెక్టార్లలో పెరిగిన సాగు విస్తీర్ణం కడప అగ్రికల్చర్: ఖరీఫ్ సీజన్ నిరాశజనకంగా ముగిసింది. తీవ్ర వర్షాభావానికి పాలకుల నిర్లక్ష్యం తోడై పంట ముందుకు ‘సాగ’లేదు. చివరికి మూడు కష్టాలు.. ఆరు నష్టాలుగానే మిగిలింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచే వరుణుడు పూర్తిగా ముఖం చాటేయడంతో వందశాతం సాగుకాకుండానే ముగిసింది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో సాధారణసాగు 76,496 హెక్టార్లు ఉండగా సెప్టెంబర్ 30వ తేదీ తేదీకి 48,431 హెక్టార్లలో మాత్రమే పంటలు సాగయ్యాయి. అంటే సాధారణ సాగుకంటే 28065 హెక్టార్లలో పంటల సాగు తగ్గింది. ఇందులో మొక్కజొన్న, రాగి పంటలు మాత్రం వందశాతానికి మించి సాగయ్యాయి. ఇందులో మొక్కజొన్న 131.4 శాతం సాగుకాగా రాగి రెండు వందల శాతం పైగా సాగైంది. మిగతా ఏ పంట వంద శాతానికి చేరువ కాలేదు. పది రోజుల్లో పెరిగిన సాగు విస్తీర్ణం... ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లావ్యాప్తంగా ఓ మాదిరిగా వర్షాలు పడ్డాయి. దీంతో ఈ పది రోజుల్లోనే జిల్లాలో 7982 హెక్టార్ల వరితోపాటు వివిధ పంటలసాగు పెరిగింది. సెప్టెంబర్ 15వ తేదీ నాటికి జిల్లాలో 40,449 హె క్టార్లలో పంటలు సాగు కాగా ఈ వర్షం వచ్చాక 48,431 హెక్టార్లకు సాగు పెరిగింది. పంటపేరు సాధారణ సాగైన సాగు సాగు విస్తీర్ణం శాతం రాగి పంట 08 16 200.00 మొక్కజొన్న 1495 1964 131.4 75 శాతం మించి సాగైన పంటల వివరాలు... మినుము 3745 3676 98.2 వేరుశనగ 4446 4004 90.1 50 శాతం మించి సాగైన పంటల వివరాలు.. వరి 33,078 23,636 71.46 ఉలవలు 19 13 68.4 ెపెసలు 113 61 68.4 ఆవుగడ్డి 76 49 64.5 సజ్జలు 994 590 59.4 చెరకు 75 39 52.0 నెల సాధారణ కురిసిన లోటు వర్షపాతం వర్షపాతం వర్షపాతం జూన్ 68.2 50.3 –26.3 జులై 96.7 24.5 –74.7 ఆగష్టు 118.4 66.7 – 43.7 సెప్టెంబర్ 117.2 88.3 – 24.7 మొత్తం 400.5 229.8 – 42.6 ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభానికి నుంచే ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన మేర జిల్లాలో వర్షాలు కురవలేదు. దీంతోపాటు జూన్, జులై, ఆగష్టు, సెప్టెంబర్ నెలలన్నీ కూడా లోటు వర్షపాతమే నమోదైంది. దీంతో పంటలసాగు బాగా వెనకబడింది. అప్పుడప్పుడు కురిసిన వర్షాలతోపాటు బోర్లు, కేసీ కెనాల్‌కు కొద్ది రోజులు నీరు రావడంతో సాగు కొంత పెరిగింది. ఇప్పటి వరకు 63.3 శాతంగా పంటలసాగు నమోదైంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఆరుతడి పంటలసాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. – సుబ్రమణేశ్వరావు, జిల్లా వ్యవసాయ అధికారి -
బలం లేకున్నా.. అధిక్కారం!
ఖాజీపేట : అధికార బలంతో విర్రవీగుతున్న కూటమి నేతల దౌర్జన్యాలు విద్యా వ్యవస్థను కూడా వదలడం లేదు. ప్రశాంతమైన వాతావరణంలో, ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలను టీడీపీ నాయకులు తమ రౌడీయిజంతో, బెదిరింపులతో అర్ధాంతరంగా వాయిదా వేయించిన సంఘటన ఖాజీపేట మండలంలో తీవ్ర కలకలం రేపింది. క్షేత్రస్థాయిలో తమకు బలం లేదని, ఎన్నికలు జరిగితే ఓటమి ఖాయమని ముందే తెలుసుకున్న అధికార పార్టీ నాయకులు.. నిస్సిగ్గుగా పోలీసులను అడ్డం పెట్టుకుని ఈ దారుణానికి ఒడిగట్టారు. ఖాకీల అండతో పసుపు నేతల రుబాబు! సజావుగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడంలో సహకరించాల్సిన పోలీసులు.. ఇక్కడ పూర్తిగా పక్షపాత ధోరణితో వ్యవహరించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖాకీలు ఏకపక్షంగా వ్యవహరిస్తూ తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా మారారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా గొడవలు సృష్టించేందుకు పోలీసులు పరోక్షంగా సహకరిస్తూ, మరోవైపు ప్రజాస్వామ్యబద్ధంగా ఓటింగ్ అడుగుతున్న వైఎస్సార్సీపీ మద్దతుదారులను తీవ్రంగా అడ్డుకోవడం ఖాజీపేటలో కలకలం రేపింది. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించే అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ.. కేవలం పసుపు నేతలకు లబ్ధి చేకూర్చేందుకే పోలీసులు వారితో చేతులు కలిపి ఎన్నికలు వాయిదా పడేలా చక్రం తిప్పారు. 67 స్కూల్స్ ఏకగ్రీవం.. ఆ రెండు చోట్లా ఓటమి భయంతోనే డ్రామా! ఖాజీపేట మండలవ్యాప్తంగా మొత్తం 69 పాఠశాలలు ఉండగా.. అందులో 67 పాఠశాలల్లో ఎన్నికలు అత్యంత ప్రశాంతంగా, ఏకగ్రీవంగా ముగిశాయి. అయితే కూటమి నేతలకు పట్టులేని దుంపలగట్టు, దుంపలగట్టు హరిజనవాడ ప్రాథమిక పాఠశాలల్లో మాత్రం టీడీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా గొడవలు సృష్టించి ఎన్నికలను వాయిదా వేయించారు. దుంపలగట్టు హరిజనవాడలోనూ 18 వర్సెస్ 12 మెజారిటీ! దుంపలగట్టు హరిజనవాడ పాఠశాలలో మొత్తం 40 మంది విద్యార్థులకు 30 ఓట్లు ఉన్నాయి. ఇందులో ఏకంగా 18 మంది ఓటర్లు వైఎస్సార్సీపీకి స్పష్టమైన అనుకూలంగా ఉండగా.. కేవలం 12 మంది మాత్రమే టీడీపీ మద్దతుదారులు ఉన్నారు. ఇక్కడ ఎన్నిక జరిగితే ఎలాగూ గెలవడం సాధ్యం కాదన్న పక్కా సమాచారంతో టీడీపీ నాయకులు కావాలనే గొడవలకు దిగారు. పసుపు నేతల అక్రమాలను వైఎస్సార్సీపీ శ్రేణులు దీటుగా అడ్డుకుని, ఎన్నిక జరగాల్సిందేనని పట్టుబట్టాయి. దాంతో ఓటమి ఖాయమని భయపడిన టీడీపీ ఓటర్లు వెనుతిరిగి వెళ్లిపోయారు. స్కూల్లో కేవలం వైఎస్సార్సీపీ మద్దతుదారులైన తల్లిదండ్రులు మాత్రమే ఉన్నప్పటికీ.. పై అధికారుల నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిళ్ల కారణంగానే ఉపాధ్యాయుల చేత ఎన్నికను బలవంతంగా వాయిదా వేయించారు. 5 వర్సెస్ 2 మెజారిటీ ఉన్నా గూండాయిజం! మరోవైపు దుంపలగట్టు గ్రామంలోని పాఠశాలలో మొత్తం 8 ఓట్లకు ఏడుగురు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ ఏడుగురిలో ఏకంగా ఐదుగురు ఓటర్లు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉండగా.. కేవలం ఇద్దరు మాత్రమే టీడీపీ వైపు ఉన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగి ఉంటే రెండు చోట్లా వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డికి చెందిన ప్యానెల్ అభ్యర్థులు ఏకపక్షంగా ఘన విజయం సాధించేవారు. కానీ, తమకు ఓటమి తప్పదని గ్రహించిన టీడీపీ నాయకులు రౌడీయిజానికి దిగి, ఖాకీల అండతో అధికారులపై ఒత్తిడి తెచ్చి దారుణంగా ఎన్నికలను వాయిదా వేయించారు. ఖాజీపేట స్కూల్ కమిటీ ఎన్నికల్లో పసుపు నేతల ఓటమి భయం.. ఖాకీల అండతో దౌర్జన్యాల జాతర దుంపలగట్టులో 5 వర్సెస్ 2, హరిజనవాడలో 18 వర్సెస్ 12 మెజారిటీ ఉన్నా ఎన్నికల వాయిదా డ్రామా రెడ్యం వెంకట సుబ్బారెడ్డి వర్గం గెలుపును అడ్డుకునేందుకు అధికారులపై కూటమి నేతల తీవ్ర ఒత్తిళ్లు -
ఎట్టకేలకు ఆగనున్న వెంకటాద్రి!
● ఎనిమిదేళ్ల ఎదురుచూపునకు మోక్షం ● ఈ నెల 3 నుంచి నందలూరులో స్టాపింగ్రాజంపేట : జిల్లాలో రైల్వేపరంగా ఎంతో ప్రసిద్ధి చెందిన నందలూరు రైల్వే కేంద్రానికి సంబంధించి స్థానిక ప్రజల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. చిత్తూరు – కాచిగూడ మధ్య నడుస్తున్న ప్రతిష్టాత్మక వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ (రైలు నంబరు: 12797/98) హాల్టింగ్‌కు రైల్వేబోర్డు ఎట్టకేలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 3వ తేదీ నుంచి నందలూరు స్టేషన్లో ఈ రైలు నిలవనుందని బుధవారం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ పేరిట అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. రైల్వే బోర్డు తీసుకున్న ఈ నిర్ణయంపై స్థానిక ప్రజలు, ప్రయాణికుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎనిమిదేళ్ల పోరాటానికి ఫలితం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలుపుతూ 1975 మే 19న వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తొలి సర్వీసు ప్రారంభమైంది. అయితే, గత ఎనిమిదేళ్లుగా నందలూరులో ఈ రైలు హాల్టింగ్ కోసం స్థానికులు ఎదురుచూస్తున్నారు. గతంలో కోవిడ్–19 లాక్డౌన్ సమయంలో అన్ని రైళ్లను ప్రత్యేక సర్వీసులుగా మార్చిన తరుణంలో, నందలూరులో వెంకటాద్రి సహా పలు రైళ్ల హాల్టింగ్‌ను రైల్వే శాఖ ఎత్తివేసింది. కోవిడ్ మహమ్మారికి ముందు ఈ స్టేషన్లో రైలు ఆగేది. మహమ్మారి తగ్గుముఖం పట్టి పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చినా హాల్టింగ్ పునరుద్ధరించకపోవడంతో వందలాది మంది రైల్వే కార్మికులు, స్థానిక ఉద్యోగులు, యాత్రీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దాదాపు ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఇక్కడ స్టాపింగ్ ఇవ్వడం విశేషం. ఫలించిన ఎంపీ మేడా కృషి ఈ రైలు పునరుద్ధరణలో రాజ్యసభ సభ్యుడు, రైల్వే స్టాండింగ్ కమిటీ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి చేసిన కృషి కీలక పాత్ర పోషించింది. ఇటీవల జరిగిన రైల్వే స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆయన నందలూరు రైల్వే కేంద్రం ప్రాముఖ్యతను, స్థానికుల అవసరాలను రైల్వే బోర్డు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దాంతో సానుకూలంగా స్పందించిన బోర్డు హాల్టింగ్‌కు ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ఎంపీ మేడా రఘునాథరెడ్డికి స్థానికులు, రైల్వే కార్మిక సంఘాలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. నందలూరులోని ప్రసిద్ధ సౌమ్యనాథ స్వామిని దర్శించుకోవడానికి తిరుపతి, చిత్తూరు జిల్లాల నుంచి వచ్చే భక్తులకు, అలాగే కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దర్శనానికి వెళ్లే యాత్రికులకు ఈ రైలు నిలుపుదల ఎంతో సౌకర్యవంతంగా మారనుంది. టికెట్ల అమ్మకాలపైనే భవిష్యత్తు! రైల్వే శాఖ ప్రస్తుతం ఈ హాల్టింగ్‌ను ప్రయోగాత్మకంగా మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో నందలూరు స్టేషన్లో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌కు జరిగే టికెట్ అమ్మకాలను రైల్వే అధికారులు నిరంతరం సమీక్షించనున్నారు. ఇక్కడ టికెట్ల విక్రయాలు ఆశాజనకంగా ఉంటేనే భవిష్యత్తులో ఈ హాల్టింగ్ శాశ్వతంగా కొనసాగుతుంది. కాబట్టి, స్టాపింగ్ నిరంతరాయంగా కొనసాగేలా చూసే బాధ్యత స్థానికులపైనే ఉందని రైల్వే వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, వందలాది మంది రైల్వే కార్మికులు, ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ హాల్టింగ్‌ను శాశ్వతం చేయాలని రైల్వే కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
అగ్రిగోల్డ్ బాధితులకు ‘ప్రత్యేక కోర్టు’తోనే న్యాయం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : అగ్రిగోల్డ్ సంస్థలో పెట్టుబడులు పెట్టి నష్టపోయిన బాధితులకు ప్రత్యేక కోర్డుతోనే న్యాయం జరుగుతుందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ బాధితులెవరూ తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యల వంటి ఉన్మాద చర్యలకు దిగవద్దని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. దాదాపు 12 ఏళ్ల క్రితం దేశంలోని 8 రాష్ట్రాలకు చెందిన 32 లక్షల మంది బడుగు, బలహీన, కార్మిక వర్గాల ప్రజల నుంచి అగ్రిగోల్డ్ యాజమాన్యం రూ.6,300 కోట్లకు పైగా ఆర్థిక దోపిడీకి పాల్పడిందని ఆయన ధ్వజమెత్తారు. సంస్థ చైర్మన్ వెంకటరామారావు, డిప్యూటీ చైర్మన్ సీతారామారావుతో పాటు వారి కుటుంబ సభ్యులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారన్నారు. ఈ దారుణ మోసం కారణంగా ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే సుమారు 600 మంది బాధితులు గుండెపోటు, బలవన్మరణాలతో అకాల మరణం చెందడం కలిచివేసిందన్నారు. గతంలో మరణించిన వారిలో 140 మందికి మాత్రమే అప్పటి ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించిందని గుర్తు చేశారు. 8 రాష్ట్రాల్లోని బాధితుల నుంచి బాండ్లను, ఫొటోలను సేకరించేందుకు మంత్రి నాదెండ్ల మనోహర్ విచారణ కేంద్రాలను ప్రారంభిస్తామని వెల్లడించారని తెలిపారు. ఇదే తరహాలో మన రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల్లోనూ ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి బాధితుల నుంచి బాండ్లు సేకరించాలని ముప్పాళ్ళ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. రోజువారీ కూలీలు, నెలవారీ కంతుల రూపంలో సేకరించిన సొమ్మునంతా అగ్రిగోల్డ్ యాజమాన్యం వారి బంధువులు, బినామీల పేరిట ఆస్తులుగా మార్చి కోర్టు కేసుల నెపంతో కాలాన్ని వెళ్లదీస్తోందని ఆయన ఖండించారు. గత ప్రభుత్వ హయాంలో రూ.20 వేల లోపు డిపాజిట్లు ఉన్న 10.43 లక్షల మందికి మాత్రమే డబ్బులు చెల్లించారని, అంతకంటే ఎక్కువ మొత్తం ఉన్న బాధితుల సమస్యలు ఇంకా అలాగే ఉండిపోయాయన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు వెంకట శివ, ఏజెంట్ అండ్ కస్టమర్స్ నేతలు నాగార్జునరెడ్డి, సుబ్రమణ్యం, కృష్ణ, గోవిందు తదితరులు పాల్గొన్నారు.సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు ముప్పాళ్ళ నాగేశ్వరరావు -
ఆత్మవిశ్వాసంతోనే విజయం సాధ్యం
కడప ఎడ్యుకేషన్ : ‘మీ మీద మీకు నమ్మకం లేకపోతే ఎప్పుడూ విజేతలుగా నిలవలేరన్న స్వామి వివేకానందుని మాటలను విద్యార్థులు స్మరించుకోవాలి‘ అని యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ పేర్కొన్నారు. జిల్లా యువజన శాఖ (స్టెప్) ఆధ్వర్యంలో బుధవారం వైవీయూలోని అన్నమాచార్య సెనేట్ హాల్లో జిల్లా స్థాయి యువజనోత్సవాలు–2026 జరిగాయి. ముఖ్యఅతిథిగా హాజరైన వీసీ మాట్లాడుతూ.. ఓటములను తట్టుకుని నిలిచిన వారే విజేతలవుతారని, నిరంతరం శ్రమిస్తే వివేకానంద, అబ్దుల్ కలాం లాగా మహనీయులవుతారని పేర్కొన్నారు. వైవీయూ రెక్టార్ ప్రొఫెసర్ ఏజీ దాము, మాజీ రిజిస్ట్రార్ పుత్త పద్మ మాట్లాడుతూ యువత ఆలోచనలను బలంగా మార్చడమే ఈ ఉత్సవాల ఉద్దేశమన్నారు. జిల్లా యువజనశాఖ అధికారి బి.వి. ప్రసాదరావు మాట్లాడుతూ జనవరి 12న వివేకానందుని జయంతిని పురస్కరించుకుని ఈ పోటీలు నిర్వహిస్తున్నామని, ఇక్కడ ప్రథమ బహుమతి సాధించిన వారు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికవుతారని తెలిపారు. మై భారత్ యూత్ ఆఫీసర్ దీపక్ జేమ్స్ మాట్లాడుతూ యువత తమ ప్రతిభను చాటుకోవడానికి ఇది మంచి వేదిక అని అన్నారు. కార్యక్రమములో విశ్వవిద్యాలయం ఆచార్య కె. లలిత, ఆచార్య ఎస్. సునీత, ఆచార్య సుబాష్ చంద్ర, స్టెప్, మేనేజర్ వి.వి. సుబ్బరాయుడు, సూపరింటెండెంట్ రఘుపతి రావు సిబ్బంది అబ్బాస్ అలీ, వి.వి. నారాయణ, వై. ఫల్గుణ్ కుమార్ పాల్గొన్నారు.వైవీయూ వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ -
నిబంధనలకు విరుద్ధంగా కాంప్లెక్స్ నిర్మాణం
ప్రొద్దుటూరు : మున్సిపాలిటీ పరిధిలోని అమ్మవారిశాల వెనుక వీధిలో ఉన్న వాసు స్టూడియో పక్కన 11/461 ఇంటినంబర్ గల స్థలంలో అధికార పార్టీ నేత నిబంధనలకు విరుద్దంగా కాంప్లెక్స్ నిర్మాణ పనులు చేపడుతున్నాడు. మాస్టర్ ప్లాన్ నిబంధనల ప్రకారం 50 అడుగుల రోడ్డును వదిలిపెట్టి కాంప్లెక్స్‌ను నిర్మించాల్సి ఉంది. అయితే సదరు అధికార పార్టీ నేత నిబంధనలను పక్కన పెట్టి గతంలో ఏవిధంగా ఉందో అలాగే నూతన కాంప్లెక్స్ నిర్మాణం చేపడుతున్నారు. గతంలో మున్సిపల్ అధికారులు ఇదే నిర్మాణాన్ని పరిశీలించి కొద్ది రోజులు పనులు నిలిపివేశారు. మళ్లీ యధావిధిగా పనులు ప్రారంభమవడం వెనుక మతలబు ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ నిధి మీనా ఈ విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కేవలం అధికార పార్టీ నేతల ప్రభావం కారణంగానే అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయమై టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ చంద్రమోహన్‌కు ఫోన్ చేసి సాక్షి వివరణ కోరగా ఆయన స్పందించలేదు.పట్టించుకోని మున్సిపల్ అధికారులు -
సామూహిక గడ్డి పెంపకంతో రైతులకు లబ్ధి
ఎర్రగుంట్ల : ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం వల్ల ఏర్పడిన పశుగ్రాస కొరతను నివారించడానికి సామూహిక గడ్డి క్షేత్రాల పెంపకం ఎంతగానో దోహదపడుతుందని, దీనివల్ల పాడి రైతులకు అధిక లబ్ధి చేకూరుతుందని పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ విజయలక్ష్మి అన్నారు. బుధవారం మండల పరిధిలోని తిప్పలూరు గ్రామ పరిధిలో భారతి సిమెంట్ ఫ్యాక్టరీ వారు కేటాయించిన 15 ఎకరాల పొలంలో ఉమ్మడిగా చేపట్టిన పశుగ్రాస పెంపక క్షేత్రాన్ని అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా జేడీ విజయలక్ష్మి మాట్లాడుతూ.. తిప్పలూరు గ్రామానికి చెందిన నిషాంత్‌రెడ్డి చొరవతో భూమిలేని 30 మంది పాడి రైతులను ఒక సంఘంగా చేర్చి ఈ సామూహిక సాగును ప్రారంభించినట్లు తెలిపారు. ఈ క్షేత్రం కోసం రైతులకు 350 కిలోల సీఎస్హెచ్–24 రకానికి చెందిన జొన్న విత్తనాలను పంపిణీ చేశామన్నారు. ప్రస్తుతం ఈ గ్రాసం కోతకు రావడంతో లబ్ధిదారులైన రైతులకు పంపిణీని ప్రారంభించామని చెప్పారు. మండలంలో సామూహిక గడ్డి క్షేత్రాలు పెంచుకోవడానికి ఆసక్తి గల రైతులు ముందుకు వస్తే వారికి ఉచితంగా విత్తనాలు అందిస్తామని జేడీ ప్రకటించారు. 75 శాతం రాయితీతో కూడిన పశుగ్రాస విత్తనాలు ఎర్రగుంట్ల ఏవీఎంలో అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో తమసీల్దార్ అమరేశ్వరీ, జమ్మలమడుగు సంచాలయలడు డాక్టరు వీరభ్రహ్మం, ఎర్రగుంట్ల పశుసంవర్దశాఖ సహయ సంచాలకుడు డాక్టర్ మునెయ్య భారతి సిమెంట్ ఫ్యాక్టరీ హెచ్ఆర్ మేనేజర్ భార్గవరెడ్డి, మండల వ్యవసాధికారి సుజనకుమారి, పోట్లదుర్తి పశువైద్యశాఖ డాక్టర్ వై జ్యోతి, చిలంకూరు పశువైద్యశాల డాక్టర్ మహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలి
కడప ఎడ్యుకేషన్ : జిల్లాలోని వివిధ కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా ఎంపికై న అభ్యర్థులకు బుధవారం కడపలోని సమగ్రశిక్ష జిల్లా ప్రాజెక్టు ఆదనపు కోర్డినేటర్ కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. అభ్యర్థులకు సంబంధించి సర్టిఫికెట్ల ధ్రువీకరణ, తుది మెరిట్ జాబితా పరిశీలన అనంతరం కౌన్సెలింగ్ నిర్వహించి ఆరుగురికి డీఈఓ షంషుద్దీన్, సమగ్రశిక్ష ప్రాజెక్టు అదనపు కో ఆర్డినేటర్ బి. అనురాధలు నియామక ఉత్తర్వులు అందచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంపికై న అభ్యర్థులు తమకు కేటాయించిన పాఠశాలల్లో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ విద్యాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.లింగాల పోలీసులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు లింగాల : పోలీసుల ద్వారా తమకు ప్రాణహాని ఉందంటూ లింగాల మండలం లోపట్నూతల గ్రామానికి చెందిన పెద్దపోతల వెంకట సురేష్ అనే వ్యక్తి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, డీఐజీ కోయ ప్రవీణ్, జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్, మానవ హక్కుల సంఘంతో పాటు పలువురు న్యాయమూర్తులు, ఉన్నతాధికారులకు ఆయన లిఖితపూర్వకంగా ఫిర్యాదులు సమర్పించాడు. లింగాల ఎస్ఐ జగదీశ్వరరెడ్డితో పాటు పోలీస్ సిబ్బంది తనను స్టేషన్‌కు రావాలంటూ బెదిరింపు కాల్స్ చేస్తున్నారని బాధితుడు ఆరోపించాడు. పోలీసులు తనకు చేసిన ఫోన్ కాల్స్, వాయిస్ రికార్డులను ఆయన వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై లింగాల ఎస్ఐ జగదీశ్వరరెడ్డిని వివరణ కోరగా.. లోపట్నూతల గ్రామానికి చెందిన ఒక రైతు తన కుటుంబంలోని మహిళలను వెంకట సురేష్ మానసికంగా వేధిస్తున్నాడని, పొలంలోని గేట్ వాల్స్ పగులగొట్టాడని ఫిర్యాదు చేశారన్నారు. ఆ కేసు విచారణ నిమిత్తం స్టేషన్‌కు పిలవగా, తప్పించుకోవడానికే సురేష్ పోలీసులపై అబద్ధపు ఆరోపణలు చేస్తున్నాడని ఎస్ఐ అన్నారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల మండలం వై కోడూరులోని వంక సమీపంలో ఉన్న శ్రీ అంజనేయస్వామి గుడి పక్కన ఉన్న సత్రం దగ్గర గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎర్రగుంట్ల సీఐ విశ్వనాథరెడ్డి బుధవారం మాట్లాడుతూ మృతుడికి సుమారు 35 నుంచి 40 సంవత్సరాలు వయస్సు ఉంటుందన్నారు. ఉంగరాల జట్టు, బూడిద రంగు టీ షర్ట్, ఎడమ చేతికి ఆర్ అనే ఇంగ్లీషు అక్షరం ముద్దర ఉందన్నారు. ఇతిని ఆచూకీ తెలిస్తే 9121100530 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని ఆయన తెలిపారు. మైదుకూరులో వృద్ధుడు..మైదుకూరు : పట్టణంలోని పొట్టి శ్రీరాములు సర్కిల్ లో బుధవారం సాయంత్రం ఓ వృద్ధుడు మృతి చెంది ఉండడాన్ని పలువురు గుర్తించారు. అతిగా మద్యం తాగి మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. సమాచారం అందడంతో ప్రొద్దుటూరులోని రామేశ్వరంలో నివాసం ఉంటున్న వృద్ధుడి కుమార్తె దస్తగిరమ్మ మైదుకూరుకు చేరుకొని మృతి చెందిన వృద్ధుడు తన తండ్రి దస్తగిరి అని పోలీసులకు తెలిపింది. అనారోగ్యంతో ఉన్న తన తండ్రి మద్యం తాగుతూ.. తిరుగుతూ ఉంటాడని వివరించింది. తన తండ్రి మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని తెలిపింది. -
నేల తడారి.. పంట చేజారి !
మంగపట్నం పొలంలో చీనీచెట్లను కొట్టేసిన దృశ్యం● ఎండుముఖం పట్టిన చీనీ,అరటి పంటలు ● కొట్టేస్తున్న రైతన్నలు ముద్దనూరు: చేతికందాల్సిన పంట చేలోనే ఎండిపోతే... సిరులొలికించాల్సిన సాగు కళ్లముందే వాడిపోతే... ఆ రైతుపడే వేదన వర్ణనాతీతం.. జిల్లాలోని ముద్దనూరు మండలంలో ఇదే జరుగుతోంది. వర్షాల్లేక పోవడం.. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో చీనీ,అరటి తదితర ప్రధాన పంటలు నిలువునా ఎండిపోతున్నాయి. మంగపట్నం, ఆరవేటిపల్లె,దేనేపల్లె తదితర గ్రామాల్లో సాగులో ఉన్న సుమారు 1500 ఎకరాల్లోని చీనీ చెట్లు ఎండుముఖం పట్టాయి. దీంతో చేసేదిలేక కొందరు రైతులు వాటిని కొట్టేస్తున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల భూములను బీడుగా వదిలివేయాల్సి వస్తోందని ఇప్పటికే తాము ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు. వ్యవసాయ బోర్లు ఎండిపోతున్నాయి 2 ఎకరాల్లో చీనీ చెట్లు సాగుచేస్తున్నాను. రెండు బోర్లలో నీటిమట్టం పడిపోయి సాగునీరు అందడంలేదు. వర్షాలు లేకపోవడంతో నీటి ఎద్దడి తీవ్రతరమైంది. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి. – నడిపి బయపురెడ్డి, చీనీ రైతు, మంగపట్నం. -
మూడేళ్లకే
● చిన్నారి ‘భవనీత్’ బతుకు పోరాటం ● ఆపన్న హస్తం కోసం ఆటో డ్రైవర్ కుటుంబం కన్నీటి ఆవేదన ‘ఆ పసివాడికి ఇంకా అమ్మ కడుపు చలవ కూడా పూర్తిగా తీరలేదు.. కనీసం ఆటపాటల వయసు కూడా రాలేదు.. అప్పుడే నూరేళ్ల ఆయుష్షును వెక్కిరిస్తూ మృత్యువు ముంగిట నిలబడ్డాడు. ఆ పసి గుండె కొట్టుకోవాలన్నా, ఆ నిష్కల్మషమైన కళ్లల్లో మళ్లీ నవ్వులు పూయాలన్నా.. అద్దె ఆటో నడిపే ఆ పేద తండ్రికి ‘రూ.30 లక్షల’ అక్షరాల కొండను దాటడం కత్తిమీద సాములా మారింది. గాలివీడు: ఆ పసివాడికి మూడేళ్లు నిండనే లేదు. అప్పుడే మృత్యువుతో పోరాటం మొదలైంది. ఆటపాటలతో ఇల్లంతా సందడి చేయాల్సిన మూడేళ్ల చిన్నారి, నేడు ప్రాణాంతక వ్యాధితో ఆసుపత్రి మంచంపై కొట్టుమిట్టాడుతున్నాడు. కంటికి రెప్పలా కాపాడాల్సిన ఆ పసిప్రాణాన్ని దక్కించుకోవడానికి రూ.30 లక్షల భారీ బడ్జెట్ కొండలా మారిపోవడంతో, ఆ పేద తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతూ దాతల ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. మూడు నెలలుగా ఆసుపత్రుల చుట్టూ.. గాలివీడు మండలం నూలివీడు గ్రామం కొత్తపల్లి హరిజనవాడకు చెందిన వీరబల్లి వెంకటరమణ ఒక అద్దె ఆటో నడుపుకుంటూ రోజువారీ వచ్చే అరకొర ఆదాయంతో తన భార్య శ్రీదేవి, ఇద్దరు పిల్లలను ఎంతో ప్రేమగా పోషించుకుంటున్నాడు. అయితే, మూడు నెలల క్రితం వీరి చిన్న కుమారుడు భవనీత్ హఠాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడు. చిన్నారికి వైద్యం కోసం కన్నతల్లిదండ్రులు తిరుపతి, బెంగళూరు, చైన్నె తదితర ప్రాంతాల్లోని పలు కార్పొరేట్ ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. అక్కడ జరిగిన తాజా వైద్య పరీక్షల్లో చిన్నారి భవనీత్ ‘అప్లాస్టిక్ అనీమియా’ (తీవ్ర రక్తహీనత, బోన్ మ్యారో సమస్య) అనే ప్రమాదకరమైన వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. దీనికి తోడు ప్రస్తుతం ఆ పసివాడికి సపోర్టివ్ డయాలసిస్ కూడా అవసరమని వైద్యులు సూచించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రెక్కాడితే గాని డొక్కాడని బతుకు.. రూ.30 లక్షలు ఎక్కడివి? చిన్నారి భవనీత్కు అత్యవసరంగా బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ చికిత్స చేయిస్తేనే ప్రాణాలు దక్కుతాయని, అందుకు సుమారు రూ.30 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తేల్చి చెప్పారు. అద్దె ఆటో నడిపితేనే పూట గడవని ఆ నిరుపేద కుటుంబానికి రూ.30 లక్షలు అనేది ఊహకందని అంకె. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో జీవనం సాగిస్తున్న తమ కుటుంబానికి ఇంత భారీ మొత్తాన్ని సమకూర్చడం అస్సలు సాధ్యం కావడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న కొద్దిపాటి సొమ్ము, అప్పులు తెచ్చి వైద్యానికి ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోయింది. రోజురోజుకూ క్షీణిస్తున్న కొడుకు ఆరోగ్యాన్ని చూసి, ‘అయ్యా.. ఏ పుణ్యాత్ముడైనా స్పందించి మా బిడ్డను కాపాడండి.. మీ రుణం తీర్చుకుంటాం’ అంటూ తండ్రి వెంకటరమణ, కన్నతల్లి శ్రీదేవి రెండు చేతులు జోడించి కన్నీటి పర్యంతమవుతూ వేడుకుంటున్నారు. దాతలు మానవతా దృక్పథంతో స్పందించి ఈ నిరుపేద ఆటో డ్రైవర్ బిడ్డకు పునర్జన్మ ప్రసాదించాలని గ్రామస్తులు కోరుతున్నారు. చిన్నారి భవనీత్ వైద్య చికిత్సకు సహాయం చేయదలచిన దాతలు మానవత్వంతో స్పందించి తమకు తోచిన ఆర్థిక సహాయాన్ని కింది నంబర్ ద్వారా అందించవచ్చు. తండ్రి పేరు: వీరబల్లి వెంకటరమణ గూగుల్‌పే / ఫోన్‌పే నంబర్: 7997510574 -
రాష్ట్ర ప్రయోజనాలకన్నా.. స్వప్రయోజనాలే మిన్న!
● రెండేళ్ల కూటమి పాలనలోనే రూ.4 లక్షల కోట్లకు పైగా అప్పులు ● అటు రైతులకు.. ఇటు ఉద్యోగులకు తీవ్ర అన్యాయం ● ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ధ్వజంపులివెందుల : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను పూర్తిగా పక్కనబెట్టి, తన స్వప్రయోజనాలే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి విమర్శించారు. బుధవారం పులివెందులలోని తన స్వగృహం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు గడిచిన రెండున్నరేళ్ల కూటమి పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసి, ఏకంగా రూ. 4 లక్షల కోట్లకు పైగా అప్పులు తెచ్చారని మండిపడ్డారు. ఈ అప్పుల వలన ప్రజలకు ఎలాంటి సంక్షేమం అందలేదని, కేవలం చంద్రబాబు తన స్వప్రయోజనాల కోసం దోచుకునేందుకే ఈ పని చేస్తున్నారని ధ్వజమెత్తారు. అప్పులు చేయడమే కాకుండా ప్రభుత్వ ఆస్తులను తెగనమ్మడానికి కూడా చంద్రబాబు వెనుకాడటం లేదన్నారు. ఇప్పటికే 9 సహకార చక్కెర కర్మాగారాల ఆస్తులను, ఆర్టీసీ ప్రైవేటీకరణ ద్వారా సంస్థ విలువైన ఆస్తులను అమ్మడానికి ప్రణాళికలు సిద్ధం చేశారని మండిపడ్డారు. ఉన్న ఆస్తులను తెగనమ్మడం అభివృద్ధి కాదని హితవు పలికారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పేదల ఉచిత వైద్యం కోసం 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టగా.. కూటమి సర్కార్ వాటిని ప్రైవేట్‌పరం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల మెడికల్ కళాశాలకు మంజూరైన మెడికల్ సీట్లను కూడా ఈ ప్రభుత్వం ద్వేషంతో వెనక్కి పంపిందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతల పరిస్థితి దయనీయం.. ఉద్యోగులపై నిర్బంధాలు! ప్రస్తుత ప్రభుత్వంలో అన్నదాతల పరిస్థితి మరీ దయనీయంగా మారిందని, పంటలకు గిట్టుబాటు ధరలు లేవని, ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోతే ఆదుకునే పంటల బీమా వ్యవస్థే లేదని విమర్శించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ’ధరల స్థిరీకరణ నిధి’ ద్వారా గిట్టుబాటు ధర కల్పించడమే కాకుండా, నెల రోజుల వ్యవధిలోనే బీమా సొమ్ము అందజేసేవారని గుర్తు చేశారు. ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం ప్రశ్నిస్తే.. వారిపై నిర్బంధాలు విధిస్తూ, అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గమన్నారు. చంద్రబాబు పాలన కేవలం ’క్రెడిట్ చోరీ’కే పరిమితమైందని దుయ్యబట్టారు. విలేకరుల సమావేశం అనంతరం ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తన పులివెందుల నివాసం వద్ద ప్రత్యేకంగా ’ప్రజా దర్బార్’ నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజల నుంచి అర్జీలు, సమస్యల వినతులను స్వీకరించారు. బాధితుల సమస్యలను ఓపికగా విని, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటానని, సంబంధిత అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానని ఎంపీ భరోసా ఇచ్చారు. -
అమ్మతోడు..
● జమ్మలమడుగు మున్సిపల్ ఎన్నికలపై మళ్లీ డాంబికాలు! ● భూపేష్‌రెడ్డిని బద్నాం చేయడానికే ఈ ‘నోటిదూల’ సవాళ్లంటున్న విశ్లేషకులు! ● బెదిరింపు పర్వానికి ఎమ్మెల్యే ‘ఆది’ తెర.. మా జోలికొస్తే ‘ఆపరేషన్ సింధూర్’ చూపిస్తా! ● కూటమి జోలికొస్తే సినిమా షూటింగులే.. బహిరంగంగానే హెచ్చరికలు! సాక్షి ప్రతినిధి, కడప: జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మళ్ళీ ‘టాక్ ఆఫ్ ది టౌన్’ అయ్యారు. జమ్మలమడుగు మున్సిపల్ ఎన్నికల ముంగిట తన సొంత ఫ్యాక్షన్ నేపథ్యాన్ని తానే నెమరువేసుకుంటూ, మంగళవారం మళ్లీ నోరు జారి.. దేవగుడి రాజకీయాన్ని మరోసారి ఇరకాటంలోకి నెట్టేశారు. ‘వైఎస్సార్సీపీ వాళ్లకు చెబుతున్నా.. మీరు పాలెగాళ్లైతే జమ్మలమడుగు మున్సిపాలిటీలో ఒక్క కౌన్సిలర్ సీటు గెలుచుకున్నా మేము రాజకీయం చాలించుకుంటాం.. ఒక్కటే ఒక్కటి...’ అంటూ ఆయన గట్టి సవాల్ విసిరారు. దీంతో పక్కనే కూర్చున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు దేవగుడి భూపేష్‌రెడ్డి సైతం ఒక్కసారిగా నివ్వెరపోయారు. ఈమాట ఎమ్మెల్యే తనకు మాత్రమే ఆపాదించుకుని ఉంటే ఎవ్వరికీ అభ్యంతరం లేదు. ఎందుకంటే తను తరచూ ఇలాంటి డాంబికాలు పలకడం, మళ్లీ మాట తప్పి మడమ తిప్పి పలాయనం చిత్తగించడం పరిపాటే. కాగా, ఈసారి మొత్తం దేవగుడి కుటుంబాన్ని ఉద్దేశించి ‘మేము రాజకీయాలు మానుకుంటాం’అని సవాల్ విసరడంపైనే ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఇపుడిపుడే రాజకీయంగా ఎదుగుతూ, భవిష్యత్తుపై ఆశలు పెట్టుకున్న భూపేష్‌రెడ్డి రాజకీయ జీవితాన్ని సైతం భ్రష్టు పట్టించడానికే ఆదినారాయణ రెడ్డి ఇలాంటి డాంబికాలు మాట్లాడి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2005లోనూ ఇదే సీన్.. జైలు నుంచే గట్టి పంచ్! ఆదిబాబుకు ఇలాంటి పదునైన సవాళ్లు విసిరి, ఆ తర్వాత ‘ఎస్.. స్కేప్’ అవ్వడం కొత్తేమీ కాదని జమ్మలమడుగు ఓటర్లు నవ్వుకుంటున్నారు. సరిగ్గా 21 ఏళ్ల క్రితం, ఇదే సెప్టెంబర్ (2005) నెలలో ఆదినారాయణ రెడ్డి ఇలాంటి సవాలే విసిరి ఘోరంగా అభాసుపాలయ్యారు. అప్పట్లో జమ్మలమడుగు మున్సిపాలిటీకి 20 వార్డులు ఉండేవి. 2005 మున్సిపల్ ఎన్నికల సమయంలో, ‘ప్రతిపక్షం కనుక ఇక్కడ మూడు వార్డులు గెలిస్తే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా’ అంటూ అట్టహాసంగా ప్రకటించారు. వాస్తవానికి ఆదినారాయణరెడ్డి ప్రధాన ప్రత్యర్థి అయిన రామసుబ్బారెడ్డి ఆ సమయంలో చర్లపల్లి జైలులో ఉన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల బాధ్యతను రామసుబ్బారెడ్డి సతీమణి ఇందిరమ్మ ఒంటిచేత్తో చూసుకుంటూ ఉండేది. భర్త జైలులో ఉన్నా, తాము ప్రతిపక్షంలో ఉన్నా 20 వార్డులకూ తమ అభ్యర్థులతో పోటీ చేయించిన ఆమె.. కచ్చితంగా మూడు వార్డులను మాత్రమే గెలుచుకుని ఆదినారా యణరెడ్డిని నిలువునా ఇరకాటంలోకి నెట్టేసింది. అప్పట్లో ఆదినారాయణరెడ్డి నోటిదూల వల్ల ఆయన వర్గం ఏకంగా 17 సీట్లు గెలుచుకున్నా కూడా కనీసం ఒక్కటంటే ఒక్క సంబరం కూడా చేసుకోలేకపోయింది. కానీ, కేవలం మూడు సీట్లు గెలిచిన ప్రతిపక్షం మాత్రం ఆరోజు జమ్మలమడుగులో పెద్ద ఎత్తున పండగ చేసుకుంది. ఆ తర్వాత ఈయన గారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసింది లేదు.. రాజకీయం మానుకుంది లేదని పరిశీలకులు దెప్పిపొడుస్తున్నారు. ఇపుడు మళ్లీ అవే డాంబికాలే... నాడు 20 వార్డులున్న జమ్మలమడుగు మున్సిపాలిటీ నేడు 32 వార్డులకు విస్తరించింది. మొత్తం 32 వార్డుల్లో వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి గట్టి అభ్యర్థులను బరిలో దించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈసారి ఓసీ మహిళా రిజర్వు అయితే స్వయంగా రామసుబ్బారెడ్డి సతీమణి ఇందిరమ్మే మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఉండబోతున్నారు. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధిక కౌన్సిల్ స్థానాలను గెలుచుకోవడమే కాకుండా.. మున్సిపల్ చైర్ పర్సన్ సీటును సైతం దక్కించుకోబోతోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లుండి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆద్యంతం ఆసక్తికరంగా మారాయి. తెలుగుదేశం పార్టీలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న భూపేష్‌రెడ్డిని బద్నాం చేయడానికేనా ఇలాంటి పనికిరాని ప్రగల్భాలు మాట్లాడాడనేది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. అతని సొంత అభిప్రాయాన్ని మొత్తం కుటుంబానికంతా రుద్ది, డాంబికపు మాటలతో అన్నదమ్ములందరినీ ఇరకాటంలోకి నెట్టి, ఆ తర్వాత తమాషా చూడడం ఆయనకు అలవాటేనని పలువురు అభిప్రాయ పడుతున్నారు. సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి టాస్క్ఫోర్సు: త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే పి.ఆదినారాయణరెడ్డి బెదిరింపుల పర్వానికి తెరలేపారు. మంగళవారం జమ్మలమడుగు పట్టణంలోని రిపబ్లిక్ క్లబ్బులో ఏర్పాటు చేసిన ఉచిత వైద్యశిబిరంలో మంత్రి ఎస్.సవిత సమక్షంలోనే ఆది ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా దుమారం రేపుతోంది. మాది సినిమా షూటింగ్ కాదు.. హిస్టరీ! సమావేశంలో ఆదిబాబు మైక్ అందుకుని వైఎస్సార్సీపీని టార్గెట్ చేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘వాళ్ల మాదిరి మేము రీల్ తిప్పం.. ఇది సినిమా షూటింగ్ కాదు, రియల్. వాళ్లలా గ్రాఫిక్స్ చేయం, మాది నిజమైన గ్రాఫ్. మేము స్టోరీలు చెప్పం.. మాది గండికోట హిస్టరీ’ అంటూ చెప్పుకొచ్చారు. తాము ఫ్యాక్షనిజంలో నలిగిపోయామని, సొంత మనుషులను పోగొట్టుకున్నామని చెబుతూనే.. ‘మేము ఎవ్వరి జోలికి పోము.. కానీ మా కూటమి నాయకుల జోలికి, కార్యకర్తల జోలికి వస్తే మాత్రం కచ్చితంగా ఆపరేషన్ సింధూర్ ఉంటుంది, సినిమా చూపిస్తాం’ అంటూ భయానక వాతావరణాన్ని సృష్టించేలా మాట్లాడారు. మళ్లీ అదే కౌన్సిలర్ సవాల్! తాము ఇండ్లు ఇచ్చామని, చేనేతలకు పెన్షన్లు, ఆటోవారితో పాటు మత్స్యకారులకు ఎంతో సహాయం చేశామని చెప్తున్న ఆదిబాబు.. ‘మంచి చేస్తే ఓట్లేయరా.. మరి బెదిరింపులు ఎందుకు?’ అంటూ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. గతంలో జగన్‌కు బై–ఎలక్షన్లో లక్ష ఓట్ల మెజార్టీ తెచ్చానని గుర్తుచేస్తూ.. తనపై కోడికత్తి, వివేకానందరెడ్డి హత్య కేసులను అక్రమంగా పెట్టారని ఆవేదన వ్యక్తంచేశారు. ఒక్క రేప్ కేసు తప్ప తనపై అన్ని కేసులు పెట్టేశారంటూ విచిత్ర వ్యాఖ్యలు చేశారు. జమ్మలమడుగు మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పాలెగాళ్లు కనుక ఒక్క కౌన్సిలర్ సీటు గెలిచినా తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు. 2005 మున్సిపల్ ఎన్నికల్లో ఇలాగే 3 సీట్ల సవాల్ విసిరి దారుణంగా అభాసుపాలైన ఆది.. మళ్లీ ఇప్పుడు అదే పాత చింతకాయ పచ్చడి ప్రగల్భాలు పలుకుతుండటంపై జమ్మలమడుగు ఓటర్లు ముక్కున వేలేసుకుంటున్నారు. -
వర్షాభావ స్థితిపై ప్రత్యేక కార్యచరణ
● ప్రత్యామ్నాయ పంటలకు విత్తనాల పంపిణీ ● పశువుల రక్షణకు ముందస్తు చర్యలు ● ఇన్చార్జి మంత్రి సవిత కడప సెవెన్‌రోడ్స్ : ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొనేందుకు ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామని ఇన్చార్జి మంత్రి సవిత తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని మొత్తం 40 మండలాలను కరువు ప్రభావిత మండలాలుగా పరిగణించాలంటూ జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలు సమర్పించిందని వెల్లడించారు. జిల్లాలోని ప్రధాన జలాశయాల్లో 82 టీఎంసీల పూర్తి సామర్థ్యానికిగాను 46 శాతం మాత్రమే నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. తాగునీటి అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ నీటి విడుదలను సమన్వయంతో చేపట్టాల్సిన అవసరం ఉందని సూచించారు. సాగునీటి లభ్యత తక్కువ ఉన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటిగా జిల్లాకు మంజూరైన సబ్సిడీ విత్తనాలను ఆమె రైతులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ శ్రీధర్, జేసీ నిధి మీనా, ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, వరదరాజులరెడ్డి, సుధాకర్ యాదవ్, ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జెడ్‌హెచ్‌డీసీ భూముల క్రమబద్ధీకరణ : అర్హులైన ఎస్సీలు సాగు చేసుకుంటున్న జెడ్‌హెచ్‌డీసీ భూములను క్రమబద్ధీకరిస్తున్నట్లు మంత్రి సవిత తెలిపారు. జిల్లా స్థాయి అసైన్మెంట్ కమిటీ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు. మొదటగా మైదుకూరు నియోజకవర్గంలో 150 మంది లబ్దిదారులకు 150 ఎకరాల హక్కులు కల్పిస్తూ అసైన్మెంట్ కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. జిల్లాలో మూడు మండలాలు, నాలుగు గ్రామాలకు సంబంధించి 304 ఎకరాల జెడ్‌హెచ్‌డీసీ భూములు 265 మంది లబ్ధిదారుల వివరాలను కమిటీ పరిశీలించిందన్నారు. ఇందులో ఖాజీపేట మండలం చెమ్ముళ్లపల్లె, దుంపలగట్టులో 143 ఎకరాలు, వల్లూరు మండలం లేబాకలో 42 ఎకరాలు, పోరుమామిళ్ల మండలం ఎల్లో పల్లెలో 117 ఎకరాలు, మైదుకూరు మండలం నంద్యాలంపేటలో 47 ఎకరాల భూములతోపాటు లబ్ధిదారులను గుర్తించామని వివరించారు. -
పెన్షనర్లపై కూటమిది దుర్మార్గ వైఖరి !
● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెన్షనర్ల నినాదాలు ● కలెక్టరేట్ వద్ద మహాధర్నా మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి ధర్నాలో పాల్గొన్న పెన్షనర్లుకడప ఎడ్యుకేషన్: పెన్షనర్లకు సంబంధించిన న్యాయమైన సమస్యల పరిష్కారానికి కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొడ్డిదారిలో చట్టాలు చేస్తూ మానసికంగా హింసిస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్, స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు మంగళవారం కలెక్టరేట్ వద్ద జిల్లా ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు రామమూర్తి నాయుడు, నాగముని రెడ్డి ఆధ్వర్యంలో మహా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా పెన్షనర్లు తరలివచ్చారు. తమ సమస్యలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూపుతున్న నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోచంరెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ పెన్షనర్ల న్యాయమైన సమస్యలను కూడా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. దీంతో పెన్షనర్లు వృద్ధాప్యంలో ఇబ్బందులు పడుతున్నారన్నారు. పెన్షనర్లకు చెల్లించాల్సిన డీఏ, డీఆర్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మల్లు రఘునాథ రెడ్డి మాట్లాడుతూ పెన్షనర్లకు మధ్యంతర భృతిని ప్రకటించాలన్నారు. ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు, జేఏసీ నాయకులు శ్రీనివాసులు, పెన్షనర్స్ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాసులు , ఎలక్ట్రిసిటీ, బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ మొదలగు సంఘాల నాయకులు ప్రభుదాస్, సుధాకర్, రఘునాథరెడ్డి,ఎల్ ఎన్ సుబ్బమ్మలు పెన్షనర్స్ సమస్యలను పట్టించుకోని ప్రభుత్వ వైఖరిని ఖండించారు. పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రదాన కార్యదర్శులు రామూర్తినాయుడు, నాగమునిరెడ్డి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పలు సంఘ నేతలు దస్తగిరి రెడ్డి, దేవదానం,ఆంజనేయులు,రామసుబ్బారెడ్డి, సుబ్బారాయుడు, కొండారెడ్డి , పెన్షనర్ల సంఘ నాయకులు ఆగేపాటి సుబ్బరాయుడు, అపూర్వసుందరి, పార్వతమ్మ ముఖ్య సలహాదారులు జడపల్లి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
వేలం ద్వారా రూ.95.10 లక్షల ఆదాయం
వేంపల్లె : చక్రాయపేట మండల పరిధిలోని గండి క్షేత్రం ఆలయానికి టెంకాయల వేలం ద్వారా రూ.95.10 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ విశ్వనాథ్ పేర్కొన్నారు. మంగళవారం ఆలయ కార్య నిర్వహణ కార్యాలయంలో టెంకాయల విక్రయానికి బహిరంగ వేలం నిర్వహించారు. వేలంలో 11 మంది డిపాజిట్‌దారులు పాల్గొనగా.. కుప్పాలపల్లెకు చెందిన రామగంగి రెడ్డి హెచ్చు పాట పాడి టెంకాయల విక్రయించేందుకు హక్కును దక్కించుకున్నాడు. గత ఏడాది రూ.75.35 లక్షలు పాడగా.. ఏడాది రూ.2 లక్షలు అదనంగా ఆదాయం వచ్చింది. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెంకటస్వామి, కమిటీ సభ్యులు, వేలంపాటదారులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలుఅట్లూరు : మండల పరిధిలోని అట్లూరు క్రాస్ రోడ్డులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగటి సుబ్బనరసయ్య అనే వ్యక్తి తీవ్రగాయాలపాలయ్యాడు. స్థానికుల వివరాల మేరకు కొండూరు ఎస్సీ కాలనీకి చెందిన సంగటి సుబ్బనరసయ్య తన అల్లుడు బుజ్జయ్యతో కలిసి ద్విచక్రవాహనంపై అట్లూరు నుంచి గ్యాస్ సిలిండర్ తెచ్చుకునేందుకు బయల్దేరారు. అట్లూరు క్రాస్ రోడ్డు సమీపానికి వెళ్లే సరికి కడప నుంచి ఆయిల్ ట్యాంకర్ మరో ఆయిల్ ట్యాంకర్‌ను ఓవర్ టేక్ చేయబోయి ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ప్రమాదంలో సంగటి సుబ్బనరసయ్య తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన అతనిని 108 అంబులెన్స్‌లో కడప రిమ్స్‌కు తరలించారు. పోలీసులు కేసు విచారణ చేపట్టారు. బాధ్యతల స్వీకరణకడప అర్బన్ : వైఎస్ఆర్ కడప జిల్లా ప్రధాన సెషనన్స్ కోర్టుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులైన జి. శివశంకర్ రెడ్డి మంగళవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి రామ్ గోపాల్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకేను అందించారు. -
రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపిక
కమలాపురం : మండలంలోని నల్లలింగాయపల్లెలో వెలసిన భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌లోని డీఏవి భారతి విద్యామందిర్‌కు చెందిన 8వ తరగతి విద్యార్థిని ఆర్.గీతికా రెడ్డి రాష్ట్ర స్థాయి ఎస్జీఎఫ్ హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపల్ శివ్వం కిషోర్ కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 28వ తేదీన పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లె జడ్పీహెచ్ఎస్లో జరిగిన జిల్లా స్థాయి ఎస్జీఎఫ్ హ్యాండ్‌బాల్ పోటీలలో అండర్–14 విభాగంలో ఆడిన విద్యార్థిని గీతికారెడ్డి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా హ్యాండ్ బాల్ జట్టుకు ఎంపికై నట్లు తెలిపారు. అక్టోబర్ 3, 4వ తేదీలలో తెనాలిలో జరిగే రాష్ట్ర స్థాయి ఎస్జీఎఫ్ హ్యాండ్ పోటీల్లో జిల్లా జట్టుకు తమ పాఠశాల విద్యార్థిని ప్రాతినిథ్యం వహిస్తుందని ఆయన వివరించారు. కాగా ప్లాంట్ హెడ్ రామమూర్తి, హెచ్ఆర్ హెడ్ గౌరీ పరమేశ్వరరావు, ఐఆర్ అండ్ పీఆర్ హెచ్ భార్గవ్ రెడ్డి , డీఏవీ ప్రాంతీయ అధికారి శేషాద్రి తదితరులు విద్యార్థినితో పాటు పీఈటీ చందును అభినందించారు. -
సచివాలయ ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించాలి
ప్రొద్దుటూరు : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను కూటమి ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ బాధలను చెప్పుకోవడానికి అమరావతి, విజయవాడ వెళ్లిన సచివాలయ సిబ్బందిపై ప్రభుత్వం నీచంగా, అమానుషంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకే సంతకంతో ఏకంగా 1.30 లక్షల సచివాలయ ఉద్యోగాలను అత్యంత పారదర్శకంగా, ఎక్కడా చిన్న విమర్శకు తావులేకుండా భర్తీ చేశారని రాచమల్లు గుర్తుచేశారు. ఎంతో ఉన్నత చదువులు చదివి, పోటీ పరీక్షలు రాసి ఉద్యోగాలు సాధించిన వారిని బానిసల్లా చూడటం మానేసి, ఆత్మగౌరవాన్ని కాపాడాలన్నారు. నిరసన తెలపడానికి వస్తే ఉద్యోగులను పశువుల్లా ఈడ్చి వ్యాన్లలోకి ఎక్కించడం దారుణమన్నారు. వలంటీర్లను తప్పించి వారి విధులన్నీ సచివాలయ ఉద్యోగులపై వేసి, వారితో ఉద్యోగం బదులు ఊడిగం చేయిస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగులను 11 రకాల ఇతర సేవలకు వినియోగించుకునేందుకు ప్రభుత్వం జారీ చేసిన దుర్మార్గపు జీఓ నంబర్ 11ను తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ పని ఒత్తిడి భరించలేక రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 400 మంది సచివాలయ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతే.. వారికి కనీసం పరిహారం ఇవ్వకపోగా, వారి కుటుంబీకులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగ అవకాశం కూడా కల్పించలేదని దుయ్యబట్టారు. సిబ్బందికి కొత్త పీఆర్సీ ఇవ్వలేదని, పాత వేతన అరియర్స్ చెల్లించలేదని, మహిళా ఉద్యోగులకు కనీస హక్కు అయిన ప్రసూతి సెలవులు కూడా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విపరీతమైన ఒత్తిడి, ముందే ఉన్న అనారోగ్యం కారణంగానే విధి నిర్వహణలో సీఐ ఆలీ మరణించారని విమర్శించారు. ఇదే సమయంలో ఒక టీవీ ఛానల్ (టీవీ5) చర్చా వేదికలో సచివాలయ ఉద్యోగుల వ్యవస్థపై, సిబ్బందిపై సాంబశివరావు అత్యంత అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమన్నారు. ఎంతో కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించిన వారిని పట్టుకుని ‘బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, పోరంబోకులు’ అంటూ తన ఛానల్లో మాట్లాడటం పట్ల రాచమల్లు తీవ్రంగా మండిపడ్డారు. ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడిన సాంబశివరావు వెంటనే సచివాలయ ఉద్యోగులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరిచి సచివాలయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో వారికి అండగా నిలిచి వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని రాచమల్లు శివప్రసాదరెడ్డి స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు డిమాండ్ -
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని కొర్రపాడు రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీహార్ రాష్ట్రానికి చెందిన మంఽథన్ మంఝూషి (24) మృతి చెందాడు. ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మైనర్ బాలుడు సోమవారం రాత్రి టీవీఎస్ ఎక్సెల్‌పై అజాగ్రత్తగా వెళ్తూ ఎదురుగా వస్తున్న బీహార్ రాష్ట్రానికి చెందిన మంథన్ మంఝాహి బైక్‌ను ఢీ కొట్టడంతో తలకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రావమైంది. దీంతో అతన్ని వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ రాత్రి పొద్దుపోయాక మృతి చెందాడు. ఇదే ఘటనలో గాయపడిన మైనర్ బాలుడు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ట్రాఫిక్ సీఐ భాస్కర్ తెలిపారు. మైనర్లు వాహనాలు నడపడం చట్టవిరుద్ధమే కాకుండా ప్రమాదకరమని సీఐ హెచ్చరించారు. గంజాయి విక్రేత అరెస్ట్పులివెందుల రూరల్ : గంజాయి విక్రేతను అరెస్టు చేసి అతని వద్ద నుంచి 750 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ తెలిపారు. మంగళవారం పట్టణంలోని స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఆయన రూరల్ సీఐ శాంతి లాల్, లింగాల మండల ఎస్ఐ జగదీశ్వరరెడ్డిలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లింగాల మండలం కోమన్నూతల గ్రామానికి చెందిన నడిపి వెంగముని నేర్జాంపల్లె గ్రామానికి వెళ్లే మార్గంలో ఎగువ గట్టపై ఉన్న అడ్డి తోటలో గంజాయి సాగు చేస్తున్నట్లు సమాచారం రావడంతో అతన్ని అరెస్టు చేసి అతని వద్ద నుంచి 750 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. కోమన్నూతల గ్రామానికి చెందిన వెంగమని గత కొంతకాలంగా గంజాయి మొక్కలు పెంచుతుండడంతో సమాచారం రావడంతో మంగళవారం 3గంటల ప్రాంతంలో తనిఖీలు చేయగా.. ఆరడుగుల ఎత్తు గల గంజాయి మొక్కలతోపాటు ఇంటి వద్ద గంజాయి ఆకులను స్వాధీనం చేసుకున్నామన్నారు. కడప శివార్లలో లారీ దహనం కడప అర్బన్ : తమిళనాడులోని నైవేలి నుంచి హైదరాబాద్‌కు లిగ్నైట్ (గోధుమ బొగ్గు) లోడ్‌తో వెళ్తున్న లారీ నగర శివార్లలోని అలంఖాన్‌పల్లి ఇర్కాన్ సర్కిల్ సమీపంలో అగ్ని ప్రమాదానికి గురైంది. బొగ్గులో సహజంగా వేడి పెరిగి మంటలు చెలరేగే ‘స్పాంటేనియస్ కంబషన్’ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. లారీ నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. కడప అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలను పూర్తిగా అదుపు చేశారు. అయితే ఈ ప్రమాదంలో లారీతో పాటు బొగ్గు పూర్తిగా బూడిదైంది. ప్రమాదం వల్ల సుమారు రూ.29,54,000 మేర నష్టం వాటిల్లినట్లు లారీ యజమాని పార్థసారథి అధికారులకు ఫిర్యాదు చేయగా, అగ్నిమాపక సిబ్బంది కేసు నమోదు చేశారు.750 గ్రాముల గంజాయి స్వాధీనం -
స్థానికఎన్నికల తరహాలో ఎస్ఎంసీ ఎన్నికలు
● 2281 పాఠశాలకుగాను 1882 పాఠశాలల్లో నిర్వహణ ● బద్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా 352 పాఠశాలల్లో ఆగిన ఎన్నికలు ● 10 పాఠశాలల్లో కోరం లేక మరో 29 స్కూళ్లలో జీరో ఎన్రోల్తో నిలుపుదల కడప ఎడ్యుకేషన్: ప్రశాంత వాతావరణంలో సజావుగా జరగాల్సిన స్కూల్ కమిటీ ఎన్నికల(ఎస్ఎంసీ)లు కూడా స్థానిక సంస్థల ఎన్నికలను తలపించాయి. జిల్లావ్యాప్తంగా ఒకట్రెండు చోట్లు చిన్నపాటి ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఎన్నికలను నిర్వహించారు. ● జిల్లావ్యాప్తంగా 2281 పాఠశాలల్లో మంగళవారం ఎస్ఎంసీ ఎన్నికలు జరగాల్సి ఉండగా 1882 పాఠశాలల్లోనే జరిగాయి. మిగతా 399 స్కూల్స్‌లో ఎన్నికలు జరగలేదు. ఇందులో బద్వేల్ నియోజవర్గ వ్యాప్తంగా 352 పాఠశాలలో ఎస్ఎంసీ ఎన్నికలు జరగలేదు. గిద్దలూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన సమావేశానికి బద్వేల్ నియోజక వర్గం నుంచి మహిళలు వెళ్లడమే ఇందుకు కారణం. బద్వేల్ డివిజన్ ఆర్డీవో ఎస్ఎంసీ ఎన్నికలు వాయిదా వేయాలని కలెక్టర్‌కు విన్నవించగా.. ఆయన ఉత్తర్వు మేరకు ఎన్నికలను వాయిదా వేసినట్లు తెలిసింది. ఈ విషయమై సమగ్రశిక్ష ఏపీసీ అనురాధను వివరణ కోరగా బద్వేల్ నియోజక వర్గం మొత్తం అక్టోబర్ 1వ తేదీ ఎన్నికలను నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారన్నారు.10 పాఠశాలల్లో మాత్రం కోరం లేక ఎన్నికలు జరగలేదు. అలాగే మరో 29 పాఠశాలలో జీరో ఎన్రోల్ మెంట్ ఉండటంతో ఆ పాఠశాలల్లో కూడా ఎన్నికలను నిర్వహించలేదు. అలాగే మరో 8 ఎయిడెడ్ స్కూల్స్ ఎన్నికలను నిర్వహించినా ఎస్ఎంసీ కమిటీ పేర్లను ప్రకటించేందుకు నిర్వాహకులు నిరాకరించనట్లు తెలిసింది. ఖాజీపేట మండలంలో... ఖాజీపేట మండలం దుంపలగట్టు ప్రాథమిక పాఠశాలలో ఎన్నికల నిర్వహణలో వైఎస్సార్సీపీ, టీడీపీ మద్దతుదారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. అలాగే దుంపలగట్టు దళితవాడలో కూడా టీడీపీ నేతల ఘర్షణతో ఎస్ఎంసీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఒంటిమిట్టలో ఉపాధ్యాయుల అత్యుత్సాహం ● ఒంటిమిట్ట మండలంలో ఎస్ఎంసీ ఎన్నికలను ఆయా పాఠశాలలకు సంబంధించిన కొంత మంది ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ముఖ్యంగా ఒంటిమిట్ట జెడ్పీహెచ్ఎస్లో జరిగిన ఎస్ఎంసీ ఎన్నికల్లో మొత్తం 15 మంది సభ్యుల పేర్లను ఎంపిక చేసినట్లు ధ్రువీకరించిన ఉపాధ్యాయులు.. సదరు ధ్రువీకరణ పత్రాల్లో సభ్యుల సంతకాలు కాక ముందే చైర్మన్ ఎన్నిక పూర్తి చేశారు. ● నిబంధనల ప్రకారం ఎస్ఎంసీ ఎన్నికల్లో చైర్మన్‌ని మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల లోపు ఎన్నుకోవాల్సి ఉండగా పెన్నపేరూరు జడ్పీహెచ్ఎస్లో, రాచగుడిపల్లి ఎంపీపీఎస్ లలో ఉదయం 10:30 గంటలకే చైర్మన్లను ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు సన్మానాలు చేసి, సామాజిక మాధ్యమాల్లోనూ పోస్ట్ చేయడం హెచ్ఎంలు, ఉపాధ్యాయులు అత్యుత్సాహాన్ని చూపుతుందని విమర్శలు వస్తున్నాయి. ఎన్నికలు జరగని పాఠశాలల్లో... జిల్లావ్యాప్తంగా వివిధ కారణాలతో ఎన్నికలు జరగకుండా వాయిదా పడిన 370 పాఠశాలల్లో తిరిగి అక్టోబర్ 1వ తేదీన ఎన్నికల నిర్వహణ ఉంటుందని డీఈఓ షేక్ షంషుద్దీన్, సమగ్రశిక్ష ఏపీసీ అనురాధ తెలిపారు. -
పోలీస్‌స్టేషన్ సమీపంలో పట్టపగలే చోరీ
● 44 గ్రాముల బంగారు నగలు ● 30 తులాల వెండి అపహరణఅట్లూరు : పోలీస్‌స్టేషన్‌కు కూత వేటు దూరంలో ఉన్న ఓ ఇంట్లో పట్టపగలే తాళాలు పగలగొట్టి 44 గ్రాముల బంగారు నగలు, 30 తులాల వెండిని దొంగలు దోపిడీ చేశారు .ఈ సంఘటన అట్లూరు మండలం కొండూరు బీసీ కాలనీలో మంగళవారం చోటు చేసుకుంది. కొండూరు బీసీ కాలనీలో నివాసం ఉంటున్న బుక్కే అరుణ, అయ్యవారయ్య దంపతులు తమ ఇద్దరి పిల్లలతో మంగళవారం ఉదయం ఇంటికి తాళం వేసి సిద్దవటం మండలం మూలపల్లెలో వెలసిన అయ్యవారయ్య స్వామి గుడికి వెళ్లారు. దర్శనం అనంతరం మధ్యాహ్నం తిరిగి వారు ఇంటికి వచ్చేసరికి ఇంటికి వేసిన తాళం పగులగొట్టి ఉండటంతో వారు ఆందోళనతో లోపలికి వెళ్లగా బీరువా తెరిచి ఉంది. బీరువాలోని దుస్తులు అన్ని చెల్లా చెదరుగా పడి ఉన్నాయి. నగలను వెతకగా 25 గ్రాముల బంగారు హారం, 7 గ్రాముల మాటీలు, 10 గ్రాముల రెండు జతల కమ్మలు, మరో రెండు ఉంగరాలు కలిపి 44 గ్రాముల బంగారు, 30 తులాల వెండితోపాటు రూ.4,500 నగదు దొంగలించినట్లు గుర్తించారు. లబోదిబోమంటూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఎస్ఐ మోహన్‌కుమార్ గౌడ్ సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి బాధితులతో మాట్లాడారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో ప్రొఫెసర్ సరితకు ప్రత్యేక స్థానం
కడప ఎడ్యుకేషన్ : యువతలో నైపుణ్యాభివృద్ధి, రచనా రంగాన్ని ప్రోత్సహించే దిశగా నిర్వహించిన ప్రతిష్టాత్మక కార్యక్రమంలో వైవీయూ ప్రొఫెసర్ పి. సరిత గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. ఈఎస్ఎన్ పబ్లికేషన్స్(ఇండియా) చైన్నె, లండన్ క్వశ్చన్ ఆఫ్ స్కిల్ డెవెలప్మెంట్(ఎల్ఓస్డి), యూకే వారి ఆధ్వర్యంలో చైన్నెలో నిర్వహించిన కార్యక్రమంలో మోస్ట్ ఆఽథార్స్ సైనింగ్ దేర్ ఓన్ బుక్ సైమల్టేనియస్‌లీ అనే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్ సాధించారు. ఈ రికార్డులో భాగంగా 1,572 మంది రచయితలు ఒకే సారి తమ సొంత పుస్తకాలపై సంతకాలు చేయడం విశేష ఘనతగా నిలిచింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని ఈఎస్ఎన్ పబ్లికేషన్, ఎల్ఓఎస్డి వారి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 26న ఐఐటీ, చైన్నెలో గిన్నిస్ సక్సెస్ మీట్ నిర్వహించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ పి. సరితకు జినైనెస్ వరల్డ్ లికార్ుడ్సను అధికారిక సర్టిఫికెట్తో పాటు ‘‘గినైనెస్ సక్సెస్ మీట్’’ జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా యోగివేమన విశ్వవిద్యాలయం మంంగళవారం వీసీ ప్రొఫెసర్ రాజశేఖర్ బెల్లంకొండ, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గంగిరెడ్డి గ, రెక్టార్ ప్రొఫెసర్ దాములు అలాగే బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం అధ్యాపకులు, విద్యార్థులు ప్రొఫెసర్ పి. సరితని అభినందించారు.వీసీ ప్రొఫెసర్ బెల్లంకొండ రాజశేఖర్ ప్రశంసలు -
బ్యాంక్ ఉద్యోగిపై కేసు
ప్రొద్దుటూరు క్రైం : లోన్ ఇప్పిస్తానని నమ్మించి రూ. 18 లక్షలు తీసుకొని ఏడాది కాలంగా పట్టించుకోకుండా తిరుగుతున్న బ్యాంకు ఉద్యోగిపై ప్రొద్దుటూరు రూరల్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రొద్దుటూరు ఎన్జీఓ కాలనీకి చెందిన దిలీప్‌నకు లోన్ ఇప్పిస్తానని సిటీ యూనియన్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేసిన జోసఫ్ ఆమ్‌స్ట్రాంగ్ హామీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే అతను లోన్ ఇప్పిస్తానని చెప్పి దిలీప్ వద్ద నుంచి రూ.18 లక్షలు తీసుకున్నాడు. డబ్బులు తీసుకొని ఏడాది గడిచినా లోన్ ఇప్పించకపోగా, డబ్బులు తిరిగి ఇవ్వకుండా అదిగో.. ఇదిగో అంటూ కాలయపన చేస్తున్నాడు. దీంతో దిలీప్ పోలీసులను ఆశ్రయించాడు. ప్రస్తుతం జోసఫ్ ఆమ్‌స్ట్రాంగ్ తమిళనాడు రాష్ట్రంలో పని చేస్తున్నాడు. బాఽధితుడు దిలీప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం జోసఫ్ ఆమ్‌స్ట్రాంగ్‌పై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. ఈ–కేవైసీ నివేదికలు మా పరిధిలో ఉండవు– సాక్షి కథనంపై డీఎస్ఓ వివరణ కడప సెవెన్‌రోడ్స్ : రోజువారి వినియోగదారుల ఈ–కేవైసీ నివేదికలు తమ పరిధిలో ఉండవని, అవి సంబంధిత ఆయిల్ కంపెనీల సేల్స్ ఆఫీసర్ల లాగిన్‌లో మాత్రమే ఉంటాయని జిల్లా పౌరసరఫరాల అధికారి రఘురాం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం ‘గ్యాస్ సబ్సిడీకి....ఈకేవైసీ గండి’ అనే శీర్షికన సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనంపై ఆయన స్పదించారు. సేల్స్ ఆఫీసర్ ఇచ్చిన నివేదిక మేరకు జిల్లాలో హెచ్‌పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ కంపెనీలకు చెందిన మొత్తం వినియోగదారులు 4,61,085 మంది ఉన్నారని తెలిపారు. వీరిలో 4,38,961 (95.20 శాతం) మంది ఈ–కేవైసీ చేయించుకున్నారని, ఇక 22,124 (4.80 శాతం) మంది పెండింగ్‌లో ఉందని వివరించారు. ఇప్పటికే ఈ–కేవైసీ పూర్తి చేసుకున్న వారు తిరిగి చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. పెండింగ్‌లో ఉన్న వినియోగదారులు అక్టోబరు 1వ తేదీలోపు ఈ–కేవైసీ చేయించుకోవాలని సూచించారు. బీఈడీ, ఎంఈడీ రెండో సెమిస్టర్ ఫలితాలు విడుదల కడప ఎడ్యుకేషన్ : యోగి వేమన విశ్వవిద్యాలయం పరిధిలోని బీఈడీ, ఎంఈడీ కళాశాలల విద్యార్థుల రెండవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ మంగళవారం విడుదల చేశారు. విశ్వవిద్యాలయంలోని తన ఛాంబర్ లో రెక్టార్ ప్రొఫెసర్ ఎ.జి.దాము, కులసచివులు ఆచార్య ఎన్.సి., గంగిరెడ్డి, పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య టి. లక్ష్మి ప్రసాద్‌తో కలిసి పరీక్షల వివరాలు వెల్లడించారు. బీఈడీ పరీక్షలకు 4524 పంది విద్యార్థులు హాజరు కాగా 3,792 (83.82 శాతం)మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అలానే ఎంఈడీ పరీక్షలకు 64మంది హాజరు కాగా 22 (34.38 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. కార్యక్రమంలో పరీక్షల విభాగ సహాయ అధికారులు ఆచార్య సునీత పాల్గొన్నారు. విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయురాలుప్రొద్దుటూరు కల్చరల్ : పరీక్షలో ప్రశ్నకు సమాధానం రాయలేదన్న కారణంతో 6వ తరగతి విద్యార్థిని బెత్తంతో కొట్టిన సంఘటన ప్రొద్దుటూరు పట్టణంలో చోటుచేసుకుంది. కొర్రపాడు రోడ్డులోని సంగమేశ్వర హైస్కూల్లో 6వ తరగతి చదువుతున్న విద్యార్థి తమన్‌ను సోషల్ ఉపాధ్యాయురాలు శ్రీలీల పరీక్షలో సమాధానం రాయలేదని సోమవారం వీపు రక్తం గడ్డ కట్టేలా కొట్టింది. విద్యార్థి వీపుపై ఉన్న వాతలను చూసిన తల్లిదండ్రులు మంగళవారం పాఠశాలకు చేరుకుని యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడకు చేరుకున్న ఎంఈఓ సావిత్రమ్మ పాఠశాలకు చేరుకుని సంఘటనపై విచారణ జరిపారు. ఉపాధ్యాయురాలిని విధుల నుంచి తొలగించాలని, ఘటనపై నోటీసు ఇచ్చారు. కరస్పాండెంట్ శివచంద్రారెడ్డిని ఇటువంటి సంఘనటలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఆదేశించారు. -
వైద్య అధ్యాపకులకు న్యాయం చేయాలి
కడప అర్బన్ : ప్రభుత్వ వైద్యుల దీర్ఘకాలిక న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ జీడీఏఏపీ ఆధ్వర్యంలో జీఎంసీ కడప వైద్యులు నెల రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నారు. మంగళవారం జీజీహెచ్ ఓపీడీ బ్లాక్ వద్ద వైద్యులు నిరసన తెలిపారు. ‘వైద్యులకు న్యాయం చేయాలి – పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి‘ అంటూ నినాదాలు చేశారు. 2016 నుంచి 2026 వరకు పెండింగ్‌లో ఉన్న బోధనా వైద్యుల వేతన / పే రివిజన్ బకాయిలను విడుదల చేయడంతో పాటు ప్రమోషన్లు, ఎన్పీపీఏ, క్యాడర్ సమస్యలు, ఖాళీల భర్తీ తదితర డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోతే దశలవారీగా ఆందోళనను తీవ్రతరం చేస్తామన్నారు. రోగుల భద్రత, అత్యవసర వైద్య సేవలకు ఆటంకం కలగకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన కొనసాగిస్తామని జీడీఏఏపీ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో జీడీఏఏపీ తరపున డాక్టర్ ఫరూక్, డాక్టర్ రాయుడు, డాక్టర్ రమణయ్య, డాక్టర్ అమానుల్లా, డాక్టర్ మధు, డాక్టర్ ఛత్రపతి, మహిళా డాక్టర్లు పాల్గొన్నారు.రిమ్స్ ఓపీ వద్ద డాక్టర్ల నిరసన -
ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు హ్యాకథాన్ బహుమతులు
వేంపల్లె : ఇంజినీర్స్ డే సందర్భంగా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేసినట్లు డైరెక్టర్ విజయ్ ప్రకాష్ తెలిపారు. మంగళవారం ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో ఇన్నోమ్స్ హ్యాకథాన్ బహుమతుల ప్రదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాలు, సృజనాత్మకత, ఆవిష్కరణ దృక్పథం, సమస్య పరిష్కార సామర్థ్యాలను ప్రోత్సహించే లక్ష్యంతో హ్యాకథాన్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ హ్యాకథాన్న్లో దాదాపు 200 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని, వినూత్న ఆలోచనలు, సాంకేతిక పరిష్కారాలను రూపొందించేందుకు బృందాలుగా పనిచేశాయన్నారు. ప్రతిభ కనబరిచిన విజేతలకు మొదటి రూ.3,500, రెండవ బహుమతి రూ.2,500, మూడవ బహుమతి రూ.1,500, నాల్గవ బహుమతి రూ.1,000 నగదు బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం విద్యార్థులకు డైరెక్టర్ విజయ్ ప్రకాష్, ఏఓ రవికుమార్, సీఎస్ఈ విభాగాధిపతి చల్లా రత్న కుమారి అభినందించారు. -
– సాక్షి, అన్నమయ్య
ఇతని పేరు తూట్ల గోపాలు. కురబలకోట మండలంలోని తుంగావారిపల్లి. సర్వేనెంబరు 89లో 10 ఎకరాల విస్తీర్ణంలో ఇతనికి ఎకరా 70 సెంట్లు రావాలని చెబుతున్నాడు. సర్వే నిర్వహించి తన భాగం తేల్చాలని ఆరునెలలుగా పీజీఆర్ఎస్కు తిరుగుతున్నా సర్వేయర్ ఇంతవరకు రాలేదని చెబుతున్నారు. ఇది ఇతరుల ఆక్రమణలో ఉంది. భాగపరిష్కారం కోసం ప్రతి వారం అర్జీ ఇస్తున్నా అధికారుల్లో చలనం లేదు. ఎన్నాళ్లు తిరగాలో..పరిష్కారం అవుతుందన్న నమ్మకం పోతోందని తూట్ల గోపాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఈమె పేరు ఎం. రేవతి. సదుం మండలం చింతమాకులపల్లి. ఈమె భర్త దివ్యాంగుడు. పింఛన్ కూడా వచ్చేది. మూడేళ్ల క్రితం పాముకాటుతో మృతి చెందాడు. ఎలాంటి ఆర్థిక సాయం కూడా అందలేదు. అప్పటి నుంటి ఈమె వితంతు పింఛన్ కోసం తిరుగుతున్నా యంత్రాంగం కనికరించలేదు. ఇటీవల కూడా పింఛన్ కోసం ఆన్లైన్ చేసినట్లు చెబుతోంది. పింఛన్ ఎప్పుడు వస్తుందో.. అసలు వస్తుందో రాదోనని దిగులు చెందుతోంది. ఈమెది కేవీపల్లి మండలం గంగోరిపల్లి. పేరు కె.గిరిజమ్మ. అడవిపల్లి రిజర్వాయర్‌కు పోయిన భూమికి నష్టపరిహారం ఇవ్వలే దు... ఇంకా 12 ఎకరాలు భూమి ఆన్లైన్ కావాల్సి ఉంది... రాయచోటిలో జిల్లా కేంద్రంగా ఉన్నప్పుడు ఒకసారి, మదనపల్లి జిల్లా కేంద్రం అయ్యాక మరోసారి పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసింది. పీలేరు ఆర్డీఓ కోర్టులో కూడా కేసువేసింది. జేసీ ఇతర కోర్టులలో కూడా న్యాయం కోసం పోరాడుతున్నా న్యాయం జరగడం లేదని చెబుతోంది. రెవెన్యూ ఉద్యోగుల వల్ల భూ సమస్య ఏర్పడింది. ప్రతి వారం తిరుగుతున్నా పరిష్కారం కాలేదని వాపోతోంది. ఇతని పేరు కె. రామచంద్ర, పీటీఎం మండలం విసనకర్రలవాండ్లపల్లి. స్థానికంగా ఎల్లమ్మ గుడి పూజారి. భూ సమస్యపై వారం విడచి వారం పీజీఆర్ఎస్కు వస్తున్నాడు. ఇతనికి సర్వే నెంబరు 436లో 63 సెంట్లు తండ్రి దాన విక్రయం ద్వారా సంక్రమించింది. రికార్డు కూడా పక్కాగా ఉంది. అయితే ఈ భూమిని మరో వ్యక్తి దర్జాగా ఆక్రమించుకున్నారు. రెవెన్యూ అధికారులు 25 సెంట్లు మాత్రమే చూపించారు. మిగిలిన భూమి గురించి అడిగితే పట్టించుకోవడం లేదని వాపోతున్నాడు. ఎన్నిసార్లు తిరిగినా తన భూ సమస్య పరిష్కారం కావడం లేదని ఆవేదన చెందుతున్నారు. -
● గణపతికి భక్తితో..
సాఽదారణంగా గణనాథుడి నిమజ్జనం అంటే భారీ లారీలు, డీజేల హడావుడి కనిపిస్తుంది. కానీ, రాయచోటిలో మాత్రం వినాయకుడు అత్యంత వైవిధ్యంగా సహజసిద్ధమైన ఎద్దుల బండిపై నిమజ్జనానికి తరలివెళ్లాడు. జిల్లా వ్యాప్తంగా ఆదివారం నాటితో వినాయక నిమజ్జనాల పర్వం అధికారికంగా ముగిసినప్పటికీ, పట్టణంలోని పాత రాయచోటిలో మాత్రం సోమవారం నాడు స్వామివారిని స్థాన చలనం చేశారు. లంబోదరుడిని తరలించేందుకు స్థానికులు ఎద్దుల బండిని రంగరంగుల పూలమాలలతో, గొడుగులతో ఎంతో సుందరంగా అలంకరించారు. చిత్రంలో కనిపిస్తున్నట్లుగా భక్తులు భక్తిశ్రద్ధలతో బండిపై స్వామివారిని ఉంచి పాత రాయచోటి వీధుల్లో ఊరేగించారు. డప్పుల వాయిద్యాలు, మేళతాళాలు, జానపద నృత్యాలు, కోలాట భజనల మధ్య భక్తులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ కేరింతలతో అత్యంత వైభవంగా స్వామివారిని నాగిరెడ్డి శ్రీనివాస రిజర్వాయర్‌కు తరలించి నిమజ్జనం చేశారు. – రాయచోటి టౌన్ -
ప్రమాదంలో గాయపడిన యువకుడు మృతి
సుండుపల్లి : మండల పరిధిలోని జీకే రాచపల్లి హాస్టల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిజ్వాన్ (22) సోమవారం చైన్నెలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాలు.. రిజ్వాన్ ఈనెల 23న బైక్‌లో సుండుపల్లికి వస్తుండగా, జీకే రాచపల్లి హాస్టల్ సమీపంలో డీజే వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసి, క్షతగాత్రుడిని రాయచోటి ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం తొలుత తిరుపతికి, అక్కడ రెండు రోజుల చికిత్స అనంతరం వేలూరు మీదుగా చైన్నెలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొని..ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడామైదానం ఎదురుగా ఆర్టీసీ బస్సు డీనకోడంతో బైక్‌పై వెళ్తున్న వెంకటరమణ (51) అనే వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు తీసుకుంటే.. ఎర్రగుంట్ల పట్టణంలోని షాదీఖానా వెనుక ఎర్రబ్బాచేనులో నివాసం ఉన్న వెంకటరమణ బేల్దారి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతని మొదటి భార్య లక్ష్మీదేవి ఆనారోగ్యంతో కొన్నేళ్ల కిందట మృతి చెందింది. వీరికి ఇద్దరు కుమారులు.తర్వాత రెండో పెళ్లి చేసుకున్నాడు. సోమవారం రాత్రి బైక్‌లో ఇంటికి వెళుతుండగా తాడిపత్రి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. అనుమానాస్పద స్థితిలో మహిళ..పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలోని స్థానిక చౌడమ్మ వీధిలో ఈశ్వరమ్మ (35) అనే మహిళ సోమవారం అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది.పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తొండూరు మండలం సైదాపురం గ్రామానికి చెందిన ఈశ్వరమ్మకు లింగాల మండలం తాతిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన రవిశంకర్‌రెడ్డితో పదేళ్ల క్రితం వివాహమైంది. అయితే వారికి సంతానం లేకపోవడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఆదివారం రాత్రి ఈశ్వరమ్మ ఇంట్లో ఇంట్లో శ్లాబ్ కడ్డీకి ఉరి వేసుకుని మృతి చెందింది. ఈశ్వరమ్మ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భర్తే ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ సుబహాన్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న ఇద్దరు అరెస్ట్ ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని రామేశ్వరం రోడ్డులో ఉన్న ఆనాబంకు వద్ద ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరిని వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ వివరాలను వన్‌టౌన్ సీఐ కొండారెడ్డి ఎస్ఐ మైనుద్ధిన్తో కలిసి సోమవారం సాయంత్రం మీడియాకు వివరించారు. ఈశ్వరరెడ్డినగర్కు చెందిన నక్క శ్రీకాంత్, నాగేపల్లి రాజేష్‌లు ఓల్డ్ 777 డాట్ కాం అనే యాప్ ద్వారా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించిన ఎస్ఐ మైనుద్ధిన్ ఇరువురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 9 వేలు నగదు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇరువురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
ట్రిపుల్ ఐటీలో గేట్ – జామ్ అవగాహన కార్యక్రమం
వేంపల్లె : ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో ’గేట్ – జామ్ 2027 పరీక్షలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమం విజయవంతమైందని డైరెక్టర్ ప్రొఫెసర్ జి. విజయప్రకాష్ తెలిపారు. క్యాంపస్‌లోని ఉన్నత విద్య, పోటీ పరీక్షల విభాగం ఆధ్వర్యంలో సోమవారం ఈ సదస్సును నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్, మాజీ గేట్ ఛైర్మన్ సురేష్ కుమార్ రాయల్ విశిష్ట వక్తగా హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. జాతీయ స్థాయి పరీక్షలైన గేట్ , జామ్ ద్వారా లభించే ఉన్నత విద్యా అవకాశాలు, పరిశోధన రంగాలు, సన్నద్ధత వ్యూహాలను ఆయన విద్యార్థులకు వివరించారు. ఐఐటీ మద్రాస్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల నిపుణుల మార్గదర్శకత్వం ట్రిపుల్ ఐటీ విద్యార్థుల వృత్తిపరమైన ఎదుగుదలకు ఎంతో దోహదపడుతుందని డైరెక్టర్ పేర్కొన్నారు. ఈ సదస్సుకు విద్యార్థుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. దాదాపు 300 మందికి పైగా విద్యార్థులు ప్రత్యక్షంగా, మరో 500 మందికి పైగా ఆన్లైన్ ద్వారా వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రిపుల్ ఐటీ పరిపాలన అధికారి పెనుగొండ రవి కుమార్, విద్యార్థి సంక్షేమ డీన్ వెంకటేష్, సెంట్రల్ ఆర్.డి డీన్ కొండారెడ్డి, డాక్టర్ ఎం. భాస్కరయ్య, పాల్గొన్నారు. -
వ్యక్తి ఆత్మహత్య
ఒంటిమిట్ట : మండల పరిధిలోని ఇబ్రహీంపేటలో విష ద్రావణంతాగి నక్కల రామయ్య(45) అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వివరాల మేరకు..ఇబ్రహీంపేట ఎస్సీ కాలనీ కి చెందిన నక్కల రామయ్య ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఏం జరిగిదో ఏమో తెలియదు ఆదివారం ఉదయం 7:30 గంటల సమయంలో ఎస్సీ కాలనీలోని ఓ ప్రదేశంలో మద్యంలో విషద్రావణం కలుపుకుని తాగడంతో తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. గమనించిన స్థానికులు రామయ్యను కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందాడు. రామయ్యకు భార్య లక్ష్మీదేవి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తెకు వివాహమైంది. భార్య లక్ష్మీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, విచారిస్తున్నారు. భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందని భర్త..ప్రొద్దుటూరు క్రైం : భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందని కలత చెంది.. భర్త కృష్ణయ్య (40) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ప్రొద్దుటూరులోని శ్రీనివాసనగర్‌లో చోటు చేసుకుంది. టూ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శ్రీనివాసనగర్‌లోని బాలాజీ గ్యాస్ ఏజెన్సీ ఎదురుగా ఉన్న పెంచలయ్య హమాలీ పని చేసుకుని జీవనం సాగిస్తుంటాడు. కుటుంబ కలహాల కారణంగా అతని భార్య ఈ నెల 26న ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన కృష్ణయ్య సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న టూ టౌన్ ఎస్ఐ మహబూబ్‌బాషా సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు, మృతుడి తల్లి చిన్నక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. అప్పుల బాధతో..కడప అర్బన్ : కడపలోని రిమ్స్ సీఎస్ పరిధిలో వికలాంగుల కాలనీకి చెందిన వెంకటేష్ (33) అనే వ్యక్తి మద్యం సేవించి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని సోమవారం ఆత్మహత్యకు పాల్పడినట్లు రిమ్స్ పీఎస్ ఎస్ఐ లక్ష్మినారాయణ తెలిపారు. ఎస్ఐ వివరాల మేరకు ఆవుల వెంకటేష్ ప్రవేట్ వాహనాల డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. భార్య శివమ్మ ఇంట్లోనే ఉంటుంది. వెంకటేష్ అప్పులు చేసి, వాటిని తీర్చలేక తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కు ఊరి వేసుకొని ఆత్మ హత్యకు పాల్పడినట్లు తెలిపారు. మృతుడి తల్లి రమణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికరాజుపాళెం : మండలంలోని తొండలదిన్నెలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు 9 మంది రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల హెచ్ఎం లక్ష్మినారాయణ రెడ్డి, పీడీ జిలాన్ బాషా తెలిపారు. సోమవారం వారు మాట్లాడుతూ కడపలోని ఇండోర్ స్టేడియంలో ఆదివారం జిల్లాస్థాయి ఎస్జీఎఫ్ టేబుల్ టెన్నిస్ క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో రాణించి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారని తెలిపారు. అండర్–14 బాలికల విభాగంలో ఎన్.చురిత, బి.ప్రశాంతి, బాలుర విభాగంలో టి.సందీప్, ఏ.సుశాంత్, అండర్–17 బాలికల విభాగంలో బి.పోలమ్మ, ఎం.భాను తేజ, బాలుర విభాగంలో సుభాష్, గంగ జనార్ధన్, జితేంద్రలు ఎంపికయ్యారన్నారు.వారిని హెచ్ఎం, పీడీ, విద్యాకమిటీ చైర్మన్ షరీఫ్, ఉపాధ్యాయులు అభినందిచారు. -
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
వీరబల్లి : మండల పరిధిలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు సోమవారం పట్టుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. వీరబల్లి మండల పరిధిలోని సీతంపేట సమీప అటవీ ప్రాంతంలో ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతున్నట్లు ఎస్ఐ సుస్మితకు ముందస్తు సమాచారం అందింది. దీంతో ఆమె తన సిబ్బందితో కలిసి సోమవారం తెల్లవారుజామున సదరు ప్రాంతంలో దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న 11 ఎర్రచందనం దుంగలు, రవాణాకు ఉపయోగించిన ఒక కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాడుల సమయంలో అప్రమత్తమైన పోలీసులు ఎర్రచందనం తరలిస్తున్న తమిళనాడుకు చెందిన ఒక ప్రధాన నిందితుడిని, అలాగే కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు ఎస్ఐ సుస్మిత తెలిపారు. సమయస్ఫూర్తితో దాడి చేసి నిందితులను పట్టుకున్న రూరల్ సీఐ సురేష్ రెడ్డిని, ఎస్ఐ సుస్మితను, పోలీస్ సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. ఈ దాడిలో పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యార్థులకు మెరిట్ స్కాలర్‌షిప్‌ల పంపిణీ
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సోమవారం కడపకు చెందిన వైవీ నాయుడు చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కాలర్ షిప్‌లు పంపిణీ చేశారు. కళాశాలలో ద్వితీయ, చివరి సంవత్సరం చదువుతున్న 48 మంది మెరిట్ విద్యార్థులకు రూ.2లక్షల విలువైన స్కాలర్షిప్లను దివంగత వైవీ నాయుడు కుమారులు వినయ్‌కుమార్, డాక్టర్ రామసంజయ్, కోడలు సునీత, మనుమడు సాయివేణుగోపాల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ తండ్రి వైవీ నాయుడు ప్రొద్దుటూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతిగా పనిచేశారన్నారు. ఈ కళాశాలతో తమ కుటుంబానికి ఉన్న అనుంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కళాశాల ప్రిన్సిపాల్ పాలెం గుర్తుమూర్తి రెడ్డి మాట్లాడుతూ వైవీ నాయుడు చారిటబుల్ ట్రస్టు ద్వారా రూ.2లక్షల విలువైన స్కాలర్షిప్లను 28 మంది ప్రతిభా విద్యార్థులకు అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల విభాగాధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
యూసీఐఎల్ గ్రామాల్లో క్యాన్సర్ పరీక్షలు నిర్వహించాలి
వేముల : తుమ్మలపల్లె యురేనియం ప్రాజెక్ట్ (యూసీఐఎల్) పరిసర గ్రామాల్లో కాలుష్యం కారణంగా ప్రజలు క్యాన్సర్, క్లస్టర్ వ్యాధుల బారిన పడుతున్నారని, బాధితులందరికీ కంపెనీ తక్షణమే క్యాన్సర్ పరీక్షలు, వ్యాక్సినేషన్ నిర్వహించాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) రాష్ట్ర మాజీ డైరెక్టర్ మరకా శివకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం ఆయన యూసీఐఎల్ ఉద్యోగులతో కలిసి ప్రాజెక్టు జనరల్ మేనేజర్ సుమన్ సర్కార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా శివకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. కంపెనీ పరిసర ప్రాంతాల్లో కాలుష్య తీవ్రత అధికంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతోపాటు యూసీఐఎల్‌లో పనిచేస్తూ అనారోగ్య కారణాలతో సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను జీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఆసుపత్రి యాజమాన్యం ఏసీ ఛార్జీలు, రూమ్ రెంట్లు కట్టాలని ఉద్యోగులపై ఒత్తిడి తెస్తోందని, కనీసం జనరల్ రూమ్‌లు కూడా కేటాయించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి ఉద్యోగుల రూమ్ రెంట్లను కూడా కంపెనీయే చెల్లించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో యూసీఐఎల్ ఉద్యోగులు బి.రాములయ్య, బి.రవికుమార్, వెంకటకృష్ణ, వై.నారాయణస్వామి, వై.శివ, ఎ.శ్రీనివాసులు, బి.గంగిరెడ్డి, వై.రవి, తదితరులు పాల్గొన్నారు. -
సత్వరమే ఫిర్యాదుల పరిష్కారం
కడప అర్బన్ : వైఎస్సార్ కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’(పిజిఆర్ఎస్) ’కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను తెలుసుకుని ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు వివిధ సమస్యలపై మొత్తం 127 ఫిర్యాదులను సమర్పించారు. ఫిర్యాదులపై చట్టపరమైన అంశాలను సమగ్రంగా పరిశీలించి, సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎన్. సుధాకర్, కడప ఇన్చార్జి డీఎస్పీ బాలస్వామి రెడ్డిచ పోలీస్ అధికారులు పాల్గొన్నారు.ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ -
పీనుగులవుతున్నా.. జీవచ్ఛవాలైనా.. అరిచి మొత్తుకున్నా స్పందించని ‘పీజీఆర్ఎస్’.. ఇది ప్రజా సమస్యల పరిష్కార వేదికా? సామాన్యుడిని సతాయించే నరక కూపమా? జిల్లా కేంద్రం నుంచి మండల స్థాయి వరకు ఆర్భాటంగా సాగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కాస్తా.
● పీజీఆర్ఎస్కు బాధితుల క్యూ ● సమస్య తీరక సతమతం ● సన్నగిల్లుతున్న నమ్మకందండం పెడుతున్నా...పింఛన్ ఇప్పించండయ్యా! పళ్లు ఊడిపోయి బోసిపోయిన ఆ నోరు చెబుతోంది ఒంటిపైకొచ్చిన తన వద్ధాప్యాన్ని... ముడతలు పడ్డ చర్మం చెబుతోంది ఆమె దీనస్థితిని.. కాంతి లేని కళ్లు.. తెల్లగా మారిన కేశాలు తన దుస్థితికి సాక్ష్యమిస్తున్నాయి.... కళ్లు మూసుకున్న చంద్రబాబు సర్కారుకు ఇవేమీ కనిపించడం లేదు.. అధికారులకా అవేవీ పట్టడం లేదు.. ఈ వృద్ధురాలి పేరు ఎస్.నాగలక్షుమ్మ, ప్రొద్దుటూరు మండలం ఉప్పరపల్లె గ్రామం. పెన్షన్ తీసుకుంటున్న ఈమెకు రెండేళ్ల కిందట పెన్షన్ ఆగిపోయింది. అన్ని అర్హతలు ఉన్నా ఎందుకు పెన్షన్ తొలగించారో అధికారులను అడిగింది.. సమాధానం లేదు. ఇటీవల కొత్త పెన్షన్లు వచ్చినపుడు మళ్లీ దరఖాస్తు చేసుకుంది. కానీ, ఆన్లైన్లో తమకు పెన్షన్ రాదని చూపుతోందని తేల్చి చెప్పారు. ‘అయ్యా వృద్ధురాలిని. వస్తున్న పెన్షన్ రాకుండా పోయింది. దండం పెడుతున్నా...పెన్షన్ ఇప్పించడయ్యా’ అంటూ అధికారులకు చేతులెత్తి వేడుకుంది. నిలబడలేకున్నా...సాయం చేయండి పట్టుమని పది సెకన్లు నిలవలేని ఈ పరిస్థితి ఈ దివ్యాంగురాలిది. పేరు ఎం. కల్యాణి . పులివెందుల మండలం ఉలిమెళ్ల గ్రామం. నిలబడలేక ఇదిగో ఇలా అధికారుల టేబుల్‌పైనే కూలబడింది. తన దీనస్థితిని చూసైనా అధికారులు కనికరించలేదని.. సదరం సర్టి ఫికెట్ ఇవ్వడం లేదని వాపోయింది. సోమవారం కలెక్టరేట్‌కు కుటుంబ సభ్యులతో వచ్చి పీజీఆర్ఎస్లో సమస్యను విన్నవించారు.‘నడవలేవని దివ్యాంగురాలిని.. సదరం సర్టిఫికెట్తో పాటు పెన్షన్ ఇప్పించండి సారూ’ అంటూ కన్నీటిపర్యంతమైంది. -
నా శునకాన్ని ఇవ్వండి
కడప సిటీ : తన పెంపుడు శునకాన్ని అప్పగించాలని కోరుతూ రాజంపేటకు చెందిన మలిశెట్టి సుబ్బ నరసింహులు పీజీఆర్ఎస్ ద్వారా కలెక్టర్‌కు విన్నవించారు. మున్సిపాలిటీ సిబ్బంది గత నెల 3న తన పెంపుడు శునకాన్ని తీసుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. శునకానికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసిన అనంతరం వారం రోజుల్లో తిరిగి అప్పగిస్తామని సిబ్బంది హామీ ఇచ్చారని, నెల రోజులు దాటినా తనకు అప్పగించలేదని తెలిపారు. ఈ విషయమై పలుమార్లు మున్సిపాలిటీ అధికారులను సంప్రదించినప్పటికీ సరైన సమాచారం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన పెంపుడు శునకాన్ని ఆచూకీని తెలియజేసి, వెంటనే దాన్ని తనకు అప్పగించేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని కలెక్టర్‌ను కోరారు. -
కడప ఆర్ట్స్ కళాశాలలో లఘు చిత్రాల పోటీలు
కడప ఎడ్యుకేషన్ : కడప ప్రభుత్వ పురుషుల (ఆర్ట్స్) కళాశాలలో సోమవారం ‘లింగ నిర్ధారణ పరీక్షలను నిలిపివేసి, ఆడపిల్లలను రక్షించాలి’అనే అంశంతోపాటు పీసీ అండ్ పీఎన్డీటీ చట్టంపై అవగాహన కల్పిస్తూ జిల్లాస్థాయి లఘు చిత్రాల పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో జిల్లాలోని వివిధ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల నుంచి విద్యార్థులు రూపొందించిన మొత్తం 11 లఘు చిత్రాలను ప్రదర్శించారు. (కడప ఆర్ట్స్ కళాశాల–6, పులివెందుల–2, పెండ్లిమర్రి–1, పోరుమామిళ్ల–1, రాజంపేట–1). పీసీ అండ్ పీఎన్డీటీ బృంద సభ్యులు భారతి, ప్రసన్నలత, భాస్కర్, పాలేశ్వర్లు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి.. సామాజిక సందేశం, చిత్రీకరణ, సృజనాత్మకత ఆధారంగా లఘుచిత్రాలను పరిశీలించారు.కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జె. వెంకట లక్ష్మి మాట్లాడుతూ, ఆడపిల్లలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని, వారికి సమాన అవకాశాలు ఇచ్చినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు. అక్టోబర్ 11న అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఈ పోటీల విజేతలకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రథమ బహుమతి రూ.30,000, ద్వితీయ బహుమతి రూ.20,000, తృతీయ బహుమతి రూ.10,000 నగదు పురస్కారాలను అందజేయనున్నట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఎయిర్‌బస్ స్టాండ్ !
● కూటమి సర్కారులోనే పులివెందుల బస్టాండ్‌కు ప్రతిష్టాత్మక స్టేట్ అవార్డు ● రూ.38 కోట్లతో ఎయిర్పోర్ట్ స్థాయి హంగులు.. నాణ్యతకు దక్కిన ‘పర్యాటక’ కిరీటం ● రాజకీయ ఆరోపణలు పటాపంచలు.. పాలకుల విమర్శలకు అవార్డే గట్టి సమాధానం ● ఆసియాలోనే అతిపెద్ద టెర్మినల్.. 55 సీసీ కెమెరాల నిఘాలో సుందర దృశ్యం పులివెందుల: ఆసియాలోనే అతిపెద్ద బస్ టెర్మినల్‌గా అరుదైన గుర్తింపు దక్కించుకున్న పులివెందుల వైఎస్సార్ బస్ టెర్మినల్‌కు ప్రతిష్టాత్మక రాష్ట్ర పర్యాటక అవార్డు లభించింది. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరంలో ఆదివారం జరిగిన ప్రత్యేక అధికారిక కార్యక్రమంలో ‘ఉత్తమ పర్యాటక అనుకూల బస్టాండ్’ విభాగంలో ఈ పురస్కారాన్ని అందజేశారు. ఎయిర్పోర్ట్ స్థాయి సదుపాయాలు ప్రయాణీకులకు సకల సౌకర్యాలతో, ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన ఈ బస్టాండ్ ఎయిర్‌పోర్టును తలపించేలా ఉందని ప్రజలు కొనియాడుతున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, అప్పటి ఆర్టీసీ ఛైర్మన్ దుగ్గాయపల్లి మల్లికార్జునరెడ్డిల ప్రత్యేక సారథ్యంలో మొత్తం రూ.38 కోట్ల భారీ బడ్జెట్ వ్యయంతో ఈ అత్యాధునిక బస్ కాంప్లెక్స్‌ను నిర్మించారు. సరిగ్గా 2022 డిసెంబర్ 24వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమై ఈ బస్ టెర్మినల్ ప్రజలకు అంకితమైంది. బస్ టెర్మినల్‌లోని ప్రధాన వసతులు ఇవే ● ప్రయాణికులకు అంతర్జాతీయ స్థాయి అనుభూతిని ఇచ్చేలా ఈ వినూత్న టెర్మినల్‌లో అద్భుతమైన మౌలిక వసతులను కల్పించారు ● కూర్చునే సామర్థ్యం: ఒకేసారి 225 మంది ప్రయాణికులు కూర్చునేందుకు వీలుగా బస్టాండ్ అంతటా 95 అత్యాధునిక బెంచీలను ఏర్పాటు చేశారు. ● ప్రత్యేక హాల్స్: ప్రయాణికులు సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రశాంతంగా వేచి ఉండేలా స్పెషల్ వెయిటింగ్ హాల్స్ అందుబాటులో ఉన్నాయి. ● భద్రతకు పెద్దపీట: ప్రయాణీకుల, మహిళల భద్రత కోసం నిత్యం 55 సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. ● దివ్యాంగులకు ఫ్రెండ్లీగా: ఈ బస్టాండ్‌ను వికలాంగులకు సైతం ఎంతో అనుకూలంగా ఉండేలా నిర్మించారు. వారికి రాకపోకల ఇబ్బంది లేకుండా ప్రత్యేక ర్యాంపులు, వసతులతో పాటు విడిగా మరుగుదొడ్లను సైతం నిర్మించారు. ● శుభ్రత – తాగునీరు: ప్రయాణికుల కోసం 13 ఆధునిక మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. అలాగే ఆర్వో ప్లాంట్ ద్వారా నిరంతరాయంగా సురక్షితమైన తాగునీరు అందుబాటులో ఉంచారు. ● ఇతర డిజిటల్ సౌకర్యాలు: ప్రథమ చికిత్స కోసం ప్రత్యేక కిట్లు, అత్యాధునిక టికెట్ కౌంటర్లు, క్యాష్‌లెస్ లావాదేవీల కోసం నగదు రహిత చెల్లింపుల వసతులను ఇక్కడ కల్పించారు. దీనితో పాటు ప్రయాణికులకు అందుబాటులో క్యాంటీన్లు, ఆర్టీసీ సిబ్బందికి కావాల్సిన విశ్రాంతి వసతులు అన్నీ సమకూర్చారు. వరప్రసాద్, చిన్నప్ప, హాలు గంగాధరరెడ్డిపులివెందుల వైఎస్సార్ బస్ టెర్మినల్ నియోజకవర్గంలోని ఏడు మండలాల ప్రజలకు ఒక వరం లాంటిదని, నాణ్యతలో ఎక్కడా రాజీ లేకుండా చిత్తశుద్ధితో దీనిని నిర్మించామని మున్సిపల్ మాజీ చైర్మన్ వరప్రసాద్ తెలిపారు. గతంలో ఈ బస్టాండు నిర్మాణ సమయంలో ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడుతో సహా స్థానిక టీడీపీ నేతలు అసలు నిర్మాణమే సరిగా లేదంటూ అనేక కుటిల విమర్శలు, రాజకీయ ఆరోపణలు చేశారని, కానీ ఇప్పుడు వారి కూటమి ప్రభుత్వ హయాంలోనే దీనికి అత్యుత్తమ రాష్ట్రస్థాయి అవార్డు దక్కడం గమనార్హమని మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ చిన్నప్ప పేర్కొన్నారు. ‘నిజమైన వాస్తవాలు ఎప్పటికీ మరుగునపడవు’ అన్నట్లుగా.. ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మక అవార్డు రావడంతోనే వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన నాణ్యమైన అసలు సిసలైన అభివృద్ధి ఏంటో నిరూపితమైందని వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు హాలు గంగాధరరెడ్డి స్పష్టం చేశారు. -
దళితుల హత్యలపై స్పందించని కూటమి
కడప సెవెన్‌రోడ్స్ : రాష్ట్రంలో జరుగుతున్న దళితుల హత్యలపై రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం స్పందించడం లేదని, రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెబుతారని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు అన్నారు. ఏపీ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్మపోరాట దీక్ష కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అగ్రకులాలకు చెందిన వ్యక్తులు హత్యలకు గురైన సందర్భంలో ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబాలను వివిధ రూపాల్లో ఆదుకుంటోందన్నారు. సీఐ నాగరాజు వల్ల చనిపోయిన పేరుపోగు క్రాంతికుమార్ హత్యపై సీఎం ఎందుకు స్పందించడం లేదో చెప్పాలని నిలదీశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 28 మంది దళితులు హత్యకు గురయ్యారన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. దళిత హత్య కేసులను వేగంగా విచారించేందుకు తక్షణమే ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హత్యకు గురైన దళితుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీల భూ సమస్యలు, ఉద్యోగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. దళిత హత్య కేసుల్లో న్యాయం చేయకపోతే రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వానికి ప్రజలు తగిన సమాధానం చెబుతారని దాసరి సువర్ణ రాజు హెచ్చరించారు. దళితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి సుధాకర్, గౌరవ అధ్యక్షులు వెంకటేశ్, కళాచైతన్య రాష్ట్ర అధ్యక్షులు విజయ్‌కుమార్, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు రామోజి ఇమ్మానియేల్, మాలమహాసేన జిల్లా ఉపాధ్యక్షులు సంపత్‌కుమార్, ఎమ్మార్పీఎస్ నాయకులు నాగసుబ్బరాయుడు, బుడ్డా శ్రీనివాసులు, ఓబులపతి తదితరులు పాల్గొన్నారు. సమగ్ర విచారణ జరపాలి కడప సెవెన్‌రోడ్స్ : రాష్ట్రంలో జరిగిన 27 మంది దళిత వ్యక్తుల హత్యలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు గుర్రప్ప డిమాండ్ చేశారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నడుస్తున్న రెడ్‌బుక్ రాజ్యాంగం ఫలితంగానే హత్యలు జరుగుతున్నాయన్నారు. దళిత హత్యలపై ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి మానుకోకపోతే సహించబోమన్నారు. ఈ కార్యక్రమంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ది వేదిక రాష్ట్ర అధ్యక్షులు నారాయణ, హేతువాద సంఘం జిల్లా కార్యదర్శి సీఆర్వీ ప్రసాద్, ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కార్యదర్శి జయవర్దన్, ఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి సుబ్బరాయుడు, పీఆర్వైఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నాగేంద్ర, ఏబీఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఓబయ్య, బాల వీరప్ప తదితరులు పాల్గొన్నారు.ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణరాజు -
● నాన్నకు ప్రేమతో..
సింహాద్రిపురం మండలం పైడిపాలెం గ్రామానికి చెందిన అన్నదమ్ములు మహమ్మద్ రఫీ, దస్తగిరి తమ తండ్రిపై ఉన్న ప్రేమతో అపురూప పితృభక్తిని చాటుకున్నారు. పదేళ్ల క్రితం వారి తండ్రి షేక్ మహబూబ్ సాహెబ్ ఇంటి ఆవరణలో ఒక వేప మొక్కను నాటారు. 2021లో ఆయన కరోనాతో మృతి చెందారు. 2025లో పాత ఇల్లు పడగొట్టి కొత్త భవనం నిర్మించే తరుణంలో.. ఆ చెట్టును నరికేయాలని పలువురు సూచించినా వారు వినలేదు. నాన్న జ్ఞాపకం పదిలంగా ఉండాలనే ఉద్దేశంతో, ఇమేజ్‌లో కనిపిస్తున్నట్లుగా చెట్టును అలాగే ఉంచి, స్లాబ్ మధ్య నుంచి పైకి వెళ్లేలా నూతన ఇంటిని నిర్మించుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరపడినా, తండ్రి మాట ప్రకారం ఉమ్మడి కుటుంబంగా కలిసి ఉంటూ ఈ అన్నదమ్ములు అందరికీ ఆదర్శంగా నిలిచారు. – సింహాద్రిపురం -
పతకాల బాద్షా.. పోలీస్ బాషా!
ప్రొద్దుటూరు క్రైం : యూనిఫాం ధరిస్తే పోలీస్.. క్రీడా బరిలోకి దిగితే పోరాటయోధుడు.. గెలుపుకోసం చెమటోడ్చి, పతకంతో తిరిగొచ్చే పట్టుదల ఆయన సొంతం. చిన్ననాట తైక్వాండోతో మొదలైన బాషా ప్రస్థానం.. నేడు జాతీయ స్థాయిలో పతకాలు సాధించే బాద్షాగా నిలిచాడు. విధి నిర్వహణతో పాటు క్రీడారంగంలోనూ ప్రతిభను చాటుతూ పోలీస్ శాఖకు గర్వకారణంగా నిలుస్తున్నారు కానిస్టేబుల్ ఎస్పీ మహబూబ్‌బాషా. తైక్వాండో, పెన్సింగ్ క్రీడల్లో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక పోటీల్లో పాల్గొని పతకాలు సాధించిన ఆయన ప్రస్థానం నేటి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. కడప జిల్లాలోని పోరుమామిళ్లకు చెందిన మహబూబ్‌బాషా 1999లో నాయబ్‌రసూల్ వద్ద తైక్వాండోలో శిక్షణ ప్రారంభించారు. చిన్న వయసులోనే క్రీడపై ఆసక్తి పెంచుకున్న ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో తన ప్రతిభను చాటారు. పతకాలు సాధిస్తూ.. 1999లో నంద్యాలలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో సబ్‌జూనియర్ విభాగంలో కాంస్య పతకంతో ప్రారంభమైన ఆయన పతకాల ప్రస్థానం.. 2001, 2005, 2007 సంవత్సరాల్లో రాష్ట్రస్థాయి పోటీల్లో రజత, కాంస్య పతకాలతో కొనసాగింది. 2006లో విశాఖపట్నంలో జరిగిన 6వ ఓపెన్ జాతీయ తైక్వాండో పోటీల్లో,2009లో మహరాష్ట్రలోని నాందేడ్‌లో జరిగిన 9వ ఓపెన్ జాతీయ పోటీల్లో పాల్గొన్నారు. 2009లో బ్లాక్‌బెల్ట్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించగా.. 2011లో జాతీయస్థాయి తైక్వాండో రిఫరీ సెమినార్లో ఉత్తీర్ణత సాధించి రిఫరీగా కూడా సేవలందించారు. క్రీడా ప్రతిభ ఆధారంగా 2012లో పోలీస్‌శాఖలో ఉద్యోగం పొందిన బాషా.. విధి నిర్వహణతో పాటు క్రీడా ప్రస్థానాన్ని కొనసాగించారు. ప్రొద్దుటూరు కడప, కడపలోని చిన్నచౌక్, కలసపాడు ప్రాంతాల్లో విధులు నిర్వహించిన ఆయన ప్రస్తుతం ప్రొద్దుటూరు ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో సేవలందిస్తున్నారు. ఆల్ ఇండియా పోలీస్ పోటీల్లోనూ ప్రతిభ 2017లో వెస్ట్ బెంగాల్, 2018లో న్యూడిల్లీ, 2022లో న్యూడిల్లీ, 2024లో అస్సాంలోని గౌహతిలో జరిగిన ఆల్ ఇండియా పోలీస్ జూడో క్లస్టర్ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచారు. అలాగే 2025 మార్చిలో పంజాబ్‌లోని జలంధర్‌లో జరిగిన తొలి ఆల్ ఇండియా పోలీస్ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించారు. ఈ ప్రతిభకు గుర్తింపుగా డీజీపీ రూ. లక్ష నగదు పురష్కారంతో పాటు ఒక ఇంక్రిమెంట్‌ను అందచేశారు. అదే ఏడాది డిసెంబర్లో హైదరాబాద్‌లో జరిగిన 14వ జాతీయస్థాయి తైక్వాండో పోటీల్లో కాంస్య పతకం సాధించారు. ఈ సందర్భంగా ఇటీవల నిర్వహించిన జిల్లా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌కు హాజరైన కడప జిల్లా కలెక్టర్, ఎస్పీలు అభినందించారు. పట్టుదల ఉంటే సాధించలేనిది లేదు.. క్రీడపై చిన్ననాటి నుంచి పెంచుకున్న ఆసక్తిని మధ్యలో వదిలిపెట్టకుండా, ఉద్యోగ బాధ్యతలతో సమన్వయం చేసుకుంటూ జాతీయ స్థాయికి ఎదిగిన మహబూబ్‌బాషా ప్రస్థానం క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధన ఉంటే లక్ష్యాన్ని చేరుకోవచ్చనే సందేశాన్ని యువతకు అందిస్తోంది. క్రీడలను కేవలం వినోదంగా కాకుండా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి ఒక మార్గంగా ఎంచుకోవాలని ఆయన ప్రస్ధానం చాటి చెబుతోంది. తైక్వాండోలో తిరుగులేని ప్రతిభ ఉద్యోగంతో పాటు క్రీడల్లోనూ జాతీయస్థాయిలో రాణింపు ప్రొద్దుటూరు ట్రాఫిక్ పోలీస్ష్టేషన్లో విధులు -
పర్యాటకంలో జిల్లాకు రెండు అవార్డులు
కడప సిటీ : వైఎస్సార్ కడప జిల్లాకు రెండు ప్రతిష్టాత్మక రాష్ట్రస్థాయి పర్యాటక అవార్డులు దక్కాయి. ఆదివారం రాజమహేంద్రవరంలోని మంజీరా కన్వెన్షన్ హాలులో జరిగిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర పర్యాటక శాఖ, ఏపీటీడీసీ ఈ పురస్కారాలను అందజేశాయి. గండికోటలో చేపట్టిన సమగ్ర పర్యాటక అభివృద్ధికి, చారిత్రక వారసత్వ పరిరక్షణకు కలెక్టర్, జిల్లా పర్యాటక మండలి చైర్పర్సన్ శ్రీధర్ చెరుకూరి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. పర్యాటకులకు, ప్రయాణికులకు అత్యాధునిక మౌలిక వసతులు కల్పించినందుకు పులివెందుల డాక్టర్ వైఎస్ఆర్ బస్ టెర్మినల్ ఉత్తమ పర్యాటక అనుకూల బస్ స్టాండ్ అవార్డు దక్కించుకుంది. పులివెందుల ఆర్టీసీ డిపో మేనేజర్ ఏ. ప్రేమ్ కుమార్, సిబ్బంది దీనిని స్వీకరించారు. -
పిడుగుపల్లె వీఆర్ఓ సస్పెన్షన్
కలసపాడు : మండలంలోని పిడుగుపల్లె వీఆర్ఓ వేణుగోపాల్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. గతంలో కాశినాయన మండలంలో వీఆర్ఓగా పనిచేస్తున్న సమయంలో ఓ వివాదాస్పద భూ సమస్యపై అతనిపై ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు విచారణ చేశారు. ఆరోపణలు రుజువు కావడంతో ఉన్నతాధికారులు సస్పెండ్ చేసినట్లు తెలిసింది. ఈ మేరకు వీఆర్ఓ సస్పెండ్ ఉత్తర్వులు బద్వేలు ఆర్డీఓకు అందినట్లు సమాచారం. నేడు పీజీఆర్ఎస్ కడప సెవెన్‌రోడ్స్ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టరేట్ సభాభవన్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించనున్నట్లు డీఆర్వో మల్లికార్జునుడు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతోపాటు డివిజన్, మండల, మున్సిపల్ స్థాయిల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. గతంలో సమర్పించిన అర్జీల వివరాలు తెలుసుకోవడానికి 1100 కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోవచ్చని సూచించారు. 1న కబడ్డీ జిల్లా జట్ల ఎంపికలుకడప వైఎస్ఆర్ సర్కిల్ : కమలాపురంలోని జెడ్పీహెచ్ బాయ్స్ హైస్కూల్ క్రీడా మైదానంలో అక్టోబర్ 1న జిల్లా జూనియర్ బాలబాలికల కబడ్డీ జట్ల ఎంపిక పోటీలను నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షుడు గురిశేఖర్ , కార్యదర్శి ఆర్ట్స్ సుబ్బయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ జె. వెంకటసుబ్బన్న, తెలిపారు. ఈ ఎంపికల్లో ప్రతిభ కనబరిచి ఎంపికై న క్రీడాకారులు అక్టోబర్ 16 నుంచి 18వ తేదీ వరకు మార్కాపురంలో నిర్వహించనున్న అంతర్‌జిల్లాల కబడ్డీ పోటీలలో జిల్లా తరఫున పాల్గొంటారని తెలిపారు. మరిన్ని వివరాలకు 9989861038, 9390810187 మొబైల్ నెంబర్లను సంప్రదించాలని సూచించారు. 29న కడపలో మహాధర్నాకడప ఎడ్యుకేషన్ : ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్, స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు మంగళవారం ఉదయం 10 గంటలకు కడప కలెక్టరేట్ ఎదుట మహా ధర్నా నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ సంఘం జిల్లా అధ్యక్షుడు రామమూర్తి నాయుడు, ప్రధాన కార్యదర్శి నాగముని రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని మండల యూనిట్ల సభ్యులు, కార్యవర్గ సభ్యులు జేఏసీ, జాక్టో, ఫ్యాప్టో, కేంద్ర ప్రభుత్వ సంస్థల విశ్రాంత, వర్కింగ్ ఉద్యోగులు పాల్గొని ఈ మహా ధర్నాను విజయవంతం చేయాలన్నారు. పెన్షన్ రూల్స్ (వాలిడేషన్) చట్టం 2025 ను తక్షణమే రద్దు చేయాలని, 8వ వేతన సంఘం పరిధిలో పెన్షన్ సవరణ చేపట్టాలని, మధ్యంతర భృతి వెంటనే ప్రకటించాల డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లతో కూడిన కరపత్రాన్ని వారు విడుదల చేశారు. విద్యుత్ సమస్యలా.. కాల్ చేయండి! కడప కార్పొరేషన్ : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమాన్ని ఏపీఎస్పీడీసీఎల్ నిర్వహించనుంది. వినియోగదారులు 8977716661కు కాల్ చేసి తమ విద్యుత్ సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకురావచ్చు. కాల్చేసే ముందు విద్యుత్ సర్వీసు నంబరు అందుబాటులో ఉండేలా చూసుకోవడం తప్పనిసరి. సర్కిల్ స్థాయిలోనూ .. డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమంతో పాటు సర్కిల్ స్థాయిలో కూడా ప్రతి సోమవారం ఉదయం 8:30 నుంచి 9:30 గంటల వరకు ‘డయల్ యువర్ ఎస్ఈ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వైఎస్సార్ జిల్లా వినియోగదారులు 08562242457 నంబర్‌కు, అన్నమయ్య జిల్లా వినియోగదారులు 9440817449 నంబర్క్లు కాల్ చేయాలని సూచించారు. సీపీఐ వైఖరి చెప్పాలికడప సెవెన్‌రోడ్స్ : శ్రీశైలం నీటిని రాయలసీమ అవసరాలు తీరకుండానే విద్యుత్ ఉత్పాదన పేరిట నాగార్జునసాగర్‌కు తరలించడం పట్ల సీపీఐ తన వైఖరి వెల్లడించాలని కేసీ కెనాల్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ మాజీ చైర్మన్ చంద్రమౌళీశ్వర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాభావం కారణంగా కేవలం తాగునీటి అవసరాలకే నీరు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. అయితే, రాయలసీమకు సుమారు 40–45 టీఎంసీలు మాత్రమే శ్రీశైలం ఇచ్చి నాగార్జునసాగర్‌కు 170 టీఎంసీలు తరలించుకు వెళ్లిందని తెలిపారు. -
వన్యప్రాణుల చర్మాల ముఠా గుట్టురట్టు
ప్రొద్దుటూరు క్రైం : వన్యప్రాణుల చర్మాలను అక్రమంగా విక్రయిస్తున్న ముఠా గుట్టును అటవీశాఖ అధికారులు రట్టు చేశారు. వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు పట్టణంలోని బద్వేల్ రోడ్డులో శాంతినికేతన్ స్కూల్ వెనుక ఉన్న చౌడేశ్వరినగర్లోని ఓ ఇంటిపై శనివారం అటవీశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా చుక్కల దుప్పి చర్మంతో పాటు ఐదు నకిలీ పులి చర్మాలు, 23 నకిలీ పులిగోర్లు, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేశారు. కేసు వివరాలను ఆదివారం సాయంత్రం ప్రొద్దుటూరులోని అట వీ శాఖ కార్యాలయంలో కడప డీఎఫ్ఓ రాజశేఖర్‌బాబు మీడియాకు వెల్లడించారు. కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి ఉర్దూలో ఫోన్ చేసి మైదుకూరు పరిధిలో వన్యప్రాణుల చర్మాలను విక్రయించే ముఠా కార్యకలాపాలపై అటవీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. దీంతో అధికారులు సిబ్బందిని అప్రమత్తం చేసి బద్వే ల్ ఎఫ్ఆర్ఓ నయీంఆలీ, ప్రొద్దుటూరు ఎఫ్ఆర్ఓ హేమాంజలి ఆధ్వర్యంలో ప్రత్యేక ఆపరేషన్ బృందాన్ని ఏర్పాటు చేశారు. నిందితులు పులి చర్మాలు, గోర్లతో రాష్ట్ర సరిహద్దులోకి ప్రవేశించినప్పటి నుంచి అటవీశాఖ అధికారులు వారిని అనుసరించారు. అనంతరం మైదుకూరులోని ఓ ఇంట్లోకి వెళ్లి చర్చిస్తున్న సమయంలో అధికారులు దాడి చేసి పట్టుకున్నట్లు తెలిపారు. దాడుల్లో మైదుకూరుకు చెందిన మడక ప్రసాద్, అట్లూరు మండలంలోని రంగంపల్లికి చెందిన కాటాదాసరి వెంకటయ్య, కర్నాటక రాష్ట్రంలోని గౌరీపురకు చెందిన గొట్టిబోయిన ప్రసాద్‌లను అరెస్ట్ చేశారు. కాగా మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు డీఎఫ్ఓ తెలిపారు. నకిలీ చర్మాలతో అక్రమ దందా చేయాలని.. అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న ఆరు చర్మాల్లో ఒకటి చుక్కల దుప్పి చర్మం కాగా, మిగిలిన ఐదు చర్మాలు నకిలీవని ప్రాథమిక పరిశీలనలో తేలినట్లు డీఎఫ్ఓ తెలిపారు. కుక్కలు లేదా గేదెల చర్మాలను తీసుకొని వాటికి ఆర్టిస్టులతో పులి చారలు వేయించి నకిలీ చర్మాలుగా తయారు చేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 23 గోర్లు కూడా నకిలీవిగా తేలినట్లు తెలిపారు. అయితే పూర్తి నిర్ధారణ కోసం చర్మాలు, గోర్లను ల్యాబొరేటరీకి పంపిస్తున్నట్లు వెల్లడించారు. వన్యప్రాణుల చర్మాల అక్రమ రవాణా వ్యవహారంలో కడపలో లింకులు ఈ వ్యవహారానికి సంబంధించిన లింకులు కడపలోనూ ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని డీఎఫ్ఓ రాజశేఖర్‌బాబు తెలిపారు. ముఠాతో సంబంధం ఉన్న ఇతర వ్యక్తులను కూడా గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. వన్యప్రాణుల చర్మాలు, ఇతర అవయవాలు అక్రమంగా కలిగి ఉండటం, రవాణా చేయడం, విక్రయించడం, కొనుగోలు చేయడం చట్టరిత్యా నేరమని డీఎఫ్ఓ స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన సబ్‌డీఎఫ్‌ఓ సంకేత్ సునీల్ గరుడ్, బద్వేల్ ఎఫ్ఆర్ఓ నయీంఆలీ, ప్రొద్దుటూరు ఎఫ్ఆర్ఓ హేమాంజలితో పాటు ఎఫ్ఎస్ఓ రవిచంద్ర, ఎఫ్‌బీఓలు హరినాథ్‌రాజు, కబీరు, సుదర్శన్, బ్రహ్మయ్య, రమాదేవి, సుంకయ్యలను డీఎఫ్ఓ అభినందించారు. మైదుకూరులో ముగ్గురు అరెస్ట్.. ఆరు చర్మాలు, 23 గోర్లు స్వాఽధీనం -
టీడీపీది దుర్మార్గపాలన
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి ● నేలమట్టమైన అరటి పంటను పరిశీలించిన వైఎస్సార్సీపీ నేతలుమైదుకూరు : కూటమి ప్రభుత్వం లాంటి దుర్మార్గమైన పరిపాలనను గతంలో చూడలేదని వైఎస్సార్సీపీ కడప జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. మైదుకూరు మండలం మిట్టమానుపల్లె వద్ద ఆదిరెడ్డిపల్లెకు చెందిన కౌలు రైతు నానుబాల చిన్నవీరభద్రుడు అరటిపంట గాలివానకు నేలమట్టంది. ఈ పంటను ఆదివారం మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి తదితరులతో రవీంద్రనాథ్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకున్న పరిస్థితి ఎప్పుడూ లేదన్నారు. ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద రైతులకు రూ. 20,000 ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, కేంద్రం ఇచ్చే రూ. 6,000లతో కలిపి రూ. 14,000 మాత్రమే ఇస్తూ సరిపెడుతున్నారని, అది కూడా కొందరికే ఇస్తున్నారని ఆరోపించారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర లేకపోతే ఆదుకున్న పరిస్థితి లేదన్నారు. చంద్రబాబు కరువు కవల పిల్లలని ఇద్దరు వెనకా ముందు వస్తుంటారని ఎద్దేవా చేశారు. చాలా రాష్ట్రాల్లో 102 శాతం పంటలు సాగయ్యాయని .. మన రాష్ట్రంలోనే మైనస్ 54 శాతం వర్షపాతం ఉందన్నారు. రాయలసీమ లిఫ్ట్‌ను పూర్తి చేసి ఉంటే.. రాయలసీమ లిఫ్ట్‌ను ఈ ప్రభుత్వం పూర్తి చేసి ఉంటే రైతులకు మేలు జరిగి ఉండేదని రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ప్రాజెక్టు 90 శాతం పూర్తయిందని మరో 10 శాతం పూర్తి చేసి ఉంటే ఇప్పటి పరిస్థితుల్లోనూ శ్రీశైలం నుంచి నీటిని డ్రా చేసి ఉండొచ్చు అన్నారు. శ్రీశైలం నిండినప్పుడు రిజర్వాయర్లకు చెరువులకు, నీరు ఇవ్వకుండా ప్రభుత్వం చేష్టలుడిగి ఉండటం ఎప్పుడూ చూడలేదని విమర్శించారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని తెలిపారు. నష్టపోయిన కౌలు రైతు వీరభద్రుడును ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత రైతును ఆదుకోకపోతే ఆందోళన గాలివానకు అరటి పంట నేలమట్టమై తీవ్రంగా నష్టపోయిన బాధిత రైతు చిన్న వీరభద్రుడును ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి డిమాండ్ చేశారు. దెబ్బతిన్న పంటను కలెక్టర్, రెవెన్యూ, ఉద్యాన అధికారులు పరిశీలించి ఆయనకు పరిహారం చెల్లించాలని కోరారు. కూటమి ప్రభుత్వ హయాంలో అతివృష్టి, అనావృష్టితో రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. కేసీ ఆయకట్టు కింద రెండు లక్షల ఎకరాల్లో పంటలు సాగుకు నోచుకోలేదని తెలిపారు. వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో బాధిత రైతు నానుబాల చిన్నవీరభద్రుడు, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి, ఊటుకూరు రఘురామిరెడ్డి, గల్లా నరసింహారెడ్డి, పులి సునీల్ కుమార్, నేట్లపల్లె శివరాం, మూలె సుధాకర్‌రెడ్డి, రెడ్యం చంద్రశేఖర్‌రెడ్డి, బండి నాగేంద్ర ప్రసాద్, ఇర్షాద్, మూలె సుబ్బిరెడ్డి, నాగేంద్ర బాబు, భూమిరెడ్డి శీను, బత్తల సుబ్బరాయుడు పాల్గొన్నారు.ప్రభుత్వ ఆస్తుల లూటీ మైదుకూరు : ప్రభుత్వ ఆస్తులను లూటీ చేసే పనిలో చంద్రబాబు ఉన్నాడని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. మైదుకూరు మండలం మిట్టమానుపల్లె వద్ద ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని అమ్మేసే కార్యక్రమం చేపట్టిందని ఆరోపించారు. రాష్ట్రంలోని 8 చక్కెర ఫ్యాక్టరీలను అమ్మేందుకు చంద్రబాబు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. కోఆపరేటివ్ సెక్టార్లో ఉన్న చక్కెర ఫ్యాక్టరీలను అమ్మేందుకు సిద్ధపడ్డారని అన్నారు. విక్రయానికి పెట్టిన చక్కెర ఫ్యాక్టరీలకు 770 ఎకరాల భూమి ఉందని, హైవేలకు దగ్గరలో ఉన్న అవి రూ.3వేల కోట్లు విలువ చేస్తాయని తెలిపారు. చక్కెర ఫ్యాక్టరీలపై ఉన్న అప్పు రూ.1300 కోట్లు మాత్రమేనని, చంద్రబాబు చేసిన రూ.4లక్షల కోట్ల అప్పులో రూ.1300 కోట్లు చెల్లించి పునరుద్దరణ చేస్తే సహకార కర్మాగారాలన్నీ తెరుచుకుంటాయన్నారు. గతంలో వైఎస్సార్, వైఎస్ జగన్ పునరుద్ధరించారని తెలిపారు. చక్కెర ఫ్యాక్టరీలను తమ బినామీలకో, తన వాళ్లకో పప్పు బెల్లాలకు కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. -
ప్రజాపక్షమే వైఎస్సార్ సీపీ విధానం
కడప కార్పొరేషన్ : అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన నిలబడటమే వైఎస్సార్ సీపీ విధానమని మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా అన్నారు. ఆదివారం కడప నగరంలోని టుటౌన్ పోలీసుస్టేషన్ ఎదురుగా ఉన్న వీధిలో టీడీపీకిచెందిన చాంద్‌బాష, వహీద్, అన్వర్‌లతోపాటు 120 కుటుంబాల వారు టీడీపీని వీడి వైఎస్సార్ సీపీలోచేరారు. వారికి అంజద్‌బాష కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్సీపీలో చేరేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారని, వారి చేరికలతో వైఎస్సార్సీపీ మరింత బలపడుతుందన్నారు. పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికీ భవిష్యత్తులో సముచిత స్థానం కల్పించే బాధ్యత తీసుకుంటామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థుల విజయానికి ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలన్నారు. వైఎస్ జగన్ ఐదేళ్లపాలన, ప్రస్తుత చంద్రబాబు పాలనను ప్రజలు బేరీజు వేసుకోవాలన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలను ప్రకటించిన సమయానికి ఠంఛనుగా అమలు చేసి ప్రజలకు అందించిన ఘనత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదేనన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనలో ఆ స్థాయిలో సంక్షేమం, అభివృద్ధి జరుగుతోందా? అన్నది ప్రజలు ఆలోచించాలన్నారు. ఉద్యోగాలు, సంక్షేమం, అభివృద్ది విషయంలో ఈ ప్రభుత్వం ఏం పురోగతి సాఽధించిందో ప్రజలకు తెలియజేయాలన్నారు. ఎవరి హయాంలో ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందో ప్రజలే నిర్ణయిస్తారన్నారు. కడప ఎమ్మెల్యే మాధవి నగర అభివృద్ధి కోసం ఎన్ని నిధులు తీసుకు వచ్చారో ప్రజలకు చెప్పాలన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మంజూరైన నిధులతో జరుగుతున్న పనులకు ఈ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే క్రెడిట్ తీసుకోవడం సరికాదన్నారు. కడప నగరానికి శాశ్వత తాగునీటికోసం బ్రహ్మంసాగర్ నుంచి 1.5 టీఎంసీల నీటిని కేటాయించి నిధులు మంజూరు చేయడం జరిగిందని వివరించారు. ఇసుక, మట్టి, రియల్ఎస్టేట్ వ్యవహారాలపై వస్తున్న ఆరోపణలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. రాజకీయ ఒత్తిళ్లు, అక్రమ కేసులతో వైఎస్సార్ సీపీ కార్యకర్తలను భయపెట్టాలని చూస్తే వెనక్కి తగ్గేదిలేదని, ప్రజల హక్కులు, సమస్యల కోసం నిరంతరం పోరాడుతామన్నారు. ఎన్నికలుపూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని, నిబంధనలకు విరుద్దంగా వ్యవహారిస్తే ప్రజాస్వామ్య పద్దతిలో ప్రశ్నిస్తామన్నారు. స్థానిక ఎన్నికల్లో ఫ్యాన్ మళ్లీ గిరాగిరా తిరిగేలా పనిచేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలోమాజీ మేయర్ పాకా సురేష్‌కుమార్, మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షులు దాసరి శివప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ తోట కృష్ణ, మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలీ అక్బర్, జిల్లా ప్రధాన కార్యదర్శి జమీల్, మాజీ కార్పొరేటర్లు షఫీ, షంషీర్, అజ్మతుల్లా, పవర్ అల్తాఫ్, గౌస్, స్థానిక నాయకులు అవినాష్‌రెడ్డి, సొహైల్ ఖాన్, షఫీ, షాబుద్దీన్ పాల్గొన్నారు. – టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి భారీగా చేరికలు -
సీపీఐ రాష్ట్ర ప్లీనరీకి సర్వం సిద్ధం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : కడపలో జరగనున్న సీపీఐ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం కడప నగరంలోని కళాక్షేత్రంలో జరుగుతున్న బహిరంగ సభ ఏర్పాట్లను సీపీఐ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను వ్యతిరేకించడంతో పాటు.. ప్రజా సమస్యలపై పోరాటాలను మరింత బలోపేతం చేసేందుకు భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి ప్లీనరీ సమావేశాలను కడపలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్లీనరీ సమావేశాల్లో భాగంగా సోమవారం కడప కోటిరెడ్డి సర్కిల్ నుంచి భారీ ర్యాలీ ప్రారంభమై ఎన్టీఆర్ సర్కిల్, 7 రోడ్స్, గోకుల్ లాడ్జ్ మీదుగా కడప కళాక్షేత్రం వరకు కొనసాగుతుందన్నారు అనంతరం కళాక్షేత్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ సభకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ నాయకులు కె.రామకృష్ణ, పల్లా వెంకటరెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొననున్నారని వెల్లడించారు. దేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతులు, కార్మికుల సమస్యలు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, ప్రజా సంక్షేమం, ప్రజాస్వామ్య హక్కులు వంటి అంశాలపై ప్లీనరీలో చర్చించనున్నట్లు తెలిపారు. కడపలో జరుగుతున్న సీపీఐ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేయా లని కార్మికులు, రైతులు, విద్యార్థులు, యువజను లు, ప్రజాసంఘాల నాయకులు, ప్రజలకు పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా నాయకులు నాగ సుబ్బారెడ్డి,వెంకటశివా, వేణుగోపాల్, బాదుల్లా ,విజయలక్ష్మి,మద్దిలేటి శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
విజయవంతంగా వర్క్‌షాప్
కడప అర్బన్: కడపలోని కోర్టు ప్రాంగణంలో న్యాయ సేవా సదన్‌న్‌లో జిల్లాలోని న్యాయూర్తులకు ఆదివారం నిర్వహించిన వర్క్‌షాప్ విజయవంతంగా ముగిసింది.ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి, వైఎస్సార్ కడప జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ తార్లాడ రాజశేఖర్‌రావు చైర్పర్సన్న్గా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బాలాజీ మెడమల్లి గౌరవ అతిథిగా హాజరయ్యారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. రామగోపాల్ వారికి సాదర స్వాగతం పలికారు. రిసోర్స్ పర్సన్లుగా విశ్రాంత జిల్లా న్యాయమూర్తులు బి.సత్యనారాయణ, జి.అన్వర్ బాషా పాల్గొన్నారు. కడప జిల్లాలోని అన్ని న్యాయస్థానాలకు చెందిన న్యాయాధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేసుల నిర్వహణ, సత్వర పరిష్కారంపై హైకోర్టు న్యాయమూర్తులు పలు సూచనలు, మార్గదర్శకాలు అందించారు. -
ఉత్సాహంగా ఎస్జీఎఫ్ జిల్లా జట్ల ఎంపికలు
కడప వైఎస్ఆర్ సర్కిల్: కడపలోని హెవెన్ బర్డ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, డాక్టర్ వైఎస్ఆర్ క్రీడా పాఠశాలలో ఆదివారం ఎస్జీఎఫ్ అండర్–19 జిల్లా జట్ల ఎంపికలు జరిగాయి. ఎస్జీఎఫ్ అండర్–19 సెక్రటరీ మురళీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో యోగాసన, చెస్, బాక్సింగ్ పోటీలను నిర్వహించారు. ఈ ఎంపికలను సంబంధిత వ్యాయామ ఉపాధ్యాయులు పర్యవేక్షణలో జరిగాయి. ఈ కార్యక్రమంలో డీవీఈవో ప్రకాశ్‌రావు పట్నాయక్, డైరెక్టర్లు నాగేశ్వర్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, పాఠశాల కరస్పాడెంట్ నసీర్ అహ్మద్ పాల్గొన్నారు. జిల్లా జట్టుకు ఎంపికై నవారు.. చెస్ బాలికల జట్టు: అయేషా సిద్దిఖ్. బిందు, అనిత, హారిక, రేణుక, స్టాండ్‌బై: చాతుర్య, పూజిత, స్మైలీ బాలుర జట్టు: ఖలీద్, రుత్విక్ రామ్, తేజ నరసింహా, పూర్ణనంద, సుమంత్ స్టాండ్‌బై: సొహైల్ ఆలీఖాన్, బాబు, రాజు యోగా బాలికల జట్టు: తేజమయి, హారిక, సుమతి, ఇందు ప్రియ, భార్గవి, జ్యోత్న, నిహారిక స్టాండ్‌బై: గీతిక, హాసిని, చందన బాలుర జట్టు: కరుణప్రకావ్రెడ్డి, రోహిత్, ప్రశాంత్, వంశీ, నాగశేఖర్లక్ష్మీ నందన్, చరణ్, ప్రతాప్ తంగాటా బాలికల జట్టు: గాయత్రి, కీర్తన, అర్చన, హిమ శైలజ బాలుర జట్టు: అఖిల్ కుమార్ తేజ, రిహాన్, ఓం హరినాధ్, జునైద్ -
విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించాలి
కడప ఎడ్యుకేషన్: విద్యార్థి దశ నుంచే వారిలో శాసీ్త్రయ ఆలోచన, ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించాలని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ పేర్కొన్నారు. జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కడప బాలాజీనగర్‌లోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో ఆదివారం నిర్వహించిన జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు విజయవంతంగా ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా 20 మండలాల నుంచి దాదాపు 600 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు తమ శాసీ్త్రయ పరిజ్ఞానం, తార్కిక ఆలోచన, పరిశీలనా సామర్థ్యాన్ని ప్రదర్శించారు. ప్రభుత్వ పాఠశాలల విభాగంలో మైలవరం ఏపీఆర్ఎస్ (గర్ల్స్) పాఠశాలకు చెందిన ఏ. స్వరూప, డి. వెంకట శ్రావణి, ఐ. ప్రదీష విజేతలుగా నిలిచి రాష్ట్రస్థాయి చెకుముకి సైన్స్ సంబరాలకు ఎంపికయ్యారు. ప్రైవేట్ పాఠశాలల విభాగంలో ప్రొద్దుటూరు వైఎంఆర్‌కాలనీ గౌతమ్ హైస్కూల్‌కు చెందిన కే. హర్షిణిశ్రీ, వి. నేహ, ఏ. సతీష్ రెడ్డి విజేతలుగా నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జేవీవీ నాయకులు సమీర్ బాషా, బాల బయన్న చేసిన మ్యాజిక్ అంశాలు పలువురిని ఆకట్టుకున్నాయి.కార్యక్రమంలో ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ వీర సుదర్శన్ రెడ్డి, మాజీ డిప్యూటి ఈఓ నాగమునిరెడ్డి, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు రాజశేఖర్, రాహుల్, బాలు గారి వెంకటసుబ్బయ్య, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహేష్ బాబు జిల్లా అధ్యక్షుడు సమీర్ బాష, జిల్లా ప్రధాన కార్యదర్శి శివరాం, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
ఈ–కేవైసీ గండి!
గ్యాస్ సబ్సిడీకి..కడప సెవెన్‌రోడ్స్ : జిల్లాలో సబ్సిడీ వంట గ్యాస్ కనెక్షన్ కలిగిన వేలాదిమంది వినియోగదారులు అవగాహన లేక ఈ–కేవైసీ చేయించుకోలేకపోయారా? అక్టోబరు 1 నుంచి సబ్సిడీ గ్యాస్ పొందలేని పరిస్థితి తలెత్తనుందా? కమర్షియల్ గ్యాస్ ధర చెల్లించి అదీ కేవలం ఐదు లేదా పది కిలోలు పొందాల్సి ఉంటుందా? ఉలుకు పలుకు లేని డీఎస్ఓ తీరును చూస్తే ఈ సందేహాలన్నింటికీ అవుననే సమాధానమే వినిపిస్తోంది. గ్యాస్ వినియోగదారులందరూ ఈ–కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని కేంద్రం కొన్ని నెలల క్రితమే ఆదేశాలు జారీ చేసింది. దీనిపై పలుసార్లు గడువు కూడా పెంచింది. ఈ మేరకు అక్టోబరు 1 నుంచి ఈ–కేవైసీ చేయించుకోని వినియోగదారులకు సబ్సిడీ వంట గ్యాస్ సరఫరా నిలిపి వేయనున్నారు. వీరు సబ్సిడీ లేకుండా మార్కెట్ ధర ప్రకారం డబ్బు చెల్లించి ఐదు లేదా పది కిలోల గ్యాస్‌ను మాత్రమే పొందాల్సి ఉంటుంది. ఈ వినియోగదారులు ఏజెన్సీల నుంచి 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ పొందడానికి వీలు ఉండదు. భారత పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం జిల్లాలో సబ్సిడీ వంట గ్యాస్ 14.2 కిలోల సిలిండర్ ధర రూ.950గా ఉంది. సబ్సిడీ లేని కమర్షియల్ గ్యాస్ 19 కిలోల సిలిండర్ ధర రూ. 3000 ఉంది. ఈ–కేవైసీ చేయించుకోని వినియోగదారులు ఐదు కిలోల నాన్ డొమెస్టిక్ సిలిండర్‌ను రూ. 829.50లకు, పది కిలోల సిలిండర్ రూ.1765.00 చొప్పున ధర చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా అదనంగా గ్యాస్ పొందడానికి వీలుండదు. ఈ–కేవైసీ చేయించుకున్న వారికి మాత్రం ఎప్పటిలాగే సబ్సిడీ ధరతో ఏజెన్సీల వద్ద ఎల్పీజీ సిలిండర్‌ను పొందవచ్చని భారత పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వశాఖ వెల్లడించింది. స్పందించని డీఎస్ఓ ! జిల్లా పౌరసరఫరాల అధికారి రఘురాం ఈ–కేవైసీపై ఇటీవల పత్రికలకు ఓ ప్రకటన విడుదల చేశారు. దాని ప్రకారం జిల్లాలో మొత్తం ఐఓసీఎల్ గ్యాస్ కనెక్షన్లు 3,20,706 ఉండగా, అందులో 2,89,984 మంది ఈ–కేవైసీ చేయించుకున్నారు. ఇంకా 30,722 మంది చేయించుకోవాల్సి ఉంది. హెచ్‌పీసీఎల్ కనెక్షన్లు 2,07,345 ఉండగా, 2,05,052 మందికి ఈ–కేవైసీ నిర్వహించారు. ఇంకా 2293 మంది చేయించుకోవాల్సి ఉంది. ఇలా ఈ రెండు కంపెనీల కనెక్షన్లు 528051 ఉండగా, 495036 మంది ఈ–కేవైసీ చేయించుకోగా, 33015 మంది చేయించుకోవాల్సి ఉంది. బీపీసీఎల్ కంపెనీ ద్వారా ఎన్ని కనెక్షన్లు ఉన్నాయో, అందులో ఎంతమందికి ఈ–కేవైసీ పూర్తి చేశారో? ఇంకా ఎంతమంది మిగిలిపోయి ఉన్నారో? అనే సమాచారం ఆయన ఇవ్వలేదు. సమగ్ర సమాచారం కోసం ఈనెల 21, 22 తేదీలలో ఆయన్ను ఫోన్ ద్వారా సంప్రదించాలని ‘సాక్షి’ప్రయత్నించగా ఆయన కాల్ లిఫ్ట్ చేయలేదు. మూగనోము పట్టిన డీఎస్ఓ తీరును పరిశీలిస్తే జిల్లాలో వేలాది మంది వంట గ్యాస్ వినియోగదారులు అక్టోబరు 1 నుంచి సబ్సిడీ కోల్పోయే ప్రమాదం ఏర్పడనుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఈ–కేవైసీ ఉద్దేశ్యం వినియోగదారుల ధృవీకరణను బలోపేతం చేయడం, లబ్ధిదారుల రికార్డులను ఖచ్చితంగా నిర్వహించడం, ఎల్పీజీ కనెక్షన్ల దుర్వినియోగాన్ని నివారించడం, నిజమైన వినియోగదారులకు ఎల్పీజీ సరఫరా అంతరాయం లేకుండా చూడటం ఈ–కేవైసీ ఉద్దేశ్యంగా కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ–కేవైసీ సకాలంలో పూర్తి చేసేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తమ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లతో కలిసి ఏజెన్సీ కార్యాలయాల ద్వారా, ప్రత్యేక నమోదు శిబిరాల ద్వారా ఈ కేవైసీ చేయించాలని పేర్కొంది. అలాగే ఇంటింటి సందర్శనలు, డోర్ స్టెప్ సేవల ద్వారా విస్తృత అవగాహన, ఔట్ రీచ్ కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. తొలుత ఆగస్టు 15లోపు ఈ–కేవైసీ పూర్తి చేయించుకోవాలని నిర్దేశించిన కేంద్రం పలుమార్లు గడువు పొడిగించింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు, ఇతర వాటాదారులను సమన్వయపరిచి ఈ–కేవైసీ పూర్తి చేయడం ద్వారా ఎల్పీజీ సేవలకు ఎలాంటి అంతరాయం లేకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా పౌరసరఫరాల అధికారిపై ఉంటుంది. ఈకేవైసీ లేకుంటే వంట గ్యాస్ నిలిపివేత! జిల్లాలో వేలాది మంది వినియోగదారుల సబ్సిడీకి గండం! ఉలకని, పలకని జిల్లా పౌరసరఫరాల అధికారి -
హోటల్లో గ్యాస్ లీక్
వేంపల్లె : వేంపల్లెలోని పులివెందుల రోడ్డులో ఉన్న విహారి హటల్ లో గ్యాస్ లీక్ అయ్యి మంటలు చెలరేగాయి. హటల్ యాజమాన్యం అప్రమత్తం కావడంతో ఎలాంటి ప్రాణ హాని జరగలేదు. ఆదివారం హోటల్లోని కిచెన్ గదిలో వంటలు చేస్తుండంగా గ్యాస్ సిలిండర్లకు చెందిన పైపుల నుంచి గ్యాస్ లీక్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వంట మనుషులు గదిలోనే ఉండి పోయారు. సమాచారం అందుకున్న ఫైర్ స్టేషన్ సిబ్బంది హుటాహుటిన హటల్ వద్దకు వచ్చి మంటలను ఆర్పడంతో పాటు గదిలో ఉన్న వంట మనుషులను కూడా బయటికి తీసుకొచ్చారు. ఎలాంటి ప్రమాదం జరగక పోవడంతో హటల్ యాజమాన్యంతో పాటు పలువురు ఊపిరి పీల్చుకున్నారు. ప్రొద్దుటూరు క్రైం : విద్యుత్ వైరు చోరీకి పాల్పడిన ముగ్గురిని త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను ఆదివారం సాయంత్రం ఎస్ఐ సంజీవరెడ్డి మీడియాకు వెల్లడించారు. ఈ నెల 24న అర్దరాత్రి సమయంలో పట్టణంలోని ఎస్ఎస్ మాల్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు సుమారు 85 మీటర్ల విద్యుత్ వైర్‌ను దొంగలించారు. చోరీకి గురైన విద్యుత్ వైర్ విలువ రూ. 1 లక్ష ఉంటుందని పోలీసులు తెలిపారు. ప్రతిమా స్టీఫెన్ ఫిర్యాదు మేరకు 25న త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సీసీపుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు. బైపాస్ రోడ్డులోని టీవీఆర్ పెట్రోల్ బంకు వద్ద ఉన్న నిందితులు రాజీవ్‌నగర్‌కు చెందిన కొట్టం నాగార్జున, ఎర్రన్నకొట్టాలకు చెందిన అరకటవేముల వెంకటేష్, బండారు శ్రీనివాసులును అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 68 మీటర్ల విద్యుత్ వైర్‌ను స్వాధీనం చేసుకున్నారు. పెండ్లిమర్రి: మండలంలోని వెల్లటూరు గ్రామ సమీపంలోని శ్రీవరసిద్ధి వినాయక ఆలయంలో చోరీ జరిగింది. స్థానికులు,ఆలయ నిర్వహకులు కథనం మేరకు..ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు హుండీ పగలగొట్టి నగదు దోచుకెళ్లారు. గతంలో కూడా ఇదే ఆలయంలో చోరీ జరిగిందన్నారు. హుండీలు చోరీ చేసే ముఠాపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. పులివెందుల రూరల్: పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని పెద్దరంగాపురంలో గత కొంత కాలంగా నీటి సమస్యలతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈనేపథ్యంలో మున్సిపల్ అధికారులు పెద్దరంగాపురం గ్రామానికి ట్యాంకర్ల ద్వారా నీటిని సరపరా చేస్తున్నారు. ఆదివారం ట్యాంకర్ గ్రామానికి వెళ్లడంతో ముందుగా మాఇంటి దగ్గర పె ట్టాలంటే.. కాదు మా ఇంటి దగ్గర అని అఖిల్‌కుమార్‌రెడ్డి, శ్రీదేవి ఘర్షణ పడ్డారు. అఖిల్‌కుమార్ రెడ్డిని శ్రీదేవి కొట్టడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని సర్వజన ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే చర్యలు విరమించుకోవాలి
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఆర్టీసీ సంస్థను ప్రైవేటుపరంచేసే చర్యలను ప్రభుత్వంవిరమించుకోవాలని ఏపీ పీటీడీ (ఆర్టీసీ) ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు డిమాండ్ చేశారు. ఆదివారం కడప ఆర్టీసీ డీపీటీఓ కార్యాలయం వద్దనున్న కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా అధ్యక్షుడు జి. బోసుబాబు అధ్యక్షతన, జిల్లా కార్యదర్శి ఏ.రామమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈయు జిల్లా విస్తృతస్థాయి కౌన్సిల్ సమావేశంలో పలిశెట్టి దామోదరరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ‘సీ్త్రశక్తి’పథకంతో భారీగా పెరిగిన ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీకి తక్షణమే 4 వేల కొత్త బస్సులు సమకూర్చాలని, ఖాళీగా ఉన్న సుమారు 15 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. అలాగే ప్రైవేటు ఆపరేటర్ల ద్వారా ఎలక్ట్రిక్ బస్సులను నిర్వహించే విధానాన్ని విరమించుకొని, ఆర్టీసీయే బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీ సిబ్బందితో నిర్వహించాలని కోరారు. ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సుల విధానంపై ప్రభుత్వం మళ్లీ ముందుకు వెళితే ఉద్యోగ సంఘాల జేఏసీగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. మూసివేసిన విద్యాధరపురం, గుంటూరు–2, నెల్లూరు–2, మంగళం డిపోలను ఆర్టీసీ జేఏసీకి ఇచ్చిన హామీ మేరకు వెంటనే పునఃప్రారంభించాలని కోరారు. కడప జోన్ జోనల్ అధ్యక్షుడు పి.ఎస్. ఖాన్, కడప జోన్ జోనల్ కార్యదర్శి ఎన్.రాజశేఖర్, నాన్ ఆపరేషన్ యూనిట్ నాయకులు రంగనాధ్, అంకిరెడ్డి, రావినాయక్, సుబ్బారెడ్డి, పుల్లన్న, సుబ్బన్న జోనల్ కమిటీ సభ్యులు పీఎన్పీ రెడ్డి, మోహన్ రావు, వైపీఎన్ రెడ్డి, సీఅర్ఎల్ రెడ్డి, జిల్లా నాయకులు మల్లికార్జున, అర్బీఎస్ మణ్యం, శివ, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర అధ్యక్షులు దామోదరరావు సమక్షంలో ప్రొద్దుటూరు డిపో ఎన్ఎంయూ నుంచి 8 మంది సభ్యులు, కడప డిపో నుండి 3 సభ్యులు, జమ్మలమడుగు నుండి ఒకరు పులివెందుల నుండి ఒకరు మొత్తం 13 మంది సభ్యులు ఎంప్లాయీస్ యూనియన్ లో చేరారు. -
రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక
కమలాపురం: స్థానిక బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల/ కళాశాలకు చెందిన విద్యార్థినులు రాష్ట్ర స్థాయి గట్కా పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపల్ తులశమ్మ తెలిపారు. ఈ నెల 17న చెన్నూరు మండలం, రామనపల్లె జడ్పీ హైస్కూల్లో నిర్వహించిన జిల్లా స్థాయి గట్కా పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచారని ఆమె వివరించారు. అండర్–17 విభాగంలో టెన్త్ క్లాస్‌కు చెందిన ప్రణవి నైన్త్కు చెందిన స్వాతి గట్కా పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. అలాగే 18న అండర్–19 విభాగంలో మైదుకూరులోని మేధా డిఫెన్స్ అకాడమీ మైదానంలో నిర్వహించిన జిల్లా స్థాయి గట్కా పోటీలలో సీనియర్ ఇంటర్ చదువుతున్న టి.మల్లిక, వై. స్రవంతి ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని ఆమె తెలిపారు. ఈ నెల 30వ తేదీన గుంటూరులో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు తమ పాఠశాల, కళాశాల విద్యార్థులు ప్రాతినిథ్యం వహిస్తారని ఆమె వివరించారు. కాగా విజేతలతో పాటు పీఈటీ కళావతిని ప్రిన్సిపల్ తులసమ్మ, వీపీ స్వర్ణకుమారి అభినందించారు. -
వైఎస్సార్సీపీలోకి 10 కుటుంబాలు చేరిక
వేంపల్లె : మండలంలోని ఇడుపులపాయ గ్రామంలోని మారుతి నగర్‌కు చెందిన 10 కుటుంబాలు టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి చేరాయి. శనివారం గండి మాజీ దేవస్థాన చైర్మన్ కృష్ణతేజ ఆధ్వర్యంలో ఇడుపులపాయ మారుతి నగర్‌కు చెందిన టీడీపీ కార్యకర్తలు పెద్దింటి చిన్న రెడ్డయ్య, పెద్దింటి బాబు, తుమ్మలూరు కుళ్ళాయప్ప, బంగారు గంగయ్య, పెద్దింటి విష్ణువర్ధన్, యంగళ్ల విశ్వనాథ్, మామిళ్ళపల్లి చిన్న కుళ్ళాయప్పలతోపాటు పలువురు వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిన వారందరికి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి కార్యకర్తలు చేరడంతో టీడీపీకి షాక్ తగిలింది. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు పోతిరెడ్డి శ్రావణ్ కుమార్, పి.జి.గోపినాథ్, సుధాకర్, సుకర్ణ, మాజీ ఉపసర్పంచ్ కోలా శ్రీరాములు, మాజీ ఎంపీటీసీ ముద్దనూరు హనుమంతు, రామాంజనేయులు, వెంకటరత్నం, పెద్దపాగ శ్రీరాములు పాల్గొన్నారు. -
మైదుకూరులో పోలీసుల తనిఖీ
● రికార్డులు లేని 23 వాహనాలు స్వాధీనం ● రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్లకు కౌన్సెలింగ్మైదుకూరు : మైదుకూరులో పోలీసులు శనివారం కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని గాంధీ రోడ్డు, కొత్తకొట్టాలు, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో అర్బన్ సీఐ కె.రమణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో రికార్డులు లేని 23 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనుమానితులు, పాత నేరస్తుల ఇళ్లలో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అనుమానిత ప్రాంతాల్లో వేటకొడవళ్లు, బాంబులు, నిషేధిత ఆయుధాల కోసం గాలించారు. వాహనాల రికార్డులను పరిశీలించారు. తక్కువ ధరకు ఇస్తున్నారని రికార్డులు లేని వాహనాలు కొనుగోలు చేయవద్దని, కొనుగోలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ రమణారెడ్డి హెచ్చరించారు. రౌడీషీటర్లు, ట్రబుల్ మాంగర్లకు, సస్పెక్ట్ షీటర్లకు కౌనెసలింగ్ నిర్వహించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలాంటి గొడవలకు పాల్పడకూడదన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించి లేదా అనుమానితుల సమాచారాన్ని డయల్ 112 ద్వారా పోలీసులకు సమాచారమివ్వాలని సూచించారు. తనిఖీల్లో అర్బన్ ఎస్ఐలు కె.చిరంజీవి, కత్తి వెంకటరమణ, సిబ్బంది పాల్గొన్నారు. -
చిన్న వయసు.. పెద్ద మనసు
– చిన్నారుల నిజాయితీకి పోలీసుల అభినందన ప్రొద్దుటూరు క్రైం : రోడ్డుపై దొరికిన పర్సును సొంతం చేసుకోకుండా పోలీసులకు అప్పగించి ముగ్గురు పాఠశాలల విద్యార్థులు నిజాయితీ చాటుకున్నారు. ప్రొద్దుటూరు పట్టణంలోని గవిని సర్కిల్ వద్ద శనివారం పర్సు రోడ్డుపై పడి ఉండటాన్ని ఆదర్శకాలనీకి చెందిన విద్యార్థులు రాకేష్ (13) నవదీప్ (12), శుభం (12) గమనించారు. వెంటనే పర్సును తీసుకొని ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఎస్ఐ మధుసూదన్‌రెడ్డికి అప్పగించారు. ఎస్ఐ పర్సును పరిశీలించగా ఆదర్శకాలనీకి చెందిన ఇల్లూరు రామచంద్రకు సంబంధించిన ఆధార్‌కార్డు అందులో ఉన్నట్లు గుర్తించారు. పర్సులో రూ. 720 నగదుతో పాటు కొన్ని వస్తువులు ఉన్నాయి. దీంతో పోలీసులు పర్సు యజమానిని గుర్తించి అప్పగించారు. చిన్న వయసులోనే బాధ్యతాయుతంగా వ్యవహరించి, దొరికిన సొమ్మును పోలీసులకు అప్పగించిన విద్యార్థుల నిజాయితీకి వన్‌టౌన్ సీఐ టీవీ కొండారెడ్డి, ఎస్ఐ మధుసూదన్‌రెడ్డి ఫిదా అయ్యారు. చిన్నారుల నిజాయితీ, పెద్ద మనసును సీఐ. ఎస్ఐలు అభినందించారు. పిల్లల్లో చిన్ననాటి నుంచే నిజాయితీ, బాధ్యతాయుతమైన ఆలోచనా విధానాన్ని పెంపొందిస్తున్న తల్లిదండ్రులు, విద్యాబుద్ధులు నేర్పుతున్న ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. -
స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి
● వైఎస్సార్సీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి ● ఎక్కడా ఏకగ్రీవాలకు తావివ్వరాదు ● రీజనల్ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కడప కార్పొరేషన్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శనివారం ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, అసెంబ్లీ సమన్వయకర్తలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో నిర్వహించిన కోర్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్టోబర్ 3వ తేదీన నోటిఫికేషన్ వచ్చే అవకాశముందన్నారు. ఎన్ని కష్టనష్టాలు వచ్చినా మనవైపు నిలబడే వారినే అభ్యర్థులుగా నిలపాలన్నారు. ప్రతి చోటా పోటీ చేయాలని, ఎక్కడా ఏకగ్రీవాలకు తావివ్వరాదని స్పష్టం చేశారు. స్థానికంగా పోలీసులు, అధికార యంత్రాంగం మనకు వ్యతిరేకంగా పనిచేసే అవకాశముందని, అయినా ఎక్కడా రాజీపడకుండా గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ రాజంపేట మినహా సుమారు 67వేల మందికి గుర్తింపు కార్డులు పంపిణీ చేశామన్నారు. 2 వేల మందికి ఫోటోలు సరిగా లేవని, వారి ఫోటోలు అప్లోడ్ చేయాలని సూచించారు. నియోజకవర్గ సమన్వయకర్తలతోపాటు పరిశీలకులు కూడా కష్టపడి పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమశిక్షణ కమిటీ ఛైర్మెన్ శెట్టిపల్లె రఘురామిరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, ఎమ్మెల్సీలు పి. రామసుబ్బారెడ్డి, డీసీ గోవిందరెడ్డి, ఎంవీ రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, డాక్టర్ దాసరి సుధ, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, సీఈసీ సభ్యులు కె. సురేష్ బాబు, ఏ. మల్లికార్జునరెడ్డి, కమలాపురం నియోజకవర్గ ఇన్చార్జి నరేన్ రామాంజులరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు ఎస్. గురుమోహన్, రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, మాజీ మేయర్ పాకా సురేష్ కుమార్, పార్టీ నాయకులు రాజగోపాల్‌రెడ్డి, పోరెడ్డి నరసింహారెడ్డి, ఆదిత్యరెడ్డి, పులిసునీల్, మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి పాల్గొన్నారు. -
పోలీసులంటే భయం కాదు.. ప్రజలకు భరోసా
సిద్దవటం : పోలీసు విధుల్లో క్రమశిక్షణ, నిజాయితీ, ధైర్యం, మానవత్వం ఎంతో కీలకం. పోలీసు యూనిఫాం ప్రజలకు భరోసా కల్పించేలా పనిచేయాలి. పోలీసులంటే భయం కాదు.. ప్రజలకు భరోసా అనే భావన ప్రజల్లో కలగాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి, వైఎస్సార్ కడప జిల్లా ఇన్చార్జి మంత్రి ఎస్. సవిత నూతన పోలీసు కానిస్టేబుళ్లకు పిలుపునిచ్చారు. భాకరాపేటలోని ఏపీఎస్పీ 11వ బెటాలియన్ పోలీసు పరేడ్ మైదానంలో శనివారం 521 మంది నూతనంగా శిక్షణ పూర్తి చేసుకున్న పోలీసు కానిస్టేబుళ్ల దీక్షాంత్ పరేడ్ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత హాజరుకాగా, జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్ల నుంచి మంత్రి గౌరవ వందనం స్వీకరించారు. ఈ దీక్షాంత్ పరేడ్ కార్యక్రమంలో తొమ్మిది నెలల ప్రాథమిక శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. వీరిలో కడప పోలీసు శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందిన 194 మంది సివిల్ ఎస్సీటీపీసీలు, 11వ బెటాలియన్‌కు చెందిన 327 మంది ఏపీఎస్పీ కానిస్టేబుళ్లు ఉన్నారు. పోలీసు వ్యవస్థకు కానిస్టేబుళ్లే వెన్నెముక పోలీసు వ్యవస్థకు కానిస్టేబుళ్లే వెన్నెముక అని మంత్రి సవిత అన్నారు. దీక్షాంత్ పరేడ్ కేవలం ఒక పరేడ్ మాత్రమే కాదు.. శిక్షణార్థి నుంచి బాధ్యతాయుతమైన పోలీసు సిబ్బందిగా మారే కీలక ఘట్టం అన్నారు. క్రమశిక్షణ, సమన్వయం, ఆత్మవిశ్వాసం, విధి పట్ల అంకితభావాన్ని చాటిన నూతన కానిస్టేబుళ్లు ఇకపై ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించనున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంతోపాటు కొత్త చట్టాలపై నిరంతరం అవగాహన పెంచుకోవాలని సూచించారు. యూనిఫాం గౌరవంతో పాటు బాధ్యతను ఇస్తుంది నూతన కానిస్టేబుళ్లకు దీక్షాంత్ పరేడ్ ఒక కొత్త బాధ్యతాయుతమైన ప్రయాణానికి శ్రీకారం చుడుతుందని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అన్నారు. తొమ్మిది నెలల కఠిన శిక్షణ అనంతరం నేడు ప్రజాసేవలోకి అడుగుపెడుతున్న ప్రతి కానిస్టేబుల్ తన విధి పట్ల అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు. ‘పోలీసు యూనిఫాం గౌరవాన్ని మాత్రమే కాదు.. గొప్ప బాధ్యతను కూడా ఇస్తుందన్నారు. పోలీసుశాఖపై నమ్మకం, రక్షణ, సాయం చేస్తారని మీపై పెట్టుకున్న విశ్వాసాన్ని వమ్ము చేయకుండా.. సమాజ సేవ చేయడానికి.. ప్రభుత్వం మీకందిస్తున్న గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టాలి జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ మాట్లాడుతూ 9 నెలల శిక్షణ పూర్తి చేసుకుని పోలీసు విధుల్లోకి అడుగుపెడుతున్న నూతన కానిస్టేబుళ్లు శిక్షణలో నేర్చుకున్న క్రమశిక్షణ, సమయపాలన, శారీరక దారుఢ్యం, విధి నిర్వహణ నైపుణ్యాలను సేవలో కొనసాగించాలని సూచించారు. ‘ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల ప్రధాన బాధ్యత అన్నారు. పోలీసు యూనిఫారం అనేది కేవలం ఒక గుర్తింపు మాత్రమే కాదని ప్రతి పరిస్థితిలో సంయమనంతో వ్యవహరిస్తూ చట్టాన్ని నిష్పక్షపాతంగా అమలు చేయాలన్నారు. ప్రజలతో మర్యాదగా వ్యవహరించి వారి విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలన్నారు. ప్రతిభ కనబర్చిన వారికి పురస్కారాలు.. దీక్షాంత్ పరేడ్ సందర్భంగా శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన కానిస్టేబుళ్లకు మంత్రి సవిత, కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి, ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పురస్కారాలు అందజేసి అభినందించారు. అనంతరం నూతన కానిస్టేబుళ్లకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో 11వ బెటాలియన్ కమాండెంట్ ఆనంద్ రెడ్డి, కడప డీటీసీ డీఎస్పీ అబ్దుల్ కరీం, బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ రాజశేఖర్, పోలీసు అధికారులు, జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, పోలీసు ఉన్నత అధికారులు, వివిధ కేటగిరీలకు చెందిన పోలీసు, బెటాలియన్ సిబ్బంది, శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లు, వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ పిఆర్వో వెంకట్ యాదవ్ వ్యాఖ్యాతగా వ్యవహరించి కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా సాగించారు. క్రమశిక్షణ, నిజాయితీతో విధులు నిర్వహించాలి దీక్షాంత్ పరేడ్ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి ఎస్. సవిత శిక్షణ పూర్తి చేసుకున్న 521 మంది నూతన కానిస్టేబుళ్లు -
చదువుల సరస్వతులు.. ఆ ముగ్గురు ఆదర్శ కుమార్తెలు!
రాజంపేట: వైఎస్ఆర్ కడప జిల్లా నందలూరు మండలం టంగుటూరుకు చెందిన ఆర్టీసీ రిటైర్డ్ కండక్టరు కంభాలకుంట సుబ్బరాయుడు, సరస్వతి దంపతులు తమ ముగ్గురు కుమార్తెలను ఉన్నతంగా తీర్చిదిద్దాలని సంకల్పించారు. ఆడపిల్లలకు ఇంట్లో ఎలాంటి పనులూ చెప్పకుండా, కేవలం చదువుపైనే దృష్టి పెట్టేలా ప్రోత్సహించారు. కన్నవారి నమ్మకాన్ని నిజం చేస్తూ ఆ ముగ్గురూ ఉన్నత శిఖరాలను అధిరోహించారు. పెద్దమ్మాయి లావణ్యలక్ష్మీ: 2009లో గ్రూప్–1 విజేతగా నిలిచి మచిలీపట్నంలో డీఎస్పీగా తొలి పోస్టింగ్ చేపట్టారు. విజయవాడ సెంట్రల్ ఏసీపీగా, మార్కాపురం ఓఎస్డీగా పనిచేసిన ఈమెకు 14 ఏళ్ల సర్వీసు ఉంది. ప్రస్తుతం తిరుపతిలో ఏపీ ట్రాన్స్‌కో ఛీప్ విజిలెన్స్ ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. చెల్లెలు లక్ష్మీప్రసన్నకుమారి: అక్కను ఆదర్శంగా తీసుకున్న లక్ష్మీ 2023 గ్రూప్–1 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలోనే 3వ ర్యాంక్ సాధించి, ప్రస్తుతం నెల్లూరు ఆర్డీవోగా పనిచేస్తున్నారు. మరో సోదరి మాధవి: అక్కల బాటలోనే వైష్ణవీ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి, ప్రస్తుతం ఏపీటిడ్కోలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. గ్రూప్–2 విజేతగా నిలిచేందుకు ప్రిపేర్ అవుతున్నారు. ఈమె భర్త కిరణ్‌కుమార్ కడపలో వ్యాపారి. ‘మా కలలను నిజం చేశారు’ – తల్లి సరస్వతి ‘మేము పెద్దగా చదువుకోకపోయినా బిడ్డలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. వారికి ఇంట్లో పను లు చెప్పకుండా నిరంతరం చదువుకోవాలనే ప్రోత్సహించాం. ఆ చదువే మా ముగ్గురు బిడ్డల జీవితాలను ఉన్నత శిఖరాలకు చేర్చింది.’ -
● మా ఇంటి దీపాలు
ప్రొద్దుటూరు క్రైం: ఆడపిల్ల పుట్టిందని ఆ తల్లిదండ్రులు ఏనాడూ దిగులు పడలేదు.. ఇద్దరూ ఆడపిల్లలే అయ్యారని అస్సలు అధైర్యపడలేదు. పైగా వారిని కొడుకులతో సమానంగా, ఎంతో బాధ్యతగా పెంచారు. తాము నమ్ముకున్న పవిత్రమైన వృత్తినే ఆ బిడ్డలకు స్ఫూర్తిగా చూపించారు. ఫలితంగా తల్లిదండ్రులిద్దరూ వైద్యులు.. కూతుళ్లిద్దరూ వైద్యులే అయి, ఒకే కుటుంబంలో నాలుగు వైద్య దీపాలను వెలిగిస్తున్నారు. ప్రొద్దుటూరుకు చెందిన డాక్టర్ పెద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి చిల్డ్రన్స్ స్పెషలిస్టుగా, ఆయన భార్య డాక్టర్ భాగ్యమ్మ గైనకాలజిస్టుగా సేవలందిస్తున్నారు. వైద్య వృత్తిలో వారు చూపిన అంకితభావాన్ని చిన్నప్పటి నుంచే చూస్తూ పెరిగిన వారి ఇద్దరు కుమార్తెల్లోనూ వైద్యులుగా ఎదగాలన్న ఆకాంక్ష బలంగా నాటుకుంది. కూతుళ్లను కేవలం చదివించడం మాత్రమే కాకుండా.. జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకొని, దానిని చేరుకునే వరకు కష్టపడేలా తల్లిదండ్రులు తీర్చిదిద్దారు. స్కిన్ స్పెషలిస్ట్‌గా పెద్ద కుమార్తె.. పెద్ద కుమార్తె గ్రీష్మబిందు 2016లో నెల్లూరులోని నారాయణ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్‌లో చేరారు. వైద్య విద్యను విజయవంతంగా పూర్తి చేసిన ఆమె.. అనంతరం చైన్నెలోని ప్రతిష్టాత్మక శ్రీరామచంద్ర మెడికల్ కాలేజ్‌లో ఎండీ పూర్తి చేసి, ప్రస్తుతం స్కిన్ స్పెషలిస్ట్‌గా మారి రోగులకు అద్భుతమైన వైద్య సేవలు అందిస్తున్నారు. ఢిల్లీ వేదికగా చిన్న కుమార్తె.. చిన్న కుమార్తె నవ్యశ్రీ సైతం అక్క, కన్నవారి అడుగుజాడల్లోనే నడిచారు. ఈమె 2020లో దేశ రాజధాని ఢిల్లీలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎల్హెచ్ఎంసీలో ఎంబీబీఎస్ సీటు సాధించారు. తాజాగా వైద్య విద్యను అత్యంత విజయవంతంగా పూర్తి చేసి, అధికారికంగా వైద్య రంగంలోకి అడుగుపెట్టారు. ఇలా తల్లిదండ్రుల వృత్తిని చూసి ప్రేరణ పొందిన ఇద్దరు కుమార్తెలు.. అదే వృత్తిని ఎంచుకొని తమ తల్లిదండ్రుల కోరికను నెరవేర్చడం విశేషం. ‘ఇద్దరు ఆడపిల్లలే అని ఎప్పుడూ బాధపడలేదు’ – డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి దంపతులు ‘మాకు ఇద్దరు కూతుళ్లు పుట్టారని ఏనాడూ బాధపడలేదు. ఆడపిల్లలను చక్కగా చదివించి, తమ కాళ్లపై తాము నిలబడేలా తీర్చిదిద్దాలనే ఆలోచనతో పెంచాం. పిల్లలకు లక్ష్యాన్ని నిర్దేశించడమే కాకుండా.. ఆ లక్ష్యాన్ని సాధించే వరకు వారికి అండగా నిలిచాం. ఆడపిల్లలు పుట్టడం లోటు కాదు.. వారికి సరైన విద్య, ప్రోత్సాహం, అవకాశాలు అందిస్తే కుటుంబానికే కాదు.. సమాజానికి కూడా గర్వకారణంగా నిలుస్తారు.’ -
ఆడపిల్లలు భారం కాదు..
జమ్మలమడుగు: ఒకప్పుడు ఆడపిల్ల పుడితే చాలు.. పెళ్లిళ్లకు కట్నకానుకలు ఎలా సర్దాలి, అత్తగారింట్లో ఎలాంటి ఇబ్బందులు పడుతుందో అని తల్లిదండ్రులు భయపడేవారు. కానీ, కాలం మారింది. నేడు ఆడపిల్లలు తమ ప్రతిభతో తల్లిదండ్రుల గుండెల్లో ధైర్యాన్ని నింపుతూ, సమాజంలో గర్వంగా తలెత్తుకునేలా చేస్తున్నారు. అందుకు సజీవ సాక్ష్యంగా నిలిచారు జమ్మలమడుగు ఎంపీడీఓ వై.రామచంద్రారెడ్డి, శ్రీదేవి దంపతుల కుమార్తెలు. తమకు ఇద్దరూ ఆడపిల్లలే అయినా, వారు ఎంతవరకు చదవాలనుకుంటే అంతవరకు చదివించి మంచి స్థాయికి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ దంపతులు పూర్తి స్వేచ్ఛను, ప్రోత్సాహాన్ని అందించారు. తల్లిదండ్రులు ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ ఆ కుమార్తెలు చదువుల్లో అద్భుతంగా రాణించారు. ఈ దంపతుల పెద్ద కుమార్తె శ్రీచరిత సాఫ్ట్వేర్ ఇంజనీరుగా స్థిరపడగా, రెండవ కుమార్తె దివ్యప్రీతి ఎంబీబీఎస్ విజయవంతంగా పూర్తి చేసి ప్రస్తుతం పీజీ జనరల్ మెడిసిన్ అభ్యసిస్తున్నారు. తమ పిల్లలను చూస్తే గర్వంగా ఉందని ఆ దంపతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
అంగన్వాడీ విభాగం జిల్లా అధ్యక్షురాలిగా రాచమల్లు రమాదేవి
ప్రొద్దుటూరు : వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అంగన్వాడీ విభాగం జిల్లా అధ్యక్షురాలిగా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి సతీమణి, మాజీ కౌన్సిలర్ రాచమల్లు రమాదేవిని నియమించారు. పలు మార్లు కౌన్సిలర్‌గా పనిచేసిన ఆమెకు ప్రజా సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉంది. ఈమేరకు ఆమెను పార్టీ ఈ పదవిలో నియమించింది. వైఎస్సార్ యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా గోపవరం మాజీ ఉప సర్పంచ్ బీరం రాఘవేంద్రారెడ్డి, వైఎస్సార్టీయూసీ జిల్లా అధికార ప్రతినిధిగా వై.ప్రసన్న కుమార్‌ను నియమిస్తూ పార్టీ ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు జడ్జిలను కలిసిన జిల్లా కలెక్టర్ కడప సెవెన్‌రోడ్స్ : జిల్లా కోర్టు ఆవరణలో శనివారం జరిగే జ్యుడిసియల్ వర్క్ షాప్ –3 కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన హైకోర్టు న్యాయమూర్తులను శనివారం జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి మర్యాద పూర్వకంగా కలిశారు. రాష్ట్ర అతిథి గృహంలో బస చేసిన రాష్ట్ర హైకోర్టు జడ్జి, జిల్లా అడ్మినిస్ట్రేటీవ్ జడ్జి, వర్క్ షాప్ చైర్ పర్సన్ జస్టిస్ టి. రాజశేఖర్ రావు, గౌరవ అతిథిగా విచ్చేసిన రాష్ట్ర హైకోర్టు జడిఎం. బాలాజీని కలెక్టర్ కలిసి మొక్కను అందజేశారు. -
ఈఆర్పీ వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయాలి
– కేజీబీవీల రాష్ట్ర సెక్రటరీ దేవానందరెడ్డి కడప ఎడ్యుకేషన్: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయల్లో ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్(ఈఆర్పీ) వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా పరిపాలన ప్రక్రియలో పారదర్శకత, వేగం, పెరుగుతాయని కేజీబీవీ రాష్ట్ర సెక్రటరీ దేవానందరెడ్డి పేర్కొన్నారు. కేజీవీబీల్లో ఈఆర్పీ వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయడమే లక్ష్యంగా సమగ్రశిక్ష ఆధ్వర్యంలో శనివారం ఆలంఖాన్పల్లిలోని ఎంఎన్ ఫంక్షన్ హాల్లో కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు చెందిన జీసీడీఓలు, కేజీబీవీ సిబ్బందికి నిర్వహించిన జిల్లా స్థాయి ఈఆర్పీ శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్‌జిల్లా సమగ్రశిక్ష ఏపీసీ అనుఽరాధ పలు సూచనలు చేశారు. జీసీడీఓ దార్ల రూతు ఆరోగ్యమేరీ, తిరుపతి జీసీడీఓ పుష్ప, చిత్తూరు జీసీడీఓ కృష్ణవేణి, అలెస్కో వెంకటరామయ్య పాల్గొన్నారు. -
నన్ను గర్వపడేలా చేసింది.. శ్రీచరణి
ఎర్రగుంట్ల: ఒక చిన్న పల్లెటూరి నుంచి ప్రయాణం మొదలైంది.. ఎన్నో కష్టాలు, సవాళ్లను దాటుకుంటూ ముందుకు సాగింది.. చివరకు ప్రపంచ క్రికెట్ వేదికపై భారత జెండాను రెపరెపలాడించే స్థాయికి చేరుకుంది! మహిళల ప్రపంచకప్‌లో తన అద్భుతమైన బౌలింగ్ నైపుణ్యంతో దుమ్మురేపిన భారత స్టార్ స్పిన్నర్, తెలుగు తేజం నల్లపురెడ్డి శ్రీచరణి. నేడు యావత్ భారతదేశం ఆమె వైపు చూసి మురిసిపోతుంటే.. కన్న తండ్రి గుండె గర్వంతో ఉప్పొంగిపోతోంది. కుమార్తెను చూసి గర్వపడుతున్న తండ్రి.. ‘ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలో భారత జట్టు తరఫున ఆడుతూ నా కుమార్తె శ్రీచరణి అదరగొడుతుంటే.. ఆమె తండ్రిగా చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది’ అని శ్రీచరణి తండ్రి నల్లపురెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి భావోద్వేగంతో తెలిపారు. వైఎస్ఆర్ కడప జిల్లా వీరపునాయినిపల్లి మండలంలోని యరమలపల్లె (యర్రగొండుపల్లి) వారి సొంత గ్రామం. వృత్తిరీత్యా ఆయన రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ లో ఉద్యోగం చేస్తున్నారు. భార్య రేణుకతో పాటు వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి వైష్ణవి ప్రస్తుతం అమెరికాలో స్థిరపడగా, చిన్నమ్మాయి శ్రీచరణి ప్రపంచ క్రికెట్లో సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పుడు అంతా తనను ‘శ్రీచరణి తండ్రి’ అని పిలుస్తుంటే ఆ సంతోషమే వేరని ఆయన మురిసిపోతున్నారు. ‘కిశోర్ మామయ్య’ ప్రోత్సాహం శ్రీచరణి క్రికెట్ కల నిజం కావడంలో ఆమె మామయ్య కిశోర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. చిన్నతనంలో మూడో తరగతి చదువుతున్నప్పటి నుంచే మామ య్యతో కలిసి ప్లాస్టిక్ బ్యాట్‌తో ఇంట్లోనే క్రికెట్ ఆడటం మొదలుపెట్టింది. అథ్లెటిక్స్ నుంచి క్రికెట్ వైపు మారినప్పుడు ఆమెకు తోడుగా నిలిచి, నిరంతరం వెన్నుతట్టి ప్రోత్సహించింది మామయ్యే. ఈ 21 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, నేడు అంతర్జాతీయ క్రికెట్లో తన అద్భుత ప్రతిభతో టాపర్‌గా నిలిచింది. కడప జిల్లా మారుమూల పల్లె నుంచి విశ్వఖ్యాతికి ఎదిగిన శ్రీచరణి ప్రస్థానం.. తమ కలలను నిజం చేసుకోవాలనుకునే ప్రతి ఒక్క యువతికీ, ఆడపిల్లల ఆశయాలకు రెక్కలు తొడిగే ప్రతి తల్లిదండ్రికీ ఒక అద్భుతమైన స్ఫూర్తిదాయక సందేశం! -
రైతుబజార్లో మహిళా రైతుపై దాడి
బద్వేలు అర్బన్ :స్థానిక సిద్దవటం రోడ్డులోని మార్కెట్‌యార్డు ఆవరణలో గల రైతుబజార్లో కూరగాయలు విక్రయించే ఓ మహిళా రైతుపై ఓ వ్యక్తి శనివారం దాడి చేశాడు. రైతుబజార్లో ఉన్న గదుల్లో కాకుండా బయట కొంతమంది కూరగాయలు విక్రయిస్తుంటారు. బయట కూరగాయలు విక్రయించే స్థలం కోసం ఇరువురి మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణకు దారి తీసినట్లు తెలుస్తోంది. రైతుబజార్‌పై మున్సిపల్ అధికారులు, మార్కెటింగ్‌శాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో రైతుబజార్ ఆవరణలో ఎవరికి వారు విక్రయాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే గొడవ జరిగినట్లు తెలుస్తోంది. రూ.15 లక్షల కొత్త కరెన్సీ నోట్లతో అలంకరణ గోపవరం : మండలంలోని వల్లెరవారిపల్లె గ్రామంలో వెలసిన స్వయంభు లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భాద్రపద మాసం పౌర్ణమి సందర్భంగా శనివారం స్వామి వారిని రూ.15 లక్షల కొత్త కరెన్సీ నోట్లతో అలంకరించారు. స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వచ్చిన భక్తులకు ఆయ ప్రధాన అర్చకులు పెంచలయ్యస్వామి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పౌర్ణమి శనివారం చాలా అరుదుగా వస్తుందని, అలా లక్ష్మీ అలంకరణలో భక్తులు దర్శనం చేసుకోవడం వలన రుణబాధలు తొలగిపోయి ధనాకర్షణ కలుగుతుందని, దీర్ఘకాల ధన సమస్యలు తొలగి మనస్సు ఆనందంగా ఉంటుందని తెలిపారు. -
కష్టాల హిమపాతాన్ని జయించి.. ఆదర్శ బిందువై నిలిచి..
జీవితం విసిరే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని, సమాజానికి గొప్ప ఆదర్శంగా నిలిచారు వైవీయూ జూనియర్ అసిస్టెంట్ హిమబిందు. లోకం తెలియని చిన్న వయసులోనే వివాహమైనా, కన్నవారి ప్రోత్సాహంతో పట్టుదలగా చదివి పీహెచ్డీ సాధించారు. ఆ చదువే భవిష్యత్తులో ఆమెను నిలబెట్టే మహా శక్తిగా మారింది. జీవితం సాఫీగా సాగుతున్న సమయంలో భర్త అకాల మరణం చెందడంతో హిమబిందు జీవితంలో చీకట్లు ముసిరాయి. అయినా గుండె నిబ్బరం కోల్పోకుండా ఇద్దరు పిల్లల, కన్నవారి బాధ్యతను భుజానికెత్తుకున్నారు. ఇంతలోనే కొండంత అండగా ఉన్న తండ్రి కూడా దూరమవడంతో తల్లి ఒంటరిదైంది. సాధారణంగా ఇలాంటి స్థితిలో ఎవరైనా కుంగిపోతారు, కానీ హిమబిందు మాత్రం వృద్ధురాలైన తన తల్లిని కన్న కూతురిగా, తన ‘మూడో బిడ్డ’గా భావించి అపురూపంగా చూసుకుంటున్నారు. విధి ఆమైపె మరోసారి కన్నెర్ర చేసి, బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్న కొడుకును రోడ్డు ప్రమాదం రూపంలో దూరం చేసింది. ఆ గర్భశోకంలోనూ కుంగిపోకుండా, తన ఇంటి వెలుగైన కూతురు మధునిని ప్రతిష్టాత్మకంగా బీటెక్ చదివిస్తూ ఆమె కలలకు రెక్కలు తొడుగుతున్నారు. ఇటు జన్మనిచ్చిన తల్లిని, అటు తను జన్మనిచ్చిన కూతురిని రెండు కళ్లుగా చూసుకుంటూ హిమబిందు సాగిస్తున్న ఈ ప్రయాణం నిజమైన ‘మహిళా శక్తికి’ నిదర్శనం. కూతుర్ల దినోత్సవం వేళ, ఒకే సమయంలో బాధ్యతగల కూతురిగా, ప్రేమమయి అయిన అమ్మగా అద్భుత పాత్రలు పోషిస్తున్న ఆమెకు సెల్యూట్ చేయకుండా ఉండలేం. ‘మా అమ్మే నా సర్వస్వం’ – మధుని, బీటెక్ ‘నాకు కొండంత అండ మా అమ్మే. ఒంటరి తల్లిగా సమాజంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటూనే నాకు ప్రేమను, ధైర్యాన్ని అందించింది. కష్టమొచ్చిన ప్రతీసారి తను నిలబడింది..నన్ను నిలబెట్టింది.. ఈ రోజు నేను సాధించిన ప్రతి విజయంలోనూ ఆమె కష్టం, త్యాగాలు ఉన్నాయి. రేపు నేను ఏ ఉన్నత స్థానానికి చేరుకున్నా అది అమ్మ వల్లే. అమ్మ నాకు మార్గదర్శి.థ్యాంక్యూ అమ్మ!’ – కడప ఎడ్యుకేషన్ -
ఎరుపెక్కిన కడప
కడప వైఎస్ఆర్ సర్కిల్ : కడప కేంద్రంగా ఆదివారం నుంచి ప్రారంభం కాను న్న సీపీఐ రాష్ట్రస్థాయి ప్లీనరీ సమావేశాలకు కడప ముస్తాబైంది. నగరంలోని ప్రధాన కూడళ్ల నిండా ఎర్రజెండా తోరణాలే కనిపిస్తున్నాయి. ఈ నెల 30 వరకు జరగనున్న ఈ సమావేశాలకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, జాతీయ కార్యదర్శులు కే రామకష్ణ పల్లా వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య తో పాటు జాతీయ రాష్ట్ర నాయకులు హాజరు కానున్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య సొంత జిల్లా కావడంతో జిల్లా పార్టీ శ్రేణులు ఏర్పాటల్లో నిమగ్నమయ్యారు. -
ఉత్సాహంగా ఎస్జీఎఫ్ జిల్లా స్థాయి ఎంపికలు
కడప వైఎస్ఆర్ సర్కిల్: కడప నగరంలోని డీఎస్ఏ క్రీడా మైదానంలో ఉత్సాహంగా స్కూల్ గేమ్ ఫెడరేషన్ (ఎస్జీఎప్) జిల్లా స్థాయి ఎంపికలు ఉత్సాహంగా సాగాయి. శుక్రవారం ఉషూ, బాక్సింగ్, జూడో పోటీలను నిర్వహించారు. అలాగే చెన్నూరు మండలం రామనపల్లి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో గట్కా అండర్–17 ఎంపికలు నిర్వహించారు. ఈ ఎంపికలు ఎస్జీఎస్ జిల్లా కార్యదర్శులు విజయలక్ష్మీ, నాగరాజారెడ్డి ఆధ్వర్యంలో జరిగాయి. అనంతరం వ్యాయా మ ఉపాధ్యాయులు విద్యార్థులకు పోటీలను నిర్వహించి జిల్లా స్థాయికి ఎంపిక చేశారు. అండర్–17 గట్కా బాలికల జట్టు : ప్రణవి, స్వాతి,నీతు, ధర్మిత, సింధూర, మోక్ష్ఞశ్రీ, జాహ్నరెడ్డి, సుమశ్రీ, స్టాండ్‌బై: చరిత, రెడ్డి బీ, రోహిత రాయల్. అండర్–17 బాలుర జట్టు : మహ్మద్ అల్తాఫ్, నాగ చైతన్య, సయ్యద్ పౌజాన్, నాగ చైతన్య, వెంకట నాగ గౌతమ్ కృష్ణ, కమాల్ భాష, అబ్దుల్ రసూల్. స్టాండ్‌బై: మౌలాలి, సుజన్ కుమార్. ఉషూ జట్టుకు ఎంపికై న క్రీడాకారులు : బాలుర జట్టు: కుమార్, వీర సురేంద్ర కుమార్, రాధకృష్ణ, హేమంత్, సందీప్‌కుమార్, నాగబస్వేశ్వర రెడ్డి, జయప్రకాశ్. బాలికల జట్టు: మోక్షిత, కృష్ణవేణి, వెంకట సాయి భవ్య, అఖిల, ఎల్లమ్మ, హరిప్రియ. చికిత్స పొందుతూ గాయపడిన వ్యక్తి మృతి చక్రాయపేట: మండలంలోని సురభి గ్రామం మహబూబ్ నగర్ సమీపంలో గురువారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న పెద్దిరెడ్డి భార్గవ్ రెడ్డి(32 మృతి చెందినట్లు ఎస్ఐ ఎస్‌కెఎం హుస్సేన్ తెలిపారు. మృతుడు అన్నమయ్య జిల్లా కాటమాయకుంట గ్రామం నల్లగుండ్ల పల్లెకు చెందిన వాడని తెలిపారు. మృతుడి తల్లి జయమ్మ ఫిర్యాదు మేరకు వివరాలిలా.. భార్గవ్‌రెడ్డికి చక్రాయపేట మండలంలోని మూలపల్లెకు చెందిన బేబితో వివాహమైంది. వారికి ఇద్దరు సంతానం. మూలపల్లెలోని అత్తగారి ఇంటికి వచ్చి తెల్లవారు జామునే ద్విచక్ర వాహనంలో వెళుతుండగా మహబూబ్‌నగర్ సమీపంలో లారీ ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు 108లో రాయచోటికి తీసుకెళ్లి అక్కడ నుంచి తిరుపతిలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని ..దువ్వూరు : మండలంలోని టంగుటూరు మెట్ట వద్దనున్న జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృదాడు. పోలీసుల కథనం మేరకు.. రాజుపాళెం మండలం టంగుటూరు గ్రామానికి చెందిన కాసా సుంకిరెడ్డి (61) శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో జిల్లెల్ల వద్దనున్న పొలం వద్దకు స్కూటర్ వెళుతుండగా ఆళ్లగడ్డ వైపు నుంచి వస్తున్న గుర్తు తెలియని వాహనం స్కూట్‌ను ఢీకొనడంతో రోడ్డుపై పడిపోయాడు. బంధువులు అతడిని ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలిస్తుండగా మార్గంమధ్యలో సుంకిరెడ్డి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ధనుంజయుడు తెలిపారు. -
జిల్లా సెషన్స్ జడ్జి కోర్టు పీపీగా జి. శివశంకర్‌రెడ్డి
కడప అర్బన్: వైఎస్ఆర్ కడప జిల్లా ప్రధాన సెషన్‌న్స్ జడ్జి కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ప్రముఖ న్యాయవాది గంగిరెడ్డి శివ శంకర్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గవర్నర్ ఆదేశానుసారం శివశంకర్ రెడ్డి పేరుమీద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్ విశ్వజిత్ శుక్రవారం ఉత్తర్వులను జారీ చేశారు. ఈ నియామకం పదవీ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి మూడు సంవత్సరాల కాలానికి, లేదా అతని సేవలు ముగిసే వరకు ఏది ముందుగా జరిగితే అది వర్తిస్తుంది. సోమ వారం ఆయన బాధ్యతలను చేపట్టనున్నారు.పథకాలను క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేయాలి● సమగ్రశిక్ష ఏపీసీ అనురాధ కడప ఎడ్యుకేషన్: ప్రభుత్వం ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం అమలు చేస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేయాలని సమగ్రశిక్ష ఏపీసీ అనురాధ తెలిపారు. సమగ్రశిక్ష సమిళిత విద్య విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం కడప సీపీ బ్రౌన్ లైబ్రరీ మీటింగ్ హాల్లో ఎంఈఓ–1, ఎంఈఓ–2లకు ఒకరోజు ఓరియంటేష్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సమగ్రిశిక్ష ఏపీసీ అనురాధ, దివ్యాంగులశాఖ ఏడీ కిషోర్, ఐసీడీసీ అధికారి నాగేశ్వరి, కడప డిప్యూటీ ఈఓ రాజగోపాల్‌రెడ్డి, పొద్దుటూరు డిప్యూటీ ఈఓ శివప్రసాద్, పోలీస్ శాఖ ప్రతినిధి జ్యోతి హాజరయ్యారు. ఈ సందర్భంగా సమగ్రశిక్ష ఏపీసీ అనురాధ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం అమలు చేస్తున్న పథకాలను పాఠశాలల్లో సక్రమంగా అమలయ్యే విధంగా ఎంఈఓలు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని యాజమాన్య పాఠశాలలు, కళాశాలలో 17 వేలకుపైగా ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని, వీరిలో ఇప్పటి వరకు 14 వేలకపైగా ప్రసస్త్ యాప్‌ను డౌన్లోడు చేసుకున్నారని తెలిపారు. వారంతా తమ పరిధిలోని ప్రత్యేక అవసరాలు గల పిల్లల వివరాలను తప్పకుండా యాప్‌లో ఆప్‌లోడ్ చేయాలన్నారు. ఈ ప్రసస్త్యాప్ గురించి పాఠశాలల్లో అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఐఈ– కో ఆర్డినేటర్ వెంకటసుబ్బయ్య, అసిస్టెంట్ కో–ఆర్డినేటర్ రమణమూర్తి, సెక్టోరియల్ అధికారులు రమేష్ రాజా, జాఫర్, రాజు, ఎఫ్ఎల్ఎన్ కో–ఆర్డినేటర్ కిరణ్, ఆర్పీలు వెంకటసుబ్బయ్య, మమత, విజయమ్మ, అర్షద్ తదితరులు పాల్గొన్నారు. -
నీట్‌గా రాణించారు
నీట్ పీజీ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ ప్రతిష్టాత్మక పరీక్షలో మన విద్యార్థులు ర్యాంకులు సాధించి, తమ పట్టును నిరూపించుకున్నారు. మన్ననలు అందుకున్నారు. అశ్విత..అక్షర సరస్వతి బద్వేలు అర్బన్ :నీట్ పీజీ పరీక్షా ఫలితాల్లో బద్వేలుకు చెందిన గొడిసిపాటి అశ్వితరాయల్ 567 మార్కులతో జాతీయ స్థాయిలో 1100వ ర్యాంకు సాధించింది. పట్టణంలోని శ్రీకృష్ణదేవరాయనగర్‌కు చెందిన జి.అంకయ్య పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడుగా పనిచేస్తుండగా భార్య రుక్మిణి ఇంట్లో టైలర్‌గా రాణిస్తోంది. వీరి కుమార్తె అయిన డాక్టర్ అశ్వితరాయల్ 1 నుంచి 10వ తరగతి వరకు పట్టణంలోని రాయలసీమ ఇంగ్లీషు మీడియం స్కూల్లో చదివింది. అనంతరం ఇంటర్మీడియట్ నెల్లూరు నారాయణ జూనియర్ కళాశాలలో పూర్తిచేసి నీట్లో అత్యుత్తమ ర్యాంకు సాధించి నంద్యాల శాంతారామ్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ఈ సందర్భంగా అశ్వితరాయల్ మాట్లాడుతూ పీజీలో రేడియాలజీ లేదా జనరల్ మెడిసిన్ కావాలన్నదే తన లక్ష్యమని తెలిపారు. -
రేడియాలజీ, జనరల్ మెడిసిన్ చదవడమే లక్ష్యం
చాపాడు : రేడియాలజీ లేదా జనరల్ మెడిసిన్‌లో సీటు సాధించడమే లక్ష్యంగా చవివానని నీట్ పీజీలో 2560వ ర్యాంక్ సాధించిన చియ్యపాడుకు చెందిన శ్రీయపురెడ్డి గోపినాథ్ రెడ్డి తెలిపారు. చియ్యపాడుకు చెందిన వైఎస్సార్సీపీ నేత, మాజీ జెట్పీటీసీ శ్రీయపురెడ్డి బాల నరసింహారెడ్డి, లక్ష్మీదేవి దంపతుల కుమారుడు గోపినాథ్‌రెడ్డి చిత్తూరులోని అపోలో మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. దేశ వ్యాప్తంగా గురువారం విడుదలైన జాతీయ స్థాయి నీట్ పీజీ పరీక్షా ఫలితాల్లో 560 మార్కులు సాధించి 2560వ ర్యాంక్ సాధించాడు. భవిష్యత్తులో ఎంఎస్ కార్డియాలజీ చదివి పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తానని తెలిపారు. -
వంచక ప్రభుత్వానికి పతనం తప్పదు
అనంతపురం సిటీ: హామీలు నెరవేర్చకుండా మోసం చేయాలని చూస్తే ప్రభుత్వానికి పతనం తప్పదని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ కాంట్రాక్టు ఉద్యోగుల జేఏసీ నాయకులు హెచ్చరించారు. సమస్యల పరిష్కారంలో చంద్రబాబు ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ శుక్రవారం అనంతపురం వేదికగా సాగిన రాయలసీమ జోనల్ (జోన్–4) వైద్య ఉద్యోగుల గర్జన మహాసభ విజయవంతమైంది. ముందుగా సప్తగిరి సర్కిల్ నుంచి రుద్రంపేట బైపాస్ వరకు వైద్య, ఆరోగ్య శాఖ కాంట్రాక్టు ఉద్యోగులు భారీ ర్యాలీ చేపట్టారు. రాయలసీమ జిల్లాల నుంచి తరలివచ్చిన కాంట్రాక్ట్ నర్సులు, పారామెడికల్, ఫార్మసీ, ల్యాబ్ అసిస్టెంట్ సిబ్బంది వందలాది మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా గర్జించారు. అనంతరం రుద్రంపేట బైపాస్‌లోని యాదవ భవన్లో జరిగిన మహాసభలో జేఏసీ రాష్ట్ర చైర్మన్ కోటేశ్వరరావు డిమాండ్ల సాధన కోసం గతంలో 15 రోజుల పాటు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తే ఓ మెట్టు దిగివచ్చిన ఉన్నతాధికారులు.. చర్చల పేరుతో ఆర్థికేతర అంశాలు పరిష్కరిస్తామని, మిగిలిన డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే ఆర్థికపరమైన డిమాండ్లపై ఇప్పటి వరకూ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కానీ, అధికారులు కానీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదన్నారు. మిగిలిన వారితో సమానంగా బేసిక్ వేతనం చెల్లించాలని, వంద శాతం గ్రాస్ సాలరీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీ గవర్నమెంట్ కాంట్రాక్టు నర్సెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని, ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకూ 100 శాతం గ్రాస్ వేతనం చెల్లించాలని కోరారు. విధి నిర్వహణలో మరణించిన ప్రతి కాంట్రాక్ట్ ఉద్యోగి కుటుంబానికీ రూ. 50 లక్షల ఎక్స్ గ్రేషియాతో పాటు ఆ కుటుంబంలో ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం కల్పించాలన్నారు. ఈపీఎఫ్, పరస్పర బదిలీల వంటి డిమాండ్లు పరిష్కరించాలన్నారు. అక్టోబర్ 3వ తేదీలోపు రెగ్యులరైజేషన్‌పై స్పష్టమైన జీఓ ఇవ్వకపోతే విధులు బహిష్కరించి నిరవధిక సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగుల పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు ప్రకటించారు. కార్యక్రమంలో ఏపీ ఎంఎల్టీ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీధర్, ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు మాధవ్, ఏపీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు శరత్, జేఏసీ కో చైర్మన్ వెంకట్, ఏపీజీసీఎన్ఏ రాష్ట్ర అధ్యక్షుడు సుమన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ వినోద్, ప్రశాంతి, లావణ్య, సుజేంద్ర, చాందిని, వెంకటేష్ నాయక్, శ్రీకాంత్, వలి, మహేష్, కాంట్రాక్ట్ నర్సులు, ఎక్స్ రే, ఓటీ, ఈసీజీ టెక్నిషీయన్లు పాల్గొన్నారు. మాట తప్పితే అక్టోబర్ 3 తర్వాత నిరవధిక సమ్మె వైద్య, ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగుల అల్టిమేటం అనంతపురం వేదికగా రాయలసీమ జోనల్–4 ‘గర్జన’ -
సత్తాచాటిన సునందకుమార్
రాజంపేట టౌన్ : నీట్ పీజీ ఫలితాల్లో రాజంపేట పట్టణం మన్నూరుకు చెందిన నరసాపురం సునందకుమార్ సత్తా చాటి తొలి ప్రయత్నంలోనే ఆలిండియా స్థాయిలో 845వ ర్యాంకు సాధించారు. మొత్తం 720 మార్కులకు 570 మార్కులు సాధించి ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. సునందకుమార్ తండ్రి సురేంద్రబాబు చిరు వ్యాపారి కాగా, తల్లి మల్లీశ్వరి గృహిణి. సునందకుమార్ చిన్నప్పటి నుంచి చదువులో రాణిస్తున్నాడు. రాజంపేట పట్టణంలోని సాయి విద్యాలయలో పదవ తరగతి చదివి 9.8 జీపీఏ సాధించాడు. ఇంటర్ విజయవాడలోని శ్రీ చైతన్యలో చదివాడు. నీట్ యూజీ ఎంట్రెన్స్‌లో 639 మార్కులు సాధించి ఆలిండియాలో 6139 ర్యాంకు, స్టేట్‌లో 250 ర్యాంకు సాఽధించాడు. న్యూరో సర్జన్‌గా వైజాగ్‌లోని ఆంధ్ర యూనివర్శిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. న్యూరో సర్జన్‌గా ప్రజలకు ఉత్తమ సేవలు అందించడమే తన లక్ష్యమని సునందకుమార్ తెలిపారు. -
వేముల గ్రామ సమీపంలో..
వేముల : వేల్పుల గ్రామ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నరసింహులు (52) అనే వ్యక్తి మృతి చెందాడు. వేములలో నివాసముంటున్న నరసింహులు పనిమీద పులివెందులకు మోటార్ బైకుపై బయలుదేరాడు వేల్పుల వద్దకు వెళ్లగానే జరిగిన రోడ్డు ప్రమాదంలో నరసింహులు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నరసింహులు కుటుంబాన్ని జెడ్పీటీసీ వెంకట బయపురెడ్డి ఆసుపత్రిలో పరామర్శించి ఓదార్చారు. రోడ్డు దాటుతుండగా.. జమ్మలమడుగు రూరల్: జమ్మలమడుగు–ప్రొద్దుటూరు బైపాస్‌లోని రైల్వే స్టేషన్ వద్ద రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని గురువారం అర్ధరాత్రి బలరాం (45) అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. పట్టణ సీఐ నరేష్‌బాబు తెలిపిన వివరాలిలా... ఒరిస్సా రాష్ట్రంలోని బరంపురంకు చెందిన బలరాం గత కొంత కాలంగా దాల్మియా కర్మాగారంలో కూలి పనులు చేసుకొనేవాడు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి స్వగ్రామానికి వెళ్లడానికి రైల్వేస్టేషన్‌కు వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ సంఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. సంప్రదాయానికి సాంకేతికతను జోడించాలికడప ఎడ్యుకేషన్: సంప్రదాయ పద్ధతులు, ప్రాచీన వైద్య విధానాలకు ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తేనే మరింత మెరుగైన ఫలితాలు సాధ్యమని ఏపీ ఔషధ, సుగంధ మొక్కల బోర్డు (ఏపీఎంఏపీ) సీఈఓ ఆవుల చంద్రశేఖర్ అన్నారు. వైవీయూ తాళ్లపాక అన్నమాచార్య సెనేట్ హాల్లో బోటనీ విభాగం ఆధ్వర్యంలో, పీఎం–ఉషా సౌజన్యంతో మూలికా వైద్యంపై శుక్రవారం ఒక రోజు జాతీయ కార్యశాల ఘనంగా జరిగింది. ప్రధాన వక్తగా పాల్గొన్న సీఈఓ చంద్రశేఖర్ ‘ప్రస్తుత ధోరణులు, పరిశోధన ఆవిష్కరణలు, భవిష్యత్ అవకాశాలు’ అనే అంశంపై మాట్లాడారు. బోర్డు పనితీరును పీపీటీ, వీడియోల ద్వారా ప్రదర్శిస్తూ.. తాను పరిశోధించిన గ్రంథాలలోని 452 రకాల మొక్కలు, 225 రకాల ఔషధ పంటల సాగు విధానాలను క్షుణ్ణంగా వివరించారు. సదస్సులో వైవీయూ రెక్టార్ ప్రొఫెసర్ ఎ.జి.దాము, రిజిస్ట్రార్ ఎన్.సి.గంగిరెడ్డి, ప్రిన్సిపాల్ టి.శ్రీనివాస్ సందేశాలిచ్చారు. బెంగళూరు ఐఎన్ఎస్ఏ శాస్త్రవేత్తలు డాక్టర్ ఆర్.ఆర్.రావు, ఎం.సంజప్ప, కర్నూలు ఉర్దూ వర్సిటీ ఇన్ఛార్జ్ వీసీ పి.ఎస్.షావల్లి ఖాన్ రిసోర్స్ పర్సన్స్‌గా వివరణ ఇచ్చారు. సదస్సుకు సమన్వయకర్తగా ఎ.మధుసూదన రెడ్డి, నిర్వాహక కార్యదర్శులుగా టి.చంద్రశేఖర్, పులి చంద్రఓబుల్ రెడ్డి వ్యవహరించారు. కార్యక్రమంలో సబ్ డీఎఫ్ఓ స్వామి వివేకానంద, సాంకేతిక సహాయకుడు ప్రసాద్, కమిటీ సభ్యులు ఎస్.రాజగోపాల్ రెడ్డి, ఎన్.మీరావలి, సి.నాగేంద్ర, బి.క్రాంతి, ఎస్.హిమబిందు, డి.వి.సురేష్ బాబు, వి.విష్ణుబాబు, తదితరులు పాల్గొన్నారు. -
మద్యం దుకాణాల లైసెన్స్ పునరుద్ధరణకు చర్యలు
కడప వైఎస్ఆర్ సర్కిల్: 2026–27 ఎకై ్సజ్ పాలసీలో భాగంగా జిల్లాలో మద్యం దుకాణాల లైసెన్సుల కేటాయింపునకు అధికారులు కసరత్తు పూర్తిచేశారు. 60కు పైగా మద్యం దుకాణాలకు దరఖాస్తులను స్వీకరించి, డ్రా ద్వారా లైసెన్స్‌లు మంజూరు చేయనున్నట్లు జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జె. రమేష్ తెలిపారు. శుక్రవారం కడప నగరంలోని ప్రకాష్ నగర్‌లోని జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ సూపరింటెంటెండ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొత్తం 60 మద్యం దుకాణాల్లో 57 దుకాణాలను జనరల్ కేటగిరీలో, మూడు దుకాణాలను గీత కూలాల కార్మికులకు కేటాయించినట్లు తెలిపారు. ఈ దుకాణాలకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అనంతరం లాటరీ ద్వారా లైసెన్సుదారులను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా నిబంధనల మేరకు డ్రా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. జిల్లా ఎకై ్సజ్ పరిధిలోని గీత కులాల కార్మికులకు మూడు దుకాణాలను ఉన్నాయని వాటిలో వీరపునాయునిపల్లె మండలంలో గౌండ్ల, పెద్దముడియం మండలం గౌడ్, చక్రాయపేట ఈడిగ కులాలకు కేటాయించినట్లు తెలిపారు.ఆన్లైన్ ద్వారా అక్టోబర్ 1వ తేదీ రాత్రి 12 గంటల వరకు దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. దరఖాస్తుదారులు ఒకటి కంటే ఎక్కువ మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని, ఒక్కో దుకాణానికి దరఖాస్తు రుసుము కింద రూ.3 లక్షలు, ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.1,000 చెల్లించాల్సి ఉంటుందన్నారు. అక్టోబరు 3న దరఖాస్తుల పరిశీలన, 5న కొత్త కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సమక్షంలో డ్రా తీస్తామన్నారు. అర్హులైన వారికి డ్రా ద్వారా దుకాణాలను కేటాయిస్తామన్నారు. మద్యం దుకాణాల ఎంపిక ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఆసిస్టెంట్ సూపరింటెండ్ సోమయ్య పాల్గొన్నారు. 60 మద్యం దుకాణాల్లో 57 జనరల్, 3 గీత కార్మికులకు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జె. రమేష్ -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బద్వేలువాసుల దుర్మరణం
బద్వేలు అర్బన్: కర్నూలు జిల్లా ఓర్వకల్లు సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కడప జిల్లా బద్వేలుకు చెందిన ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. హైదరాబాద్ నుంచి బద్వేలుకు వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుక నుండి బలంగా ఢీకొనడంతో ఈ విషాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పెరుమాళ్ళ పోలయ్య (56), కత్తి రామాంజనేయులు అలియాస్ నాని (19) మరణించారు. బద్వేలు ఆంజనేయనగర్‌కు చెందిన బియ్యం వ్యాపారి పోలయ్య పని నిమిత్తం హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలైన ఆయన్ను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ కన్నుమూశారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా, జ్యోతిబసు కాలనీకి చెందిన నాని ఆటో నడుపుతూ జీవించేవాడు. ప్రమాదానికి గురైన బస్సుకు ఇతని తండ్రి డ్రైవర్‌గా చేస్తుండటంతో, నాని కూడా కొద్దిరోజులుగా క్లీనర్‌గా వెళ్తున్నాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయమై నాని అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామమైన ప్రకాశం జిల్లా దర్శికి తరలించారు. -
పులివెందుల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు
పులివెందుల టౌన్ : పులివెందులలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు తనిఖీ నిర్వహించారు. 2018లో కార్యాలయంలో జరిగిన ఏసీబీ దాడులకు సంబంధించిన కేసు ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణకు రావడంతో, అందులో నమోదైన అభియోగాలపై అధికారులు వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. 2018లో పులివెందుల సబ్ రిజిస్ట్రార్‌గా బాలాజీ, సీనియర్ అసిస్టెంట్‌గా దస్తగిరి పనిచేస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు కార్యాలయంలో దాడులు నిర్వహించారు. అప్పట్లో కార్యాలయంలోని అధికారులు, డాక్యుమెంట్ రైటర్ల నుంచి సుమారు రూ.1.17 లక్షల నగదును స్వాధీనం చేసుకుని పలువురిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ కేసు కోర్టు విచారణ దశకు రావడంతో కేసులో ఉన్న సంబంధిత అధికారులు, డాక్యుమెంట్ రైటర్లను ఏసీబీ అధికారులు పిలిపించి వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం. అనంతరం 2018లో రిజిస్ట్రేషన్న్ చేసిన పత్రాలను పరిశీలించారు. తనిఖీల సమయంలో అప్పట్లో పనిచేసిన బాలాజి, దస్తగిరి కూడా అక్కడ ఉన్నట్లు తెలిసింది. -
ప్రత్యేక అధికారుల నియామకం
కడప సెవెన్‌రోడ్స్ : జిల్లాలోని 39 మండల ప్రజాపరిషత్‌లకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ప్రొసీడింగ్స్ జారీ చేశారు. ఆరు నెలలు లేదా మండల పరిషత్‌లకు ఎన్నికలు జరిగి కొత్త సభ్యులు కొలువుదీరే వరకు వీరు కొనసాగుతారు. ఆ వివరాలిలా ఉన్నాయి. మండలం ప్రత్యేక అఽధికారి పేరు అట్లూరు అహ్మద్ మోహిద్దీన్ బి.కోడూరు బి.అనూరాధ బి.మఠం నాగయ్య బద్వేలు విజయలక్ష్మి సీకే దిన్నె చాన్‌బాష చక్రాయపేట నరేంద్ర చాపాడు బ్రహ్మనందరెడ్డి చెన్నూరు పరిమళజ్యోతి దువ్వూరు రవిచంద్రబాబు గోపవరం శ్రీనివాసమూర్తి జమ్మలమడుగు వెంకటేశ్వర్లు కలసపాడు రమేష్‌కుమార్ కమలాపురం శేషగిరి ఖాజీపేట ప్రసాద్‌రావు కొండాపురం జాన్ ఇర్విన్ లింగాల వెంకట సుబ్బయ్య ముద్దనూరు రఘురామ్ మైదుకూరు చింతామణి మైలవరం శివకుమారి పెద్దముడియం రామశివదీక్షిత్ పెండ్లిమర్రి శంకర్‌బాలాజీ పోరుమామిళ్ల రాజరత్నం ప్రొద్దుటూరు కృష్ణ పులివెందుల రమాదేవి రాజుపాలెం సుబ్రమణేశ్వరరావు కాశినాయన వేణు సిద్దవటం కృష్ణయ్య సింహాద్రిపురం మురళీధర్‌రెడ్డి తొండూరు హరిప్రసాద్ వల్లూరు కృష్ణకిశోర్ వీఎన్ పల్లె బీవీ రెడ్డి వేంపల్లె నాగసుధ వేముల శ్రీనివాసులు ఒంటిమట్ట చంద్రశేఖర్‌రెడ్డి ఎర్రగుంట్ల సురేష్‌కుమార్ రాజంపేట భరత్‌కుమార్ నందలూరు సుబ్బారెడ్డి వీరబల్లి రామిరెడ్డి సుండుపల్లె చిన్నారావు -
వైవీయూ జర్నలిజం కోర్సులో ప్రవేశాలు
కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయం(వైవీయూ)లో రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ జర్నలిజం (ఎంఏ) కోర్సుకు సంబంధించిన ప్రవేశాలు మొదలైనట్లు కోర్స్ కో–ఆర్డినేటర్, జర్నలిజం శాఖ విభాగాధిపతి తమ్మినేని శ్యామ్ స్వరూప్ తెలిపారు. ఏపీ పీజీ సెట్లో జర్నలిజం కోర్స్‌కు నమోదు చేసుకుని ర్యాంకు సాధించిన వారు వైవీయూలో ఆప్షన్స్ ఇచ్చి కోర్సులో చేరవచ్చని తెలిపారు. ఏ డిగ్రీ అర్హత ఉన్నా జర్నలిజం కోర్సులో అడ్మిషన్ పొందవచ్చన్నారు. మరిన్ని వివరాలకు 8008006630, 9640895256 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు. వైఎస్సార్సీపీలో నూతన నియామకం కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన దిగువ పేర్కొన్న వారిని వివిధ హోదాలలో నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం కార్యదర్శిగా పి. జోగయ్య, రాష్ట్ర చేనేత విభాగం కార్యదర్శిగా పుల్లగూర ఉపేంద్ర(మైదుకూరు), జిల్లా ఐటీ విభాగం అధ్యక్షుడిగా డి.యు కిరణ్ కుమార్‌రెడ్డి(పులివెందుల), జిల్లా అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలిగా రాచమల్లు రమాదేవి,జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా బీరం రాఘవేంద్రరెడ్డి, జిల్లా వైఎస్సార్టీయూసీ అధికార ప్రతినిధిగా వై. ప్రసన్న కుమార్ (ప్రొద్దుటూరు)లను నియమించారు. జెడ్పీ ప్రత్యేకాధికారిగా కలెక్టర్ బాధ్యతలు కడప సెవెన్‌రోడ్స్ : జిల్లా పరిషత్ పాలకవర్గం పదవీకాలం ఇటీవల ముగిసిన నేపథ్యంలో జిల్లా పరిషత్ ప్రత్యేకాధికారిగా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు జిల్లా పరిషత్‌లకు ప్రత్యేకాధికారులను నియమించగా, కడప జెడ్పీ ప్రత్యేకాధికారిగా జిల్లా కలెక్టర్ బాధ్యతలు చేపట్టారు. జిల్లా పరిషత్ కార్యాలయానికి చేరుకున్న కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరికి జెడ్పీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి సుబ్రహ్మణ్యం, అధికారులు, ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జెడ్పీ ప్రత్యేకాధికారిగా బాధ్యతలు చేపట్టిన శ్రీధర్ చెరుకూరి జిల్లా పరిషత్ కు సంబంధించి పలు అంశాలపై జెడ్పీ సీఈఓ తో చర్చించారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలను ప్రణాళిక ప్రకారం చేపట్టాలని, ప్రతి ఒక్కరూ ఎన్నికల విధులను పారదర్శకంగా నిర్వహించేందుకు బా ధ్యతగా పనిచేయాలని ఎన్నికల విధులకు కేటాయించిన డాక్టర్ శ్రీధర్ సూచించారు. అదే సమయంలో ఎంపీపీల పదవీకాలం కూడా ముగియడంతో వారి స్థానంలో అన్ని మండలాలకు ప్రత్యేక అధికారులను కూడా నియమించారు. -
నందలూరులో క్రూషియల్ సెంటర్
● రూ.6 కోట్లతో 50 పడకల ఆధునిక భవన నిర్మాణానికి టెండర్లు పూర్తి ● మెరుగైన సౌకర్యాలతో క్రూ సెంటర్‌కు కొత్త శోభ ● బ్రిటిషు కాలం నాటి రన్నింగ్ రూమ్‌కు మంగళం రాజంపేట: ఉమ్మడి కడప జిల్లాలో రైల్వేపరంగా ఎంతో ప్రసిద్ధి చెందిన నందలూరు రైల్వే కేంద్రంలో ఆధునిక సౌకర్యాలతో కూడిన నవీన రన్నింగ్ రూమ్ నిర్మాణానికి రైల్వే శాఖ శ్రీకారం చుట్టింది. శతాబ్దాల చరిత్ర కలిగిన బ్రిటీష్ కాలం నాటి పాత రన్నింగ్ రూమ్‌కు మంగళం పాడుతూ.. లోకో పైలట్లు, గార్డులు విశ్రాంతి కోసం సరికొత్త హంగులతో ఈ నూతన భవనాన్ని నిర్మించనున్నారు. 2024 రైల్వే బడ్జెట్లో ఈ పనులకు రూ.3.35 కోట్ల నిధులు కేటాయించగా, ఇప్పుడు గుంతకల్ డివిజన్ రైల్వే ఉన్నతాధికారులు నిర్మాణ కార్యాచరణను వేగవంతం చేశారు. పాత పీడబ్ల్యూఐ స్థలం ఎంపిక ఈ నవీన రన్నింగ్ రూమ్ నిర్మాణం కోసం రైల్వే ఉన్నతాధికారులు నాగిరెడ్డిపల్లె రైల్వే కాలనీలోని పాత రైల్వే హాస్పిటల్ స్థలంతో పాటు పలు ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే, నిరంతరం విధుల్లో ఉండి అలసిపోయే లోకో పైలట్లు, అసిస్టెంట్ లోకో పైలట్లకు ఎటువంటి ఆటంకం లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో తగిన విశ్రాంతి లభించేలా ఈ భవనం ఉండాలని అధికారులు భావించారు. ఆ దిశగా అన్ని రకాలుగా అనుకూలంగా ఉండి, రైల్వే స్టేషన్‌కు అత్యంత సమీపంలో ఉన్న పాత పీడబ్ల్యూఐ స్థలాన్ని ఈ నవీన రన్నింగ్ రూమ్ నిర్మాణం కోసం తుది ఎంపిక చేశారు. రూ.6 కోట్లతో నూతన భవనాలు నందలూరు నవీన రన్నింగ్ రూమ్ నిర్మాణంతో పాటు రాజంపేట రైల్వేస్టేషన్లో ఆర్పీఎఫ్ అవుట్‌పోస్ట్ భవన నిర్మాణాన్ని కలిపి దాదాపు రూ.6 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి గుంతకల్ రైల్వే డివిజన్ ఉన్నతాధికారులు ఇప్పటికే అధికారికంగా టెండర్లను పిలిచారు. టెండర్ దక్కించుకోనున్న కాంట్రాక్ట్ సంస్థకు ఏడాది కాల పరిమితిని గడువుగా పెట్టినట్లు సమాచారం. గతంలో ఇండియన్ రైల్వేలోనే ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఏసీ రన్నింగ్ రూమ్ కోసం నిధులు మంజూరైనా.. ఆ ప్రతిపాదనను పక్కనపెట్టి, ఇప్పుడు ఈ సరికొత్త శాశ్వత భవన నిర్మాణానికి సిద్ధమయ్యారు. ప్రాథమికంగా 50 పడకలతో ప్రారంభమై, భవిష్యత్తు అవసరాలను బట్టి దీనిని వంద పడకల రన్నింగ్ రూమ్‌గా విస్తరించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 105 ఏళ్ల చారిత్రక రన్నింగ్ రూమ్ జ్ఞాపకాలు నందలూరు రైల్వే రన్నింగ్ రూమ్‌కు 105 ఏళ్ల ఘనమైన చరిత్ర ఉంది. 1920వ సంవత్సరంలో అప్పటి బ్రిటిషు రైల్వే పాలకులు ఇక్కడి స్టీమ్ లోకో ఇంజన్ల డ్రైవర్లు, ఫైర్‌మెన్‌ల విశ్రాంతి కోసం ఈ రన్నింగ్ రూమ్‌ను నిర్మించారు. అప్పట్లో ఇక్కడ 25 వరకు స్టీమ్ లోకో ఇంజన్లు అందుబాటులో ఉండేవి. ఆ కాలంలో నందలూరు రైల్వే కేంద్రం సదరన్ రైల్వే పరిధిలో ఉండటం వల్ల అరక్కోణం నుంచి నందలూరు వరకు రైల్వే క్రూ రాకపోకలు సాగించేవారు. అరక్కోణం నుంచి వచ్చే తమిళ రైల్వే సిబ్బంది ఇక్కడే స్థిరపడటం వల్లనే, నందలూరు స్టేషన్‌కు అత్యంత సమీపంలో ‘అరవపల్లె’ అనే చారిత్రక గ్రామం ఆవిర్భవించింది. నిత్యం లోకో పైలట్లు, అసిస్టెంట్ లోకో పైలట్లు, గార్డులు మార్పిడి జరిగే ఈ క్రూ సెంటర్‌కు, నవీన రన్నింగ్ రూమ్ నిర్మాణంతో సరికొత్త శోభ చేకూరనుంది. ఎర్రగంట్ల కష్టాలకు చెల్లుఒకానొక దశలో ఎర్రగుంట్లలో క్రూ సెంటర్ ఏర్పాటు చేసి, నందలూరు రన్నింగ్ క్రూ సెంటర్‌ను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు ఓ రైల్వే ఉన్నతాధికారి తీవ్ర వ్యూహం రచించారు. అయితే ఎర్రగుంట్ల నుంచి పనిచేయడానికి లోకో పైలట్లు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. అక్కడ వాతావరణం సరిపడక కొంతమంది సిబ్బంది ఊపిరితిత్తుల వ్యాధుల బారిన పడి ఇతర డిపార్టుమెంట్లకు మారిపోయారు. అయితే ఇప్పుడు నందలూరులో నూతన విశ్రాంతి భవనం రానుండటంతో వారి కష్టాలకు చెల్లుచీటీ పాడినట్లయింది. నందలూరు రైల్వే రన్నింగ్‌స్టాప్ క్రూ కుదింపు వ్యవహారంపై రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి గట్టిగా పోరాడారు. కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌ను అనేకమార్లు కలిసి ఇక్కడి సమస్యలను వివరించారు. నందలూరు రైల్వే పూర్వవైభవం కోసం లోక్‌సభలో సైతం ఆయన గళమెత్తిన తర్వాత నుంచే రైల్వేశాఖ ఇక్కడ మెరుగైన వసతులు కల్పించే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. -
మృత్యువులోనూ వీడని స్నేహ బంధం
వేంపల్లె/యాదమరి : అతివేగం..అజాగ్రత్త డ్రైవింగ్ ఇద్దరు స్నేహితుల ప్రాణాలను బలితీసుకుంది. రహదారిపై మృత్యువు రూపంలో దూసుకొచ్చిన టాటా ఏస్ వాహనం ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొనడంతో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. చిత్తూరు జిల్లా యాదమరి మండలంలో బుధవారం అర్థరాత్రి సమయంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. స్థానిక ఎస్సై ఈశ్వర్ కథనం మేరకు..వైఎస్సార్ కడప జిల్లా వేంపల్లె మండలం నాగూరు గ్రామానికి చెందిన నాగేళ్ల రామచంద్రారెడ్డి కుమారుడు రాంప్రసాద్‌రెడ్డి(21) ముత్తిరేవుల సమీపంలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం రాత్రి రాంప్రసాద్ తన స్నేహితుడైన చిత్తూరు పెద్ద హరిజనవాడకు చెందిన సురేష్ కుమారుడు ధనుష్(21)తో కలసి ద్విచక్రవాహనంలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్లారు. అక్కడ నుంచి పని ముగించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో మండల పరిధి వరిగపల్లి జంక్షన్ వద్ద ఉన్న సర్వీసు రోడ్డులో ఎదురుగా వస్తున్న వీరి వాహనాన్ని టాటా ఏస్ డీకొంది. ఈ ప్రమాదంలో రాంప్రసాద్‌రెడ్డి తీవ్ర గాయాలతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటన స్థలికి చేరుకున్నారు. తీవ్ర రక్తగాయాలతో మృత్యువుతో పోరాడుతున్న ధనుష్‌ను 108 అంబులెన్సు ద్వారా చితూరు ప్రభుత్వాసుపత్రికి తరలిలించారు. అయితే అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఇంజినీరింగ్ చదివి గొప్ప వాడై తమకు అండగా నిలుస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకున్న రాంప్రసాద్ ఆసుపత్రిలో విగతిజీవిగా ఉండటాన్ని చూసి కుటుంబసభ్యులు రోదనలు మిన్నంటాయి. ఎస్సై ఈశ్వర్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు పరిమిత వేగంతో ప్రయాణించాలని, రహదారి భద్రతా నియమాలు విధిగా పాటించి ప్రమాదాల బారీన పడకుండా విలువైన ప్రాణాలు కాపాడుకోవాలని ఎస్సై సూచించారు.రాంప్రసాద్‌రెడ్డి(ఫైల్) ధనుష్(ఫైల్)ద్విచక్ర వాహనాన్ని డీకొని ఇద్దరు యువకులు దుర్మరణం -
డెర్మటాలజిస్ట్ అవుతా
కడప ఎడ్యుకేషన్ : నీట్పీజీలో కడపకు చెందిన కాంట్రాక్టర్ శ్యామల సాయి శ్రీధర్‌రెడ్డి, గృహిణి గౌరీదేవిల కుమార్తె జతీషరెడ్డి 1239వ ర్యాంకు సాధించింది. జతీషరెడ్డి 1 నుంచి 5వ తరగతి వరకు ఆర్టీపీపీలో చదివింది. 6,7 తరగతులను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో, 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విజయవాడలోని శ్రీ చైతన్య స్కూల్, జూనియర్ కళాశాలలో చదివింది. ఇంటర్లో 970 మార్కులు సాధించింది. నీట్లో జాతీయస్థాయిలో 27 వేల ర్యాంకు సాధించి ఒంగోలు రిమ్స్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ప్రస్తుతం నీట్పీజీలో 1239వ ర్యాంకు సాధించింది. డెర్మటాలజీ చేయడమే ఆశయమని జతీషరెడ్డి తెలిపారు. -
డీసీసీబీలో ఉద్యోగాలకు నేడు ప్రవేశ పరీక్ష
జిల్లావ్యాప్తంగా 63 పోస్టులకు 4821 మంది దరఖాస్తు కడప అగ్రికల్చర్: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీ)లో ఉద్యోగ ఖాళీల భర్తీకి శుక్రవారం ఆన్లైన్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఇందుకోసం నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వకు, 11.30 నుంచి 1.30 వరకు, సాయంత్రం 3.30 నుంచి 5.30 వరకు మూడు విడతల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. డీసీసీ బ్యాంకులో మొత్తం 63 పోస్టులకు సంబంధించి జులై నెలలో ప్రభుత్వం నోటిఫికేషన్‌ను విడుదల చేయగా ఇందులో 23 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులుకాగా మరో 40 స్టాప్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల కోసం జిల్లావ్యాప్తంగా 4821 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష రాసే అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉండటంతో వీరి కోసం వైఎస్సార్జిల్లాలోతోపాటు పొరుగు జిల్లాలైన కర్నూల్, నంద్యాల, తాడిపత్రిల్లో కూడా పరీక్షా కేంద్రాలను కేటాయించారు. అభ్యర్థులు నిర్ణయించిన సమయంలోపు హాజరుకావాలని.. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు ఆనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. -
మొక్కలు విరివిగా నాటాలి
కడప ఎడ్యుకేషన్ : పర్యావరణ పరిరక్షణలో భాగంగా పరిశ్రమ ప్రాంగణాల్లో మొక్కలను విరివిగా నాటాలని, పచ్చదనాన్ని మరింతగా పెంచాలని ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఈఎంసీఎల్) చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి పరిశ్రమల అధికారులను ఆదేశించారు. వైఎస్ఆర్ కడప జిల్లాలోని భారతి సిమెంట్ పరిశ్రమను, ముద్దనూరు మండలం జీఎం ఎకో సర్వీసెస్ ఎల్ఎల్పీ పరిశ్రమలను ఆయన గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా భారతి సిమెంట్ పరిశ్రమలోని హానికర వ్యర్థాల సహ–ప్రాసెసింగ్ యూనిట్‌ను పరిశీలించారు. హానికర వ్యర్థాలను నిర్దేశిత నిబంధనలకు అనుగుణంగా చట్టబద్ధంగా సహ–ప్రాసెసింగ్ చేస్తున్నారా లేదా అనే అంశాన్ని ధృవీకరించారు. అలాగే రికార్డులు, వ్యర్థాల నిర్వహణ విధానాలను పరిశీలించారు. దీంతోపాటు ముద్దనూరు మండలంలోని జీఎం ఎకో సర్వీస్ ఎల్ఎల్పిలోని హానికర వ్యర్థాల ప్రీ–ప్రాసెసింగ్ యూనిట్‌ను సందర్శించారు. ప్రీ–ప్రాసెస్ చేసిన హానికర వ్యర్థాలను నిబంధనలకు అనుగుణంగా.. చట్టబద్ధంగా అనుమతించిన సిమెంట్ పరిశ్రమలకు పంపిస్తున్నారా లేదా అనే అంశాన్ని పరిశీలిం చారు. 26 నుంచి ఎస్జీఎఫ్ జిల్లా స్థాయి ఎంపికలుకడప వైఎస్ఆర్ సర్కిల్ : ఈనెల 26 నుంచి అక్టోబర్ 2 వరకు జిల్లాలోని వివిధ క్రీడా మైదానా ల్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) అండర్–19 జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఎస్జీఎఫ్ అండర్–19 జిల్లా కార్యదర్శి మురళీకృష్ణారెడ్డి తెలిపారు. ఈ ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు 2007 జనవరి 1 తర్వాత జన్మించి ఉండాలన్నారు. ప్రతి విద్యార్ది రెండు లేదా మూడు క్రీడల్లో మాత్రమే పాల్గొనాల్సి ఉంటుందన్నారు. హాజరయ్యే వారు సంబంధిత మైదానాలకు ఉదయం 9 గంటలకు కల్లా హాజరుకావాలన్నారు. -
రేడియాలజీ చేస్తా
కడప ఎడ్యుకే షన్ : నీట్ పీజీ పరీక్షా ఫలితాల్లో కడపకు చెందిన ఆవుల ప్రత్యూష 562 మార్కులు సాధించి 1450వ ర్యాంక్ సాధించింది. కడప నగరం చిన్నాచౌక్ ఎస్ ఆర్ నగర్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆవుల ఏరికలయ్య, గృహిణి సుభాషిణి దంపతులకు మొదటి కుమార్తె డాక్టర్. ప్రత్యూష. ఈమె 1 నుంచి 10వ తరగతి వరకు కడప నారాయణ ఒలింపియాడ్ స్కూల్లో చదివింది. పదవ తరగతిలో 9.7 పాయింట్లు సాధించింది. ఇంటర్ విజయవాడ నారాయణ కాలేజీలో చదివి 976 మార్కులు సాధించింది. తరువాత నీట్లో ఆల్ ఇండియా స్థాయిలో 11 వేల ర్యాంకు సాధించి తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ఈ సందర్భంగా ప్రత్యూష మాట్లాడుతూ పీజీలో రేడియాలజీ లేదా డెర్మటాలజిస్ట్ కావాలనేదే లక్ష్యమని తెలిపారు. -
భక్తిశ్రద్ధలతో పవిత్రోత్సవం
కడప సిటీ : దేవునికడపలోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా గురువారం వివిధ పూజాధి కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా పవిత్ర సమర్పణ, హోమాలు నిర్వహించారు. యాగశాలలో శాస్త్రోక్తంగా హోమాలు, జపాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఉత్సవ మూర్తులను ఊరేగించారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే నిత్య పూజలు, ఉత్సవాల్లో భక్తులు, అర్చకుల ద్వారా తెలిసి తెలియక జరిగే లోపాలు, అపచారాలు ఉంటాయి. అశౌచ దోషాల నివారణకు ఈ పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. శుక్రవారం పూర్ణాహుతి, చక్రస్నానం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దీంతో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. -
బతుకుతెరువుకు వెళ్లి.. తిరిగిరాని లోకాలకు
● ఒకే వీధికి చెందిన ఇద్దరిని బలిగొన్న రోడ్డు ప్రమాదం ● కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులుప్రొద్దుటూరు క్రైం : బతుకుబండి లాగేందుకు నిత్యం శ్రమించే ఆ ఇద్దరూ గురువారం కూడా తమ పనిమీద బయలుదేరారు. రాళ్లను ట్రాక్టర్లో తీసుకెళ్లి విక్రయించి తిరిగి వస్తారనుకున్న కుటుంబ సభ్యులకు అంతలోనే తీరని విషాదం ఎదురైంది. బద్వేల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రొద్దుటూరు మండలంలోని చౌడూరు గ్రామానికి చెందిన పట్నం భాస్కర్, తలసరి రమణయ్య దుర్మరణం చెందడంతో ఆ గ్రామంలో విషాదం అలుముకుంది. ఒకే వీధిలో నివసించే ఇద్దరూ ఒకే ప్రమాదంలో మృత్యువాత పడటంతో వారి కుటుంబాలు కన్నీరుమున్నీరయ్యాయి. పట్నం భాస్కర్‌కు గ్రామ శివారులో ఎకరం చౌడు భూమి ఉంది. సొంతంగా ట్రాక్టర్ ఉండటంతో సమీపంలోని గనుల నుంచి రాళ్లను తీసుకెళ్లి ఇతర ప్రాంతాల్లో విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సాధారణంగా రాళ్లను విక్రయించేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు తనతో పాటు అదే వీధిలో నివసించే రమణ్యను కూడా తీసుకెళ్లేవాడు. ఎప్పటిలాగే గురువారం కూడా రమణయ్యను వెంటబెట్టుకొని రాళ్ల లోడుతో బద్వేల్ వైపు బయలుదేరాడు. అయితే మార్గంమధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాలు భాస్కర్ మృతితో భార్య మునిలక్షుమ్మ, కుమారుడు వెంకటపవన్, కుమార్తె వెంకటసువర్ణ విషాదంలో మునిగిపోయారు. కుమార్తెకు ఇప్పటికే వివాహం కాగా, కుమారుడు పవన్ గ్రామంలోనే నెట్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. కుటుంబానికి ఆధారంగా ఉన్న భాస్కర్ ఒక్కసారిగా దూరం కావడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మరోవైపు రమణయ్య మృతితో భార్య రాజ్యలక్ష్మి, కుమారుడు వెంకటశివుడు, కుమార్తె శివలలిత తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పిల్లలిద్దరికీ వివాహాలు కావడంతో వారి కుటుంబ బాధ్యతలు కొంత తీరిన సమయంలో రమణయ్య మృత్యువాత పడటం కుటుంబ సభ్యులను తీవ్రంగా కలచివేసింది. చౌడూరులో విషాదచాయలు.. ఒకే వీధిలో నివసిస్తూ, బతుకుతెరువు కోసం కలసి ప్రయాణించే ఇద్దరూ ఇక లేరన్న వార్త చౌడూరు గ్రామస్తులను, మృతుల సన్నిహితులను కలచివేసింది. పోస్టుమార్టం అనంతరం గురువారం సాయంత్రం ఇరువురి మృతదేహాలను గ్రామానికి తీసుకురావడంతో విషాద వాతావరణం నెలకొంది. తమతో కలిసి నిత్యం కనిపించే ఇద్దరు ఇక కనిపించరనే వాస్తవాన్ని జీర్ణించుకోలేక గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. బతుకుతెరువు కోసం బయలుదేరిన వారు తిరిగి రాకపోవడంతో రెండు కుటుంబాల్లో విషాదం మిగిలింది. ఇరువురిని కడసారి చూసేందుకు గ్రామస్తులంతా పెద్ద ఎత్తున తరలివచ్చారు. -
అరుణాచలానికి ప్రత్యేక సర్వీసు
కడప కోటిరెడ్డిసర్కిల్ : పరాభవ నామ సంవత్సర భాద్రపద పౌర్ణమి సందర్భంగా తమిళనాడులోని అరుణాచలానికి ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ కడప డిపో మేనేజర్ ఆర్సీ నిరంజన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 26వ తేది ఉదయం 9 గంటలకు కడప ఆర్టీసీ బస్టాండు నుంచి ఒక బస్సు, రాయచోటి బంగ్లా బస్టాండు నుంచి ఉదయం 10.15 గంటలకు మరో బస్సు బయలుదేరుతుందన్నారు. ఈ బస్సులో ఛార్జి కేవలం రూ. 1050గా నిర్ణయించారన్నారు. వివరాలకు 9959225774, 9494755057, 9440449559 నెంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు. జిల్లాలో విస్తారంగా వర్షాలు కడప అగ్రికల్చర్: అల్పపీడనం కారణంగా జిల్లాలో నాలుగు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఉద్యాన పంటలతోపాటు వ్యవసాయ పంటలు జీవం పోసుకున్నాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం తెల్లవారుజాము వరకు జిల్లావ్యాప్తంగా వర్షం కురిసింది. కొండాపురం మండలంలో అత్యధికంగా 32.6 మి.మీ వర్షం కురిసింది. అలాగే చెన్నూరు మండలంలో 31.2, సింహాద్రిపురంలో 25.2, పులివెందుల, జమ్మలమడుగులలో 17.6, ప్రొద్దుటూరులో 16.6, సిద్దవటంలో 15.6, చాపాడులో 14.4, వేంపల్లి, లింగాలలో 14, మైదుకూరులో 13, ఖాజీపేటలో 12.8, కడపలో 12.6, కాశినాయనలో 12.2, బి.మఠంలో 12, పెద్దముడియలో 11.8, తొండూరులో 10.4, ఒంటిమిట్ట, వల్లూరులలో 9.8 ,సికెదిన్నె 9.6, ముద్దనూరు, చక్రాయపేటలో 9.2, మైలవరంలో 9, వీఎన్‌పల్లిలో 8.8, కలసపాడులో 8.6, పోరుమామిళ్లలో 8.2, బద్వే ల్, వీరబల్లిలో 7.2, అట్లూరులో 6.4, నంద లూరులో 5.6, బి.కోడూరులో 5, రాజంపేటలో 4.6, కమలాపురంలో 4.4, గోపవరంలో 3.6, పెండ్లిమర్రి, టి. సుండుపల్లిలలో 3.2, వేములలో 3 మి.మీ వర్షం కురిసింది. 26న గెస్ట్ లెక్చరర్‌కు ఇంటర్వ్యూ ప్రొద్దుటూరు : స్థానిక ఎస్సీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ గెస్ట్ లెక్చరర్ పోస్టుకు ఈనెల 26న ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. పీజీ (ఎంసీఏ లేదా ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్)లో 55 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులు తమ బయోడేటాతో ఇంటర్వ్యూకు హాజరుకావాలని ఆయన సూచించారు. నేడు జిల్లాస్థాయి ఎంపికలు కడప ఎడ్యుకేషన్: కడప డీఎస్ఏ క్రీడా మైదానంలో శుక్రవారం ఉషూ, బాక్సింగ్, జూడో జిల్లాస్థాయి ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శులు విజయలక్ష్మి, నాగరాజురెడ్డి తెలిపారు. అలాగే చెన్నూరు మండలం రామనపల్లె బాలబాలికలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గట్కా అండర్ 17 ఎంపికలు జరుగుతాయని వివరించారు. క్రీడాకారులందరూ 25వ తేదీ ఉదయం 9 గంటలకు స్టడీ సర్టిఫికెట్, ఆధార్ కార్డుతో హాజరుకావాలని సూచించారు. వైవీయూలో పీజీ ప్రవేశాలు ప్రారంభం – ఈ నెల 29వరకు కొనసాగింపు కడప ఎడ్యుకేషన్: యోగివేమన విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రవేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ పీజీ సెట్)–2026 అర్హత సాధించిన విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. రామకృష్ణ పర్యవేక్షణలో విద్యార్థులకు సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించారు. మొదటి విడతలో 303 మంది విద్యార్థులు యోగి వేమన విశ్వవిద్యాలయ క్యాంపస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కళాశాలను కోరుకోగా వారికి తొలిరోజు వెరిఫికేషన్ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ అర్హత పత్రాల పరిశీలన ఈనెల 29వ తేదీ వర కు ఉంటుందని తెలిపారు. విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ అలాట్మెంట్ లెటర్ రెండు కాపీలు, అర్హత పత్రాల రెండు సెట్ల జిరాక్స్ కాపీలు, రెండు ఫొటోలు తీసుకురావాలన్నారు. అర్హత పత్రాల పరిశీలన కార్యక్రమంలో డీఓఏ అసోసియేట్ డైరెక్టర్లు, ప్రొఫెసర్ శ్రీధర్ రెడ్డి, ప్రొఫెసర్ రమేష్, డాక్టర్ మృత్యుంజయరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
‘హార్టికల్చర్ హబ్’గా తీర్చిదిద్దడమే లక్ష్యం
– కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి కడప సెవెన్‌రోడ్స్ : రాయలసీమ ప్రాంతాన్ని గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దే క్రమంలో వైఎస్ఆర్ కడప జిల్లాను ఉద్యాన పంటల సాగుకు ప్రధాన క్షేత్రంగా అభివృద్ధి చేయాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచడంతో పాటు నీటి వనరులను సమర్థంగా వినియోగించుకునే సూక్ష్మ నీటి సాగు విధానాలను విస్తృతంగా ప్రోత్సహించాలని ఆయన అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ఉద్యాన పంటల విస్తీర్ణం పెంపు, సూక్ష్మ నీటి సాగు విధానాల ప్రోత్సాహం, ఉద్యాన రంగ అభివృద్ధి తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టర్ ఛాంబర్ నుంచి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాయలసీమ సమగ్ర ఉద్యాన అభివద్ధి కార్యక్రమం కింద వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించి రూపొందించిన సమగ్ర ప్రణాళికను, ప్రస్తుతం ఉద్యాన సాగు విస్తీర్ణం పెంపు, సూక్ష్మ సేద్య సాగు విధానాల ప్రగతి, సంబందిత అంశాల్లో ప్రగతి గురించి సీఎం చంద్రబాబుకు కలెక్టర్ వివరించారు.ఉద్యాన శాఖ జిల్లా అధికారి హరిప్రసాద్, ఏపీ ఎంఐపీ పీడీ బి.వి. రమణ పాల్గొన్నారు. -
వైద్యాధికారులు సేవా నైపుణ్యాలు పెంపొందించుకోవాలి
కడప రూరల్ : వైద్యాధికారులు ప్రజాసేవ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ యుగంధర్, ఐజీఓటీ కర్మయోగి జిల్లా నోడల్ అధికారి డాక్టర్ హీరేందర్ అన్నారు. గురువారం స్థానిక జిల్లా కార్యాలయంలో కర్మయోగి కార్యక్రమం పై వైద్యాధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల జ్ఞానం, నైపుణ్యాలు, సామర్థ్యాలు, పరిపాలనా దక్షత, ప్రజాసేవా నైపుణ్యాలను పెంపొందించడం కర్మయోగి కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అన్నారు. ఉద్యోగులు తమ విధులకు సంబంధించిన వివిధ అంశాలపై నిరంతరం శిక్షణ పొందడంతో పాటు, ప్రభుత్వ కార్యక్రమాలు, పరిపాలనా విధానాలు, నాయకత్వ నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహనను పెంచుకోవచ్చు అని తెలిపారు. నేడు నులిపురుగుల దినోత్సవం అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ యుగంధర్ శుక్రవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించే జాతీయ నులిపురుగుల దినోత్సవం పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 2744 అంగన్వాడీ సెంటర్లలో, 2832 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కాలేజీల్లో 5,31,354 మంది బాల బాలికలను గుర్తించినట్లు చెప్పారు. 1 నుంచి 19 సంవత్సరాల పిల్లలందరికీ నులిపురుగుల నివారణ మాత్రలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ అంధత్వ నియంత్రణ కార్యక్రమ సంయుక్త సంచాలకులు డాక్టర్ సునీల్ కుమార్ నాయక్ మాట్లాడుతూ ప్రతి స్కూల్లో పిల్లలకు చేతులశుభ్రత, వ్యక్తిగత శుభ్రత, గురించి అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఐఓ డాక్టర్ ప్రవీణ్ కుమార్, ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ మహమ్మద్ తాహా, ఆర్బీఎస్కే ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ అరిఫుల్లా, డెమో భారతి, డిప్యూటీ డెమో కుమారి తదితరులు పాల్గొన్నారు. -
పేదలకు ఉత్తమ వైద్యసేవలందిస్తా
చాపాడు : నీట్ పీజీ పరీక్షా ఫలితాల్లో మండల పరిధిలోని గుంతచీపాడు గ్రామానికి చెందిన ధనిరెడ్డి వెంకట వరుణేశ్వర్‌రెడ్డి జాతీయ స్థాయిలో 6363వ ర్యాంక్ సాధించాడు. గత ఏడాది కర్నూలులోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. ఈ ఏడాది జరిగిన పీజీ నీట్ పరీక్షలో 525 మార్కులు సాధించాడు. వరుణేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ జనరల్ మెడిసిన్ పూర్తి చేసి పేద ప్రజలకు ఉత్తమ వైద్య సేవలు అందించడమే లక్ష్యమని తెలిపాడు. ఇదే సంకల్పంతో చదివినట్లు విద్యార్థి తల్లిదండ్రులు రామలక్ష్మిరెడ్డి, ఉమామహేశ్వరి తెలిపారు. రైతు కుటుంబంలో పుట్టిన వెంకట వరుణేశ్వర్‌రెడ్డి చదువులో ప్రతిభ చాటుతూ నీట్ పీజీలో సీట్ సాధించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. -
పవిత్రోత్సవాలకు అంకురార్పణ
కడప సిటీ : తిరుమల తొలిగడప దేవునికడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలకు బుధవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. ఇందులో భాగంగా సాయంత్రం 6 గంటలకు విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మృత్సంగ్రాహణం నిర్వహించారు. గురువారం చతుష్ఠార్చన, యాగశాలపూజ, పవిత్ర ప్రతిష్ఠ నిత్య హోమం నిర్వహిస్తారు. శుక్రవారం పవిత్ర సమర్పణ, హోమం నిర్వహించనున్నారు. శనివారం మహా పూర్ణాహుతి, పవిత్ర వితరణ తదితర కార్యక్రమాలు జరుగనున్నాయి. ఆలయంలో స్వామి, అమ్మవార్లను ఊరేగించనున్నారు. వేడుకగా శ్రీ వెంకటేశ్వరుని కల్యాణం దేవునికడపలోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రవణా నక్షత్రం సందర్భంగా బుధవారం స్వామి, అమ్మవార్ల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామి, అమ్మవార్ల కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై కల్యాణ క్రతువును తిలకించారు. ఆలయ ఇన్స్పెక్టర్ ఈశ్వర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
మోటార్ కేబుల్ వైర్లు చోరీ
లింగాల : మండలంలోని చిన్నకుడాల గ్రామంలో వ్యవసాయ విద్యుత్ మోటార్ల కేబుల్ వైర్లను మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకపోయారు. గ్రామానికి చెందిన శివనారాయణరెడ్డి అనే రైతుకు చెందిన 250మీటర్ల కేబుల్ వైర్లను ఎత్తుకెళ్లారు. దీని విలువ రూ.2లక్షలు ఉంటుందని రైతు వాపోతున్నాడు. నాగేంద్రనాథరెడ్డి, శంకర్‌రెడ్డి తది తర 8 మంది రైతులకు చెందిన కేబుల్ వైర్లను అపహరించుకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై లింగాల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని రైతులు తెలిపారు. ఎస్జీఎఫ్ అండర్–19 సెక్రటరీగా మురళీకృష్ణారెడ్డి కడప వైఎస్ఆర్ సర్కిల్ : వైఎస్సార్ కడప ఎస్జీఎఫ్ అండర్–19 సెక్రటరీగా డాక్టర్ పి.మురళీ కృష్ణారెడ్డిని కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నియమించారు. బుధవారం కడప నగరంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్ , ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ జి ఎఫ్ క్రీడలు వివరాలు, క్రీడలు నిర్వహించే మైదానాల గురించి చర్చించారు. ఈ సమావేశంలో ఇంటర్మీడియట్ బోర్డ్ డివి ఈవో ప్రకాష్ పట్నాయక్, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సూర్యారావు, ఫిజికల్ డైరెక్టర్లు నాగేశ్వర్ రెడ్డి, పోలంకి గణేష్ బాబు పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. యువకుడిపై కత్తితో దాడి మదనపల్లె టౌన్ : భూ వివాదంలో జరిగిన ఘర్షణలో ఓ యువకుడిని ప్రత్యర్థులు కత్తితో దాడి చేసి గాయపరిచారు. బుధవారం మదనపల్లి మండలంలో జరిగిన ఘటనపై బాధితుడు తాలూకా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు.. మండలంలోని కొత్తవారిపల్లె పంచాయతీ రెడ్డివారిపల్లికు చెందిన మణి (36) అదే గ్రామానికి చెందిన హరీష్‌కు కొంతకాలంగా భూ వివాదం నడుస్తోందని తెలిపారు. ఈ క్రమంలో పొలం వద్దకు వెళ్లి ఇంటికి వస్తున్న మణిని గ్రామానికి సమీపంలో అడ్డగించి కత్తితో దాడి చేసి గాయపరిచినట్లు బాధితుడు ఆరోపించారు. హరీష్ దాడిలో గాయపడిన బాధితుడిని కుటుంబీకులు చికిత్స కోసం స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు అందించడంతో కోలుకుంటున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
తెలుగు భాషా సాహిత్యాలకు వేదికగా ‘బ్రౌన్’ గ్రంథాలయం
కడప ఎడ్యుకేషన్ : తెలుగు భాషా సాహిత్యాలకు వేదికగా సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సేవలందించేలా రూపుదిద్దుతామని జిల్లా కలెక్టర్, సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సలహామండలి చీఫ్ ప్యాట్రన్ డా. చెరుకూరి శ్రీధర్ పేర్కొన్నారు. వైవీయూ ఆధ్వర్యంలోని సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో బుధవారం బ్రౌన్‌శాస్త్రి సమావేశ మందిరంలో సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సలహామండలి సమావేశాన్ని నిర్వహించింది. ముందుగా జిల్లా కలెక్టర్ శ్రీధర్, వైవీయూ ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ సలహామండలి సభ్యులు నూతన భవన నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శ్రీధర్, వైవీయూ ఉపకులపతి, సలహామండలి ఛైర్మన్ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్, సలహామండలి సభ్యులు ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి, ఆచార్య పి.సి.వెంకటేశ్వర్లు, డా. రావి శారద, డా. మన్నం వెంకటరాయుడు, సన్నపరెడ్డి వెంకటరామిరెడ్డి, జానమద్ది విజయ భాస్కర్, సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సంచాలకులు మరియు సలహామండలి కన్వీనర్ ఆచార్య గంజి పార్వతి పాల్గొన్నారు. బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో ఆన్లైన్ జర్నల్ నిర్వహించడం, మనసు ఫౌండేషన్ సహకారంతో తెలుగు బోధనా సమావేశాలు నిర్వహించడం, సోషియల్ మీడియా వేదికగా భాషా పరిశోధన కేంద్రం తరపున భాషా సాహిత్యాల ప్రచారాన్ని నిర్వహించడం లాంటి పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు డా. భూతపురి గోపాలకృష్ణ శాస్త్రి, డా. చింతకుంట శివారెడ్డి, గ్రంథాలయ సహాయకులు పాల్గొన్నారు.కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ -
ఈ నీరు ఒడిసిపట్టాల్సిందే
కడప సెవెన్‌రోడ్స్ : ఎగువన కురిసిన వర్షాలకు జిల్లాలోని కుందూ,పెన్నా నదులు జలకళను సంతరించుకున్నాయి. ముఖ్యంగా ఎగువనున్న నంద్యాల, నందికొట్కూరు, ఆళ్లగడ్డ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కుందూ పోటెత్తుతోంది. ఆ నీరంతా పెన్నాలో కలిసి జోరుగా ప్రవహిస్తోంది. సోమశిలకు చేరే వరకు ఎక్కడా నిల్వ చేసుకునే అవకాశం లేనందున ఈ నీళ్లన్నీ వృథాగా దిగువకు వెళ్లిపోతున్నాయి. కడప తాగునీటి అవసరాలకు పెన్నానే ప్రధాన నీటి వనరు. గండి, లింగంపల్లి వాటర్ వర్క్స్ నుంచి పంపింగ్ చేసి కడపకు తాగునీరు అందిస్తున్నారు. పాత కడప చెరువు ఆయకట్టు రైతులకు ఈ నీరే ఆధారం. అసలే తీవ్ర కరువుకాలం రాబోతోందన్న నేపథ్యంలో పెన్నా నీటిని ఒడిసిపట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నీటిని సద్వినియోగం చేసుకోవాలంటే ముందుగా కేసీ కాలువలో కూరుకుపోయిన వ్యర్థాలను తక్షణమే తొలగించాలి. కాలువలో పూర్తి సామర్థ్యంలో నీరు వస్తే 15–20 రోజుల్లోపుగా పాతకడప చెరువు నిండిపోతుంది. అక్టోబరులో మరిన్ని వర్షాలు కురిస్తే ఆయకట్టు రైతులు వరి లేదా జొన్న తదితర ఆరుతడి పంటలు సాగు చేసుకునే వీలుంటుంది. తమ చెరువులు నింపాలని పాతకడప ఆయకట్టు రైతులు కోరుతున్నారు. కడప కార్పొరేషన్: ఎగువ కురిసిన వర్షాల వల్ల పెన్నానదిలో నీటి ప్రవాహం పరవళ్లు తొక్కుతోంది. నిన్నామొన్నటి వరకూ ఎండిపోయి కనిపించిన పెన్నానది నేడు జలకళను సంతరించుకుంది. చెన్నూరు, కొండపేట, సిద్దవటం హైలెవెల్ బ్రిడ్జిల నుంచి చూస్తే నీటి ప్రవాహం కనుల విందుగా ఉంది. పెన్నా నుంచి వృథాగా వెళుతున్న 12 వేల క్యూసెక్కుల నీరు పెన్నా నీటితో పాతకడప చెరువు నింపాలని స్థానికుల డిమాండ్ కడపకు తాగునీరు, ఆయకట్టు కింద రబీ పంటలకు ఈ నీరే ఆధారం -
దంపతుల ఆత్మహత్య
● భార్య ఉరేసుకోగా.. భర్త రైలు కింద పడి.. ● చిలంకూరు ఐసీఎల్ కాలనీలో విషాదంఅనారోగ్య సమస్యలు, మానసిక ఆందోళన ఓ కుటుంబంలో కోలుకోలేని విషాదాన్ని నింపాయి. భార్యాభర్తలు ఒకే రోజు వేర్వేరు చోట్ల బలవన్మరణానికి పాల్పడ్డారు. కుమారుడి భవిష్యత్తుపై ఆందోళనతో భర్త ఇంటి నుంచి వెళ్లిపోగా.. ఆ మనస్తాపంతో భార్య ఇంట్లోనే ఉరి వేసుకుంది. భర్త కడప రైల్వే స్టేషన్లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల మండల పరిధిలోని చిలంకూరు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. దంపతులు కల్లూరు మోహన్‌రెడ్డి, భారతి వేర్వేరు చోట్ల ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ముద్దనూరు మండల పరిధిలోని పెనికలపాడు గ్రామానికి చెందిన కల్లూరు మోహన్‌రెడ్డి చిలంకూరు ఐసీఎల్ ఫ్యాక్టరీలో సూపర్వైజర్గా పని చేస్తూ, తన భార్య భారతితో కలిసి ఐసీఎల్ కాలనీలోనే క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. వీరిద్దరికి గౌతమి, హర్షవర్థన్‌రెడ్డి ఇద్దరు సంతానం. గౌతమికి వివాహం చేశారు. కల్లూరు మోహన్‌రెడ్డి, కల్లూరు భారతి కొంత కాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. తన కుమారుడు హర్షవర్షన్రెడ్డి ఉద్యోగంపై అతిగా ఆలోచించిన మోహన్‌రెడ్డి మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయంపై తెలిసిన వెంటనే ఆయన భార్య భారతి బంధువులు, తన భర్త స్నేహితుల ద్వారా విచారణ చేయగా ఆచూకీ తెలియరాలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుంది. మృతురాలి కుమార్తె గౌతమి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ విశ్వనాథరెడ్డి తెలిపారు. కడపలో.. కల్లూరు మోహన్‌రెడ్డి ఇంటిలో నుంచి ఎవరికీ చెప్పకుండా కడపకు వెళ్లి రైల్వే స్టేషన్లో రైలు కింద పడి చనిపోయినట్లు కడప రైల్వే పోలీసుల ద్వారా తెలిసింది. కుమారుడు హర్షవర్థన్‌రెడ్డి సంఘటన స్థలానికి వెళ్లి ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
విద్యుత్ వైర్లు, ట్రాన్స్ఫార్మర్లే టార్గెట్
ప్రొద్దుటూరు క్రైం : విద్యుత్ వైరు, ట్రాన్స్ఫార్మర్లోని విలువైన కాపర్ వైరును రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడుతున్న ముఠా వ్యవహారాన్ని ప్రొద్దుటూరు పోలీసులు వెలుగులోకి తెచ్చారు. ఏడాది కాలంగా ప్రొద్దుటూరు, రాజుపాళెం మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో వరుసగా విద్యుత్ వైర్లు, ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి వాటిలోని కాపర్ వైర్‌ను చోరీ చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను ప్రొద్దుటూరు రూరల్ పోలీసులు పట్టుకున్నారు. వీరితో పాటు 15 ఏళ్ల బాలుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ వివరాలను ఏఎస్పీ విభూకృష్ణ బుధవారం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో వెల్లడించారు. ప్రొద్దుటూరు మండలంలోని సోములవారిపల్లె జగనన్న కాలనీలో విద్యుత్‌వైర్లు, ట్రాన్స్ఫార్మర్ కాపర్‌వైరు చోరీకి గురైనట్లు ఫిర్యాదు రావడంతో ఇటీవల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.. ఇందులో భాగంగా నిందితుల కదలికలపై రూరల్ సీఐ నాగభూషణ్, ఎస్ఐ రాజు, సిబ్బందితో కలిసి ప్రత్యేక నిఘా పెట్టి వారు సంచరిస్తున్న ప్రాంతానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ప్రొద్దుటూరుకు చెందిన పొలిశెట్టి వెంకటేశ్వర్లు, మద్దికం కృష్ణయ్య, రామాపురం గ్రామానికి చెందిన ముక్కమల్ల మహేష్, చౌటపల్లెకు చెందిన మాలికి సాయికిరణ్, పొలంకి రంగనాయకులుతో పాటు 15 ఏళ్ల బాలుడిని అరెస్ట్ చేశారు. పోలీసులను చూసి నిందితులు పారిపోవడానికి ప్రయత్నించగా వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 5.40 లక్షల నగదు, 56 కిలోల అల్యూమినియం విద్యుత్ వైరు, 5 కిలోల ట్రాన్స్ఫార్మర్ కాపర్వైరుతో పాటు చోరీకి ఉపయోగించిన ఆటో, రెండు ద్విచక్ర వాహనాలు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించనున్నట్లు ఏఎస్పీ తెలిపారు. కాగా ఘటనా స్థలంలో పారిపోయిన ఆటో డ్రైవర్ కోసం గాలిస్తున్నామన్నారు. పట్టుబడిన నిందితులకు సంబంధించి నమోదైన కేసులు, గత నేరచరిత్ర గురించి విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. చోరీ చేసిన విద్యుత్‌వైర్, కాపర్ వైర్లను కొనుగోలు చేసిన గుజరీ వ్యాపారుల పాత్రపై కూడా విచారణ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఏడాదిగా చోరీలు చేసే ముఠా గుట్టురట్టు ఐదుగురు నిందితులు అరెస్ట్ రూ. 5.40 లక్షలు నగదు, విద్యుత్, కాపర్ వైరుతో సహా వాహనాలు స్వాధీనం -
సేవల్లో అంతరాయం లేకుండా చూడాలి
● ప్రైవేటుకు ధీటుగా బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ సేవలు అందించాలి ● 21 గ్రామాల్లో బలహీనంగా సిగ్నల్ ● ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కడప సెవెన్‌రోడ్స్ : జిల్లాలో ప్రైవేటుకు ధీటుగా బీఎస్ఎన్ఎల్ సేవలు అందించాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అన్నారు. జిల్లాలోని 26 మండలాల పరిధిలోగల 21 గ్రామాల్లో అంతరాయం లేని మొబైల్ కనెక్టివిటీ అందించాలని, 79 గ్రామాల్లో నెట్వర్క్ సామర్థ్యాన్ని విస్తరించాలని కోరారు. బుధవారం కడపలో నిర్వహించిన టెలికాం అడ్వయిజరీ కమిటీ సమావేశంలో బీఎస్ఎన్ఎల్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ షేక్ ముజీబ్బాషాకు ఆయన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ యూఎస్ఓఎఫ్ స్కీమ్ ద్వారా కొత్త 4జీ టవర్ ఏర్పాటు చేసి నెట్వర్క్ లేని గ్రామాలకు కనెక్టివిటీ కల్పించాలంటూ గతంలో రెండు సార్లు, ఈ ఏడాది ఏప్రిల్ 7వ తేది కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు విన్నవించానని పేర్కొన్నారు. జిల్లాలో 100 గ్రామాల కు కనెక్టివిటీ సౌకర్యం కల్పించాలని తాను కేంద్ర మంత్రికి విన్నవించినట్లు వివరించారు. దీంతో 21 గ్రామాలకు మొబైల్ కనెక్టివిటీ కల్పించారని పేర్కొన్నారు. ఈ గ్రామాల్లో నెట్వర్క్ సిగ్నల్ బలహీనంగా ఉందన్నారు. నిరంతరం సేవల్లో ఏర్పడుతున్న అంతరాయాలను తొలగించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. మొబైల్ సేవలు బలహీనంగా ఉన్న 21 గ్రామాలు, కనెక్టివిటీ లేని 79 గ్రామాల ప్రజలు ప్రభుత్వ పథకాలు, సేవలు పొందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. విద్యార్థులపై ఈ ప్రభావం తీవ్రంగా ఉందని తెలిపారు. మొబైల్ కనెక్టివిటీ కల్పించడం కోసం 4జీ టవర్లు ఏర్పాటు చేయాలని, నెట్వర్క్ సామర్థ్యాన్ని మరిన్ని గ్రామాలకు విస్తరించాలని విజ్ఞప్తి చేశారు. -
తృటిలో తప్పిన ప్రమాదం
వీరబల్లి : మండల పరిధిలో బుధవారం గడికోట ఘాట్ రోడ్లో ఆర్టీసీ బస్సు డ్రైవర్ అప్రమత్తంకావడంతో ప్రమాదం తప్పింది. వివరాలు ఇలా ఉన్నాయి.. గడిగోట నుంచి మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు రాయచోటికి వస్తూ ఉండగా వీరబల్లి నుంచి గడికోటకు చెందిన వ్యక్తి ద్విచక్ర వాహనంలో గ్యాస్ సిలిండర్ తీసుకు వెళుతుండగా ఘాట్ రోడ్డులో సిలిండర్ కిందపడి పోయింది. సిలిండర్ బస్సుకు ఎదురుగా రావడంతో వాటిని తప్పించడానికి ఆర్టీసీ డ్రైవర్ బస్సును చాకచక్యంగా రోడ్డు పక్కన ఆపేశాడు. దీంతో ప్రమాదం తప్పింది. ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. -
జీవ వైవిధ్యంతోనే జీవుల మనుగడ
కడప ఎడ్యుకేషన్: జీవవైవిధ్యం.. జీవుల మునుగడ పర్యావరణ సమతుల్యతకు ఆధారమని యోగి వేమన విశ్వవిద్యాలయం వీసీ బెల్లంకొండ రాజ శేఖర్ అన్నారు. వైవీయూ సైన్స్ బ్లాక్ లోని ఆచార్య జె. సి. బోస్ సెమినార్ హాల్లో బుధవారం ‘కడప జీవ వైవిధ్యం’అనే అంశంపై నిర్వహించిన అవగాహన సదస్సులో వీసీ మాట్లాడారు. ప్రకృతిపై ప్రేమ ఆసక్తులు ఉన్నవారు జీవ వైవిధ్యానికి హద్దులు దాటి అధ్యయనం చేస్తారని.. దీనికి పొరుగు రాష్ట్రానికి చెందిన పరిశోధకుడు కలివి కోడిపై చేసిన పరిశోధనే మంచి ఉదాహరణ అని అన్నారు. ప్రధాన వక్తగా హాజరైన మైసూర్ ప్రకృతి ఫౌండేషన్ శాస్త్రవేత్త డాక్టర్ పి.జగన్నాథం మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ప్రకృతి ప్రేమికులుగా మారాలన్నారు. జీవం ఉన్న ప్రతి జీవిని రేపటి తరం కోసం కాపాడడం మన బాధ్యత అన్నారు. కలివికోడిని అధ్యయనం చేస్తున్నామని రాత్రి సమయాలలో ఇది తిరుగుతూ ఉంటుందన్నారు. గత ఆగస్టు 24న కలివికోడి చేసిన శబ్దాలు వినిపించాయని అక్కడున్న వారు చెప్పారని తెలిపారు. వైవీయూ రెక్టార్ ఎ. జి. దాము మాట్లాడారు. సదస్సు కన్వీనర్లు ప్రొఫెసర్ అనుప్రసన్న, పర్యావరణ శాస్త్ర విభాగం ప్రొఫెసర్ ఎం. శ్రీధర్ రెడ్డి, టి. చంద్రశేఖర్, నిర్వహణ కమిటీ ప్రొఫెసర్ ఎ. టి. వెంకట రమణ రెడ్డి , ఆచార్య వెంకట్రామిరెడ్డి, ఆచార్య ఏ మధుసూదన్ రెడ్డి, ఆచార్య ముని కుమారి, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. వైవీయూ వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ -
ఐదు నెలల శిశువుకు అరుదైన శస్త్ర చికిత్స
కడప వైఎస్ఆర్ సర్కిల్ : కడప ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్యులు అరుదైన, క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన ఐదు నెలల చిన్నారికి రిట్రోపెరిటోనియల్ టెరటోమా కణితిని శస్త్రచికిత్స ద్వారా పూర్తిగా తొలగించారు. చిన్నారి కొంతకాలంగా తరచూ వాంతులతో బాధపడుతుండటంతో తల్లిదండ్రులు కడప ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకువచ్చారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి స్కానింగ్ చేయగా, చిన్నారి కడుపులో సుమారు 15–10 సెంటీమీటర్ల పరిమాణంలో కణితి ఉన్నట్లు గుర్తించారు. కణితి కడుపు, ప్యాంక్రియాస్‌తో పాటు ప్రధాన రక్తనాళాలకు అత్యంత సమీపంలో ఉండటంతో శస్త్రచికిత్స అత్యంత క్లిష్టంగా మారింది. అయినప్పటికీ వైద్య బృందం అత్యంత జాగ్రత్తతో ఈ నెల 17వ తేదీన శస్త్రచికిత్స నిర్వహించింది. ప్రధాన రక్తనాళాలు, కడుపు, ప్యాంక్రియాస్‌కు ఎలాంటి నష్టం కలగకుండా కణితిని వాటి నుంచి వేరు చేసి పూర్తిగా తొలగించారు.శస్త్రచికిత్స అనంతరం చిన్నారి ఆరోగ్యం సంతృప్తికరంగా ఉండటంతో వైద్యుల పర్యవేక్షణలో కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వైద్యుల వివరాల ప్రకారం, రిట్రోపెరిటోనియల్ టెరటోమా చిన్నారుల్లో అత్యంత అరుదుగా కనిపించే కణితుల్లో ఒకటి. సుమారు రెండు లక్షల మంది శిశువుల్లో ఒకరికి ఈ తరహా కణితి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. సకాలంలో గుర్తించి చికిత్స అందించకపోతే కణితి పరిమాణం పెరిగి కడుపులోని ఇతర అవయవాలు, ప్రధాన రక్తనాళాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని, కొన్ని సందర్భాల్లో కణితి క్యాన్సర్‌గా మారే ప్రమాదం కూడా ఉంటుందని వైద్యులు వివరించారు. ఈ క్లిష్టమైన శస్త్రచికిత్సను పీడియాట్రిక్ సర్జరీ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ సునీల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ పి.వి. రమణ, డాక్టర్ సుకుమార్, డాక్టర్ సులక్షణ, మౌనికతో కూడిన బృందం నిర్వహించింది. అనస్థీషియా విభాగానికి చెందిన డాక్టర్ రాఘవేంద్ర, డాక్టర్ సోమశేఖర్ మరియు వారి బృందం శస్త్రచికిత్సకు సహకరించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ వైద్య బృందాన్ని అభినందించారు. -
● కుర్చీల కోసం ‘కుమ్ములాట’..
మున్సిపాలిటీ, పంచాయతీ ఎన్నికలు త్వరలో రానున్నందున.. మొన్నటి వినాయక చవితి పండుగనాడు ఏర్పాటు చేసిన మండపాల దగ్గర, రచ్చబండల వద్ద, వీధుల్లో మీటింగులు జోరందుకున్నాయి. ఐదేళ్లు మొహం చాటేసి ఇప్పుడు నోట్ల మూటలతో ఓటర్ల ముంగిట్లోకి వస్తున్న నాయకులు.. ‘గత ఐదేళ్లలో నేనేం చేశానో మీకు తెలుసు’’ అని ఒకరు మైక్ అందుకుంటే.. ‘నువ్వు చేసింది ఏమీ లేదు.. నన్ను గెలిపిస్తే గ్రామాన్ని పట్టణంగా, మున్సిపాలిటీని నగరంగా చేసి చూపిస్తా’ అని ఇంకొకరు సవాల్ విసురుతున్నారు. ఈ రాజకీయంలో బిర్యానీ ప్యాకెట్లతో ఓటర్లకు గాలం వేసేందుకు ‘చిరు కానుకలు’ అనే నైవేద్యాలను ఇప్పటి నుంచే అభ్యర్థులు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ ఓటర్లు కూడా తక్కువ తినలేదు! ‘నేతలు పెట్టే నైవేద్యం తిందాం.. ఓటు మాత్రం మనకు సంక్షేమ పథకాలు అందించిన వాడికే వేద్దాం’ అని లోపల గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. మున్సిపాలిటీల్లో, పంచాయతీల్లో సమస్యల సుడిగుండంలో ఉన్న ప్రజలు.. ఈసారి నేతల ప్రలోభాల ఆశలకు లొంగుతారా? అనేది కాలమే నిర్ణయించాలి. ఈ రాజకీయంలో నిజమైన గెలుపు ఎవరికి దక్కుతుందో ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే. -
వ్యాపారం ద్వారా సంఘాలు ఆర్థికంగా బలపడాలి
కడప అగ్రికల్చర్ : ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు వ్యాపారాలను ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని డీసీఎంఎస్ చైర్మెన్ జయప్రకాష్ నారాయణ బాబు సూచించారు. కడప డీసీఎంఎస్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం సహకార సంఘాల అధ్యక్షుల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరపతి సంఘాలు ఆర్థికంగా బలపడాలంటే వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. ముఖ్యంగా ఎరువులు, పురుగు మందుల షాపులతోపాటు పెట్రోల్ బంకులను ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా బలపడాలని సూచించారు. అనంతరం సంఘానికి సంబంధించి మార్చి 2026 నుంచి ఆగష్టు 2026 వరకు జమ, ఖర్చులపై సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో డీసీఓ వెంకటసుబ్బయ్య, డీఎల్సీఓ గోపీనాయక్, డీఎంఓ పరిమళజ్యోతి, డీసీఎంఎస్ మేనేజర్ రఘురామిరెడ్డి, సహకారం సంఘాల చైర్మన్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
అరటి పొలాలను సందర్శించిన జర్మనీ బృందం
లింగాల : మండలంలోని అక్కులగారిపల్లి గ్రామంలో బుధవారం అరటి పొలాలను జర్మనీ టీం, ఐజీగార్ల్ అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు ప్రకృతి వ్యవసాయ రైతుల పొలం, రసాయనిక వ్యవసాయ రైతుల పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు ప్రకృతి వ్యవసాయంలో పండించిన అరటిరైతు రాజశేఖర్ రెడ్డి తోటలో చెట్లు లావుగాను, ఏపుగాను, ఎక్కువ కాయలు దిగుబడి, నాణ్యత కలిగి ఉండడం గమనించారు. అలాగే చెట్లు ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోవడం, ఎల్‌నినో ప్రభావంలో తక్కువ నీటి ఎద్దడి ఉన్నప్పటికీ చెట్లు ఏపుగా పెరగడం, వేర్లు దృడంగా ఉండడం, మల్చింగ్ చేయడం వల్ల భూమిలో తేమ శాతం బాగా ఉండడం, భూమిలో వేడి తక్కువగా ఉండటం గమనించారు. రసాయన పద్ధతిలో సాగుచేసిన అరటి తోటలో దీనికి పూర్తి భిన్నంగా ఉండటం గమనించారు. అనంతరం మురారిచింతలలో ప్రకృతి వ్యవసాయ రైతు నారాయణ రెడ్డి పొలంను జర్మనీ శాస్త్రవేత్తలు సందర్శించారు. ప్రకృతి వ్యవసాయం చేయడానికి గల కారణాలు, ప్రకృతి వ్యవసాయంవల్ల కలిగిన లాభాలు, నీవు వాడిన ఉత్పత్తులను తెలియజేయాలని వారు కోరారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ఆ రైతు వారికి వివరించారు. కార్యక్రమంలో జర్మనీ ఐఆర్ఐఎస్ఎస్ సంగీత అగర్వార్, రాష్ట్ర కమిటీ మెంబర్ మురళీధర్, రీసెర్చ్ డైరెక్టర్ వరప్రసాద్, ఐజీ గార్ల్ అధికారులు శివారెడ్డి, లలిత, గుల్జార్, జలాల్, అనిత, స్వాతి, పూజిత, తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
– ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ సిద్దవటం: ప్రజలకు మెరుగైన సేవలు అందజేయాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పేర్కొన్నారు. సిద్దవటం మండలం భాకరాపేట సమీపంలోని 11వ బెటాలియన్‌లో శిక్షణ పొందుతున్న 548 కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్‌కు సంబంధించి నిర్వహించిన రిహార్సల్‌ను బుధవారం సాయంత్రం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్ల పరేడ్ కవాతు, డ్రిల్, మార్చింగ్, కమాండ్లకు అనుగుణంగా స్పందించే విధానం, క్రమశిక్షణ, సమన్వయం తదితర అంశాలను ఎస్పీ నిశితంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాసింగ్ అవుట్ పరేడ్‌లో ప్రతి ఒక్కరూ పూర్తి క్రమశిక్షణ, సమయపాలన, ఆత్మవిశ్వాసంతో పాల్గొనాలని సూచించారు. పోలీసు విధుల్లో క్రమశిక్షణ, శారీరక దారుఢ్యంతో పాటు ప్రజల పట్ల బాధ్యత, నిబద్ధత, సేవాభావం అత్యంత కీలకమని పేర్కొన్నారు. శిక్షణలో పొందిన నైపుణ్యాలను భవిష్యత్తులో విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించాలని, అప్పుడే మంచి పేరు వస్తుందని ఆయన సూచించారు. పాసింగ్ అవుట్ పరేడ్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పక్కాగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో 11వ బెటాలియన్ కమాండెంట్ ఆనంద్ రెడ్డి, కడప డీటీసీ డీఎస్పీ అబ్దుల్ కరీం, బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ రాజశేఖర్, పోలీసు సిబ్బంది, శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.


